అతి తెలివి

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

అతితెలివి

రచన:శ్రీదేవి విన్నకోట

చిన్నప్పుడు మనం అమ్మ కంటే అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉంటాం, అమ్మమ్మ మనవల్ని చూసుకునెంత  ముద్దుగా మరి ఎవరూ చూడరేమో, అమ్మ తరువాత అంత ప్రేమ బంధం ముడి పడేది అమ్మమ్మ నానమ్మల తోనే, చిన్నప్పుడుఅమ్మమ్మ చెప్పిన కథలు బోల్డన్ని ఉంటాయి. అనగనగా ఒక రాజు ఏడు చేపల కథ నుంచి, ఆవు పులి, నాన్న అమ్మో పులి, కుందేలు తాబేలు, బాతు బంగారు గుడ్లు, ఇలాంటి ఎన్నో నీతి కథలు  చెప్పిన ఘనత మన అమ్మమ్మల కే దక్కుతుంది,

అమ్మమ్మ ఎంత ప్రేమగా చూసినా చిన్నప్పుడు,చదువుకోకపోతే దండన కూడా అలాగే ఉండేది, నాకు ఇప్పటికీ అమ్మమ్మ చెప్పిన కథలు చాలా గుర్తు ఉన్నాయి, అందులో ఒక కథ చెప్తా ఒక తెలివైన నక్క తన అతి తెలివి ప్రదర్శించి ఎలా మిగిలిన జంతువులను ఇలా మూర్ఖులుగా చేసి తాను భంగపడిందో ఈ కథలో చెప్తా సరేనా.ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా సరే మళ్లీ మీ చదివేసి  పిల్లలకి మరోసారి చెప్పండి.

అనగనగా ఒక పల్లెలో  ఊరి చివర తనకు తానే చాలా తెలివైన దానిని అనుకునే ఒక నక్క ఉండేది. కానీ ఊర్లో వాళ్ళందరూ ఆ నక్క ఎక్కడ కనిపించినా కొడుతూ ఉండేవాళ్ళు, దాంతో పాపం దానికి ఆ ఊర్లో ఆహారం దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఆహారం కోసం ఏం చేయాలా ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఒకరోజు అక్కడ చెరువు దగ్గర కొంతమంది రజకులు బట్టలు ఉతుకుతూ ఉండగా  అటువైపు వెళ్ళిన నక్క పొరపాటున వాళ్లు నీలి మందు నీళ్లు కలిపి పెట్టిన గాబు లో పడిపోయింది.

వాళ్ళు కొట్టడానికి తరుముకు వచ్చేసరికి అడవిలోకి పారిపోయింది, కానీ ఆ నక్క నీలి మందు  నీళ్ళల్లో పడడం వల్ల దాని శరీరం అంతా నీలంగా మారిపోయింది, అడవిలో మిగిలిన జంతువులన్నీ ఆ నక్కను చూసి, ఏదో కొత్త వింత జంతువు  అడవిలోకి వచ్చిందని అన్ని ఒకదానికి ఒకటి చెప్పుకుని, ఆ వింత జంతువు ఏంటో తెలుసుకుందామని నీలిరంగు పులుముకున్న నక్క దగ్గరికి వెళ్ళాయి,

అడవికి రాజైన సింహం ఓయి కొత్త జంతువా, నేను
ఈ అడవికి రాజు ని, నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత వరకు నీ రంగు రూపంలో ఉన్న జంతువుల్ని మేము ఎక్కడ చూడలేదే అని పలకరించింది, సింహం మాటలకి నక్క నవ్వుతూ అవును నేను ఈ అడవికి కొత్త జంతువు నే, నేను స్వర్గం నుంచి  ఈ అడవిలో మీరు సుఖంగా సంతోషంగా ఉన్నారా లేదా అని ఇంద్రుడు దేవతలు నన్ను కనుక్కుని రమ్మంటే వచ్చాను, మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాతో చెప్పండి, నేను స్వర్గలోక రాజు అయిన ఇంద్రుడికి చెప్పి మీ సమస్యలన్నీ పరిష్కరించేలా చూస్తాను అంటూ సోది చెప్తూ కోతలు కోసేసరికి, పాపం జంతువులన్నీ నమ్మేసాయి,

నక్క నిజంగానే స్వర్గ లోకం నుంచి దిగి వచ్చినట్టు తమ సమస్యలు ఏకరువు పెట్టసాగాయి, నక్క అవన్నీ వింటున్నట్టు నటిస్తూ, నాకు ఆకలేస్తుంది నేను స్వర్గానికి వెళ్లి తినేసి వస్తాను, అనడంతో అక్కడున్న జంతువులన్నీ, అయ్యో ఇప్పుడు అంత దూరం వెళ్ళి తిరిగి రావడం ఎందుకు మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు మేమే మీకు ఆహారం సమకూరుస్తాము అని చెప్పడంతో, నక్క ఇష్టం లేనట్టు నటిస్తూనే సరే మీ ఇష్టం, నేను కేవలం మీ కోసం ఆగిపోతున్నాను అంది,

అలా రోజులు గడుస్తున్నాయి రోజు పులులు, సింహాలు,ఎలుగుబంట్లు, మిగిలిన జంతువులు అన్నీ వేటాడి ఆహారాన్ని తీసుకొస్తూ ఉంటే  నక్క హాయిగా ఆ ఆహారాన్ని తింటూ ఆ జంతువుల మీద నాకు ఇంకా అది తీసుకురండి ఇది తీసుకురండి అంటూ అజమాయిషీ చేస్తూ చక్కగా చాలా లావై పోయి చాలా సంతోషంగా ఉండసాగింది, ఒకరోజు  ఏనుగు
ఓ స్వర్గలోక జంతువా, నువ్వు మా గురించి మాకున్న సమస్యల స్వర్గం లో చెప్పవా అని అడిగింది, ఇదిగో వెళ్ళాలి వెళ్తాను, వాళ్లు కూడా నన్ను వచ్చేయమని పిలుస్తున్నారు, కానీ నేను వెళ్తే మీరు అనాధలై పోతారని చూస్తున్నాను, అంటూ ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్పింది,

కానీ ఎందుకో ఆ ఏనుగుకి అనుమానం కలిగించింది దాని ప్రవర్తన, అయినా ఏమీ అనకుండా తిరిగి వెళ్ళిపోయింది, మిగిలిన జంతువులతో, నాకెందుకో ఆ జంతువు స్వర్గ లోకం నుంచి వచ్చిన జంతువులా అనిపించట్లేదు, మన లోకంలోనే ఉండే ఏదో మామూలు జంతువు లా అనిపిస్తుంది, బహుశా ఆ జంతువు మనల్ని మోసం చేస్తుందేమో అనుకుంటున్నాను, అని చెప్పడంతో
మిగిలిన జంతువులన్నీ, చాల్లే ఊరుకో పాపం ఆ జంతువు మనకి సహాయం చేయడానికి స్వర్గం నుంచి వచ్చింది, నువ్వలా అనుమానించి అవమానించకు
అనడంతో ఆ అన్ని జంతువులతో వాదించలేక మిన్నకుండి పోయింది, అలా కొంతకాలం గడిచింది ఇప్పుడు నక్కే అన్ని జంతువుల మీద అజమాయిషీ చేస్తూ తానే ఆ అడవికి రాజులా ప్రవర్తించసాగింది.

అన్ని జంతువులు తన అదుపాజ్ఞల్లో ఉండసాగాయి, అడవిలో ఒక రోజు బోరున వర్షం పడుతుంది, జంతువులన్నీ సంతోషంగా వర్షంలో తడుస్తూ  అక్కడ దగ్గరలో ఉన్న కొలనులో నీళ్లు ఒకదానిపై ఒకటి చిమ్ముకుంటూ ఆడుకోసాగాయి, ఇంతలో సింహం అంది కదా, మన స్వర్గలోక అతిధిని కూడా పిలిస్తే
తను కూడా మనతో పాటు నీళ్లతో ఆడి సంతోష పడుతుంది, తనని కూడా పిలుచుకు రండి అంటూ కోతిని పంపించింది, కోతి నక్క దగ్గరికి వెళ్లి వర్షం వస్తుంది కదా, మన వాళ్ళంతా చెరువు దగ్గరే ఉన్నారు. నీళ్ళతో భలే ఆనందంగా ఆడుకుంటున్నారు,మీరు కూడా రండి స్వర్గలోకపు అతిధిగారు అని పిలిచింది,

కానీ నక్క వర్షంలో తడవడానికి చెరువు దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడలేదు, ఏ మాత్రం నీళ్ళల్లో కొంచెం తడిసిన తన నీలిరంగు పోతుందని భయపడింది, స్వర్గలోక జంతువులు స్నానం చేయవు, మాకు వర్షంలో తడిసి స్నానం చేయాల్సిన అవసరం ఉండదు, మేము అమృతం తాగడం వల్ల మీరు చేసే పనులు మేము చాలా చేయక్కర్లేదు, వెళ్లి మీరు చేయండి అని చెప్పింది, ఇక కోతి ఏమీ చేయలేక తిరిగి వచ్చేసింది అతిథి గారు రాను అంటున్నారు అని చెప్పి,

ఈ మాటలు విన్న మిగిలిన జంతువులు సరేలే అని ఊరుకున్నాయి, కానీ ఏనుగు కి మొదటి నుంచి నక్కమీద అనుమానమే, అందుకే తన తోటి జంతువులకు ఏమీ చెప్పకుండా, నక్క దగ్గరికి వచ్చింది, అదేంటి స్వర్గలోక జంతువు గారు. మేము వర్షం పడడం వల్ల చాలా ఆనందంగా ఉన్నాం, మాతో పాటు మీరు సంతోషంగా అడి పాడుతూ ఉండాలని మా కోరిక, మీరు ఖచ్చితంగా మాతో కొలనులో ఈత కొట్టడానికి రావాల్సిందే, అంటూ నక్క ఎంత చెప్తున్నా వినకుండా తొండంతో నక్కను ఎత్తి పట్టుకుని పరుగున తీసుకువచ్చి కొలనులో పడేసింది,

ఒక రెండు నిమిషాలు గడిచేసరికి నీలిరంగు అంతా పోయి నక్క అసలు రూపం బయటపడింది, నక్కను చూసి మిగిలిన జంతువులన్నీ అవాక్కయ్యాయి. అన్ని జంతువులు తేరుకుని నక్కని చిత్తుగా కొట్టాయి.
పాపం జిత్తులమారి నక్క ఆ జంతువుల దెబ్బలు తట్టుకోలేక వాటి నుంచి తప్పించుకుని లబోదిబోమంటూ మరో చోటికి పారిపోయింది,

మిగిలిన జంతువులన్నీ మరోసారి అలా కొత్తగా వేరే రూపం రంగు మార్చుకుని వచ్చిన జంతువులను అసలు కొంచెం కూడా నమ్మకూడదని మూకుమ్మడిగా నిర్ణయించుకున్నాయి, అక్కడి నుంచి పారిపోయిన నక్క మళ్లీ అమాయక జంతువులు దొరికే మరో కొత్త చోటు కోసం వెతుక్కోసాగింది,

ఈ కథను చాలా మంది వినే వుంటారు వారి చిన్నప్పుడు, నాకెందుకో మా అమ్మమ్మ చెప్పిన కథల్లో ఈ కథ బాగా గుర్తుండిపోయింది ఇప్పటికీ కూడా,
ఈ కథలో నీతి కొత్త వారు ఎవరు వచ్చినా అంత తేలిగ్గా తొందరగా ఎవరిని నమ్మకూడదు, మనకి తెలిసిన వారే వేరు వేరు రూపాల్లో మనల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలనే నీతి దాగి ఉంది ఈ కథలో, చిన్నప్పుడు ఇలాంటి కథలు వినడం వల్లే నాలో నేను కూడా కథలు రాయాలి అనే ప్రేరణ కలిగింది, ఎన్నో కథలు మంచి బుద్ధులు చెప్పిన అమ్మమ్మ మాతోపాటు ఇప్పుడు లేరు, కానీ తను చెప్పిన కధలు కబుర్లు తీయటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి ఇప్పటికీ
ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు తెచ్చుకునేలా చేసిన మనోహరం టిం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఈ కథ ఎప్పటిదో ఎవరు రాశారో తెలియదు, కానీ
మా అమ్మమ్మ చెప్పడం వల్ల ఎప్పటి నుంచో నేను వినడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి నేనే స్వయంగా రాసా, కానీ ఈ కథ నా సొంతం అని మాత్రం చెప్పలేను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!