బాలుగారికి స్మృత్యంజలి
మక్కువ. అరుణకుమారి
గాన గాంధర్వం మూగవో యింది
సినీజగాన నీరవ నిశ్శబ్దం అలముకుంది
యాభైఏళ్ళ సంగీత ప్రస్థానం నడక చాలించి
అమరపురికి పయనమైంది
సురపతికి గాంధర్వ గానం వినాలనే ఆశ పుట్టిందేమో
తన ఆస్థాన గాయకునిగా పిలుపునిచ్చాడు
షోడశ భాషలు అరలక్షకు పైగా గీతాలు
ప్రతిచోటా, ప్రతీఇంటా, ప్రతి నోటా నీ పాటే
తీరేదెలా నీవు లేని లోటు
పాడుతా తీయగా అంటూ పరవశింపజేశావు
వర్థమాన గాయకులకు భవిత నిచ్చావు
స్వరాభిషేకంతో మట్టిలో మాణిక్యాలను వెలికితీసావు
కాంతులీనే వజ్రాలుగా సానబెట్టావు
మరువగలమా నీ గానం, మరువతరమా నీ సౌజన్యం
సంగీత, సాహిత్యాల సమాహారం నీ గానం
సుస్వరాల సుమధురం నీ గళం
పద్మశ్రీ, పద్మభూషణ్, ఎన్నెన్నో నందులు మరెన్నో పురస్కారాలు
అజరామరం నీ కీర్తి అద్వీతీయం నీ ఖ్యాతి
అట్టి
గాన గాంధర్వం నేడు నింగి కెగిసింది
నారద తుంబురులను మురిపించాలనా
దేవలోకాన్ని అలరించాలనా
ఏదేమైనా నీవు లేని చోటు భూలోకానికి తీరని లోటు
నీ మృదు మధుర గాత్రానికి ఇదే నా కవితా స్మృత్యంజలి
************************