బాల్యం

బాల్యం

రచన : అనురాధ మురుగము బూజు

ఉదయాన్నే లేచి టిఫిన్ చేసాక, నా కొడుకు దినేష్ వచ్చి తనకు పుస్తకాలు, పెన్నులు, జామెంట్రీ బాక్స్ కావాలని అడిగాడు.
డబ్బులు వున్నా ఇంకో రెండు రోజులు ఆగమని చెప్పాను.
ప్లీజ్ డాడీ, త్వరగా కొనివ్వండి, అమ్మకు చెప్పి వారం అయింది. ఇప్పుడేమో మీ నాన్నను అడుగు అని చెప్పింది.
మా ఫ్రెండ్స్ అందరూ కొనేసారు. నేను వాళ్ళతోనే అడిగి తీసుకున్నాను. ఈ వీక్ నేను స్పాన్సర్ చెయ్యాలి.
ఎందుకంటే….. మా ముగ్గురిలో ఎవరు ఫస్ట్ కొన్నా అందరం వాడుకుంటాం. ఒక్కొక్కరం ఒక్కో వారం అని అనుకున్నాము, ఒక వేళ మాలో ఏ ఒక్కరు కొనలేకపోయినా వాడుకుంటాం అనుకో, కానీ వుంటే బాగుంటుంది కదా! మేము మళ్ళీ ఇంకొకరిని అడగకుండా, అని నీళ్లు నమిలాడు దినేష్.
సరే అని దినేష్ కి పదిరూపాయలు ఇచ్చి స్కూల్ కి వెళ్ళమన్నాను.
అదేమిటండి, ఇవ్వొచ్చు కదా, నాకు పదిరోజుల నుండి తెలుసు, మీరేమో అన్నది నా భార్య వల్లి.
పరవాలేదు వల్లి, రేపు కొనిస్తాలే అన్నాను నేను.
పిల్లలకు విలువలు నేర్పించటం మంచిదే కానీ, మనసు నొప్పించకూడదు. మీ దగ్గర లేకపోతే సర్దుకోమని చెప్పొచ్చు, మనకు వుంది కదా, అంది వల్లి.
అలా కాదు వల్లి…… వాడికి అనే కాదు ప్రతి పిల్లలకు ఇలా చెయ్యాలి. ఎందుకంటే వాళ్లకు ఎదుటి పిల్లలతో స్నేహం చెయ్యటం తెలుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నాను నేను.
ఏమో…. మీ మాటలకు విలువ ఇచ్చి మీరు చెప్పినట్టే వింటున్నాను, సరే మీ ఇష్టం అని లంచ్ బాక్స్ ఇచ్చింది వల్లి.
ఆఫీస్ కి బయలుదేరాను. దినేష్ అడిగిన వస్తువులు కొని కారులో పెట్టుకొని ఆఫీస్ కి వెళ్లాను.
నా అసిస్టెంట్ ప్రభాకర్ వచ్చి, సార్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్టేషనరీ మెటీరియల్ కావాలంట అని అడిగాడు.
సరే అని ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాను. ప్రభాకర్ వెళ్లి తెచ్చి ఇచ్చాడు. అందులో ఒక అసిస్టెంట్ అన్నాడు, “ఎన్ని పెన్నులో, పెన్సిల్సో, ఎన్ని వైట్ పేపర్స్”, ఇవన్నీ చిన్నప్పుడు మా నాన్న కొని ఇచ్చింటే నేను ఇంకా బాగా చదివేవాడిని అని.
ఇంకో అసిస్టెంట్ కలుగచేసుకుని, ఏమి కాదు, ఆరోజు అలా జరిగింటే, నువ్వు ఈపాటికి ఎక్కడో ఒక చోట ఎంప్లొయ్ గా ఉండేవాడివి, లేదంటే మీ నాన్న సంపాదించి ఇచ్చిన ఆస్తులను చూసుకుంటూ బ్రతికే వాడివిఅని అన్నాడు.
అంతే కదా, మరి మన చిన్నప్పుడు ఇవి అన్ని వుండే పిల్లలు కనీసం ఊరు కూడా దాటిండరు అన్నాడు ఇంకో అసిస్టెంట్.
వాళ్ళ మాటలు నిజమే అనిపించింది, ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నకు కష్టమో, ఏమో తెలియదు కానీ, అవసరం అని అడిగినా ఏదయినా కొనడానికి వారం నుండి పదిరోజులు తీసుకొనేవాడు.
నేను, నా ఫ్రెండ్స్ సునీల్, శేఖర్ కి కూడా అలాగే అయ్యేది.
మా దగ్గర యరేజర్ అదేనండి రబ్బరు లేకపోతే, వున్న ఇంకో క్లాసుమేట్ దగ్గర నిలబడి అడిగి ఇప్పించుకొని వాడుకొనేవాళ్ళం.
ఒకటేమిటి అన్నీ…… పెన్, పెన్సిల్, రెడ్ పెన్ కోసం ఆరాటం, మెండర్ కోసం వెతుకులాడటం ఇలా ఎన్నో ఎన్నెన్నో.
టిఫిన్ కోసం, అందరం కలిసి ఒక దోశలు పొసే ఆమె దగ్గర ఖాతా పెట్టడం, అవి తీర్చడానికి నానా పాట్లు పడటం.
అటువంటి సమయంలో కొంత మంది వుంటారు, వాళ్లకు పాపం వాళ్ళ తల్లిదండ్రులు అన్ని ఇచ్చిన, బొట్టు చదువు వచ్చేది కాదు. స్కూల్ లో ఏది చెప్పినా వాళ్ళ తల్లిదండ్రులు కొనిస్తారు, కానీ వాళ్లకు ఎలా వాడాలో తెలియదు.
మన దగ్గర లేకపోయినా మనకు వాడటం తెలుసు, ఒక వేల వాళ్లకు చూపించినా, కొంతమంది మనతోనే వుంటూ మంచి ఫ్రెండ్ అవుతాడు, ఇంకొంతమంది ఇవ్వడం ఇష్టంలేక, పిసినారిలా తయారు అవుతారు.
అలా వచ్చిన వాడే శేఖర్. నాకు సునీల్ కి అన్నీ ఇచ్చిన చిన్ననాటి నా స్నేహితుడు. ఇప్పటికీ మేము కలిసే ఉన్నాము అనుకోండి.
బాల్యం చాలా గొప్పది, మనం తప్పు చేస్తే, స్నేహితులు తమ మీద వేసుకోవడం, మనకు మార్కులు తక్కువ వస్తే, వాళ్ళు బాధపడిపోవడం, అందరం కలసి ఆడుకుంటూ, చెట్ల ఎక్కి దూకటం దెబ్బలు తగిలించుకోవడం.
ఇంటిలో చెప్పకుండా వుండటం, అదేంటో చిన్నప్పుడు బాగా చూసుకున్న తల్లిదండ్రుల పిల్లలు సరిగ్గా బాగుపడనట్టు చూస్తుంటాం.
ప్రభాకర్ వచ్చి “సార్ టీ” అంటే ఈ లోకంలోకి వచ్చా, టీ తాగుతున్నాను.
నా అసిస్టెంట్లు ఇంకా అదే టాపిక్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ బాల్య స్మృతులు…….
నా చిన్నప్పుడు అన్నీ కొనిచ్చే నా ఫ్రెండ్ ఇప్పుడు ఏ ఉద్యోగం లేక, మా ఊరిలోనే బస్సు స్టాండ్ దగ్గర షాప్ పెట్టుకున్నాడు అని చెప్పాడు ఒక అసిస్టెంట్.
మా ఫ్రెండ్ అంతే, వాళ్ళ నాన్న పరువు కోసం ఇంజనీరింగ్ చదివించిన, డొనేషన్స్ కి లక్షలు పోయాయి, కానీ బ్యాక్ లాక్స్ ఉండిపోయాయి.
అవును మా ఫ్రెండ్ కూడా అంతే, వాళ్ళ నాన్న అడగకుండానే ఇంటర్ లో బైక్, బీటెక్ లో కారు కొనిచ్చాడు, బైక్ కోసం నేను తిరిగే వాడిని కానీ, మా నాన్న డిగ్రీ చేయమంటే ఇదిగో ఇప్పుడు ఇలా, అయినా కానీ మనం ఫ్యూచర్ లో అనుకున్నది సాధిస్తాము.
పాపం అలా పెరిగిన వాళ్ళు ఎందుకో అలా అవుతారు అన్నాడు ఇంకో అసిస్టెంట్.
అవును కదా, చిన్నప్పుడు, స్కూల్ కి తీసుకొని వెళ్లే బ్యాగ్ మొదలుకొని, బుక్స్, పెన్నుకు, పెన్సిల్ కి, మెండర్ కి పక్క వాళ్ళను అడిగి, వాళ్ళు ఇవ్వకపోయినా ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి, స్కూల్ కల్చరల్ ఆక్టివిటీస్ పాల్గొన్నప్పుడు మన అవసరాలు అయినా పెన్స్, పెన్సిల్ గిఫ్ట్ గా ఇస్తే ఎంత ఆనందపడుతామో, ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అన్నాడు ఇంకో అసిస్టెంట్.
ఎందుకో, ఏంటో అన్నీ వున్నవాళ్లు అలా అవుతారు, ఇలా ఇబ్బందులు పడ్డవాళ్ళం ఏదో ఒకటి సాధిస్తాం అన్నాడు ఇంకో అసిస్టెంట్.
పాపం కొంచెం చిన్నవాళ్ళు కదా, కొంచెం క్లారిటీ ఇద్దాం అని బయటికి వచ్చాను.
నన్ను చూసి గుడ్ మార్నింగ్ చెప్పారు కానీ, టాపిక్ కంటిన్యూ చేయడం లేదు.
నేను కలుగ చేసుకున్నాను, ఈ పెన్సిల్స్ చిన్నప్పుడు వుండి వుంటే, ఎంత బాగా చదివేవాళ్ళమో కదా…. అని.
మీరు కూడానా సార్….. అన్నాడు, ప్రభాకర్.
తప్పేముంది ప్రభాకర్, మన పేరెంట్స్ వుండి లేక పెంచినప్పుడు మనం “ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటాం, నాన్న కొనిచ్చే దాక ఎదురు చూసినప్పుడు, ఓపికగా వుండటం నేర్చుకుంటాం, అప్పులు చేసి టిఫిన్స్ చేసినప్పుడు, మనీ మానేజ్మెంట్ నేర్చుకుంటాం”.
నువ్వన్నట్టు ఫ్రెండ్ బైక్ కోసం తిరిగినప్పుడు, ఎదుటివాడితో ఎంత సామరస్యం గా మాట్లాడి, వాళ్ళను ఒప్పించటం నేర్చుకుంటాం. పంచుకోవడంలో ఆనందం వెతుక్కుంటాం.
ఇలా ప్రతి చోట మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి మనకు బ్రతకటానికి ఒక దారి తెలుస్తుంది. మనకు ఏమి కావాలో? ఎలా వుండాలో? అర్థం అవుతుంది.
అదే అన్ని వున్నా మనచిన్నప్పటి ఫ్రెండ్స్ అడగకుండానే తల్లిదండ్రులు అందివ్వడం వల్ల వాళ్లకు ఇన్ని విలువలు తెలియకపోవచ్చు. అడ్జస్ట్ అవ్వడం రాదు. అందరిలో కలిసి మెలసి ఉండరు. టోటల్ గా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం వల్ల వాళ్లు అలా తయారు అవుతారు.
“పండిత పుత్రః పరమ శుంఠ” అని అందుకే అంటారు.
మనం చదవటానికి కష్ట పడుతాము, ట్యూషన్ అని ఆ స్థోమత లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకుంటాం. అదే ఇంటిలో తల్లి కానీ, తండ్రి కానీ టీచర్ అయితే, బుక్ ముందర వుంటుంది కానీ చదవరు. నటిస్తారు అంతే……
అందుకే మన కు మన తల్లిదండ్రులు నేర్పకపోయినా, తెలుసుకుంటూ వెళ్తాము. మన పిల్లల కు ఇవ్వన్ని అర్థం కావాలంటే మనం కూడా వారి అవసరాలు తగ్గించి, బ్రతకటం నేర్పించాలి. ఏ సిట్యుయేషన్ అయినా పేస్ చేసేలా ప్రిపేర్ చెయ్యాలి.
పేరెంట్స్ గా మనం జన్మ ను ఇస్తాము, అంతే…… అన్ని ఫ్రెండ్స్ ద్వారానే తెలుసుకుంటారు. ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ వెళతారు. అన్నీ ఇచ్చాము అనుకో కమ్యూనికేషన్ స్కిల్స్ ని క్లాస్ రూమ్స్ లో నేర్చుకోవాల్సి వస్తుంది.
ఆ దుస్థితి ఎప్పుడూ పిల్లలకీ ఇవ్వకూడదు, అన్నీ ఇచ్చి చెడగొట్టడం కంటే, ఇవ్వడం, పెట్టడం నేర్పించాలి.
సంపాదిస్తున్నాము కదా, అని పిల్లలకు ఆడంబరాల పేరుతో బాల్యాన్ని దూరం చేయకూడదు.
మనకు కార్లు, బైక్స్ వున్న వాళ్లకు నడవటం, సైకిల్ లో స్కూల్ కి వెళ్ళటం నేర్పించాలి. అలా అని అన్నివిషయాల్లో వదిలేయాలి అని కాదు, అబ్సర్వ్ చెయ్యాలి, వాళ్లకు తెలియనీయకూడదు.
మనం ఎంత దాచిన అమ్మకో, నానకో దొరికి పోయినట్లు అన్నమాట, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా అన్నాను. అవునన్నట్లు తల ఊపారు అందరూ.
సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి, నా కొడుకు దినేష్ ఉత్సాహం తో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి నాన్న అని అడిగితే……
నాన్న నేను గేమ్స్ లో ఫస్ట్ వచ్చాను, నాకు జామెంట్రీ బాక్స్ ఇచ్చారు. తన ఫ్రెండ్ అఖిల్ ని చూపించి వీడికి కలర్ పెన్సిల్ ప్యాక్ ఇచ్చారు. ఇంకొక అబ్బాయి రాజు ని చూపించి వీడికి కూడా బాక్స్ ఇచ్చారు అని చూపించాడు.
మేము అనుకోలేదు నాన్న, మా ప్రిన్సిపాల్ పిల్లలకు యూస్ అయ్యేటివి ప్రెసెంట్ చేస్తే ఉత్సాహం గా చదువుకుంటారు. మేము చదివేటప్పుడు మా టీచర్స్ కూడా ఇలాగే ఇచ్చి ప్రోత్సహం ఇచ్చేవాళ్ళు, అందుకే మా అందరికి ఇచ్చారు.
ఇంకా ఇవ్వడం, తీసుకోవడం నేర్చుకోవాలి, ఇంటిలో పేరెంట్స్ కొనివ్వకపోతే గొడవ పడకండి, చదువుకొనేటప్పుడు నేర్చుకొనే ప్రతి విషయం జీవితంలో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కలిసి మెలసి ఉండమని చెప్పరు అని చెప్పాడు దినేష్.
సరే, ఇదిగో తీసుకో అని వాడు అడిగినవి ఇచ్చాను. వాడు చూసి థాంక్స్ నాన్న, ఇవి అఖిల్ ఇంటి దగ్గర ఒక అబ్బాయికి లేవంట, నాకు వచ్చినవి ఇస్తాను, మీరు ఇచ్చినది ఇప్పుడు వాడేవి పనిచేయనప్పుడు వాడుకుంటాం అని వల్లి దగ్గరికి వెళ్లి……
అమ్మా ఇవి ఎత్తి పెట్టు, నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటాం అని ఇచ్చాడు.
నాన్న మేమంతా అఖిల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి బాక్స్ ఇచ్చి వస్తాము, అని ఫ్రెండ్స్ అందరూ రెండు సైకిల్స్ లో వెళుతున్నారు.
రాజు కి సైకిల్ లేదనుకుంటా, ఎవరి దానిలో కూర్చోవాలి అని చూస్తుంటే, దినేష్ చూసి నా సైకిల్ ఎక్కు, ఇందాక అఖిల్ తో వచ్చావు కదా, ఇప్పుడు నాతోరా అనడంతో రాజు దినేష్ సైకిల్ లో కూర్చున్నాడు.
మేము ముగ్గురం ఒక సైకిల్ అయితే వీళ్ళు నలుగురు రెండు సైకిల్స్ అనుకుంటా అనుకున్నాను.
మా ఆవిడ టీ ఇస్తూ, మీరు చెప్పింది నిజమే పిల్లలని తోటి పిల్లలతో పెరగనివ్వాలి. నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే చేసేవాళ్ళు, కానీ అప్పట్లో బాగా…. అంటే ప్రతి ఫంక్షన్ కి కొత్త బట్టలు వేసుకొని, అన్నీ కొని తల్లిదండ్రులు ఇచ్చిన చదవకుండా కొందరు, 10th క్లాస్ పూర్తి కాకుండానే ప్రేమాయనాలు నడిపేవారు కొందరు వుండేవాళ్ళు.
అలా చేసిన వాళ్ళు, ఇప్పుడు పెళ్లిళ్లు చేసేసుకున్నారు, నేను కావ్య ఇప్పుడు బోటిక్ పెట్టుకున్నాం. చిన్నప్పుడు చదివేటప్పుడు ఆంక్షలు వున్నా చదివే కొద్ది అన్నీ తగ్గిపోయాయి. ఇంకా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేస్తాను అన్నప్పుడు అమ్మ భయపడింది కానీ నాన్న దగ్గరుండి కాలేజీ లో జాయిన్ చేసారు.
ఇప్పుడు మన ప్రేమ ను కూడా ఒప్పుకున్నారు, ఒకసారి డౌట్ వచ్చి అడిగితే చెప్పారు, బ్రతకడం నేర్చుకోవడం తెలిస్తే తప్పులు చెయ్యరు, మీరు అన్నారు కదా, పొద్దున కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నాన్న కూడా అదే చెప్పారు.
అందుకే మీరు నాకు ఎందుకు నచ్చారో, నాన్నకు ఎందుకు నచ్చారో అని అర్థం అయ్యింది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వల్లి.
మా నాన్న నన్ను ఎలా పెంచాడో, నాకు తెలుసు, నాన్నంత కాకపోయినా నాన్నను తలుచుకుంటూ దినేష్ ని పెంచాలి అనుకుంటూ టీవీ ఆన్ చేసాను.

“సమాప్తం”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!