ఊబి

ఊబి

రచన ::సావిత్రి కోవూరు

“హలో గిరిజ నేను క్యాబ్లో వస్తున్నాను. నీవు ఎక్కడున్నావో చెప్తే ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళిపోవచ్చు”  అన్నది అనిత.

“అవునా  నేను కూకట్ పల్లి షాపింగ్ సెంటర్ దగ్గర బస్టాఫ్ లో నిలబడ్డాను.” అంటుండగానే అనిత వచ్చింది. ఇద్దరు కలిసి సంజీవ రెడ్డి నగర్ లో ఉన్న లేడీస్ హాస్టల్ కి వెళ్ళారు.

హాస్టల్ కి వెళ్ళిన తర్వాత డిన్నర్ తర్వాత “అనిత మీ అమ్మ ఎక్కడి కెళ్ళారు.హాస్టల్ కి వచ్చినవ్” అన్నది గిరిజ.

గిరిజ అనిత ఇద్దరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసులో పని చేస్తున్నారు. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ “మా అమ్మ మా మామయ్య గారి అమ్మాయి పెళ్ళికి వెళ్ళింది. తను వచ్చేసరికి ఒక నెల రోజులు పడుతుంది. తమ్మునిల్లు కదా! అంత తొందరగా పంపించరు మా మామయ్య,అత్తయ్య. నెల రోజులు ఇంట్లో ఉండాలంటే చాలా బోర్. అందుకని ఈ నెల రోజులు హాస్టల్లో ఉండి, మా అమ్మ వచ్చాక వెళ్ళిపోతాను” అన్నది అనిత.

“నీవు అసలు పెళ్లి చేసుకోలేదా” అన్నది గిరిజ. ఎంత ఫ్రెండ్స్ అయినా అప్పటివరకు ఇద్దరు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోలేదు. అందుకే ఈ రోజు అడిగింది గిరిజ.

“నాదో పెద్ద కథ ఎప్పుడైనా చెప్తాను లే” అన్నది.

“ఎప్పుడో ఎందుకు ఇప్పుడు చెప్పు తెల్లవారిందాక వింటాను” అన్నది గిరిజ.

తన కథ చెప్పడానికి గతంలోకెళ్ళిచెప్పడం మొదలుపెట్టింది అనిత. “మా నాన్న నా చిన్నప్పుడే పోయారు. అమ్మనే నన్ను పెంచి పెద్ద చేసింది. చదువు అయిపోగానే ఈ జాబ్ వచ్చింది. హాయిగా జాబ్ చేసుకుంటుండగ కొన్ని రోజులకి దూరపు బంధువు ద్వారా ఒక సంబంధం వచ్చింది. నేను “కొన్ని రోజుల తర్వాత పెళ్ళి చేసుకుంటా”నని చెప్పాను అమ్మతో.

“అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం ఒక్కడే అబ్బాయి. మంచి సంబంధం. చూడు నచ్చితేనె చేసుకో” అన్నాడు మధ్యవర్తి. వాళ్లు చెప్పిన మాటలను నమ్మి, మా అమ్మ కూడ అదే మాట అన్నది. తర్వాత నేను కూడ ఒప్పుకోవడంతో పవన్ తో పెళ్లి జరిగింది. అత్త, భర్త బాగానే చూసుకునే వాళ్ళు. నాలాగ అతనికి కూడ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. రెండు మూడు నెలల తర్వాత ఒక మొదటి తారీకు రాగానే పవన్ “నీ జీతం ఏది? నా జీతం ఇంకా రాలేదు. అమ్మ ఇంట్లో కిరాణ సామాన్లు తెమ్మంటున్నది” అన్నారు.

“సరే అని ఇచ్చేశాను” అప్పటి నుండి ప్రతినెల జీతం తీసుకునేవాడు. కొంత నా ఖర్చులకు ఉంచుకుని మిగతాదంత ఇచ్చేసేదాన్ని.”

తర్వాత కొన్ని నెలలకి “నీకు అంత ఖర్చులు ఏముంటాయి. ఆఫీస్ కి ఆటోలో ఎందుకు? బస్సులో వెళ్ళచ్చు కదా! ప్రతి నెల చీరలు కొనడం అయితే ఉండదు కదా” అనడం మొదలు పెట్టారు అత్తగారు.

“బస్సులో వెళితే చాలా లేట్ అవుతుంది అత్తయ్య డైరెక్ట్ బస్సు లేదు. మనకు బస్టొప్ కూడ దూరం” అన్ళాను.

“నేను బండి పైన దింపుతాను  లే” అన్నారు మా వారు.

కొన్ని నెలల తర్వాత మొత్తం జీతం తీసుకునేవాడు. రెండు సంవత్సరాల తర్వాత “మీ అమ్మ ఒక్కదానికి అంత పెద్ద ఇల్లెందుకు అది అమ్మేసి, మన దగ్గరకు వచ్చెయ్యమను. అదే డబ్బుతో ఇక్కడ ఒక ప్లాట్ కొంటే, బోలెడు రెంట్ వస్తది.” అన్ళది మా అత్తయ్య.

నేను పట్టించు కోనట్టు ఉన్నా,వారానికొకసారైనా అనేది. వినీ వినీ విసిగి పోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే మాట చెప్తే “నేను ఈ ఇల్లు అమ్మను. మీ నాన్న గారు ఎంతో కష్టపడి కట్టించారు” అని ఖరాఖండిగా చెప్పింది అమ్మ.

ఆ మాటే మా అత్త గారితో చెప్తే రెండు రోజులు మాట్లాడలేదు. నాకు డబ్బులకు చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం చీరలు ఇస్త్రీ చేయించు కోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు. అతను ఆఫీసుకు తీసుకెళ్తానని చెప్పాడు కాని, ఒక్క రోజు కూడ తొందరగా లేచి, రెడి కాడు. నేను రెడీ అయ్యి లేపితే కానీ లేవడు. అలా రోజు ఆఫీస్ కి లేట్ అవ్వడం వల్ల చాల అవమానంగా ఉండేది. అంతకుముందు నేనెప్పుడూ ఆఫీస్ కి లేట్ గా వెళ్లేదాన్ని కాదు. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది.

వారమంత బిజీగా ఉంటాము, కనుక ఆదివారం ఎక్కడికన్నా బయటకి వెళదామంటే, ప్రతి ఆదివారం ఏదో పని ఉందని బయటకెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు.

మా అత్త గారిని అడిగితే “మగాడు అన్నాక సవాలక్ష పనులు ఉంటాయి అవన్నీ పట్టించుకోవద్దు” అన్నారు.

ఒకరోజు మా స్నేహితురాలి పెళ్లికి వెళ్దామని బ్యాంకు లాకర్ లో ఉన్న నా నగలు తెచ్చుకోడానికి వెళ్లాను. లాకర్ ఓపెన్ చేసి చూస్తే ఒక్క నగ లేదు. అవన్నీ మా అమ్మ, పెళ్లి కాకముందు చేయించినవి. నా జీతం తో చేయించుకున్నవి.

మా అత్తగారు వాళ్ళు పెళ్లప్పుడు కట్నం భారీగానే తీసుకున్నారు కానీ, ఒక్క నగ కూడా పెట్టలేదు. పెళ్లిలో మా వారి కజిన్ లలిత అనే అమ్మయికి ఆడపడుచు లాంచనాలు కూడ సక్రమంగా చేయించారు మా చేత. ఆ అమ్మాయి  ఇంట్లో కూడా పెత్తనం చేసేది. మా అత్తగారు ప్రతిదానికి “లలితా, లలితా” అని పిలిచేది. నేను ఏది అడిగినా “నాకు తెలియదమ్మా లలితని అడుగు” అనేది ఆ అమ్మాయిది కూడా నా వయసే. కాబట్టి నేను కూడా ఆ  అమ్మాయితో క్లోజ్ గా ఉండేదాన్ని.

బ్యాంకులో నగలు కనిపించకపోయేసరికి  మా వారిని “మీరు బ్యాంకులో నుంచి నా నగలు తీశారా” అనడిగాను.

“అవును తీసాను” అన్నారు.

“తీస్తే నాకు ఎందుకు చెప్పలేదు. ఈరోజు మా ఫ్రెండ్ పెళ్లి ఉంది. కావాలి ఎక్కడ పెట్టారు” అన్నాను.

వెంటనే మా అత్తగారు “నేనే తెమ్మన్నాను ఒక ప్లాటు చాలా చీప్ లో ఉందని ఎవరో చెప్తే, కొనడానికి డబ్బులు తక్కువ పడితే నీ నగలు తెచ్చి బ్యాంకు లో పెట్టి లోన్ తీసుకున్నాము” అన్నది.

“మరి నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అత్తయ్య. నేను వద్దంటానా?” అన్నాను.

“నేను నీకు చెప్పడం మర్చిపోయాను. చెప్పినా నీవెలాగైన ఇస్తావు కదా! అయినా ఆ డబ్బులతో ప్లాట్ కొంటె మీకే కదా” అన్నది తేలికగా.

ఆ రోజంతా నిద్ర పట్టలేదు. జాబ్ చేస్తున్నా, చేతిలో వంద రూపాయలు ఉండట్లేదు. నాకు తెలియకుండా నా నగలు తీసేశారు. అసలు ఏం జరుగుతుంది అంతు పట్టడం లేదు. పెండ్లి అయ్యి నాలుగేళ్లైనా ఇప్పటి వరకు కనీసం  సినిమాకు కూడా తీసుకెళ్లలేదు.

ఏమన్నా అంటే “అమ్మ ఒక్కతే ఉంటది ఇంట్లో” అంటాడు. తను మాత్రం పొద్దుటి నుండి రాత్రి వరకు బలాదూర్గా తిరిగేసి వస్తాడు. మా ఆఫీసు లో తోటి వాళ్లంతా సెలవుంటే  భర్త పిల్లలతో సరదాగా బయట తిరిగొస్తుంటే, నేను మాత్రం అత్తతో టీవీ చూస్తూ కూర్చుంటున్నాను. మా అత్తగారు సతాయించడం లాంటివి ఏమీ లేదు. చక్కగా సమయానికి వండి పెడుతుంది వంట దగ్గర కూడా హెల్ప్ అడగదు.

పోనీ పిల్లలు ఉంటే లైఫ్ కొంచెం హుషారుగా ఉంటుదనుకుంటె పిల్లలు కూడా కావట్లేదు.డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే టైం దొరకటం లేదు. మా అమ్మ ఎన్నో సార్లు అడిగింది “ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నారా? ఒకరో ఇద్దరో పిల్లలు ఉంటే బాగుంటుంది కదా! ఏ వయసులో ముచ్చట ఆ వయసులో ఉండాలి”అని.

ఒకరోజు లేచేసరికి డల్ గా ఉంది. ఆఫీసు ఇల్లు, ఆఫీసు ఇల్లు బోర్ కొడుతుంది. వారం రోజులు అమ్మ దగ్గరికి వెళ్లి వద్దాం అనుకున్నాను. మా అత్త గారిని అడిగితే “వెళ్లి రా” అన్నది.

మా వారిని అడిగి తనను రమ్మంటే “నీవు వెళ్ళు నాకు చాలా పనులు ఉన్నాయి” అన్నారు. నేను రెడీ అయ్యి బయల్దేరాను. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో  రెంట్ కి ఇచ్చిన పోర్షన్ లోకి కొత్తగా ఎవరో వచ్చారు. ఆయన సెక్రటరియేట్ లో పని చేస్తాడట. ఆవిడ బ్యాంకులో పనిచేస్తుందట. ఏ బ్యాంక్ అని అడిగితే ఎస్.బి.ఐ.అన్నది. మా వారు చేసే బ్రాంచ్ లోనే అని తెలిసింది.

వెంటనే “మా వారు కూడా అదే బ్యాంక్ లో పని చేస్తున్నారు” అన్నాను.

“అవునా ఏం పేర”ని అడిగితె, నేను డీటెయిల్స్ అన్ని చెప్పి, ఫోటో చూపించాను. “ఇతను ఒకప్పుడు మా బ్యాంకులో అటెండర్ గా చేసేవాడు. ఏదో గొడవ వల్ల జాబ్ పోయింది. ఇప్పుడు చేయట్లేదు. మొన్నొక రోజు ఎక్కడో కనిపించి, మా వారికి చెప్పి ఏదైనా జాబ్ ఇప్పించమని అడిగాడు” అన్నది.

నాకు నోట్లోంచి మాటరాలేదు.  “మీరు సరిగ్గా చూడండి. ఇతనేనా మీరు చెప్పేది” అన్నాను.

ఆమె “ఫోటో చూసి అవును. నాకు బాగా తెలుసు. ఇతని తీసేసి కూడా చాలా రోజులు అయింది.” అన్నది ఆవిడ. నాకు తల కొట్టేసినట్లు అయ్యింది ఆమె చెప్పిన మాటలు విని.

జాబ్ లేకపోయినా పర్వాలేదు. నాకు ఉన్నది కాబట్టి ఎలాగైనా గడుపు కోవచ్చు. కానీ జాబ్ చేస్తున్నానని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని, ఇన్నేళ్ళ వరకు తల్లి కొడుకులు నాటక మాడుతున్నందుకు చాలా కోపంగా ఉంది. ఇన్ని రోజులు ఎలా మోసపోయానో అర్థం కావటం లేదు. ఒక్కసారి కూడా అనుమానం రాకుండా ఎలా నటించారు. ఆ రాత్రంతా అమ్మ నేను ఏడుస్తూనే గడిపాము.

మా అమ్మ “జాబ్ లేదంటే పిల్లని ఇవ్వరని మోసం చేశారేమో, తర్వాత అయినా నిజం చెప్తే బాగుండేది. ఎంతమంది భార్యలు జాబు చేయకపోయినా భర్తలు పోషించటం లేదా, అలాగే అనుకుని నీవే వాళ్ళని పోషించే దానివి. కానీ ఒక్క మాట చెప్పకుండా జీతము అంతా తీసుకుని ఖర్చులకు కూడా ఇవ్వకుండా, నీ నగలు కూడ చెప్పకుండా తీసుకున్నారు అంటే, నీకు తెలియకుండా ఇంకెన్ని మోసాలు చేస్తున్నారో. ఇంకా నయం ఇల్లు అమ్మి ఆ డబ్బులు కూడా వాళ్ల చేతుల్లో పోయే లేదు. అప్పుడు మనకు నిలువనీడ కూడా ఉండేది కాదు.” అన్నది అమ్మ ఏడుస్తూ.

అమ్మ నే వెళ్లి “ఎందుకు అలా చేశారని నిలదీస్తాను.” అన్నాను.

“దాని వలన వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎలాగు తెలిసిపోయింది కదా అని టార్చర్ పెట్టే అవకాశం ఉంది” అన్నది అమ్మ.

మరి నన్ను ఏం చేయమంటావమ్మా” అన్నాను బేలగా.

“చేసేదేం లేదు. నీకు ఇష్టమైతే అలాగే కాపురం చేసుకో. నీవే వాళ్ళని పోషించు. నీ డబ్బులు మొత్తం వాళ్ళకి ఇవ్వకుండా నీ అవసరాలకు పెట్టుకొని ఇంట్లోకి ఖర్చులన్నీ భరించు.” అన్నది అమ్మ.

“అంత మోసం చేసిన వాళ్లని ఏమీ తెలియనట్టు రోజు వాళ్ళ ముఖం చూస్తూ ఎలా భరించ మంటావ్ నన్నొక డబ్బు సంపాదించే యంత్రంలా చూస్తున్నారు.  ఒక సరదా లేదు. ఏమీ లేదు. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. మా వారు రాత్రిళ్ళు ఏదో టాబ్లెట్ తీస్తుంటారు రోజు. అది ఏంటి అని అడిగితే ‘ఎలర్జీ టాబ్లెట్స్’ అన్నారు. ఒక టాబ్లెట్ నా బ్యాగ్ లో పడిపోయింది. ఆ టాబ్లెట్స్ నాకే పాలల్లో కలిపి ఇస్తున్నారేమో అని అనుమానంగా ఉంది. ఒకసారి కనుక్కుంటాను.”అన్నాను.
ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆ టాబ్లెట్ పేరు చెప్పి “ఇది దేనికి వాడతారో ఒకసారి మీ ఆయన డాక్టర్ కదా అడిగి చెప్తావా” అన్నాను. గూగుల్ చూసె ఓపిక లేక. కొంత సేపటికి ఆమె ఫోన్ చేసి అవి ఫ్యామిలీ ప్లానింగ్ టాబ్లెట్స్ అట అన్నది. నా అనుమానం ఏంటంటే రోజు నాకు పాలల్లో అవే కల్పిస్తున్నాడేమో. పిచ్చిదాని లాగా తాగేస్తున్నాను. అందుకే నాకు ఇన్నాళ్ళు పిల్లలు కలుగ లేదు. అనుకున్నాను

మా అమ్మతో “ఒక్కసారి నేను అక్కడికి వెళ్లి అన్ని అడిగేసి వస్తానమ్మా” అని బయల్దేరాను. నేను వెళ్లేసరికి మా అత్తగారు లోపల ఏదో పిండి వంటలు  చేస్తున్నట్టున్నారు. బెడ్రూం తలుపు దగ్గరగా వేసి ఉంది. లోపలికి వెళదామా అనుకుంటూ ఉండగా, లోపలినుండి ఆడ గొంతు వినిపించింది “మొత్తానికి మీ ఆవిడను బలే బోల్తా కొట్టిస్తున్నావు. ఎప్పుడు వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర నుండి” అన్నది.

“ఏమో తెలీదు మొన్ననే కదా వెళ్ళింది. వారం రోజులు వెళ్తున్నానంది.అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణ అవతారం చాలించి, రామావతారం ఎత్తాలి” అన్నారు మావారు.

“ఈ వారం రోజులే అన్నమాట మనకి ఇక్కడ హనీ మూన్”అన్నది.

“నా పెళ్లి అయినాక మా ఇంట్లో నీకు ఉండడానికి అవకాశం రావట్లేదు. పోనీలే ఇన్ని రోజులు కైనా అనిత వారం రోజులు మనకి టైమ్ ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది” అన్నాడు.

“అంత ఇదిగా ఉంటే శాశ్వతంగా పంపించు. నేను వచ్చేస్తాను ఇక్కడికే” అన్నది.

“అమ్మో అలా పంపిస్తే ఎలాగా? అనిత నా పాలిట కామదేనువు. తను నాకు డైవర్స్ ఇచ్చినా నాకు ఉద్యోగం లేదు. కనుక ఎంతో కొంత  భరణం కూడ వస్తది. అలా వెళ్లి పోతే మన ముగ్గురిని పోషించేది ఎవరు. తను ఉండాల్సిందే” అన్నాడు

“మనిద్దర్నీ చూసి అనితకీ పెళ్లప్పుడు అనుమానం వస్తుంది అనుకున్నాను. పిచ్చి మొద్దు అసలు అనుమానించ లేదు. ఇన్ని రోజుల నుండి రోజు నీ దగ్గరికి వస్తున్నా, ఆదివారం మొత్తం నీదగ్గరే ఉంటున్నా, అనుమానం రావట్లేదు దానికి. నాకే నటించ లేక కష్టం అవుతుంది” అన్నాడు.

ఎవరా ఆ ఆడ గొంతు అని మెల్లగా తొంగి చూశాను. పెళ్లిలో ఆడపడుచు లాంఛనాలు తీసుకుని పెత్తనాలు చేసిన మావారి కజిన్. వెంటనే సెల్ తో ఇద్దరు క్లోస్ గా ఉన్న ఫోటో ఒకటి తీసుకుని,  అవమానంతో వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని మెల్లగా వచ్చిన దారిని బయట కొచ్చేసాను. ముగ్గురు వాళ్ళ వాళ్ళ లోకాలలో ఉన్నారు. కాబట్టి నేను వచ్చింది ఎవరు చూడలేదు. ఇంటికి వెళ్లి అంతా అమ్మకు చెప్పి బోరున ఏడ్చేసాను. ఒక్కొక్కటి ఆయన లీలలు బయట పడుతుంటే దిమ్మతిరిగిపోతుంది.

“ఫోటో ఎందుకు?”అన్నది గిరిజ.

“రేపు అతను కోర్టులో భరణం అడిగినపుడు,అక్రమ సంబంధం గురించి చెప్పి ఋజువు చూపెడితే భరణం ఇవ్వక్కర లేదు.” అన్నది అనిత.

మా అమ్మతో “ఇన్ని మోసాలు చేసిన వాడితో నేను కాపురం చేయలేను. కొంచెం కూడా అనుమానం రాకుండా నాకు ఐదేళ్లు టాబ్లెట్స్ ఇచ్చిన వాళ్ళు, జాబు లేకపోయినా ఉన్నట్టు నటించిన వాళ్ళు, నా దగ్గర పైసలు, నగలు ఏవి లేకుండా చేసిన వాళ్లు, నా పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో సంబంధమున్న మనిషి, ఓన్లీ నా సంపాదన కొరకే నన్ను పెళ్లి చేసుకున్న మనిషి, రేపు నా జాబ్ లేకపోతే, నా ప్రాణం తీయరని గ్యారెంటీ ఏంటి” అన్నాను

మా అమ్మ “నీవు ఏమి చిన్నపిల్లవు కాదు నేను చెప్పడానికి. బాగా ఆలోచించుకో. ఇది నీ జీవిత సమస్య నీవే నిర్ణయించుకో. నీవు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే” అన్నది.

“థాంక్స్ అమ్మా, అందరి అమ్మ ల్లాగా ‘చావైనా, బతుకైనా నీ భర్త దగ్గరే’ అని నీతులు వల్లించకుండ, నా ఇష్టం అంటున్నవు. అదే నీ గొప్పతనం. అదే నాకు కొండంత అండ. నేను పొద్దున్న లేచినప్పటి నుండి వాళ్ళ నటనను చూస్తూ గడపడం నావల్ల కాదు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్లను నిన్ను దిక్కులేని దాన్లా, ఒంటరిగా వదిలేసి అంత మోసగాళ్లను పోషించాల్సిన అవసరం నాకు లేదు. అట్లని ఈజీగా డైవర్స్ కూడా ఇవ్వను. నేను డైవర్సు ఇస్తే , ఇంకో అమ్మాయికి వల వేస్తారు ఆ తల్లీ కొడుకులు. ఉద్యోగం పోతే బ్రతకడానికి ఏ పని అయినా చేయొచ్చు. అంతేగాని సోమరిగా, అవిటి వాణి లాగా ఇతరులపై బడి బ్రతకనక్కరలేదు. పోషించాల్సి వస్తదని పిల్లలు కాకుండా నాకు తెలియకుండా టాబ్లెట్స్ మింగించడమంత నీచమైన పని మరేదీ ఉండదు” అని ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చింతగా ఉన్నాను.”అని ముగించింది అనిత.

“మరి అందరిలా భర్త పిల్లలు లేరే అని బాధ కలుగుతుందా ఎప్పుడైనా” అన్నది గిరిజ.

“ఇన్ని మోసాలు చూసినా నాకు ఆ భర్త అన్నా అసహ్యం వేస్తుంది, పిల్లలు అన్నా ఏమి ఆసక్తి లేదు. ఇలా అమ్మతో హాయిగా నా ఇష్టం వచ్చినట్టు ఉండడమే నాకు ఇష్టం” అన్నది అనిత.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!