దేవి అలక
రచయిత: ఉదయగిరి దస్తగిరి
ఎప్పుడు చూసినా శృంగార రసాన్ని చిలికే నీ కనులు
నేడు అలకతో ఎర్రమందారాల వలే మారెనెందుకో
గంధము పూసిన చెంపలు
నల్ల కలువల వలె అవతారమెత్తెనెందుకో
పద్మాలంకారివైన వక్షస్థలమున
శాశ్విత నివాసమున్న పద్మావతివే
అలిగిన వేళ కులికే అలకలకెంత సోకో
ద్వాపరయుగమున కాళ్లు పట్టితిని
ఈ కలియుగమున ఈ కరము పట్టి
బతిమాలుడుదునే దేవి
అతల వితల సుతల పాతాళలోకమందు లేని అద్భుతాలన్నీ
నీ అలక తీర్చగా కానుకివ్వనా లేక
నీ సోయగాన్ని గారాలు చేస్తూ పొగిడి బుజ్జగించనా
నీ అలకతీరు మార్గమేమిటో తెలుపవా దేవి
ఈ హరిని కరుణించవా దేవి…