ధన బంధాలు

ధన బంధాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే…. అంటూ సుప్రభాతం వినిపిస్తోంది పక్కనే ఉన్న కలియుగ దేవుని గుడిలోంచి. చిరు చల్లని చలి, ఇంకొంత సేపు ముసుగు తీయకు అంటోంది, ముసుగులా మూసుకున్న మంచు కు చిల్లులు పెడుతున్నాడు ఉదయ భానుడు అరుణ వర్ణపు కిరణాల కత్తులతో. పచ్చని చెట్ల కొమ్మల మధ్యలోంచి పడుతున్న ఆ లేలేత కిరణాలకి అపుడే విచ్చు కుంటున్న పూవుల రెమ్మల పై పడిన మంచు బిందువులు ముత్యాలా అన్నట్టు ఉన్నాయి. ఇంతలో అప్పటికే స్నానం చేసి తులసి మాతకు నీళ్ళు పోసి ప్రదిక్షణలు ముగించుకున్న లలితమ్మ పిలుపుకు ఒళ్లు విరుచుకుంటూ లేచాడు గిరీశం.
గిరీశం అదే ఊర్లో జిల్లా పరిషత్ పాఠశాల లో లెక్కల మాస్టారు గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు తిలక్ పదవ తరగతి, అమ్మాయి సరోజిని ఎనిమిది చదువుతోంది. దేశభక్తి తో వారికి ఆ చరితార్ధుల పేర్లు పెట్టుకున్నారు. గిరీశం గారు ఆ ఊర్లో అందరికీ చేతనైన సాయం చేస్తూ ఉండడం తోనూ, పిల్లలకి మంచి విద్యాబోధన చేస్తూ క్రమశిక్షణ నేర్పడం తో మంచి పేరు ఉంది. లలితమ్మ గారు వారికి తగిన ఇల్లాలు మాత్రమే కాదు ఆ ఊరి ఆడపిల్లలు అందరికీ పంతులమ్మ కూడా.
ఆ ఊర్లో గుడి అరుగు మీద ఓ ముసలామె ఉండేది. కూడు గుడ్డ గూడు లేని ఓ పేదరాలు. ఎవరూ కూడా నిత్యం ఏం చేస్తాం అని ఆమె ను పట్టించుకునే వారు కాదు. ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటీ వంటి వివరాలు కూడా ఎవరికీ తెలీదు. ఆ విషయం అంతగా ఎవరూ ఎపుడూ పట్టించు కోలేదు కూడా. ఆమెకు రోజూ ఈ లలితమ్మ గారే ఉదయం, మధ్యాహ్నం వాళ్ళతో బాటే కొంచెం ఉపాహారం, భోజనం పెట్టేది. దానికి ప్రతిఫలంగా రోజూ బంగారు దీవెనలు అందేవి లలితమ్మ కుటుంబానికి. మానవ సేవే మాధవ సేవ అని అవిడ నిర్విరామంగా అలా చేస్తూనే ఉండేది. రాత్రి మాత్రం ఆ అవ్వ ఏమీ తినేది కాదు. గుడి దగ్గరే చెరువులో స్నానం చేసి, ఆవరణ అంతా శక్తి కొలది శుభ్రం చేసి అక్కడే ఉంటూ ఉండేది. అనుకోకుండా ఆ రోజు తిలక్ పాలు తీసుకు రావడానికి కొత్తగా నేర్చుకున్న తన నాన్నగారి స్కూటర్ తీసుకు వెళ్ళాడు. కొంచెం నడపడం వచ్చు కానీ తండ్రి లేకుండా ఎప్పుడూ తీసేవాడు కాదు. ఆ రోజు తన ప్రారబ్దం కొద్దీ స్కూటర్ తియ్యడం పట్టు తప్పి ఈ అవ్వను గుద్దడం తో అవ్వ పాపం స్పృహ తప్పి పడి పోయింది. వెంటనే గిరీశం గారు అవ్వను తీసుకుని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. అవ్వకి అవసరమైన ప్రథమ చికిత్స అందించి వైద్యుల సలహా మేరకు దగ్గర్లో ఉన్న పట్టణం లోని వేరే ఆసుపత్రి కి తరలించారు. ఇదంతా ఊరు జనం చూస్తున్నారు కానీ, ఏదో మొక్కుబడిగా జాగ్రత్తా అయ్యగారు, చూసుకోండి మాస్టారు అన్నారే గానీ ముందుకు రాలేదు. ఈ యనకు ప్రాణం ఒప్పక ఎవరైనా ప్రాణమే కదా, ఎలా వదిలేస్తాం అని ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి వైద్యులతో అవసరమైన చికిత్స చెయ్యమని చెప్పారు. అక్కడ ఉన్న వైద్యుడు మన గిరీశం గారి పూర్వ విద్యార్థి కావడం తో ఇబ్బంది లేకుండా పోయింది. అయితే అలా రెండు రోజులు అయినా అవ్వకి స్పృహ రాక పోవడం తో కొంచెం కంగారు పడుతున్నారు.
ఇక ఊర్లో సంగతి చూస్తే. ఏమండీ మాస్టారు అబ్బాయికి అలా ఎలా స్కూటర్ ఇస్తారు, నడపడానికి అనే వారు ఒకరు. పిల్లల్ని గారాబం చెయ్యకూడదని చెప్పే వారు ఒకరు, ఇలా కాదండీ పోలీసులకి ఫిర్యాదు చెయ్యాలి, లేకుంటే రేపు ఆ అవ్వకు ఏమైనా అయితే ఎలా అంటూ నానా రకాల మాటలు మొదలయ్యాయి. ఇంతలో అవ్వ ఆరోగ్యం మరింత క్షీణించి కోమాలోకి వెళ్లి పోయింది.
ఇక పాపం గిరీశం గారు, లలితమ్మ మొక్కని దేవుడు లేడు. పిల్లలు సరే సరి. నాన్న! సారీ అనుకోకుండా తీసుకువెళ్ళా, పొరబాటు అయింది అంటూ ఒకటే ఏడుపు. కొడుక్కి సరే ఏదో జరిగింది ఇంకెప్పుడూ బండి తియ్యకు అని ధైర్యం చెప్పారు. ఊరి జనాల్లో కొంత మంది. అయ్యో పిన్నీ ఏమైంది? అంటూ ఒకళ్ళు, అయ్యో అత్త ఎవరే నిన్ను ఇలా మంచాన పడేశారు అంటూ ఒకడు ఆ అవ్వ చుట్టూ చేరారు. ఆమె అక్కడ ఉన్నప్పుడు కనీసం గుక్కెడు నీళ్ళు కూడా పోయని వీళ్లంతా ఇప్పుడు బంధువులు ఎలా ఆయారో తేలీలేదు గిరీశం దంపతులకి. ఇంతలో ఓ కుర్రాడు మా అమ్మ ని ఈ మాస్టారి కొడుకు గుద్దేసాడు బండి మీద, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎస్ ఐ కూడా మన మాస్టారికి పూర్వ విద్యార్థి కావడం తో ఈ జనాల సంగతి ఏమిటో చూద్దాం అనుకున్నాడు. ఆ వైద్యుడు కూడా ఇతనికి స్నేహితుడే. ఓ పథకం వేసి ఆ అవ్వ బ్రతకడం కష్టం అని చెప్తారు ఇక చూడండి వీల్లంతా న్యాయస్థానానికి పోతాం అంటూ గంతు లేసారు. పాపం మన గిరీశం గారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ గొడవలు అవీ అంటే బంగారం లాంటి పిల్లాడి భవిష్యత్ నాశనం అయిపోతుంది అని ఒక్కటే మధన పడుతున్నాడు. ఆ ఎస్ ఐ వచ్చి మీరు కంగారు పడకండి మాస్టారు, వీళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. ఇంతలో మరో రెండు రోజులు గడిచింది. అవ్వ కూడా కోమా లోంచి బయటకు వచ్చి కోలుకుంటోంది.
ఆ సదరు గోల పెడుతున్న జనాన్ని స్టేషన్ కి పిలిచారు మన ఎస్ ఐ. ఏమిటి విషయం అనే సరికి ఒక్కక్కడు ఒక్కోలా మాట్లాడుతూ, మాకు ఇంత కావాలి, అంత కావాలి అని పట్టుబట్టారు. సరే ఇలా కాదు కానీ మీరంతా మీ మీ ఆధార్ కార్డులు, అవ్వ తో మీకున్న బంధుత్వం తాలూకు వివరాలు, దానికి ఉన్న ఆధారాలు తీసుకుని రేపు రండి, ఈ లోపు అవ్వ ఎలాగూ పోతుంది, న్యాయస్థానం అవన్నీ ఎందుకు పాపం పిల్లాడి భవిష్యత్ పోతుంది కాదా, మీ అందరికీ తలో పదివేలు ఇప్పిస్తా అనే సరికి భలే బేరం అనుకుని అందరూ జారుకున్నారు. వాళ్ళ ఆధార్ కార్డులు, అవ్వ తో బంధుత్వం తాలూకు ఏవో అవీ ఇవీ కాగితాలు సృష్టించే పని లో పడ్డారు.
ఇంతలో మన గిరీశం గారి అదృష్టం కొద్దీ అవ్వ తేరుకుంది. ఆ విషయం వాళ్ళకి తెలీకుండా జాగ్రత్త గా అవ్వ కి ఈ ధన బంధు గోల మొత్తం చెప్పి, పక్క గదిలో కూర్చో బెట్టారు. ఇంతలో ఏ ఆధారాలు సృష్టించ లేక సగం మంది జారుకోగా మిగతా జనం స్టేషన్ కి వచ్చారు ఏవో కాగితాలు తీసుకుని.
ఇంతకీ ఇప్పుడు ఈ అవ్వ మీ చుట్టమే అంటారు అయితే అన్నారు ఎస్ ఐ. అవును పాపం అవిడను తీసుకెళ్ళి బంగారంలా చూసుకుందాం అనుకున్నాం ఇంతలో వీళ్ళు చంపేశారు అంటూ కట్టలు తెంచుకున్నాయి వారి మాటలు. సరే ఓ పని చేద్దాం, నేను అవ్వ ని పిలుస్తా, మీరు తీసుకెళ్ళి పెంచండి, ఎలాగూ వైద్యం మన మాస్టారు చేయించారు కదా అన్నారు. అవ్వ ఏం బతుకుతుంది లే అనుకున్న జనం అలాగే కానీ ఆవిడని ఈ స్థితి కి తెచ్చారు కనుక మాకు పరిహారంగా మీరు నిన్న చెప్పిన డబ్బు ఇవ్వాల్సిందే అన్నారు. అయితే సరే అవ్వను పిలుస్తా, ఆమె ఏమంటుంది చూద్దాం, ఆవవిడ ఎలా చెప్తే అలాగే అని అవ్వని పిలిచారు. ఆమె కొంచెం కోలుకోవడం తో మిల్లిగా నడుస్తూ వచ్చి…
ఏవర్రా సన్నాసులూ! ఎప్పుడైనా నాకు ఓ ముద్ద పెట్టారా, గుక్కెడు నీళ్లు ఇచ్చారా, కనీసం పలకరించారా, ఇప్పుడు నేను మీకు చుట్టామా, ఎలా? అంటూ గదమాయించే సరికి ఖంగు తిన్నారు వాళ్లంతా. అక్కడ నుంచి జారుకో పోయారు. ఇంతలో ఎస్ ఐ గారు వాళ్ళని పట్టుకుని ఏరా మాస్టారు దగ్గర అన్యాయంగా డబ్బులు నొక్కేద్దామని చూస్తారా, మీరే ఈమెకు తలో పది వేలు ఇవ్వండి అనే సరికి కాళ్ల బేరానికి వస్తారు. అదేం కుదరదు డబ్బులు కడతారా, లేదా మీ మీదే కేసు పెట్టి లోపల వెయ్య మంటారా అనే సరికి బుద్ది గడ్డి తిని చేశాం వదిలెయ్యండి అన్నారు. ససేమిరా కుదరదని ఆమె వైద్యానికి అయిన ఖర్చు మొత్తం మాస్టారుకి తిరిగి ఇవ్వండి అనే సరికి వాళ్ళకి ఒప్పుకోక తప్పలేదు. అలా మన గిరీశం మాస్టారు వాళ్ళు కుదుటపడ్డారు. అవ్వ మాత్రం గిరీశం గారికి, లలితమ్మ కి పరిపరి విధాల మొక్కింది, ఏ జన్మ బంధమో తెలీదు మీ వల్ల ఇలా ఉన్నాను అని, తిలక్ ని పిలిచి మళ్లీ ఎప్పుడూ పొరబాటున కూడా బండి తియ్యకయ్య అని చెప్పింది. మన గిరీశం, లలితమ్మ ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
అదండీ కథ ఏదైనా డబ్బులు కలిసి వస్తాయి అంటే బంధాలు ఎలా వచ్చేస్తాయి చూసారు కదా. ధన మూలం ఇదం జగత్ అంటే ఇదే.
కథ కంచికి మనం ఇంటికి.

You May Also Like

16 thoughts on “ధన బంధాలు

  1. చాలా బాగుంది కధ.నిజమే చాలా మంది ఇలాంటి వాళ్ళే.

  2. చాలా బాగుంది. ధనమే ప్రధానం అని బాగా చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!