ధన్యజీవి లక్ష్మక్క

ధన్యజీవి లక్ష్మక్క
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

ప్రాతఃకాల సంధ్యావందనం చేసుకుని పూజామందిరం నుంచి వస్తున్న రామశర్మ తో, ఒరే రామం మన లక్ష్మక్క రాత్రి నిద్రలోనే పోయిందిట అన్నారు కొడుకు తో సుభద్రమ్మ గారు. పక్కింటి మీనాక్షి మీకు తెలిసిందా అత్తయ్య గారు అందరితో కలివిడిగా ఉండే మన లక్ష్మక్క రాత్రి నిద్రలోనే పోయిందట. మహాతల్లి ముక్కోటి ఏకాదశి పూట తనువు చాలించింది. అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి అని సుభద్రమ్మ గారితో అంది.
ఒసే చిట్టి మనతో రోజు వైకుంఠపాళీ ఆడే లక్ష్మక్క రాత్రి దేముని దగ్గరకు వెళ్ళి పోయిందట మా అమ్మ చెప్పింది అన్నది ఎనిమిదేళ్ళ పద్మ. ఎంతమంచిదో కదా అంది. ఒరే డేవిడ్ మన లక్ష్మక్క ప్రభువు సన్నిధికి రాత్రి నిద్రలోనే చేరిందిట. ఎంత మంచిమనిషో క్రిస్టమస్ కి గుడ్ ఫ్రైడే కి కుల మత భేధాలు లేకుండా చర్చ్ కి వచ్చేది అని డెబ్భై ఏళ్ళ ఫాథర్ పీటర్ కొడుకుతో బాధపడుతు అన్నాడు.
అయ్యో లక్ష్మక్క గారు అప్పుడే చనిపోయారా. నా చేత దేమునిమందిరం, పీటలు చేయించుకొని ఇంత మెతక వాడివైతే ఎలా బ్రతుకుతావురా బ్రహ్మం అని అన్నారని భార్య పార్వతి తో చెప్పాడు. ఇక రామాలయం పూజారి డెబ్భై ఐదు సంవత్సరాల నృసింహశర్మ ప్రతీ శ్రీరామనవమికి వడపప్పు, పానకం, విసిన కర్రలు లక్ష్మక్కే స్వయంగా ఇచ్చేది ఎంత మంచి మనిషో అని, ఊళ్ళో శుభకార్యాలకు మొదట పెద్ద ముతైదువు గా లక్ష్మక్క నే పిలవటం ఆమె హస్త వాసి మంచిది అనడం నాయిడు గారితో చెపుతున్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి గారు ఆగస్టు 15, జనవరి26 న లక్ష్మక్కగారు వచ్చి పిల్లలతో బాటు జెండా వందనము స్వీట్లు పంచిపెట్టడం గురించి చెపుతున్నారు.
ప్రేమసమాజం సన్యాసిరావు గారు లక్ష్మక్క అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు వచ్చి అనాధాలకు, అభాగ్యులకు పండ్లు తోచిన సహాయం చేయడం, ఆప్యాయత తో పలకరించండం గుర్తు చేసుకొని ఆమె పోవడం దురదృష్టం అని అన్నారు. ఇవన్నీ అందరినోట విన్న నాకు మతిపోయింది. హైదరాబాద్ నుంచి మా చెల్లి ఉన్న గ్రామానికి రావడం మొదటిసారి. డొక్కా సీతమ్మ గారిని, సిస్టర్ నివేదితను, మథర్ థెరిస్సా ను నాకు తెలియదు కాని అంతకన్నా మంచిమనిషి ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసి, చెల్లితో లక్ష్మక్క గారికి ఏం చేసింది చనిపోయారు అంటే, నా చెయ్యి పట్టుకుని పద లక్ష్మక్క ఇంటికే వెళదాం అంటూ రెండు వీధుల అవతల జనం తిరునాళ్ళలా ఉన్న నాలుగిళ్ళ లోగిలిలో కి తీసుకెళ్ళింది.జనాన్ని తప్పుకుంటు వసార లో పండుటాకుల నుదుట విచ్చరూపాయంత కుంకుమ బొట్టుతో నిద్రపోతున్న పార్వతీదేవిలా ఉన్న లక్ష్మక్క కనిపించారు. అక్కడ ప్రశాంత, పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఉన్నట్లు అనిపించింది. జనం ఆవిడకు పూలదండలు వేస్తు, కాళ్ళకు నమస్కరిస్తున్నారు. లక్ష్మక్కకు అధిక మాసాలు కలిపి నూరేళ్ళు ఉంటాయి. పుణ్యజీవి. ముక్కోటి ఏకాదశి పూట ఎవ్వరిచేత చేయించుకోకుండా పూర్ణాయుర్దాయం జీవించిన దేవత అని ఎవరో అనడం వినిపించింది.
చెల్లి లక్ష్మక్క పిల్లలు వస్తారా అని నేనంటే అబ్బే ఆమెది బాల్యవివాహం ఇరువది సంవత్సరాలు భర్తకి, ఆమెకి తేడా. పెళ్లయిన కొత్తలోనే ఆయన సన్యాసుల్లో కలిసిపోయారు. ఆమెకే భర్త తెలియదు. ఊరంతా ఆమె పిల్లలే. ఆమె పంట రాబడి ఊరి వారికే పెట్టింది. పిల్లల్లో పిల్లలా, పెద్దవాళ్ళకి పెద్దగా ఎప్పుడు చిరునవ్వుతో అందరిని పలకరిస్తు, సహాయం చేస్తు జీవితాన్ని సార్ధకత చేసుకున్న స్థితప్రజ్ఞతకు దర్పణమే. ఇప్పుడు మేమంతా తల్లి లేని పిల్లలమయ్యాము అని చెల్లి భాధ పడుతుచెప్పగా నేను పైకే లక్ష్మక్క ధన్యజీవి దేవతయే అనగా అవును అన్నయ్య కోటికి ఒకరు ఇలా వుంటారేమో అన్నది..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!