ఎదురు

(అంశం:”అపశకునం”)

 ఎదురు

 

రచన:: మంగు కృష్ణకుమారి

” కమలా! కాఫీ ! “

” ఇదుగో! మీ మాట పూర్తవకుండానే కాఫీ రెడీ “

” ఓహ్ ! పొద్దుటే నువ్వు ఇచ్చిన మొదటి కాఫీ రుచి ఉంటుందీ! ఒక మాటలో చెప్పలేనోయ్”
” నీకు కూడా కలుపుకోలేకపోయేవా!”

” ఏమిటోయ్! కొంచెం చికాగ్గా అసహనంగా ఉన్నట్టున్నావ్! అలిగేవా”

” ఆఁ , నా మొహానికి అదొక్కటే తక్కువ”

” అసలేం‌ జరిగింది”

” రోజూ ఉన్న గోలే! పాలవాడు బెల్ కొడితే లేచేసరికి, మొట్టమొదట పిల్లి ఎదురు. ఎప్పుడయినా అది రాకపోతే ఎదురింటి మంగరత్నం గారయినా కనిపిస్తారు. పాపం‌ మంచావిడే! పోనీ ఈ కాలం‌ వాళ్ల లాగ‌ఏ స్టిక్కర్ బొట్టు అయినా పెట్టుకోరు. ఆవిడకి చాలా పట్టింపట. మరి నాకే ఏవీ ఉండకూడదా!”

” పాపం, పిల్లి కేం తెలుసు రాకూడదని. దానికి ఎవరెదురొచ్చేరో!”

” నా చిన్నప్పుడే ఈ జోక్ వినేసాను లెండి. ఏక్కడికయినా కదల భయం. పక్కింటి భావన్న గారి దర్శనం లేకుండా ఒక్కసారి కూడా అవదు. చక్కగా ఇంత బొట్టు పెట్డుకొని బనీను మీద జంధ్యం తో మరీ కనిపిస్తారు”

” నీకు అతని భార్యన్నా వాళ్ల కోడలన్నా, పిల్లలన్నా‌ మహా ఇష్టం కదుటోయ్”

” లేదన్నానా! ఆయన మంచాయన కాదన్నానా!”

” పాపం భావన్న గారు, మన కోలనీ మీటింగుల్లో ఎప్పుడూ, ‘రాఘవరావు గారూ, మీరు చెప్పిందే ఆచరణ యోగ్యం’ అని నన్ను తెగ మెచ్చుకుంటాడు సుమీ! ఇంతకీ వీళ్ల ఎదురు వల్ల నీకు నష్టం ఏం జరిగిందో!”

” పెద్ద పెద్దవి కాకపోతే మాత్రం! ఆ పిల్లి రాక్షషి కనపడ్డాదా, గుమ్మం లోకి వచ్చేయని కొన్న తెల్ల వంకాయలన్నీ పుచ్చులే! లేదా కూర మాడి తగలడుతుంది. ఏవో ఇలాటివే అవుతూ ఉంటాయి”

” పోనిస్తూ! పిల్లికి నువ్వు ఎంత సణిగినా బోధ పడుతుందా!”

” అంతే లెండి. పిల్లి మీద ఉన్న జాలి లో వెయ్యో వంతయినా కట్టుకున్న ఇల్లాలి‌ మీద ఉంటే కదా!

ఏమండీ! మీ చెల్లీ, బావగారూ భోజనానికి వస్తాం అని ఫోన్ చేసి చెప్పేరు కదండీ! వాణికి నేను చేసిన పులిహార అంటే చాలా ఇష్టం కదా, చేద్దాం అని మొదలెట్టేను. తీరా చూస్తే ఇంగువ లేదు. డబ్బా ఖాళీ. ఇంకో డబ్బా ఉందనుకున్నా! మరి లేదు. కాస్త తెచ్చిద్దురూ!

” అలాగే!”

” ఇదేమిటండీ! పావుగంటయింది చెప్పు. ఇంకా వెళ్లలేదెమిటి! వాళ్లు వచ్చేసరికి వంట పూర్తి చేసేస్తే బాగుంటుంది‌కదా!”

” అవునోయ్! మన ఎదురింటికి ముందింటి శర్మ గారు, వాళ్లమ్మాయి స్బప్నా బయల్దేరనీ అని చూస్తున్నా! స్వప్న బయటికి వచ్చి మళ్లా ఏం మర్చిపొయిందో, లోపలకి వెళ్లింది”

” వాళ్లు ఎక్కడికో వెళ్తే మీకెందుకు మధ్యలో! “

” నిన్ననే శర్మగారు చెప్పేరు.‌ఈ రోజు స్వప్నని ఏదో ఇంటర్వ్యూ కి తీసుకు వెళ్తున్నట్టు!

” అయితే? “

” ఇహ నా ఎదురు వాళ్లకి దేనికి? ఎంత చెడ్డా నేను ఓ బ్రాహ్మడినే కదా! ఒక్కడినీ ఎదురయితే ఎలా?వెధవ వంకాయలు పుచ్చువయితేనే నువ్వు పిల్లి ఎదురు వల్లే అని తిట్టేవు. పాపం స్వప్న ఉద్యోగం ఇంటర్వ్యూ కి వెళుతోంది. ఏదయినా అయితే ఇంకేమన్నా ఉందా! “

” ఆఁ ! అవునండీ! మీరు చెప్పిందీ నిజమే సుమీ”

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!