పుణ్యఫలం

పుణ్యఫలం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

‘ఏవండీ !ఈ రెండు చపాతీలు మన వీధి బయట కిటికీ దగ్గర పెట్టండి, పాపం ఎవరైనా ఆకలితో ఉన్న బిచ్చగాడు తీసుకుని తింటాడు! అంటూ గట్టిగా పిలిచింది భర్త ‘ప్రభాకర్ ‘ ను అతని భార్య సరళ.
సరళ కు పెళ్లయిన దగ్గరునుండి ఉన్నా ఈ అలవాటు సంవత్సరాల తరబడి సాగుతూ వస్తోంది. తను వంట వండిన తర్వాత ఆ పదార్థములు ముందు ‘దేవునికి నైవేద్యం ‘పెట్టి ఆ తర్వాత కొంచెం ‘కొంచెం అన్నం కూర,’ లేకపోతే ‘చపాతీలు’ వీధి గుమ్మం దగ్గర కిటికీ లో పెడుతూ, ఎవరైనా బిచ్చగాడు వచ్చి అవి తీసుకుని వెళ్ళిన వెంటనే ఎంతో ఆనందంతో తన భర్తకు తనకు వడ్డించుకుని భోజనం చేయడం పరిపాటి.  ఆరోజు కూడా రెండు చపాతీలు గుమ్మం దగ్గర కిటికీ లో పెట్టిన వెంటనే, ఒక బిచ్చగాడు మురికిగా ఉన్న చిరిగిన బట్టలతో, సరళ పెట్టిన ఆ చపాతీలు మూట కడుతూ,  “అమ్మ ! నువ్వు ‘చెడు తలపెడితే’ అది నీతోనే ఉంటుంది,” కానీ “మంచి తలపెడితే, అది నీ వెనకాలే వచ్చి నీకు అన్ని విధాలా మంచే జరుగుతుంది!” అని గట్టిగా అరుస్తూ తన ఖాళీ పళ్లెం గట్టుమీద కొడుతూ ఉండడం చూసి, ఏమీ అర్థం కాక, ఏదోలే పిచ్చివాడు పాపం! ఆకలితో నకనక లాడుతున్నాడు, ఏదో అరుస్తున్నాడు లే! అని సరిపెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది సరళ.
అలా గత నెల రోజుల నుంచి అదే పిచ్చివాడు  సమయానికి ఆహారం తీసుకుంటూ, గట్టిగా పళ్లెం గట్టు మీద కొడుతు” అమ్మ నీవు చెడు తలబడితే నీకు చెడే జరుగుతుంది” అది నీతోనే ఉంటుంది. అదే “మంచి తలపడితే నీకు అన్ని విధాలా మంచే జరుగుతుంది”! అంటూ అరవడం గట్టుమీద ఖాళీ పళ్ళెంతో కొట్టడం, ఆ మాటలు ఏమీ అర్థం కాని సరళ బాగా విసిగిపోయి’ ఏంటీ? పిచ్చి వెధవా! రోజు చపాతీలు హాయిగా తీసుకుంటూ నన్నే తిడుతున్నాడు, ఏమి శాపనార్థాలు పెడుతున్నాడు ఏమో!? అంటూ వీడికి ఏదోరకంగా బుద్ధి చెప్పాలి! అనుకుంటూ మళ్లీ ‘! పోనీలే, ఊరు కాని ఊర్లో నా కొడుకు  అహోరాత్రులు కష్టపడుతూ తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా చూస్తూ, పాపం వాడు తింటున్నాడో, లేదో ? చాలా బెంగగా ఉంది,  రోజు భోజనం చేసేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు దేవుడికి అదే ప్రార్థన చేస్తారు, నా కొడుకు ప్రదీప్ కి ఏ రోజు ఖాళీ కడుపుతో పడుకోకుండా భోజనం పెట్టూ తండ్రి! అంటూ ప్రార్థిస్తారు, నేను కూడా అందుకే ఏదో కొంచెం వండినది బిచ్చగాళ్లకు దానం చేస్తున్నాను, అంతా నా కొడుకు యోగక్షేమాలు గురించే కదా! అంటూ అనుకుంటుంది సరళ.
ఆ రోజు వంట చేస్తున్నప్పుడు విసిగిపోయిన సరళ, ఇవాళ ఆ పిచ్చి వెధవ కి కొంచెం ‘గొడ్డు కారం ‘వేసి  చపాతీలు చేస్తాను, వెధవకి కడుపు మండుతుంది , అప్పటికిగాని అరవడం మానడు, అంటూ ఇంట్లో ఉన్న ‘గొడ్డు కారం’ ముద్దలా చేసి చపాతీ పిండి లో పెట్టి చపాతీలు చేసింది సరళ, ఆ రెండు చపాతీలు మిగతా వంట ని కూడా దేవుడి దగ్గర పెడుతూ “చూడు ప్రభు! రోజు చపాతీలు తింటున్న ఆ పిచ్చి బిచ్చగాడు నన్ను తిడుతున్నాడు వాడికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను! అంటూ’ గొడ్డు కారం’ ఉన్న చపాతీలను వేరేగా తీసి కిటికీ లో పెట్టబోతున్న సమయంలో’ఒక ఎలుక పరిగెత్తుకు వచ్చి ఆ రెండు చపాతీలు తీసుకొని కింద పడేసి పారిపోయింది, అయ్యో ! ఓరి దేవుడా, నిజంగానే నా ఆలోచన మంచిది కాదని నువ్వే నిరూపించావు! పాపం ఏమీ తెలియని ఒక బిచ్చగాడికి ద్రోహం తలపెట్టినాను, అది నీకు కూడా ఇష్టం లేక ‘ఎలుక రూపంలో ‘వచ్చి వాటిని కింద పడేశావు,  నా తప్పు నేను తెలుసుకున్నాను దేవుడా! నన్ను క్షమించు! అంటూ ఆ ‘గొడ్డు కారం ఉన్న చపాతీలను’ కాలువలోకి విసిరేసి, మళ్లీ మంచి చపాతీలు చేసి గుమ్మం దగ్గర కిటికీలో ఆ బిచ్చగాడికి కోసం పెట్టి వేసింది సరళ. ఆ మర్నాడు సరళ కొడుకు’ ప్రదీప్’ సరిగ్గా తల్లి ఆ బిచ్చగాడు కోసం చపాతీలు పెడుతున్న సమయంలో వస్తూ వస్తూ “అమ్మా !అంటూ అరిచాడు, ఉలిక్కిపడిన సరళ దూరాన తన కొడుకు ప్రదీప్ భుజాన బ్యాగులు వేసుకుని నీరసంగా నడుస్తూ రావడం చూసి ‘, బాబు అంటూ ఎదురు పరిగెత్తుకొని వెళ్లి, తన బాబు ని తేరిపార చూసుకుంటూ ‘ ఒరే బాబు వచ్చావా, ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు నేను మీ నాన్నగారు నీకోసం కలవరించిన రోజు లేదు, అయినా” ఏంట్రా బాగా చిక్కిపోయావు ‘ అంటూ కొడుకుని ఆప్యాయంగా చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకు వస్తున్న సమయంలో తండ్రి ప్రభాకర్ రావు కూడా వేగంగా బయటకు వచ్చి కొడుకు తల నిమురుతూ’ రా.. రా నాయన’ అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ లోపలకి తీసుకు వచ్చారు తల్లి తండ్రులు.
భోజనం అయిన తర్వాత ప్రదీప్ మాట్లాడుతూ అమ్మ!  నేను మన ఊరు రావడానికి ఒక బస్సు ఎక్కాను, సరిగ్గా మన ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో నేను వస్తున్న బస్సు టైరు పేలి పోయి బస్సు ఆగిపోయింది, అది బాగా అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది, అందుకని నేను నడుచుకుంటూ వచ్చేద్దామని బయల్దేరాను, కొంత దూరం అడ్డదారిలో వచ్చేసరికి దారి తప్పి పోయి ఎంత నడిచినా మన ఊరు జాడ రావటంలేదు,  నడవలేక బాగా అలిసిపోయి వస్తున్న తరుణంలో ఎండ వల్ల  ఏ క్షణం లోనైనా , ‘దాహం తో ప్రాణాలు పోతాయి అన్నా! ఆ సమయంలో తెలియకుండానే తల తిరిగి పడిపోయాను, కాసేపయ్యాక నేను ఒక చెట్టు నీడలో ఒక ‘బక్కచిక్కిన మనిషి’ తొడ మీద తల పెట్టి ఉన్నాను, ఆయన నవ్వుతూ నాకు నీళ్లతో ముఖం తుడిచి, తన దగ్గర ఉన్న మూట లో నుంచి ఒక చపాతీ తీసి నాకు తినిపిస్తూ నేను తేరుకో గానే” పోరా, పో మీ ఇంటికి పో !”అంటూ నన్ను అక్కడే వదిలేసి గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయాడు, ఆయన పెట్టిన తిండి తో నే కాస్త శక్తి వచ్చి మన ఇంటి వరకు ధైర్యంగా రాగలిగాను, ‘ నిజంగా అమ్మ, ఆయన నాకు దేవుడు కిందే లెక్క! అంటూ చెప్పేసరికి, సరళ ఆశ్చర్యపోతు ‘పోనీలే బాబు, ఎలాగైనా  అతని దయవల్ల క్షేమంగా ఇల్లు చేరావు, మాకు అంతే చాలు! అంటూ ఇంతకీ ఎవరు అతను? అని అనగానే’ ఏమోనమ్మా, ఒక బిచ్చగాడిలా ఉన్నాడు , అని కొడుకు చెప్పగానే సరళ కి గుండెల్లో రాయి పడినట్లే అయింది, ఒరేయ్ బాబు, అతను సన్నగా చిరిగిన బట్టలతో ఎక్కడ చూసినా ఎముకలే అన్నట్లు ఉన్నడా ! అతని శరీరం అయితే అతడే రా! , ఆ బిచ్చగాడు ప్రతిరోజు మన ఇంటి దగ్గరికి వచ్చి నేను చేసిన చపాతీలు తీసుకొని , పిచ్చి పిచ్చిగా అరుస్తూ వెళ్ళిపోయేవాడు, ఉండు , కాసేపు పోయాక మన ఇంటి దగ్గరికి వస్తాడు! ఆ బిచ్చగాడు అన్న మాటలు ఏమిటో నాకు అర్థం కాక, విసిగిపోయిన నేను  అతనికి’ గొడ్డు కారం’ తో చేసిన చపాతీలు పెడదాం! అనుకున్నాను, కానీ భగవంతుని దయవల్ల ఆగిపోయాను, ఎందుకంటే అతను రోజు చపాతీలు తీసుకుంటున్నప్పుడు గట్టిగా అరుస్తూ నన్ను తిడుతున్నాడు అనుకుని కోపంతో ‘గొడ్డు కారం తో చేసిన చపాతీలు’ పెడదామనుకున్నా, ఆ చపాతి లే నీకు ఎండలో పెట్టి ఉంటే నువ్వు మాకు దక్కి ఉండేవాడివి కాదురా! నిజంగా దేవుడు కరుణామయుడు,! అంటూ ఏడుస్తున్న తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ప్రదీప్. కాసేపు అయిన తర్వాత అదే బిచ్చగాడు సరళ చేసిన చపాతీల కోసం రాగానే “ఒరేయ్ బాబు చూడరా,! అతనేనా , ఇతను అని చూపించేసరికి ప్రదీప్ ఆశ్చర్యపోతూ అవునమ్మా అతనే నాకు  ఆహారం పెట్టి ఆ సమయంలో నా ప్రాణాలు కాపాడిన వాడు ! అతనే అని చెప్పగానే , సరళ ‘ఒరేయ్ బాబు, ఒకసారి  వాడు ఏమంటున్నాడో, వాడు నన్ను తిడుతున్నాడో, మెచ్చుకుంటున్నాడో తెలియక , నేను అన్యాయం చేయబయాను, అనేసరికి ఆ బిచ్చగాడు అన్న మాటలను సరిగ్గా విన్న కొడుకు ప్రదీపు “అమ్మ  వాడు ఒక నీతి వాక్యం చెబుతున్నాడు, నువ్వు చెడు తలపెడితే, అది  నీ వెనకాలే ఉంటుంది, ఎప్పుడూ చెడు జరుగుతూనే ఉంటుంది,’ అదే నువ్వు “మంచి తలపడితే అది నీతోనే ఉండి, అన్ని విధాల నీకు మంచి జరిగేటట్టు చూస్తుంది!” ఆ బిచ్చగాడు అంటున్నది, అనగానే కళ్ళనీళ్ళు పెడుతూ అయ్యో ! ఈ మాటలు అర్థం కాక దుర్మార్గం చేయ బోయాను, దేవుడు రక్షించాడు, కనుక నువ్వు మళ్ళీ మాకు దక్కావు, జీవితంలో బిచ్చగాడు చెప్పిన ‘నీతి వాక్యాలు అక్షరాల నిజం’ నేను మంచి చేయబట్టే కదా! నా కొడుకు నాకు దొరికాడు! అదే నేను చెడు చేసి ఉంటే నా కొడుకు ప్రాణాలే పోయేవి!! ఏదైనా నా “మంచి పని ప్రతిఫలం ఆశించకుండా, చేస్తేనే, అది మనకి ‘పుణ్యఫలమై ‘తిరిగి వస్తుంది! అనుకుంటూ సరళ తన’ నిత్య అన్నదాన పథకాన్ని’ ఇంకా ఎక్కువగా అమలు చేస్తూ సుఖశాంతులతో జీవితం సాగించింది.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!