ఏది నిజం?

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

ఏది నిజం?

రచయిత :: మంగు కృష్ణకుమారి

పరాశర పెళ్ళి. పెళ్ళి కూతురు వందన వాడి‌మేనమామ కూతురే! నేను, పరాశరా, అర్జున్ చదువుకొనే రోజుల్లో, చాలా స్నేహితులం.
మాది ఇటు చిన్నా, అటు పెద్దా కాని ఊరు. ఇంటర్ తరవాత నేను ఇంజనీరింగ్ కి వెళ్ళేను. పరాశర టీచర్ ట్రైనింగ్ అయి మా ఊళ్ళోనే తెలుగు టీచర్ గా చేరేడు. ఇంకోపక్క పౌరోహిత్యం నేర్చుకుంటున్నాడు.

“రెండూ ఏమిటిరా?”
అంటే, “ఈ రోజుల్లో ఒట్టి పౌరోహిత్యం అంటే సామాజిక విలువ తక్కువ! అందుకే ఉద్యోగం కూడా చేస్తున్నాను. ఈ మంత్రాలు, తంతులూ నాకు ఎప్పుడో వచ్చు”అనేవాడు. చాలా హుషారయిన వాడు.

అర్జున్ పొలం దున్నుతూ ఆ పనుల్లో ములిగి తేలుతున్నాడు. కారు చటక్కున ఆగితే ఉలిక్కిపడి చూసేను. డ్రైవర్ “సారూ, మీరు ఈ అడ్డదారిన వెళితే మీఊరు గంటకల్లా వెళిపోతారండీ! పెట్రోల్ అయిపోవచ్చింది. నాకుకూడా నిద్రమత్తు వచ్చేస్తుంది. మీరిక్కడ దిగిపోండి” అని నన్ను దింపేసాడు. నా బేగ్ తొ దిగేను.

ఈ కరోనా కాదుగానీ, వెహికల్స్ దొరకడం కష్టంఅయింది. ఆఖరికి అటు వెళుతున్న ఓ కార్ యజమానిని బతిమాలి ఎక్కేను. మధ్యలో టైర్ మార్చడంతొ చాలా లేట్ అయింది.

“పరాశరా, నాకు నువ్వే దిక్కురా!” అనుకుంటూ నడక ప్రారంభించేను.
చిమ్మ చీకటి. ఎక్కడా దీపాలు కనపడటం లేదు. డొంకదారి తెలిసినదే అయినా, చీకటికి దడవచ్చి చదివిన దెయ్యాల కథలన్నీ గురుతొచ్చి కాళ్ళు వణకడం మొదలెట్టేయి. ఇంటికి చేరేలోగా ఎన్ని దెయ్యాలు పీక్కుతింటాయో, అన్న భయంతో దడ మొదలయింది.

ఎక్కడో నక్క ఊళ వినిపిస్తున్నాది. ఇంకేముంది? నామీద దెయ్యం దూకడమే ఆలస్యం అన్నట్టు లోపలనించీ భయం.

“ఏరోయ్ హరీ, ఈదారిన వస్తున్నావే” ఉలిక్కిపడి చూసేను.

నుదుట కళ్యాణం బొట్టూ,‌ నల్లఫేంటూ, తెల్ల గళ్ళషర్టూ చేతిలో సంచీతో పరాశర.
“నువ్వేమిట్రా, పెళ్ళికొడుకువి ఇటొస్తున్నావ్?” ఆనందంగా వాడి చెయ్యి పట్టుకోబోయేను.

దూరంగా నడుస్తూ, “సోషల్ డిస్టెన్స్ కన్నా బామ్మకి ఒట్టేసి మాటిచ్చేనురా! దూరంగా ఉండి పని చేసుకొస్తానని” అన్నాడు.

“అంత పనేమిట్రా? పెళ్ళికొడుకువి?” అన్నాను. నవ్వి “వందన సెంట్ కావాలందిరా! తేకుండా ఎలా? బామ్మకి వెయ్యివేల ఒట్లు వేసి వెళ్ళేను. ఆలస్యం అయి బస్ దూరంగా ఆపేసాడు “ఏరా హరీ, ఇటు నడుస్తున్నావ్?”
అర్జున్ మాట విని ఉలిక్కిపడ్డాను.
అర్జున్ చేతిలో బేగ్ తో వస్తున్నాడు.
“ఇందాకట్నించీ నిన్ను పిలుస్తున్నానురా!
వినిపించుకోటం లేదు” అన్నాడు.

“భలే విచిత్రంగా ముగ్గురం కలిసేం. పరాశరతో మాటాడుతూ ఉంటే
వినపడలేదు. నువ్వేంట్రాఇలా..”
అడిగేను.

“విత్తనాల పనిమీద సిటీ నిన్ననే వెళ్ళేనులే… మావాడే జీప్ లో దింపుతానని ఇక్కడ దింపి పోయేడు” వడివడిగా నడుస్తూ అన్నాడు. ఎందుకో చాలా గంభీరంగా ఉన్నాడు.

మర్చిపోయిన భయం మళ్ళా వచ్చేసింది.
పరాశరతో వీడు ఒక్క మాటా మాటాడటం
లేదే? పరాశర కూడా సైలెంట్ అయిపోయేడు. ఏమయింది?” ఒక అడుగు ముందుకు వేసి
“పరాశరా, మన అర్జున్ గాడురా… చూడలేదా? అన్నాను.

“చూసేనురా! ఎంత మొత్తుకున్నా వాడిని పెళ్ళికొడుకుని చేసినప్పుడు భోజనానికి పిలవడానికి బామ్మ ఒప్పుకోలేదు.
‘పెళ్ళివిందుకి పిలువు చాలు’ అంది. వాడి మొహం చూడలేను. నువ్వుకూడా తక్కువ మాటాడరా!”అంటూ నడకజోరు చేసేడు.

అర్జున్ పక్క ఓరగా చూసేను. నల్లగా మొహం, చిన్నప్పుడు నుదిటి మీద కాల్చిన మచ్చ. చెవులకి పక్కన పోగులు. వాడి రూపం అలవాటే అయినా వెన్ను లోంచి భయం. కొంపతీసి వీడు దెయ్యం, అయిపోలేదు కదా!” చకచకా నడుస్తున్నాను. మతిస్థిమితం తప్పేటట్టుంది. ముందు పరాశర, వెనక నేను, పక్కగా అర్జున్!
చటక్కున గురుతొచ్చి “పరాశరా, నువ్వు హనుమాన్ చాలీసా చాలా బాగా చదివేవాడివి. చదవరా!” అన్నాను. అర్జున్ ఉలిక్కిపడ్డట్టయి
“ఒరే ఈ పక్క సందులోంచి వెళితే
మా ఇల్లు దగ్గరరా…తెల్లారి కలుద్దాం” అంటూ సందు దాటివెళిపోయేడు.

“హమ్మయ్యా!” అనుకుంటూ నా భయాలన్నీ పరాశరకి చెప్దాం అని చూసేసరికి,

పరాశర వడివడిగా నడుస్తూనే “రేపు కలుద్దాం” అనడం లీలగా వినిపించింది.

కాళ్ళీడ్చుకుంటూ మాఇంటికేసి నడిచేను. మా అమ్మ తలుపు తీసింది. వీధిలోనే ఉన్నగోలెంలో నీళ్ళతో కాళ్ళు కడుక్కొని లోనికి వచ్చేను. అమ్మ ఆత్రుతగా “హరీ, తెలిసిందిరా! పరాశరకి చాలాపెద్ద ఏక్సిడెంట్ అయిందిట. అసలు మనిషే అయిపోయేడని అంటున్నారు” అంది. నేనుకొయ్యగట్టి ఉండిపోయేను.

మా చెల్లి ఉత్సాహంగా లేచి వచ్చి “అన్నయ్యా, అసలు విషయం నేను చెప్తాను విను…. పరాశర అన్నయ్య, అర్జునన్నా వాళ్ళ గూడెంలో, నీలిమతో ప్రేమ భాగోతం నడిపేడు. తీరా పెళ్ళి
వందనతో చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కోపం వచ్చి, అర్జున్ అన్న ద్వారా, అక్కడకి రప్పించేరు. నీలిమతో బలవంతంగా అయినా పెళ్ళి చేసేద్దాం అని ఏర్పాట్లు చేస్తుంటే, పరాశరన్నయ్య
తప్పించుకొని సిటీ పారిపోయేడు.
అర్జునన్నయ్య బైక్ మీద వెంటపెట్టేడు. ఏక్సిడెంట్ అయిందని తెలిసింది.
ఇద్దరూ పొయేర‌ని కొందరంటున్నారు. ఏమయిందో మరి?” అంది.

“దేవుడా! నేను చూసిన ఇద్దరిలో ఎవరు మనిషి?ఎవరు కాదు? అయినా పరాశర ఏక్సిడెంట్ అయినవాడు అంతలా ఎలా కనపడ్డాడు?‌ అర్జున్ వంటినిండా దెబ్బలతో అంతలా ఎలా నడిచేడు?” నా ప్రశ్నలకి జవాబు దొరికినా నేను భయంతో గడ్డకట్టకుండా ఉండగలనా?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!