నడిచే లాంతరు

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

నడిచే లాంతరు

రచయిత :: పద్మావతి తల్లోజు

అది రాత్రి పది గంటల సమయం. పనిమీద పొరుగూరు వెంకటాపురం వెళ్లి పని ముగిశాక, తన పల్లె కిష్టారం వైపు నడక సాగించాడు మొగులయ్య. చుట్టూ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. ఉన్న దీపాలన్నీ మహానగరాలకే వెలుగులు నింపితే ఇలాంటి కు గ్రామాలకు ఇక వెలుగెక్కడ?
చెవులు చిల్లులు పడేలా కీచురాళ్ళ శబ్దం. స్వతహాగా ధైర్యవంతుడు అయినా చుట్టూ ఆ పరిసరాల మూలంగా కాళ్లలో మెల్లగా వణుకు మొదలైంది. ముందుకు అడుగు వేయడానికి మొరాయిస్తున్న కాళ్లను మోసుకెళ్తున్న ట్టుగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు.
కిర్…..కిర్…. మంటూ తన చెప్పులు చేసే శబ్దం తన గుండె వేగాన్ని మరింత పెంచుతోంది. దబ్… ముందు ఏదో పడిన శబ్దం గుండె ఆగినట్లైంది. ఎంతకూ ఆ వస్తువులో కదలిక లేకపోయేసరికి వణుకుతున్న కుడికాలును ముందుకు జరిపి దానిని తాకి చూశాడు. అది ఎండిన చెట్టుకొమ్మ.
సాయంత్రం ఏడు దాటితే ఆ దారి అంత సురక్షితం కాదని తెలిసి నా ఆలస్యం చేసినందుకు తనను తానే నిందించుకుంటూ నడక సాగించాడు. పని మీదే అయితే ఇంకాస్త ముందుగానే బయలుదేరేవాడు. అసలు పని వేరే ఉంది. అదే… మందు! ఉదయమంతా ఒళ్ళు పులిసి పోయేలా పనులు చేయడం, రాత్రి అయితే మందు కల్లు తాగి ఒళ్ళు నొప్పులు మర్చిపోవడం ఆ ఊరి వాళ్ళకు అలవాటే.
కిష్టారం తో సహా చుట్టుపక్కల మరో ఐదు గ్రామాలు వెంకటాపురం గ్రామ పంచాయతీ కిందికే వస్తాయి. వెంకటాపురంలో రెండు బెల్ట్ షాపులు, ఒక సా రా దుకాణం ఉన్నాయి. కిష్టారం నుండి కేవలం వెంకటాపురం రెండు మైళ్ళ దూరం లోనే ఉండటం మూలాన, చాలామంది కాలినడకన వెళ్లి తాగి ఎంత రాత్రైనా ఇల్లు చేరుకుంటారు.
వెంకటాపురం వెళ్లే రోడ్డును ఆనుకొని పెద్దకాపు రామ్ రెడ్డి బావి అతి ప్రమాదకరంగా మారింది. ఆయన కాలం చేయడం , ఆయన పిల్లలు యుకెలో స్థిరపడటం మూలాన పొలాన్ని బీడు పెట్టారు. బావి ఎండిపోయి నోరు తెరుచుకొని మింగడానికి సిద్ధంగా ఉన్న రాక్షసిలా తయారయింది. మొగులయ్య నడుచుకుంటూ ఆ బావి సమీపానికి రాగానే దూరంగా మినుకుమినుకు మంటూ చిన్న వెలుతురు. ,అది క్రమంగా బావి అంచు గుండా పయనిస్తూ అతనికి దగ్గర కాసాగింది.
అకస్మాత్తుగా మొగులయ్యకు రాజన్న గుర్తుకొచ్చాడు. తన పొలంలోని కలుపు తీయడానికి కూలికి వచ్చేవాడు. సాయంత్రమైతే చాలు వెంకటాపురం వెళ్లి తాగొచ్చి భార్యను చితకబాదేవాడు. వాడి బాధ భరించలేక ఆమె కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. రాజన్న తల్లి లచ్చవ్వ వాడినే మాత్రం కట్టడి చేయలేకపోయింది. వారం కిందటే మితిమీరి తాగి బాట కనబడక రాంరెడ్డి బావిలో పడి చనిపోయాడు రాజన్న. అప్పుడే రాజన్న గుర్తుకురావడం ,గాలిలో నుండి వెలుగు తనను సమీపించడం మొగులయ్య పై ప్రాణాలు పైనే పోయినంతపనైంది.
అమ్మో…. దెయ్యం! అంటూ అరుస్తూ తన వయసు కూడా మర్చిపోయి పరిగెత్తి ,పరిగెత్తి తన ఇంటి ముందే సొమ్మసిల్లి పడిపోయాడు.

*. *. *. *.

ట్రింగ్….. ట్రింగ్….
“అరే మల్లేష్! నీ మొబైల్ లేరా రింగ్ అవుతుంది.”అన్నాడు సూర్య తన ఫ్రెండ్ తో.
మొగులయ్య కొడుకు మల్లేష్, సూర్య రూమ్మేట్స్.
ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళిద్దరు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఫోన్ మాట్లాడుతున్న మల్లేష్ ముఖం పాలిపోవడం గమనించి సూర్య ఏమైంది అని అడిగాడు.
“రాత్రి నాన్న వెంకటాపురం వెళ్లేదారిలో దేన్నో చూసి జడుసుకున్నారట. ఫీవర్ చాలా ఎక్కువగా ఉందని అమ్మ ఫోన్ చేసింది”అన్నాడు దిగులుగా.
“మరి ఇంకా లేట్ చేస్తావేమ్.. పద! నా క్కూడా అంకుల్ ని చూడాలని ఉంది. ఎలాగూ రేపటినుండి సంక్రాంతి హాలిడేస్ మొదలవుతాయి. మా మమ్మీ ,డాడీ కి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటాను” అంటూ బయలుదేరదీశాడు సూర్య.

*. *. *.

“నాన్న!”అన్న మల్లేష్ పిలుపుకు బలవంతంగా కళ్ళు తెరిచి చూశాడు మొగులయ్య.
“ఇప్పుడేలా ఉంది నాన్నా!” అడిగాడు మల్లేష్ ఆర్తిగా.
బాగుంది అన్నట్టు గా తలాడించాడు మొగులయ్య.
“అసలు ఏమైంది నాన్నా!”ఉండబట్టలేక అడిగాడు మల్లేష్.
ఆ సంఘటనను గుర్తు చేసుకుంటున్నట్లుగా మొగులయ్య కళ్లు భయంతో పెద్దవయ్యాయి. “రాజన్న… రాజన్న… దెయ్యం… దెయ్యం”అంటూ వణకి పోసాగాడు.
తనను ఇంకా ఏమీ అడగవద్దు అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది మల్లేష్ వాళ్ళ అమ్మ. అది గమనించి సూర్య ముందుకు వచ్చి”నమస్కారం అంకుల్! నా పేరు సూర్య. మల్లేష్ రూమ్మేట్ ని. మీ ఊళ్లో సంక్రాంతి పండగ చాలా బాగా జరుపుకుంటారట కదా! మల్లేష్ చెబితే ఇక్కడికి వచ్చాను. మరి మీరు త్వరగా కోలుకుంటే పండుగ ఏర్పాట్లు చేసుకుందాం.”అంటూ పరిచయ కార్యక్రమంతో వాతావరణం తేలికపరిచాడు.
మొగులయ్యకు సూర్య కలివిడితనం బాగా నచ్చింది. ఏమి జరగనట్టుగానే తనతో కబుర్లలో పడిపోయాడు. సూర్య ను తీసుకొచ్చి మంచి పని చేశావు అన్నట్టు మల్లేష్ వాళ్ళ అమ్మ వాడి వైపు మెచ్చుకోలుగా చూసింది. మల్లేష్ గర్వంగా తన ఫ్రెండ్ వైపు చూశాడు.
ఆ రాత్రి భోజనాలు ముగిశాక డాబా పైకి ఎక్కి కూర్చుని, మల్లేష్ తమ్ముడు ద్వారా రాజన్న కు సంబంధించిన అన్ని వివరాలు సేకరించాడు సూర్య. చిన్నతనం నుండి సూర్య లో జిజ్ఞాస పాలు కాస్త ఎక్కువే! తీగ తగిలితే డొంక కదిలించే దాకా ఊరుకోడు. అవసరమైతే తనకు చేతనైన సాయం చేసే దాకా నిద్రపోడు. అసలు తాను మల్లేష్ వెంట వచ్చింది దెయ్యం..,! అంటే ఎలా ఉంటుందో చూడాలనే.

*. *. *.

ఉదయం ఫలహారం ముగిశాక కాస్త బయట తిరిగి వస్తానంటూ మల్లేష్ తమ్ము డిని వెంట పెట్టుకొని ఊళ్లోకి వెళ్లాడు సూర్య. ఇద్దరూ ఓ అర కిలో మీటర్ నడిచి రాజన్న గుడిసెను చేరుకున్నారు. ఆ గుడిసె నుండి చూస్తే కొంతదూరంలో రామ్ రెడ్డి బావి ,దానికి అవతల వైపు వెంకటాపురం రోడ్డు కనిపిస్తున్నాయి. గుడిసె బయటనుండి గొళ్ళెం పెట్టి ఉంది. తెరిచి ఉన్న కిటికీ గుండా లోపలికి చూసారు.
ఒంగిపోయి విరగడానికి సిద్ధంగా ఉన్న ఒక నవారు మంచం, దానిపై అతుకుల దుప్పటి, కప్పుకోవడానికి ఒక గొంగలి వేసి ఉన్నాయి. గోడపై ఒక చిన్న ఫోటో అతికించి ఉంది. బొట్టు పెట్టి ఉండటాన్ని చూసి అది “రాజన్న” అని నిర్ధారించుకొన్నాడు సూర్య. కొక్కానికి ఒక లాంతరు, దండం పైన రెండు చిరిగిన చీరలు, సొట్టలుబడ్డ కొన్ని పాత్రలు, కట్టెలపొయ్యి… దరిద్రానికి చిరునామాలా ఉంది ఆ గుడిసె.
“ఇక్కడ రాజన్న వాళ్ళమ్మ లచ్చవ్వ ఉంటుందన్న. పగలంతా హనుమాన్ గుడి కాడ అడుక్కుంటాది. రాత్రిపూట గుడిసెలో పడుకుంటాది. ఎవరితో మాట్లాడదు. తనలో తానే గొణుకుంటూ ఉంటాది” చెప్పాడు మల్లేష్ తమ్ముడు.ఆ పూటకు తన ఇన్వెస్టిగేషన్ చాలించి ఇంటికి వెళ్లి పోయాడు సూర్య.

*. *. *.

ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్దా మంటూ మల్లేష్ను బయలుదేర తీశాడు సూర్య. పాతబడిన చిన్న గుడి అది.ఒకరు ,ఇద్దరు భక్తులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ప్యాంటు, షర్టు, బూట్లు వారి వాలకం చూసి దక్షిణ గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడేమో ఆ పేద పూజారి, వారికి ఎదురొచ్చి
“రండి! రండి! మొగులయ్య కొడుకువి కదా నువ్వు! పట్నం నుండి ఎప్పుడొచ్చావు? చదువెలా సాగుతుంది? మీ నాన్నకు ఎలా ఉంది ఇప్పుడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయన అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతూనే దైవదర్శనం చేసుకొని బయటికి వచ్చారు.
మల్లేష్ తన స్నేహితుడికి తన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆ గుడి తో తనకున్న అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరిస్తున్నాడు. సూర్య దృష్టి మాత్రం ముందు బొచ్చె పెట్టుకొని తనలో తానే మాట్లాడుకుంటున్న ముసలావిడ పైనే ఉంది. ఆమె “లచ్చవ్వ ” అని నిర్ధారించుకొని ,ఆమెకు సమీపాన్నే ఒక బండపై కూర్చుని ఆమె మాటలు వినే ప్రయత్నం చేశాడు.
“యాడున్నావ్ బిడ్డా! ఇంకా రాకపోతివి. సీకటి బడవట్టే. బిచ్చమెత్తి, కందిట్ల నూనె వోసి కాపు కాత్తున్న” పదేపదే అవే మాటలు గొణుగుతూ, మధ్యమధ్య ఏడుస్తూ ఉంది. చేతికంది వచ్చిన కొడుకు కళ్ళ ముందే చనిపోతే, పిచ్చెక్కి ఏదేదో వాగుతుందని తననెవరూ పట్టించుకోవటం లేదు.

*. *. *.

మరుసటి రోజు రాత్రి భోజనాలయ్యాక బయటికి వెళ్దాం… నీకు ఒకటి చూపిస్తానని చెప్పి సూర్య, మల్లేష్ను వెంటబెట్టుకొని బయలుదేరాడు. నేరుగా వెళ్లి లచ్చవ్వ గుడిసె వెనుక దాక్కున్నారు.మల్లేష్ కు అంతా అయోమయంగా, కొంత భయంగానూ ఉంది. నిండా గొంగడి కప్పుకొని చేతిలో లాంతరుతో ఒక ఆకారం గుడిసెలో నుంచి బయటికి వచ్చింది. తలుపు గొళ్లెం పడిందో లేదో చూడడానికి లాంతరు పైకి ఎత్తినప్పుడు ఆ వెలుగులో ఆకారాన్ని పోల్చుకున్నాడు మల్లేష్. అది… లచ్చవ్వ!
“బిడ్డ వచ్చే యాల అయ్యింది. సీకట్ల కాడువడుతాడో ఏమో నా బిడ్డా…..”అంటూ తనలో తానే గొణుక్కుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ రామ్ రెడ్డి బావి వైపు బయలుదేరింది.
“రేయ్ సూర్య! ఏంటిరా ఇదంతా! నాకేం అర్థం కావటంలేదు. పిచ్చెక్కుతుంది. లచ్చవ్వనే ఇదంతా చేస్తుందా? తన కొడుకు దయ్యమై తిరుగుతున్నాడని కలరింగ్ ఇస్తూ అందరితో ఆడుకుంటుందా? పద… ఊళ్లోకి వెళ్లి అందరిని తీసుకొని వచ్చి దీని బండారం బయట పెడదాం.”అంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు మల్లేష్
“కూల్ డౌన్ మల్లేష్! ఎందుకా ఆవేశం? తన వల్ల ఇంత ప్రాబ్లం క్రియేట్ అయిందని లచ్చవ్వ కు తెలిస్తే కదా తనను మనం ఏమైనా చేయడానికి. పాపం! తన కొడుకు చనిపోయాడని ఆ ముసలి గుండె ఇంకా ఒప్పుకోవడం లేదు. అందుకే ప్రతిరోజు ఆ బావి దగ్గర నిలబడి రాజన్న కోసం ఎదురుచూస్తుంది. ఇక అందరినీ భయపెట్టడం అంటావా? మన భయమే మన శత్రువు. ఎవరిని భయపెట్టడం తన ఉద్దేశం కాదు. ఒక విధంగా చెప్పాలంటే తాను మనకు మేలే చేస్తుంది…”సూర్య మాటలు ఇంకా పూర్తికానేలేదు,
“అదేలారా? కాస్త అర్థమయ్యేట్టు చెప్పు” అయోమయంగా ప్రశ్నించాడు మల్లేష్.
“నువ్వో విషయం గమనించావా మల్లేష్! దయ్యం దెబ్బకు మీ ఊర్లో చాలామంది వెంకటాపురం వెళ్లి తాగడానికి భయపడుతున్నారు. మీ ఊరికి శాపంగా మారిన ఈ తాగుడు అలవాటు దెయ్యం పుణ్యమాని తగ్గు ముఖం పట్టింది. లచ్చవ్వ మనకు ఒక విధంగా ఉపకారమే చేస్తుంది కాబట్టి, ఎట్టి పరిస్థితిలో మనమీ విషయం బయట పెట్టకూడదు. కాకపోతే , రోడ్డుపక్కనే ప్రమాదకరంగా మారిన బావి విషయంలోనే మనం ఏదైనా డేసిషన్ తీసుకోవాలి. పద ! ఇంటికెళ్ళి ఆలోచిద్దాం”అంటూ ఇంటి బాట పట్టారు.

*. *. *.

మరుసటి రోజు ఉదయం బావిని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి ,పరిస్థితిని వివరిస్తూ , తోచిన సహాయం చేయాలని అభ్యర్థిస్తూ, అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సూర్య ఫ్రెండ్స్ మరియు లెక్చరర్స్ తమకు తోచినంత సూర్య అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. బావి సమస్య తీరుతుంది అనగానే ఊళ్లో వాళ్లు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. సూర్య పాకెట్మనీ 5000 రూపాయలతో కలిపి 60,000 పైచిలుకే జమ అయ్యాయి.
పండగ ముందు రోజు రాత్రి వరకే బావి ముందువైపు ఫెన్సింగ్ పనులు ,ప్రమాద మలుపు హెచ్చరిక బోర్డు రేడియంది, కరెంటు స్తంభానికి ఒక ట్యూబ్ లైట్ అమర్చబడ్డాయి.ట్యూబ్ లైట్ వెలుతురు చూసి లచ్చవ్వ లాంతరు ఆర్పి వేయడంతో ఆ రాత్రి నుండి ఇంకెవరికి నడిచే లాంతరు గాని, మరే దెయ్యం గాని కనిపించలేదు. ఆ సంతోషంలో , మొదటిసారి మందు లేకుండానే ఆ ఊరి వాళ్లు పండగ సంతోషంగా సంబరాలు ముగించారు.

*. *. *.

సూర్య , మల్లేష్ కాలేజీకి తిరిగి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. సూర్య వెళ్ళొస్తానని సెలవు తీసుకుంటూ రెండు వేల రూపాయలను మొగులయ్య చేతికిస్తూ”అంకుల్! ఈ డబ్బు మీరు లచ్చవ్వకు ఇవ్వండి. ఒకసారి ఆమెను గుడి దగ్గర చూశాను. కొడుకు చనిపోయి భిక్షం ఎత్తుకుంటుందట కదా! మల్లేష్ చెప్పాడు. జాలనిపించింది.ఆమె కొడుకు దుబాయిలో ఉన్నాడు అని ,అక్కడి నుండే ఈ డబ్బు పంపాడని చెప్పండి. ప్రతినెలా నేను మీకు కొంత డబ్బు పంపుతాను ఆమె కొడుకు పేరు మీద. ఎక్కడో అక్కడ తన కొడుకు బ్రతికే ఉన్నాడు అన్న ఊహే తనను మరికొంతకాలం బతికిస్తుంది” సూర్య మాటలు పూర్తికాకముందే మొగులయ్య అతన్ని గుండెలకు హత్తుకున్నాడు. చిన్న వయసులోనే అంత పెద్ద మనసున్న సూర్యను చాలా అభినందించాడు. భారమైన గుండెతో అందరూ వీడ్కోలు పలికారు.
కిష్టారం స్టాప్ లేదు కాబట్టి, వెంకటాపురం వెళ్లి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. అంతలో ఆ ఊరి వాళ్లు కొందరు వచ్చి వారు చేసిన మంచి పనుల గురించి పొగిడారు. అందులో ఒకడు మాత్రం”ట్యూబ్ లైట్ వెలుతురుకు దెయ్యం కూడా మీ ఊరు వదిలి పారిపోయిందట కదా! ఇక మీ ఊరి వాళ్లు మందు కొట్టడానికి మా ఊరికి వస్తారైతే”అన్నాడు పగలబడి నవ్వుతూ. మిగతా వాళ్ళు వాడితో వంత కలిపారు.సూర్య, మల్లేష్ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. మొదట వాడిపై కోపం వచ్చినా, వాడి లాజిక్ తో వాళ్ల కో విషయం అర్థమైంది. సమస్య సమూలంగా పరిష్కారం కాలేదని.
ఒక్క నిమిషం ఆలోచించిన సూర్య, మల్లేష్ వైపు చూస్తూ కన్నుగీటి ,ఊరి వాళ్ళతో “అంత సంతోష పడాల్సిన విషయం కాదు అంకుల్ ఇది. నేను ఈ మధ్యనే నెట్ లో చూశాను. పక్క దేశంలో ఓ పిల్లాడు చార్జింగ్ పెట్టిన మొబైల్ తో ఆడుతూ, అది పేలి చనిపోయాడు. అప్పటినుండి వాడి ఆత్మ ఎవరైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటే వారికి కనిపించి భయ పెడుతూ ఉందట. హడలి చస్తున్నారు జనాలక్కడ. అసలే రాజన్న తాగి దారి కనబడక బావిలో పడి చనిపోయాడు. ఇక ముందు తాగే వాళ్లను ఆ దేవుడే కాపాడాలి” అంటూ వాళ్ల ఆలోచనలో వాళ్ళను వదిలేసి, అప్పుడే వచ్చిన బస్సును మల్లేష్ తో కలిసి ఎక్కేశాడు.
ఇది జరిగిన కొన్ని నెలలకు మొగులయ్య సంతోషంగా సూర్యకి ఫోన్ చేసి చెప్పాడు.,. వెంకటాపురం లోని రెండు బెల్టుషాపులు, సారా దుకాణం నడవక మూతపడ్డాయి అని!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!