కాగితం పడవ

కాగితం పడవ

రచయిత :: పాండురంగాచారి వడ్ల

మబ్బులు ఆకాశాన్ని కమ్మేసి చిమ్మచీకటి చేసేసాయి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, వర్షం పడుతుంది అనడానికి సూచనగా. టపటపటపమని ఒక్కొక్కటిగా మొదలై మట్టి పొరలను నిద్దరలేపుతున్న వాన, చినుకుల ధాటికి లేస్తున్న దుమ్ము పైకెగిరి ఆ వాన చినుకులతో కలిసి మట్టి వాసన ముక్కుని చేరేలోపే పెద్ద వానగా మారింది. చేతులని చాచి వాన చినుకులతో ఆడుకున్నట్లుగా అనిపిస్తోంది చెట్ల కొమ్మలు గాలికి వంగిపోయి ఊగుతూ ఉంటే.

తన పాత పుస్తకాలలో నుండి కాగితాలు చించి పడవలు చేసి ఇంటి ముందు పారుతున్న వాన నీళ్ళల్లో వేస్తున్న చిన్నాగాడిని ఒక్కటిచ్చి “వానల తడిసి, జొరం ఒస్తే ఎవడ్రా చూసేది?” అని ఇంట్లోకి లాక్కొచ్చింది వాడి తల్లి ఈరమ్మ.
పడవ కొంత దూరం పోయి వానలో తడిసి, ముద్దయి, మునిగిపోయి కొట్టుకుపోయింది వాన నీటితో పాటే.
ఇంటి పై కప్పు బండల సందులో నుండి కారుతున్న నీళ్లకి వడ్ల సంచులు తడిస్తే, మొలకలు వచ్చి పనికి రాకుండా పోతాయని, ఆ నీళ్ళు సంచులను చేరకుండా బట్టతో తుడిచేస్తూ, నీళ్ళు కారుతున్న చోట ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టేశాడు శివయ్య.

ఒక ఎకరం కౌలుకు తీసుకుని, అప్పో సొప్పో చేసి సాగుచేసి పంట చేతికొచ్చాక, అమ్మగా మిగిలిన దాంతో అయినంతలో ఇల్లు గడుపుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులూ కుటుంబ సమస్యలూ ఏవీ లేకుండా సంతోషంగానే గడిచిపోతున్నట్లున్నాయి వాళ్ళ జీవితాలు.

మనిషి ఎదుగుతున్నాడు, అడవులను కొట్టేస్తూ, పరిశ్రమలు నెలకొల్పుతూ, కాలుష్యం పెంచేస్తూ, నాగరికత అని చెప్పుకుని పర్యావరణాన్ని నాశనం చేస్తూ.

అయినా కాలంతో పాటే పరుగు తీసే అవకాశం రైతుకు ఎక్కడిది? వానలు పడితే పంట. లేదా అప్పుల కోసం తంటాలు పడాల్సిందే. ఇక బావుల సంగతి అంటారా వానాకాలం నిండుగా ఉండేవి, ఎండాకాలం చుక్క నీరు లేకుండా బండరాయిలా ఉండేది.
బోర్లు వేయడం అనేది ఆ ఊరికి పరిచయం అయీ అవగానే పెద్ద రైతులంతా బోర్లు వేయించారు, కానీ ఎక్కడ వేయిస్తే నీళ్ళు పడతాయి అనే అవగాహన లేక, నీళ్ళు పడక ఒకింత అప్పుల్లో మునిగారు వాళ్ళు కూడా.

రోజులు గడుస్తున్న కొద్దీ, వానలు తగ్గి పంట దిగుబడి లేకపోవడంతో,తీర్చలేనంత అప్పులు పెరిగిపోయాయి శివయ్యకు. వేసిన పంటలు వేసినట్టే, భూమిలో కలిసిపోయాయి. చేసిన అప్పులు చేసినట్టే కుబేరుడి వడ్డీలా వడ్డీల మీద వడ్డీలు పడి తల మీద కుంపటిలా తయారయ్యింది. కుటుంబ పోషణ కష్టం అయ్యింది శివయ్యకు. కూలీ చేసుకునే అవకాశం కూడా లేకుండా ఊర్లో అందరు రైతుల పరిస్థితీ అలాగే ఉంది.

చిన్నాగాడి పుస్తకాలు కిలో లెక్కన పాత ఇనప సామాన్ల వాడికి అమ్ముడుపోయాయి. వాన నీటిలో పడవలై తేలిన కాగితాలే, ఇపుడు వడగాలిలో కొట్టుకుపోతున్న చిత్తు కాగితాలు అయ్యాయి, వాళ్ళ జీవితాలాగే.

“బతుకు విలువ ఎక్కువా? అప్పుల లెక్కలు ఎక్కువా? ” అనే సంకట పరిస్థితికి వచ్చిన శివయ్యకు అప్పుల లెక్కలే ఎక్కువ అనే అనిపించింది. ముగ్గురికీ సరిపడా ఎలుకల మందు తెచ్చుకున్నాడు కాగితపు పొట్లంలో, మరి అది తప్ప వేరేది కొనే స్థోమత లేదు కదా.

ఖాళీ అయిన కాగితం గాలి వాటుకు కొట్టుకుని పోయి ముళ్ళ పొదల్లో చిక్కుకుని చిరిగిపోయింది.

***

You May Also Like

2 thoughts on “కాగితం పడవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!