కళ్యాణ వైభోగమే

కళ్యాణ వైభోగమే

రచయిత : శివరంజని

2019 జనవరి నెల ఓ కార్పొరేట్ కంపెనీలో ఒక ఉదయాన

“హాయ్ శ్రుతీ” అన్నది లాస్య, “హాయ్ లాస్య” అన్నది శృతి.
వారాంతపు సెలవు తర్వాత స్నేహితురాళ్లిద్దరూ పరస్పరం పలకరించుకున్నారు.
“ఎలా జరిగిందే షాపింగ్” అడిగింది శృతి. “హా చాలా బాగా జరిగింది, నేననుకున్నట్టుగానే తీసుకున్నాను. ఉండు, లాగిన్ అయ్యాక నీకు పిక్స్ చూపిస్తా” అంటూ తన లాప్ టాప్ లో లాగిన్ చేయసాగింది లాస్య. ఇద్దరు స్నేహితురాళ్లు లాగిన్ అయ్యాక కెఫెటేరియా వెళ్లారు, టీ తాగుతూ షాపింగ్ కబుర్లు చెప్పుకోవడానికి.

శృతి లాస్య ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. శృతి పెళ్లయి రెండేళ్లు అయింది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. లాస్య పెళ్లి మరో రెండు నెలల్లో ఉన్నది. వీళ్ల టీంలోనే ఉన్న మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంస్కృతి పెళ్లి కూడా మరో నెలలో ఉన్నది.

“ఇదిగోవే ఇది రిసెప్షన్ సారీ” తన ఖరీదైన స్మార్ట్ ఫోన్ లో చూయించింది లాస్య. “వావ్, బాగుందే ఎంత? అడిగింది శృతి. “లక్ష పద్దెనిమిది వేలు” “వాట్” అదిరిపడింది శృతి. “నా పెళ్లప్పుడు అన్ని చీరలు కలిపి లక్ష ముప్పై వేలు అయ్యిందే” అన్నది శృతి.
“అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్ మారింది, ధరలు పెరిగాయ్ అమ్మాయ్” అంటూ మిగతా చీరలు చూపించ సాగింది లాస్య. తర్వాత మూడు పట్టు చీరలు, ఒకటి నలభై ఏడు వేలు, ఒకటి ముప్పయి వేలు మరోటి ఇరవై వేలు” లాస్య
“డిస్కౌంట్ పోను, లక్ష తొంబై ఎనిమిది వేలు నా ఒక్క దాని చీరలకే అయ్యింది” గొప్పగా చెప్పింది లాస్య.

“చీరలన్నీ అదుర్స్” కాంప్లిమెంట్ ఇచ్చింది శృతి
“మా ఆడపడుచులిద్దరు చెరి లక్ష, అత్తగారు, అమ్మ యాభై వేలు, అక్క మరో లక్ష ఖరీదు చేసే చీరలు తీసుకున్నారు” అంటూ వాటి చిత్రాలు కూడా స్మార్ట్ ఫోన్ లో చూపించసాగింది లాస్య.
ఇంతలో పొగలు కక్కుతున్న కాఫీ మగ్ తో సంస్కృతి కూడా వీళ్లతో కలిసింది. “హాయ్ శృతి, హాయ్ లాస్య” అంటూ నవ్వుతూ విష్ చేసింది.
“వెల్ కమ్ టు డే షిఫ్ట్” అన్నది శృతి రెండు నెలలు నైట్ షిఫ్ట్ తర్వాత డే షిఫ్ట్ కి మారిన సంస్కృతిని.
లాస్య తను కొనుక్కున్న చీరలు సంస్కృతి కి చూయించింది. “బావున్నాయి” చెప్పింది సంస్కృతి.

“నీ పెళ్లి పనులన్నీ అయిపోయినట్టేనా, వచ్చే నెలే కదా పెళ్లి, నీ సంగీత్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూపులు ఇక్కడ” అన్నది లాస్య.
“పెళ్లి పనులు అయితే అన్ని అయ్యాయి, కాకపోతే ముందు అనుకున్నట్టు గ్రాండ్ పెళ్లి కాదు సంప్రదాయబద్ధమైన సింపుల్ పెళ్లి. సంగీత్ పెళ్లి కూడా ముందనుకున్నట్టు రిసార్ట్స్ లో కాదు” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగడంతో, ఒక్క నిమిషం అంటూ సంస్కృతి కొంచెం పక్కకు వెళ్లి మాట్లాడసాగింది.

శృతి లాస్య ఇద్దరు అయోమయంగా ఏమయిందన్నట్టుగా చూసుకోసాగారు. “అదేమిటి మొన్నటి వరకు పెళ్లి గ్రాండ్ గా ఉండాలని కలలు కన్నది, వీళ్ల పెళ్లి వేడుకలు వీళ్లకు నచ్చినట్టుగా చేసుకోమని రెండు కుటుంబాల వారు వీళ్లకు పర్మిషన్ ఇచ్చారని చెప్పింది, ఇంతలో ఏమయ్యిందే?” అడిగింది శృతి.
“ఏమోనే నాకూ అర్థం కావట్లేదు” అన్నది లాస్య.

ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేసుమెంట్ లో మంచి సాఫ్ట్ వేర్ కంపెనీ లో సంస్కృతి కి ఉద్యోగం వచ్చింది. ఇంటర్మీడియట్ నుండి కథలు రాసి పత్రికలకు పంపేది. అవి ప్రచురించబడేవి కూడా. ఉద్యోగం వచ్చాక కూడా కథలు రాయటం అలాగే కంటిన్యూ చేసింది. తరచూ సంస్కృతి రాసే కథలు వివిధ పత్రికలలో ప్రచురితం అవడంతో, కంపెనీ లో మంచి ఉద్యోగి గానే కాకుండా మంచి రచయిత్రిగా కూడా పేరొచ్చింది.
అదే కంపెనీలో పని చేస్తున్న భరత్, సంస్కృతిని గూర్చి విని, తనని కలవడానికి వచ్చాడు, తాను దర్శకత్వం వహించబోయే షార్ట్ ఫిలిం కి స్క్రిప్ట్ రాయమంటూ. కలిసి పని చేయటం, ఇద్దరి అభిరుచులు కలవటం తో ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. తమ కంపెనీ లో కొందరు యువతీ యువకులు వారాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్, కంప్యూటర్స్ నేర్పిస్తారని ఆసక్తి ఉంటే నువ్వు కూడా మా బృందం లో చేరు అని భరత్ అడిగితే ఉత్సాహంగా భరత్ బృందం లో చేరింది. వారాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువు చెప్పడం, నెలకొకసారి వృద్ధ ఆశ్రమాలకు వెళ్లి వాళ్ల అవసరాలు కనుక్కొని, ఆర్థికంగా సహాయపడడం చేస్తుంటారు ఈ బృందం లోని సభ్యులు. దీని కోసం సంస్కృతి, భరత్ ప్రతి నెల తమ జీతం లో పది శాతం కేటాయిస్తారు. కొందరు నెలకు వెయ్యి, కొందరు అయిదొందలు ఇలా ఎవరికి వీలయినంత వారు. అయితే అందరిలోనూ ఉన్నది ఒకటే దృక్పథం “మనకింత ఇచ్చిన సమాజానికి మనమూ కొంత తిరిగి ఇవ్వాలి”

సంస్కృతి భరత్ ల బృందం ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా బోధించటం తో పాటు వృద్ధాశ్రమానికి వాలంటీర్లుగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడు స్లం ఏరియా లకు వెళ్లి పరిశుభ్రత ప్రాముఖ్యం తెలియజేస్తారు. అక్కడి యువతని తమతో కలుపుకొని కాలనీలు శుభ్రం చేస్తారు, మొక్కలు నాటుతారు.

ఇలా నాలుగేళ్ల పాటు కలిసి పనిచేయటం, అభిరుచులు కలవటంతో సంస్కృతి భరత్ ల స్నేహం ప్రేమగా మారింది. రెండు కుటుంబాలలో ఇద్దరి మీదా ఉన్న నమ్మకం, ఇద్దరూ మంచి ఉద్యోగాలలో స్థిరపడి ఉండడంతో వీళ్ల పెళ్లికి సంతోషంగా ఒప్పుకోవడంతో పాటు పెళ్లి మీకు నచ్చినట్టుగా మీ అభిరుచికి తగ్గట్టుగా చేసుకోండని అన్నారు.
సంస్కృతి భరత్ ల నిశ్చితార్దము రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆరోజు సంస్కృతి భరత్ లు వజ్రపుటుంగరాలు మార్చుకున్నారు. అరవై డెబ్భై రకాల కమ్మని వంటకాలు అతిథుల మన్ననలు అందుకున్నాయి. ఈడు జోడు బావుందని వచ్చిన వారంతా మెచ్చుకున్నారు. ఉద్యోగంతో పాటు సంస్కృతి ప్రవృత్తి రచయిత్రి, భరత్ ప్రవృత్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్ కావడంతో వాళ్లతో పనిచేసే ఆయా రంగాల ప్రముఖులు నిశ్చితార్థానికి విచ్చేసారు. నిశ్చితార్థ వేదిక అలంకరణ, ఆ వేదిక మీద డిజైనర్ బట్టల్లో మెరిసిపోతున్న సంస్కృతి భరత్ ఆ వేడుక చూసిన శృతి లాస్య నోరెళ్లబెట్టారు. వాళ్ళతో పాటు పనిచేసే కార్పొరేట్ ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు చాలామంది వచ్చారు.
నిశ్చితార్థమే ఇంత వైభవంగా చేస్తే పెళ్లి ఇంకెంత వైభవంగా చేస్తారో అని అనుకున్నారు శృతి, లాస్య.

కానీ రెండు నెలలలోనే ఏం జరిగి ఉంటుంది, సంస్కృతి భరత్ ఇద్దరూ తల్లి తండ్రులకు ఒక్కగానొక్క బిడ్డలు. రెండు కుటుంబాలు ఆర్థికంగా ఉన్నవాళ్లే. నిశ్చితార్దము అంత వైభవంగా చేసి ఇప్పుడు పెళ్లి ఎందుకు సింపుల్ గా అంటోంది అని శృతి లాస్య ఇద్దరూ ఎవరికి వారే ఆలోచించసాగారు. ఫోన్ మాట్లాడడం అయిపోయిన సంస్కృతి వీళ్ళతో వచ్చి కూర్చుంది.

“రెండు చేతులా సంపాదిస్తున్నావ్, ఒక వైపు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మరో వైపు రచయిత్రి గా, నీకెందుకమ్మాయ్ పొదుపు గిదుపు” నవ్వుతు అడిగింది శృతి
సంస్కృతి చిరునవ్వు నవ్వుతూ “ఇవాళ సంపాదిస్తున్నాం కదా అని వృధాగా ఖర్చు పెట్టొద్దు అనే ఫిలాసఫీ అనుసరిస్తున్నాం. పెళ్లిలో వీలైన చోటాల్లా ఖర్చు తగ్గించి, ఆ డబ్బుని ఒక మంచి పని కోసం కేటాయిద్దామనుకుంటున్నాం” అన్నది సంస్కృతి

“ఏయ్ పెళ్లి అనేది జీవితం లో మళ్లీ మళ్లీ జరిగేది కాదు, అది మన స్పెషల్ డే, ఆ రోజు మన జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ మధురమైన ఘట్టానికి నీ బోడి పొదుపుతో ముడి పెట్టకు” చిరు కోపంగా అన్నది శృతి.
“నిజమే శ్రుతీ, పెళ్లి జీవితం లో ఒకే సారి జరిగే మధురమైన సంఘటన, అందుకే మేము దాన్ని చాలా జాగ్రత్తగా మన సంప్రదాయబద్దంగా అందరికీ ఆనందాన్నిచ్చే విధంగా, ముఖ్యంగా మా ఇద్దరికీ మా రెండు కుటుంబాలకు తృప్తినిచ్ఛే విధంగా ప్లాన్ చేస్తున్నాం” అన్నది సంస్కృతి.
“నిజానికి రెండు నెలల ముందు వరకు నేనెప్పుడూ పొదుపు గురించి ఆలోచించలేదు. రెండు నెలల క్రితం జరిగిన అనుకోని సంఘటన మా ఆలోచనా దృక్పథాన్ని మార్చింది. నేను నైట్ షిఫ్ట్ లో ఉండడం వల్ల మీతో షేర్ చేసుకోలేదు. అసలేం జరిగిందంటే అంటూ చెప్పడం ప్రారంభించింది సంస్కృతి.

మేము సేవ కార్యక్రమాలు చేయడానికి స్లం ఏరియాలకు వెళ్తామని మీకు తెలుసు కదా, అలా మా నిశ్చితార్దము అయ్యాక అంబేద్కర్ కాలనీ లో పనిచేస్తున్నప్పుడు, కాలనీ వాళ్లు తల్లి తండ్రి చనిపోయిన ఇద్దరు ఆడపిల్లల్ని ఏదైనా అనాథ ఆశ్రమం లో చేర్పించమంటూ మా దగ్గరికి
తీసుకువచ్చారు.

అక్కచెల్లెళ్లయిన ఇద్దరు చిన్నారులకి పది, ఎనిమిది సంవత్సరాలున్నాయి. ఆరోజు శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడం వల్ల ఈ రెండ్రోజులు ఆ ఇద్దరు పిల్లల్ని మా ఇంట్లో ఉంచి, సోమ వారం బాలల వసతి గృహంలో చేర్పిద్దామని అనుకున్నాము. కాలనీ వాళ్లకు మా ఫోన్ నంబర్లు ఇచ్చి, వారి నంబర్ తీసుకొని, ఎక్కడ చేర్చింది తెలియబరుస్తామని, ఒక వేళ పిల్లల కోసం వాళ్ల బంధువులెవరైనా వస్తే తెలియజేయమని చెప్పి బయల్దేరాము. మా ఇంటికి వచ్చే దారిలో పిల్లలిద్దరికీ కావలిసిన బట్టలు ఇతర అవసరమైన సామానులు కొన్నాను. ఇంటికి వచ్చాక నేను స్నానం చేసి, పిల్లలిద్దరినీ స్నానం చేయమని చెప్పి నాలుగు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ మీద చక చక అన్నం, ముద్ద పప్పు, సాంబారు, బంగాళదుంప వేపుడు, వడియాలు వేయించి గడ్డ పెరుగు తో పిల్లలిద్దరికీ అన్నం వడ్డించాను. పాపం వేడి వేడి అన్నం కూరలు చూడగానే పిల్లలు ఆవురావురుమంటూ గబ గబా తినేశారు. మర్నాడు ఆదివారం కాబట్టి, లాప్ టాప్ ముందేసుకుని బాలల వసతి గృహాల గురించి వాకబు చేద్దామని కూర్చున్నా. మొదటి రెండు నంబర్లు ఫోనెత్తలేదు. మూడోది మా ఇంటికి దగ్గర్లో ఉన్న, కొత్తగా పెట్టిన బాలల అనాథాశ్రమం. సరే వీలైతే, ఇవాళే చూసి రావచ్చనుకొని కాల్ చేసా. ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్లు హిందీ లో మాట్లాడారు. మీకు తెలుసుగా నేను హిందీ బాగా అర్థం చేసుకోగలిగినా, మాట్లాడేటప్పుడు కూడబలుక్కుంటూ మాట్లాడుతా. వాళ్లు అప్పటికే ఎవరిదో ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. “పిల్లల్ని చేర్చాలని నేను అడిగితే, వాళ్లకు పిల్లలు కావాలని అర్థం అయ్యింది. పెంచుకోవటానికా, ఇంట్లో పని కోసమా అని అడిగి, వస్తువుల ధరలు చెప్పినట్లుగా సంవత్సరం పిల్లల నుండి పన్నెండు సంవత్సరాల పిల్లల వివరాలు ధరలు చెప్పారు. నా మైండ్ బ్లాక్ అయ్యింది. అంటే వాళ్లు అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్నట్లుగా నటిస్తూ, తర్వాత ఏ పిల్లలు లేని వారికో ఈ పిల్లల్ని అమ్ముతున్నారు, లేకపోతే ఇళ్లల్లో పని మనుషులుగా ఈ పసి పిల్లల్ని కుదురుస్తున్నారు. ఆ పసి రెక్కలతో డబ్బు సంపాదిస్తున్నారు.

“మై గాడ్” అన్నారు శ్రుతీ, లాస్య ఇద్దరూ ఒకే సారి.

విషయం అర్థమైన వెంటనే వాళ్లు మాట్లాడేది నా ఫోన్ లో రికార్డు చేసా. భరత్ కి కాల్ చేసి విషయం చెప్పి, కాల్ రికార్డింగ్ పంపించా. భరత్ తనకు తెలిసిన జర్నలిస్ట్ కి కాల్ చేసాడు. విషయం పూర్తిగా తెలియకుండా కేవలం ఫోన్ కాల్ ఆధారంగా ఏం చేయలేమని, ఏమైనా సాక్షాధారాలు సంపాదించాలని అన్నాడు. భరత్, నేను అప్పటికప్పుడే మా బృందాన్ని అల్లర్ట్ చేసి, ఆన్ లైన్ మీటింగ్ పెట్టి, వాళ్లని ట్రాప్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేసాము. కావలసిన టెక్నాలజీ, టూల్స్ అన్ని ఆ రోజే సిద్ధం చేసుకున్నాము.

మరుసటి రోజు భరత్ వాళ్ల జర్నలిస్ట్ ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ చేత మా ఇద్దరి పోలికలు తెలీకుండా, మేకప్ చేయించాడు. భార్యా భర్తల్లా (ఎలాగూ అవబోయేవాళ్లమేగా) అక్కడికి వెళ్లాము. భరత్ షర్ట్ కి ఒక పెన్ కెమెరా, నా హ్యాండ్ బాగ్ లో ఒక కెమెరా ఫిక్స్ చేసాము. మా కెమెరా లతో అనుసంధానించబడిన లాప్ టాప్ లతో మా మిత్ర బృందం శరణాలయానికి కొద్ది దూరంలో వ్యాన్ లో ఉన్నారు. బయట మరో ఇద్దరు ఫ్రెండ్స్ ని బ్యాకప్ గా పెట్టుకొని, ఫోన్ వాళ్లకు రింగ్ చేసి, ఆన్ లో ఉంచి అనాథ శరణాలయం లోపలికి వెళ్లాము. శరణాలయం అంటే అదొక రెండంతస్తుల మేడ అంతే.
వార్డెన్ కి కొత్తగా పెళ్లయిన భార్యా భర్తలుగా మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాము. మా ఇద్దరి ఉద్యోగాల గురించి వాకబు చేసి “మీకు సోనీ అయితే పర్ఫెక్ట్. ఎవరికి ఏమి చెప్పదు. తనకి ఇంతకుముందు మీ లాంటి వారి దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లు ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరు వెళ్లారు. మీ అదృష్టం” అన్నారు

“నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి అయ్యే పన్నెండు వేలు ముందుగానే ఇవ్వాలి, ఒక వేళ సోనీ పని నచ్చక పోతే వేరే పిల్లల్ని పంపుతాము. సోనీ తిండి, బట్ట ఖర్చులు మీరే చూసుకోవాలి” చెప్పింది అక్కడి వార్డెన్ అనబడే వ్యాపారి.

మేము అమ్మాయిని చూడాలని చెప్పాము. పిలిపించారు. మాసిన బట్టలతో, వదలిపోయిన తోటకూర కట్టలా, నీరసంగా ఉన్న పది పన్నెండేళ్ల అమ్మాయి వచ్చింది. దగ్గరకు పిలిచి తనకు ఏమేం పనులు వచ్చో అడుగుతున్నారు. తను చెప్తోంది. అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, తుడవడం, చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరగటం, ఆడించటం ఇలా అన్ని పనులు చెప్తోంది. ఇంతకు ముందు ఎవరి ఇంట్లో ఉన్నదో, ఏమేం పనులు చేసేదో చెప్పింది. వీళ్లేమవుతారని ఎవరైనా అడిగితె ఏమని చెప్తావు అని అడిగితే మామ అత్త అని టక్కున చెప్పింది.
మా కెమెరాలో వీడియో ఆడియో అంతా రికార్డ్ అవుతోంది. అదంతా బయట వ్యాన్ లో ఉన్న మా మిత్ర బృందం లాప్ టాప్ లో చూస్తున్నారు.

“మరి ఏమైనా ప్రాబ్లమ్ ” అంటుండగానే “మీ చుట్టుపక్కల వారికి మీ బంధువుల అమ్మాయి అని చెప్పండి. తను కూడా అలాగే చెప్తుంది. బయటికి పంపకుండా ఇంటి పనులకే వాడుకోండి. ఏం ప్రాబ్లమ్ రాదు” అన్నారు.

“సరే ఏ విషయము ఆలోచించి చెప్తామని, మేము చాలా మాములుగా బయటికి వచ్చాము.

ఆ రాత్రి, పోలీసులు ఆ అనాథశరణాలయం మీద దాడి జరపడం, దాని నిర్వాహకులను స్టాఫ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వసతి గృహం నుంచి పిల్లల్ని పనిమనుషులుగా తీసుకెళ్లిన వారి మీద కేసులు బుక్ అయ్యాయి, పిల్లల్ని ఆ చెర నుంచి విడిపించారు.
అయితే అందులో ఉన్న నలభై మంది పిల్లల పరిస్థితి ఏమిటి?

టెంపరరీ గా మేము వాలంటీర్లుగా ఉన్న వృద్దాశ్రమంలోనే వాళ్లకీ అకామడేషన్ కల్పించాం.
“ఇలాంటి వాటికి ప్రభుత్వ వసతి గృహాలు ఉంటాయి కదా” ప్రశ్నించింది శృతి
“నిజమే ఉంటాయి, కానీ ఈ పిల్లల్ని మా బృందం అంతా మా బాధ్యత గా స్వీకరించాం. వాళ్లని ఆ చెర నుంచి తప్పించాం కాబట్టి వాళ్లని బాగా చదివించి మంచి పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత కూడా మాదే అనిపించింది. ఒక్కొక్కరం ఒక అమ్మాయి లేదా అబ్బాయి చదువు బాధ్యత తీసుకున్నాము. అందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, మన వృద్ధాశ్రమం లోనే బాలల వసతి కోసం కూడా చర్యలు తీసుకున్నాము. వృద్ధాశ్రమం లో రెండు పెద్ద హాల్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి అక్కడ ఉంచాము. పిల్లల మానసిక పరిస్థితి అసలు బాగా లేదు, బాగా భయం లో ఉన్నారు.

పిల్లలు అందరికీ ఆత్మవిశ్వాసం కోసం మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పించాము. అందర్నీ పాఠశాలల్లో చేర్పించాము. వృద్ధాశ్రమం లో ఉన్న ప్రతి బామ్మా తాతయ్యలు పిల్లల్లో తమ మనవలని మనవరాళ్లని చూసుకోసాగారు. ఒక్కో బామ్మ దగ్గర ఒక్కో పాపా, ఒక్కో తాతయ్య దగ్గర ఒక్కో బాబు చేరిపోయారు. వృద్ధాశ్రమం లో పిల్లల కోసం అనుకూలమైన బిల్డింగ్ కట్టడానికి స్థలం ఉంది, కానీ డబ్బు లేదు. అందుకే ఇలా మా పెళ్లి లో వృధా ఖర్చులు తగ్గించి, ఆ పసి పిల్లల అకామడేషన్ కి, డబ్బు చేకూర్చాలని మా ఈ పొదుపు మంత్రం. మా పెళ్లి లో అనవసరపు ఖర్చు తగ్గించి దాంతో వాళ్లకు నీడను ఏర్పరచటం మాకు మధురానుభూతే కదా మరి అన్నది సంస్కృతి.
శ్రుతీ లాస్య ఇద్దరు చప్పట్లు చరుస్తూ సంస్కృతిని చాలా మంచి పని చేస్తున్నావంటూ కౌగిలించుకున్నారు.

“మా సేవా బృందం లో ఇక మీదట ఎవరి పెళ్లి అయినా వాళ్లు అనవసరమైన ఖర్చులు తగ్గించి, ఆ డబ్బు ని బాలల వసతి గృహం కోసం వెచ్చించాలనేది మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. అందులో మొదటి పెళ్లి మాదే. మా పెళ్లి బడ్జెట్ ఇరవై లక్షలు. సంప్రదాయాలు తప్పకుండా, ఎక్కడా బాగా లేదు అనిపించుకోకుండా ఒకవైపు వైభవంగా, మరో వైపు పొదుపుగా పెళ్లి చేసుకోవాలనేదే ప్రస్తుత మన టార్గెట్. అందుకే ఈవెంట్ మానేజిమెంట్ వాళ్లను పెట్టుకోకుండా, మన ఈవెంట్ మేనేజర్ రాజేష్ ని సహాయం అడిగాం. మా కాస్ తెలిసి తనూ ఒప్పుకున్నాడు. చాలా డబ్బు మిగిల్చాము. మీకు కూడా డబ్బు మిగిల్చే మంత్రాలూ ఏమైనా తెలిస్తే చెప్పండి” అన్నది సంస్కృతి.

“తప్పకుండా” కోరస్ గా అన్నారు శ్రుతీ లాస్యాలు.
“ఇంతకూ ఇప్పటి వరకు ఏమేం ఖర్చులు తగ్గించావు?” అడిగింది శృతి.
“ప్రతిదీ పొదుపు మంత్రమే, కానీ పిసినారితనం కాదు అలాగే ఎక్కడ సంప్రదాయాలు మరువలేదు. చీరలు షోరూం లో కాకుండా కంచిలో నేత పని చేసే వారి నుండి తీసుకున్నాం. వంటలు కేటరింగ్ కు ఇవ్వకుండా వంటవాళ్లను మాట్లాడాము. సరుకులు రాజేష్ కు తెలిసిన వారి దగ్గర నాణ్యమైనవి మంచి ధరలో తీసుకున్నాం. రిటర్న్ గిఫ్ట్ లుగా నర్సరీ నుండి మొక్కలు బుక్ చేసాము. వాహనాలు బయట నుంచి బుక్ చేయకుండా బంధువులు, స్నేహితుల వద్ద నుండి తీసుకుంటున్నాము. పెళ్లి రోజు బంధువులను రిసీవ్ చేసుకోవడం, భోజన సౌకర్యాలు చూసుకునే
బాధ్యత మా సేవ బృందం సభ్యులు తీసుకున్నారు. పెళ్లి కూడా రిసార్ట్ బదులు వృద్దాశ్రమంలో ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో చేసుకోబోతున్నాము. దీనికి మాత్రం మా రెండు కుటుంబాల పెద్దలు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ రాజేష్ అందమైన పందిరి, వేదిక, పచ్చని గార్డెన్, అతిథుల సౌకర్యాలకు తీసుకునే చర్యలు ప్రజెంటేషన్ తయారు చేసి చూయించడం వల్ల, మా వాళ్లను కన్విన్స్ చేయగలిగాము. సంప్రదాయాలు, పద్ధతులు మార్చకుండా డబ్బు అయితే చాలానే మిగిల్చగలిగాము” మెరుస్తున్న కళ్ళతో చెప్పింది సంస్కృతి.

“బావుందే, మీ పెళ్లి రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాము” ఏక కంఠంతో అన్నారు శృతి లాస్య. అంతా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. 2020 ఫిబ్రవరి 15 వ తేదీన సంస్కృతి భరత్ ల వివాహం సంప్రదాయబద్ధంగా కన్నుల పండగగా జరిగింది. పెళ్ళికి విచ్చేసిన అతిథులు అంతా సంతోషంగా వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులు సంస్కృతి భరత్ లు పదిహేను లక్షల చెక్కు బాలల వసతి గృహ నిర్మాణానికి గాను ఇచ్చారు. శృతి లాస్య కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం అని పాడుకున్నారు. ఆ తర్వాత మార్చ్ 24 న పాండెమిక్ కోవిద్ లాక్ డౌన్ ప్రకటించారు. లాస్య పెళ్లి లాక్ డౌన్ లో అన్ని నియమాలు పాటిస్తూ జరిగింది. తన పెళ్లి లో మిగిలిన డబ్బుని లాస్య కూడా బాలల వసతి గృహానికి తన వంతు సహాయంగా ఇచ్చింది. అలాగే శృతి పండంటి ఆడ బిడ్డని ప్రసవించింది. పాప బారసాల సాంఘిక దూరం పాటిస్తూ, లాక్ డౌన్ నియమాలతో చేసుకొని, శృతి కూడా బారసాల కోసం దాచుకొన్న డబ్బుని బాలల వసతి గృహానికి ఇచ్చింది. సంస్కృతి భరత్ ల వివాహానికి హాజరైన మానవత్వం ఉన్న చాలా మంది తమ ఇంటి కార్యాలలో వృధా తగ్గించి ఎంతో కొంత డబ్బు బాలల వసతి గృహ నిర్మాణానికి ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. సర్వే జనా సుఖినోభవంతు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!