కనువిప్పు

కనువిప్పు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : తిరుపతి కృష్ణవేణి

ఏమండీ! నేను చెప్పేది వినండీ! మీ ఆలోచన  ఎంత వరకు సమంజసమో! ఒక్కసారి ఆలోసించండి?దయచేసి నా మాట వినండి, అంటూ భర్త ప్రవీణ్ ను ప్రాధేయ పడుతూ! అడుగుతువుంది, పావని.
చూడు పావని! నువ్వు  చెప్పేది నేను వినటం  కాదు! ఇప్పుడు నేను  చెప్పేది నువ్వు వినాలి.  అంతే! ఇంక నువ్వేమి మాట్లాడకు.! డాక్టర్ నా ఫ్రెండ్ అవడం వలన, ఇప్పటి వరకూ, అంతా సవ్యంగా జరుగుతూంది. నేను డాక్టర్ తో  అంతా మాట్లాడాను. ఇంక ఏమీ మాట్లాడకుండా  నోరుమూసుకుని చెప్పింది చేయి! ఇదంతా! మన  మంచికే! అంతా ఆలోచించే నేను ఈ నిర్ణయం  తీసుకున్నాను. డాక్టర్ వచ్చే టైమ్ అయ్యింది.  కళ్ళు తుడుచుకో! అంటూ గద్దించాడు భర్త ప్రవీణ్.
నాన్న పక్కనే కూర్చుని లాలి పప్ తింటూ  ఇదంతా! గమనిస్తుంది ప్రవీణ్ నాలుగేళ్ళ కూతురు దీక్ష. ప్రవీణ్ ది ఓ మధ్యతరగతి కుటుంబం. తమ తల్లి, దండ్రులకు నలుగురు అక్కలకు, చివరగా   ప్రవీణ్ ఒక్కడే మగ సంతానం. చిన్నతనం నుండి  ఆడ పిల్లలు, వారికి అయ్యే ఖర్చులు, వారికి  పెళ్లిళ్లు,కట్న కానుకలు ఇచ్చి అత్తారింటికి సాగనంపటం, వారికి సీమంతాలు, పురుడులు పోయటాలు చేయటంలో తమ తల్లి,దండ్రులు పడ్డ కష్టాలు, ఇబ్బందులు చూస్తూ, పెరిగిన ప్రవీణ్ ఆడపిల్లలంటేనే, విముఖుత కలిగింది.
అప్పటినుండే ఆడపిల్లల సంతానం వద్దురా బాబు! అనుకున్నాడు. కానీ అనుకున్నవన్నీ జరగవుగా?
తనకూ మొదటి సంతానం ఆడపిల్లే పుట్టింది. అప్పటి నుండి ప్రవీణ్ గుండెల్లో రాయి పడింది.
అబ్బాయి పుట్టాలంటే ఎంత మంది ఆడపిల్లల్ని కనాలో? తరచూ ఆలోచనలో పడేవాడు. మొదటి సంతానం పాప అయినా ఇంట్లో అందరూ చాలా గారాభంగా చూచే వారు. మహాలక్షి పుట్టింది అని మురిసి పోయేవారు. దీక్షకు అప్పుడే నాలుగు సంవత్సరాలు నిండాయి. దీక్షఅంటే ప్రవీణ్ చాలా ప్రేమ, ప్రాణంకన్నా మిన్నగా చూచుకునే వాడు.
ఒక్క అమ్మాయి చాలు! మరలా ఆడపిల్లను కనకుండా చూచుకోవాలి. ఇంటి వారసుడు అబ్బాయి మాత్రం కావాలి అనుకుంటూ ఉండేవాడు. మరోబిడ్డకు తండ్రిని కాబోతున్నానని తెలిసి కంగారు పడసాగాడు. ప్రవీణ్ ముందుగా మేలుకుంటే మంచిదని ఆలోచించి, తన డాక్టర్ ఫ్రెండ్ ద్వార విషయం తెలుసుకున్న ప్రవీణ్  భార్యకు అబార్సన్ చేయించటానికి హాస్పిటల్ కు తీసుకునివచ్చాడు. భార్య వద్దని ఎంతచెప్పినా! ససేమిరా! అంటూ, మరలా మనకు ఆడపిల్లపుడితే ఎలా? నేను భరించలేను. అంటూ, భార్య పావనిపై విసుక్కో సాగాడు. మా నాన్న కూడా రెండవ సంతానం మగపిల్లవాడు పుడతాడులే!
అని, ప్రతి సారి ఎదురు చూడటం వల్లనే, వరుసబెట్టి నలుగురు ఆడపిల్లలను కన్నారు. నా మాటవిని అబార్సన్ చేయించుకో? అన్నాడు ప్రవీణ్.
నాకు ఇష్టం లేదండి, అని కళ్ళనీరు పెట్టుకుంది, పావని. ఇద్దరితో ఆపుదాం! వాళ్లనే మగపిల్లల్లా పెంచుకుందాం అండీ? అని భర్తను వేడుకో సాగింది పావని. అక్కడనే ఉండి ఇదంతా గమనిస్తున్న
ప్రవీణ్ కుమార్తె దీక్ష, ఏదో ! అర్థం  అయిన  దానిలా! తను తింటున్న లాలిపాప్ ను కోపంతో  నేలకేసి విసిరి కొట్టి,  తన చిన్ని చిన్ని  చేతులతో  తండ్రి  చెంపల పై గట్టిగా వాయించింది. అది చూచి పావనిలో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. తన   కూతురు వైపు ఎంతో గర్వంగా చూసింది. చూడండి! ఆడపిల్ల అంటే అక్కగా, చెల్లిగా, భార్యగా, తల్లిగా, కోడలిగా, కూతురిగా అన్ని  రకాల పాత్రల్లో ఒదిగిపోయి కుటుంబ భారాన్ని  మోస్తూ! దాసిలా పని చేస్తుంది. మనం   చదువుకొని ఉద్యోగాలు చేస్తూ, ఇంత మూర్ఖంగా  ఆలోచించటం ఎంత వరకు సబబు? ఆడా!  మగా! ఎవరైనా ఒకటేనండీ! చిట్టి తల్లి దీక్షకు  కూడా, మన ఆలోచన తప్పు అనిపించే, కదండీ!  మీ పై కోపాన్ని చూపించింది. ఆడపిల్లను మొగ్గలోనే తుంచేయాలి, అనే మీ అవివేకానికి   సిగ్గు పడుతున్నానండి. అబార్సన్స్ చేయించుకోవటమంటే ఆడవారికి ఎంత కష్టమో! మీ మగాళ్లకు ఏం, తెలుసండి! అని కోపంగా భర్త ప్రవీణ్ పై పావని తిరగబడింది. కోపంగా హాస్పిటల్  బెడ్  పై నుండీ అన్నీ విదిలించుకొని కూతురు దీక్షను తీసుకొని గది బయటకు నడిచింది. ప్రవీణ్ ఆలోచనలోపడ్డాడు. పావని చెప్తుంది కూడా నిజమే కదా! ఆడబిడ్డయినా, మగ బిడ్డయినా, ఒకటే ! నేటి సమాజంలో ఆడపిల్లలు సైతం ఎన్నో విజయాలు సాధిస్తూ, అన్ని రంగాలలో రాణిస్తున్నారని,
తల్లి దండ్రులకు ఎంతో పేరు, ప్రఖ్యాతులు  తెస్తున్నారనే వార్తలను చూస్తున్నాము గదా!ఎందుకు ఇంత అవివేకంగా మాట్లాడాను. నా కూతురు కనువిప్పు కలిగించిందిఅని, పశ్చాత్తాపంతో, స్థాణువులా నిలుచుండి పోయాడు.
కొన్ని నెలల తర్వాత,హాస్పిటల్ నుండి డిఛార్జి అయి మరో ఆడబిడ్డతో పావని, నాన్న ప్రవీణ్ చేయి పట్టుకుని లాలీపాప్ తినుకుంటూ దీక్ష, ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!