కవితార్చన
రచయిత:అనురాధ కోవెల
పనిలో అలసిన మనసు
పండు వెన్నెల్లో సేద తీరేవేళ
మూతలు పడిన రెప్పల మాటున చేరి
క్షణమాగక నర్తించే కావ్యనాయిక
తన పద మంజీర నాదాలతో
అలవోకగా పలికించే భావ వీచికలకు
హెచ్చిన నా గుండె వేగం
తలుపు తట్టిన తొలి వేకువను
చూడ విచ్చిన కళ్ళల్లో
నవ్వు విరులు పూయించగా
దోసిట నిండుగా ఒడిసి పట్టిన
తన వలపు తలపులు
అక్షర సుమాలుగా జార విడిచి
జవ్వనిని అభిషేకించనా
భామిని మెడలో భావ మాలలు వేసి
కవితార్చన కావించనా..