కొండపొలం

కొండపొలం (చిత్రసమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: పరిమళ కళ్యాణ్
చిత్రం: కొండ పొలం

రవి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్పి, తన ఇంటర్వ్యూ ని మాతృభాషలో చెయ్యాల్సింది గా అడుగుతాడు.
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి, మంచి ఇంగ్లీష్ తెలిసి ఉండి కూడా తెలుగులో ఎందుకు అడగమన్నావు అని అడుగుతారు ప్యానెల్ సభ్యులు. తర్వాత ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగితే అడవిలో అంటాడు రవి. నీ గురించీ చెప్పమని అడుగుతారు సభ్యులు. నా కథ చెప్పాలంటే చాలా టైం పడుతుంది అని, చెప్పటం మొదలు పెడతాడు. రవి ఒక సాధారణ కుర్రాడు. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ ప్రయత్నాలు ఎన్నో చేసి, ఉద్యోగం సంపాదించలేక పోతాడు. ఊరికి నాలుగు రోజులు ఉండాలని వెళ్తాడు. అదే సమయంలో ఊర్లో వర్షాలు పడక, గొర్రెలను కొండపొలం మీదకి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. తన తండ్రికి సాయంగా రవి కూడా గొర్రెల మందని చూసుకోవడానికి, తాత మాట మీద వెళ్ళటానికి సిద్ధ పడతాడు. కానీ కొండపొలం వెళ్ళిన రవి అక్కడ పులి ఉంటుందని తెలుసుకుని భయపడతాడు. అలాగే కొండ చిలువని చూసి భయపడతాడు. అన్నిటికీ భయపడే అతను గొర్రెలను కాయలేడని ఇంటికి వెళ్ళిపొమ్మంటాడు తండ్రి. కానీ రవి అక్కడే ఉంటాడు. ఆ అడవిలో అన్నీ చూస్తూ గమనిస్తూ నేర్చుకోవాలి అని చెప్తారు అతనికి. దాంతో అప్పటినుంచీ అడవిలో ప్రతి దాన్ని గ్రహించటం మొదలు పెడతాడు. అలా మొదలవుతుంది అతని అసలు జీవితం. అడవిలో తిరుగుతూ నీటి కోసం చూస్తూ, పులి నుంచి గొర్రెలను కాపాడుకుంటూ సాగుతుంది వారి జీవనం. అలా సాగుతున్న అతని ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాడు రవి. క్రమంగా ఒక్కొక్క సంఘటన నుంచీ ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ, ధైర్యాన్ని నింపుకుంటాడు. ఈ క్రమంలో అతనికి దగ్గరవుతూ, అన్ని విషయాలు నేర్పిస్తుంది వరసకి మరదలు అయ్యే ఓబులమ్మ. “చదువుకున్నందుకు నీ మీద ఈర్ష్యగా ఉంది, చదువుకుని ఇలా గొర్రెలు కాయటానికి వచ్చినందుకు కోపంగాను ఉంద”ని చెప్తుంది రవితో.
తండ్రి, ఓబులమ్మ, మామ మిగతా వాళ్ళు అందరితో కలిసి ఉంటూ జీవితం అంటే ఏమిటో నేర్చుకుంటాడు. పులిని చూసి భయపడినప్పుడు, ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలకు భయపడిన సందర్భాలు గుర్తుచేసుకుంటాడు. నెమ్మదిగా అతనిలో ధైర్యం పెరుగుతుంది. ఒకసారి పులి వాళ్ళ గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెను కరుచుకుని పోతుంది. కానీ గొర్రె చెట్ల మధ్యలో ఇరుక్కుపోవటంతో, పులి కింద పడిపోతుంది. అదే అదనుగా గొర్రె ను కాపాడటానికి ప్రయత్నిస్తాడు రవి. అందరూ కలిసి కష్టపడి గొర్రెను పులి నుంచీ కాపాడగలుగుతారు. మధ్యలో ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ వస్తారు. పులిని చూసి దారి తప్పి, వేరే దారిలోకి వెళ్ళిపోతారు కొందరు. అలా దారులు వెతుక్కుంటూ గమ్యం చేరే మార్గంలో చివరకి పులికి ఎదురు వెళ్తాడు రవి. ఓబులమ్మ తో ప్రేమలో పడతాడు. కానీ ఉద్యోగం చేసేవాళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఓబులమ్మ తాత అందరితో చెప్తాడు. రవి తండ్రి రవి ఓబులమ్మతో దగ్గరగా ఉండటం చూసి, “తప్పు చేయద్దు, ఓబు చాలా మంచి అమ్మాయి. నీకే ఉద్యోగం లేదు, ఆ పిల్లని ఎలా చూసుకుంటావు?” అని అడుగుతాడు. తనని మర్చిపోమని చెప్తాడు. తండ్రి మాటలు విని ఓబు కి దూరంగా ఉంటాడు రవి. చివరకి వర్షం పడేసరికి, విజయవంతంగా అడవి నుంచీ బయటపడతారు అందరూ. రవికి అడవి ప్రయాణం వల్ల అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తర్వాత పరీక్ష పాసయ్యి, IFS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. అలా ఫారెస్ట్ ఆఫీసర్ గా, ఉద్యోగం సంపాదించి, అదే అడవిలో అదే మనుషుల మధ్య ఎప్పటికీ ఉండాలని అనుకుంటాడు. ఉద్యోగం సంపాదించిన తర్వాత తండ్రి దగ్గరకి వచ్చేసరికి, తండ్రి ఇంకా గొర్రెలు కాస్తూనే ఉంటాడు. కొండపొలం అనే ఈ సినిమా నన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి  నవల “కొండపొలం” నుంచి తీసుకున్న కథ. సినిమాకి కూడా కథ, మాటలు నవలా రచయిత అందించటం విశేషం.
నవల నుంచీ దాదాపు 80-90% తీసుకున్న కథ, సినిమా కోసం కొంత కల్పించిన కథ ఉంటుంది.
ఈ సినిమాలో రవి అనే సాధారణ వ్యక్తి, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి ఇక ఇదేనా నేను అనుకునే సమయం నుంచీ, ఒక శక్తివంతమైన ఫారెస్ట్ ఆఫీసర్ గా ఎలా అయ్యాడు అనేది చూపిస్తారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అన్ని సినిమాల లాగానే ఈ సినిమా ని కూడా ఎంతో ఉన్నతంగా తీశారు. అలాగే సమకాలీన పరిస్థితుల గురించీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న నీటి కరువు గురించీ, కొండలను ఆక్రమించటం వరకూ, కొండల్లో దొరికే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించీ, అలాగే పెత్తందార్ల గురించీ కూడా స్పృశిస్తారు రచయిత. నటీనటులు అందరూ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు చాలా బాగా నటించారు. వైష్ణవ్ తేజ్ నటన బాగుంది. అతను ఎంచుకునే సినిమాలు కూడా కథా పరంగా మంచి సినిమాలు గానే ఉన్నాయి. కాస్త కథనం స్లో గా ఉన్నా, మొత్తానికి ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఎక్కువ. కుటుంబం అందరూ కలిసి చూడతగ్గ సినిమా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!