కొత్త ప్రపంచం వైపు

కొత్త ప్రపంచం వైపు

రచయిత:: శివానంద వింజమూరి

స్తబ్దుగా పడి ఉండి చలనం లేని నా మొద్దుబారిన
మనసును ఒక్క చూపుతో ఉర్రూతలూగించి….
కేవలం శూన్యం లో పయనించే
నా నిదుర కాలాన్ని సుందర దృశ్యాలతో అలంకరించి…
భావాలు భావుకత లంటే తెలీని నా మనసుకు
సరికొత్త లోకాలను చూపించి, విహరింప జేసి…
సాదాసీదాగా సాగిపోయే నా పయనంలో
వింతలు విడ్డూరాలు రంగులు హంగులు చేర్చి…
గాలివాటు గా సాగే నా గమ్యాన్ని మలయ
మారుతాలు వైపు మళ్లించి.. మధుర స్వప్నాలు పూయించి..
ఇహ పరమైన యోచనలే కాక
భావాతీత భావనలకు ఆజ్యం పోసి…
బహుదూరపు బాటసారిని బంధంలో బంధించి…
ఆనందపు లోతు లే కాక
దుఃఖపు ఛాయలను తట్టుకునే ఓదార్పు నిస్తూ..
నీ మెరుపుతో నక్షత్రాలను సైతం మరిపింప చేస్తూ
నవ్వులతో నా గాయాలన్నీ మాయం చేస్తూ
నా లోకాన్ని కొత్తగా చెక్కేసి….
అనుక్షణం నీ ఆరాధనలో వెలిగిపోతున్న నాకు
హృదయానందాన్ని కలిగిస్తూ …
ఎల్లప్పుడూ నీవు అనబడే ఒక భావం… ఒక ఉత్తేజిత కిరణం
నాయందు పయనిస్తూ నేను ఒంటరిని కాదని భరోసానిస్తూ..
నీ గూర్చి మెరిసిన అణువంత ఆధారమైన
అణు బాంబుల శక్తినిస్తుంది నాకు
ఈ నూతన అనుభవాల లోకాన్ని ప్రసాదించిన నీకు
నేనేమివ్వగలను…గుండెలనిండా నీ రూపం నిలుపుకోవడం తప్ప.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!