హృదయ వనం

హృదయ వనం

రచయిత:: శివానంద వింజమూరి

అనుకోకుండా ఆ ఉదయ సమయంలో ఆరుబయట పెరటిలో
నా కళ్ళని ఆకర్షించిందో తుమ్మెదల గుంపు…
పూల చెట్ల పై ప్రతి పుష్పాన్ని పలుకరిస్తూ, ఎగురుతూ, గెంతుతూ
ఆడుతూ తూగుతూ, వయ్యారాలు పోతూ తన రంగురంగుల రెక్కలను
ఆడిస్తూ ..ప్రకృతి అందాన్ని మరింత పెంచుతూ సాగిపోయేవి హాయిగా..
ఆ రమణీయ దృశ్యాలు తిలకించాలని నా మనసెంతో ఎదురు చూసేది.
ఈ వ్యాపకంతో హృదయం తన్మయత్వం చెంది పరవశంతో ఊగిపోయేది.
ఆకులు చిగురులు పూలు కొమ్మరెమ్మ లతో ప్రతి చెట్టు రెపరెపలాడుతూ
ఆ తుమ్మెదలను మరింత ఆకర్షించాలని..
ఋతువులతో సంబంధం లేకుండా పుష్పించే ఆ పుష్ప రాజాలను
వనమంతా గుప్పించా… నిర్విరామంగా నా ఆస్వాదన సాగాలని.
అప్పుడప్పుడు వచ్చే హోరుగాలులు, జోరు వానలు, వరద ముంపులు
నా తోటను ముంచేయడం తో నా తుమ్మెదల గుంపు జాడ లేకుండా పోయింది.
నా కమనీయ దృశ్యాల పరంపర రద్దయిపోయింది
కనులు ఎంతో నిరాశ చెందాయి… హృదయం ద్రవించింది …నిరుత్సాహం ఆవరించింది..
ఆ బాధతో మూసిన నా కను రెప్పలపై
ఆ గుంపుల పాత దృశ్యాలు స్వప్నాలై
హృదయంలో అమృతాన్ని పొంగించాయి….
మళ్లీ ఆ గుంపులు తరలి వస్తున్నట్లు అగుపిస్తున్నాయి.
ఇలానే,
నా నుండి తప్పిపోయిన నా చెలి అందించిన మధురస్మృతులు కూడా
ఆనందంలో నన్ను ముంచెత్తుతూ ఉంటాయి…
మరో జన్మ లోనైనా జతగా తను మరలి వస్తుందని నమ్మకం పుట్టిస్తాయి.
…. …

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!