కుక్కా – మజాకా

కుక్కా – మజాకా

ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు
శునకమునకు కనకమేలననా..
మొన్నేమో ఎదురింటి మంగళ గౌరీ గొలుసు
నిన్నేమో పక్కింటి పిన్ని గారి కాసులపేరు
ఈరోజేమో నా ఉంగరాలు, ముంజేతి కడియాలు
ఛీ పాడు లోకం కళ్లన్నీ ఎప్పుడూ పొరుగోళ్ళమీదే

ముందే ముద్దుగా అందంగా ఉంటాను
ఆపై స్వర్ణాభరణాల అలంకరణ
ఏమాటకామాటే 
మీకంటే నాకే బాగున్నాయి కదా
నా పిచ్చి గానీ మీరెప్పుడు నిజాలొప్పుకున్నారని

ఏంటి మీ లుక్కులో ఏదో తేడా కొడుతుంది
ఓ ముక్కేసి బంగారం నొక్కేద్దాం అనుకుంటున్నారా
ముందుకొచ్చారంటే పిక్కలెక్కలాగి తిక్క కుదురుస్తా
తరువాత బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ల లెక్కలేసుకుంటారు

నా అమాయకపు చూపులు చూసి
పెంపుడు కుక్క కదా పద్ధతిగా ఉంటుదనుకుంటున్నారేమో
నేను గ్రామ సింహాన్నన్న సంగతి మర్చిపోకండి
తెలుసుగా లోపల ఒరిజినల్ ఊర మాసే
ఇంత చెప్పినా నా జోలికొస్తే మీ పని తుస్సే

ఏంటి గడ్డంమీద చేయుంచి ఆలోచిస్తున్నారు
మీరు పెంచుకుంటున్న పింకీని తెచ్చి
నన్ను ముగ్గులోకి దించాలనుకుంటున్నారా
నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు
ఈ భైరవుడి దగ్గర మీ పప్పులేం ఉడకవు

కావాలంటే ఒక ఆటోగ్రాఫ్….
అమ్మో వద్దులే ఉంగరం జారిపోయేలా ఉంది
ఈ సారికి సెల్ఫీతో సరిపెట్టుకొని 
వచ్చిన దారినే బుద్దిగా వెళ్లిపోండి

నేను వెంటనే వెళ్లి అమ్మను దిష్టి తీయమనాలి
ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో నా మీద.

రచయిత: భావన

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!