కుట్టు ఎవుసం(కవితా సమీక్ష)

కవితా సమీక్ష

కుట్టు ఎవుసం

—– లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్ ద్వితీయ సంవత్సరం

నా ఏడో ఏటా,
మా నాన్నకి మధుమేహం వచ్చి
మహా వృక్షం లాంటి నాన్న శరీరం తరుగుతున్నప్పుడు,
అమ్మ మా బతుకు మొక్కలను
తన భుజాల పెరట్లో పెంచుకోవడం మొదలెట్టింది.

మా బతుకు మొక్కలను పరమాన్నాలతో పండించడానికి,
అమ్మ కుట్టు మిషన్ తో దోస్తీ కట్టింది.

అప్పటి నుంచి
మా ఇంట్లో
అమ్మ నాన్నై బరువు మోయడం,
నాన్న అమ్మై ఇంటిని కాయడం,
మా ఇద్దరి జీవితాలు
కొత్త అవతారంతో వెలిగాయి..

అందరి బాధ్యతాయుత తల్లిలాగే
అమ్మకి కూడా సూర్యోదయం కంటే ముందే
కనురెప్పల తలుపులు తెరుచుకుంటాయి..

తలంటు స్నానం చేసుకొని
తులసమ్మని పూజించడం అమ్మ రోజు విధి.

దర్జీ అయిన అమ్మకి,
కత్తెర, సూది, దారం ,కొలతలు టేపు
దేహంలో అవయవాలు.
కుట్టు మిషనూ శరీరం..

నాట్లు వేసేటప్పుడు భూదేవిని
మొక్కుకునే హాలికునిలాగా,
పొద్దున్నే కుట్టు మిషన్ ఎక్కగానే,
“మాకు అన్నం పెట్టే తల్లి..
నీకు వందనాలు” అంటూ
కుట్టు మిషన్ ని ఆరాధ్యదైవంగా,
పంట పండించుకునే పైరులా భావిస్తుంటే,
అమ్మ నుంచి
“పని గౌరవం” మా గుండెల్లో మొలుస్తుంది.

డీజు ముక్కల సహాయం తీసుకోదసలు,
అమ్మకి తన కుడిచేతి బొటనవేలి గోరే,
తన మార్కర్…

ఉలి శిల్పి చేతిలో ఎలా ప్రేమతో ఒదిగి పోతుందో,
అమ్మ చేతిలో కత్తెర కూడా అంతే..
చేతి కత్తిర అమ్మకు గాజుబొమ్మ లాంటిది.
కింద పడిపోకుండా ఎంత జాగ్రత్త పడుతుందో..

ఎప్పుడూ మొండివైఖరిగా వ్యవహరించే
మా అన్నదమ్ముల్లాంటి సూది దారాలను చూసినా,
అమ్మకు విసుగసలు రాదు ఎందుకో..?
తనకు మేమంటే ఎంత లాలనో,
తన కుట్టు మిషనన్నా, సూది దారాలన్నా అంతే..
అమ్మ సహనం సూది దారాల గొడవ
సద్దుమణిగేలా చేసినప్పుడే
నాకు బోధపడుతుంది…

హెడ్ చక్రానికి, స్టాండ్ చక్రానికి
తాడు నాగలి తొడిగి,
దుస్తులను సాగుచేస్తూ
అమ్మ “కుట్టు ఎవుసం” చేస్తుంది..

కొలతల అంశం తీసుకోకుండా
ప్రేమతో సూదికి దారానికి స్నేహం కలిపి
యంత్రం కన్నా మిన్నగా ఆ కాళ్లు చేతులు,
క్షుణ్ణంగా ఆ చూపులు వేగంతో,
మోడల్ డ్రెస్సులను, జాకెట్లను కుట్టేసి
అందంగా ఒంటిని కప్పేస్తాయి.

పొద్దున్నుంచి సాయంత్రం వరకు
కూర్చొని పనిచేసే అమ్మని చూస్తే,
తపస్సులా అనిపిస్తుంది
అమ్మ పని తీరు..
రాత్రి పూటే,
అన్నం మెతుకులు, మంచినీళ్లు
అమ్మ ముఖాన్ని చూసేది..
పొద్దంతా బట్టలోళ్ళు అమ్మను
తినేస్తూ, తాగేస్తారు కదా..

శుభకార్యాలప్పుడు
బ్లౌజుల సదనానికి
రాత్రి ఆకాశంలో నుండి
రంగు రంగుల చంకీలు కోసుకొచ్చి,
లైటింగ్ అమర్చుతుంది.
అప్పుడప్పుడు అమ్మ వెంట
నేను,తమ్ముడు చంకీలను అమర్చే వాళ్ళం..
ఎప్పుడూ
అది మా జీవితాలలో
మిగిలిపోయే ఆత్మీయ అనుభూతి..

ఎండాకాలంలో
విరగ కాసిన మామిడి పళ్ళలా
మా ఇళ్లు చెట్టు నిండా,
గదుల కొమ్మలకి,
బట్టల మామిడి పళ్ళు ఉంటుంటాయి..
మా జీవితాలు విరగపండి,
పువ్వులా విరబూసేది కూడా అప్పుడే మరి..

పండుగైన, పబ్బమైనా
పెళ్లిళ్లైనా, పేరంటాలైనా
ఊరంతా అమ్మ కుట్టిన హరివిల్లులు ధరించి,
మురిసిపోతుంది.
కానీ అమ్మకి,
మా బ్రతుకు మొక్కల బాధ్యత యాదొచ్చి
ముక్క చీరలను ముత్యాలుగా చే(చూ)సుకుంటుంది..

మేము ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని,
నలుగురిలో గొప్పగా నవ్వుతూ ఉండాలని,
వాళ్లని వీళ్ళని చూసి,
వాళ్లు వీళ్లు చెప్పింది ఆలకించి,
అమ్మ తన కుట్టు ఎవుసాన్ని,
రాత్రి కూడా పండించడం మొదలెట్టింది.
అప్పుడు నాకు పదేళ్లు..
ఒకో రాత్రి అలసటొస్తే,
కుట్టు మిషనే అమ్మ నిద్రించే
నవ్వారు మంచం అవుతుంటుంది..

కొన్ని కళ్లకు అమ్మ కాయకష్టం,
అత్యాశ లాగా అర్థమవుతుంది కానీ,
ఆ అత్యాశ లో ఎంత గొప్ప బాధ్యత దాగుందో
అది మా ముగ్గురికే ఎరుక..

నిన్నటి వరకు అమ్మ మాకోసం “కేవలం దర్జీ”,
ఈరోజు,
టైలరింగ్ మాస్టర్ అయ్యింది.

మాకు
అమ్మ, అమ్మ మాత్రమే కాదు
బాధ్యతలు చూసే
నాన్న కూడా..

•••

నా సమీక్ష:——

మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అంటారు. అలానే సాహితీ పుడమిలో రత్నం వంటి వాడు లిఖిత్ కుమార్ గోదా.తన రచనల్లో లోతైన భావుకత నిండి పసిమి వయసులో భావాల ఝరులను పొంగించగల సమర్థుడు. పాఠకుల హృదయాలను రంజింపజేయగల రచనలు చేయడంలో దిట్ట.ఏ విధంగానైతే సానబెట్టే కొద్దీ వజ్రం విలువ తెలుస్తుందో అదే విధంగా తన కలాన్ని పదునుబెట్టి మనసును సానబెడితే మరిన్ని మంచి రచనలు చేయగలరు.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రభంజనం ఈ యువ కెరటం.
కుట్టు ఎవుసం అంటూ తన రచనా పటిమను చాటుకున్న లిఖిత్ తన కవితలో వాడిన పదాలు కాని వాక్యాలు కానీ ఊహకే అందనివి. అంత పసి వయసులో లోతైన అర్థాలు, పదాల అల్లిక,వాక్యాల కూర్పు శ్లాఘనీయం.
తండ్రిని మహా వృక్షంతో పోల్చడంతో పాటు మా బ్రతుకు మొక్కలను తన భుజాల పెరట్లో పెంచడం అనే వాక్యం అద్భుతం గా ఉంది.
అంటే తన భుజ స్కంధాల మీద పిల్లల భవితవ్యం ఎత్తుకుంది అని విలక్షణమైన రీతిలో చెప్పడం తనకే చెల్లింది.
బతుకు మొక్కలను పరమాన్నాలతో పండించడానికి అంటే మనం తినే తిండే పంచభక్ష్య పరమాన్నం అనే అర్థం వచ్చే రీతిలో వాడటం అద్భుతం.

దర్జీ పనిని వ్యవసాయంతో పోలుస్తూ చక్కని వర్ణన చేశారు. ఇంటిని చెట్టుగా, గదులను కొమ్మలుగా , బట్టలను మామిడి పండ్లు అంటూ పోలిక పెట్టడం అంటే రచయితకి మొక్కలతో అనుబంధం గురించి తెలుసుకునే అవకాశం లభించింది మాకు అనిపించింది.మొక్కలతో అనుబంధం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది.ఒక ఆత్మీయ స్పర్శ.అలౌకిక ఆనందం కదా.
అందరికీ అమ్మే కానీ తను బాధ్యతలు మోస్తూ నాన్న కూడా అయింది అని ఎంతో హృద్యంగా చిత్రాన్ని దృశ్యరూపకంగా చిత్రించడంలో రచయిత విజయం సాధించారు.
నేను కూడా సాహితీ సేద్యంలో కలం హాలికురాలినై అక్షర విత్తులు నాటుతూ కవన పంటలు పండిస్తున్న “క”ష్టజీ”వి”ని అని తెలుపుతూ ముగిస్తున్నాను.

మీ
తేజస్విని బలివాడ
సమీక్షకురాలు ,
మహిళా పాత్రికేయురాలు

You May Also Like

One thought on “కుట్టు ఎవుసం(కవితా సమీక్ష)

  1. నండూరి నారాయణ రావు. సామాజిక కార్యకర్త. తెనాలి says:

    చిరంజీవి లిఖిత్ ఈ వయసులో కూడా చాలా అనుభవం వున్న రచయిత లాగా అక్షర సేద్యం చేసారు. అమ్మ నాన్నల శ్రమను గుర్తించి అమ్మ కు సహాయం చేయడానికి ఉపక్రమించారు. అభినందనలు మరియు శుభాకాంక్షలు.
    మంచి భవిష్యత్తు వుంది. ఇలాంటి వారిని పరిచయం చేసినందుకు పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!