గురుదక్షిణ

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

గురుదక్షిణ

రచన: సావిత్రి కోవూరు 

“ఏరా అఖిల్ రేపు మన ట్యూషన్ టీచర్ పెండ్లి కదా వెళుతున్నావా” అన్నాడు పదో క్లాస్ చదువుతున్న వినోద్.

“ఆ వెళ్తాను మా ఇంట్లో అందరం వెళ్తున్నాం. నువ్వు రావా” అన్నాడు అఖిల్.

“నేను రాను రా” అన్నాడు వినోద్.

“టీచర్ మన అందర్నీ రమ్మన్నారు కదా”

“కానీ నాకు ఆ పెళ్ళికొడుకు నచ్చలేదు.  మన రవి అన్నయ్య అయితేనే మన టీచర్కు బాగుంటాడు. రవి అన్నయ్య ఎన్నో రోజుల నుండి మన  టీచర్ను చేసుకోవాలని అనుకుంటున్నాడు. పైగా టీచర్కు బావ కూడా. కానీ ఏదో విషయంలో టీచర్ వాళ్ళ నాన్నకు, రవి అన్నయ్య పెద్దవాళ్లకు గొడవలు వచ్చి, ఇప్పుడు టీచర్ వాళ్ళ నాన్న అంటే మోహన్ రావు అంకుల్ వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారట. మన టీచర్కీ, టీచర్ వాళ్ళ అమ్మగారికి కూడ ఇష్టం లేదట. టీచర్ వాళ్ళ అమ్మగారు మా అమ్మతో బాధపడుతూ చెప్పారట” అన్నాడు వినోద్.

“అవునా, నాకు తెలియదు” అన్నాడు.

“పాపం మన టీచర్ వాళ్ళ నాన్నకు ఎదురు చెప్పలేక ఒప్పుకుందట. సరేలే మనమేం చేయగలం. అయినా మన టీచర్ చెప్పారు రమ్మనందుకైన వెళ్ళాలిరా. నీవు మీ అమ్మ వాళ్ళతో కలిసి వచ్చేయి రా.” అన్నాడు అఖిల్.

మరుసటి రోజు అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ, వినోద్ వాళ్ళ ఫ్యామిలీ పెండ్లి టైమ్ కంటే చాలా ముందుగానే వెళ్లారు హాలుకు. అప్పటికీ ఇంకా చుట్టాలంతా రాలేదు. అఖిల్, వినోద్ హాలులో తిరుగుతుండగా, ఎవరో పిల్లవాడు వచ్చి “ఆ అన్నయ్య నిన్ను, నీ ఫ్రెండ్ వినోద్ ను రమ్మంటున్నాడు” అని చెప్పాడు.

వీళ్ళిద్దరూ బయటకు వచ్చి చూసేసరికి, రవి దూరంగా నిలబడి ఉన్నాడు. ఇద్దరు మిత్రులు అతని దగ్గరికి వెళ్లి “ఏంటి అన్నయ్య నీవు మా టీచర్ ని పెళ్లి చేసుకుంటావని  అనుకున్నాము. నీవు ఎందుకు చేసుకోవట్లేదు. మాకు ఆ పెళ్ళికొడుకు నచ్చలేదు. మా టీచరు కూడా రోజు ఏడుస్తోంది. కానీ వాళ్ల వినటంలేదు. వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మ  కూడా పోట్లాడుతుందట. టీచర్ కి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని” అన్నారు.

“అయితే మీ టీచర్ ను నేను చేసుకోవడమే మీకు ఇష్టమైతే మీరు నేను చెప్పినట్టు చేయండి” అన్నాడు రవి.

“సరే చెప్పండి అన్నయ్య మీరు టీచర్ ను పెళ్ళి చేసుకుంటారంటే ఏం చేయమన్నా చేస్తాం” అన్నారు వినోద్, అఖిల్.

రవి వాళ్ళకు రహస్యంగా ఏదో చెప్పి పంపించాడు. వాళ్ళు వెళ్లి వాళ్ల టీచర్కి రవి చెప్పిన మాటలు చెప్పారు. అదంతా చూస్తున్నా వాళ్ళ అమ్మగారు కూడా కళ్లతోనే ఏదో జరుగుతుందని తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి హడావుడి మొదలయ్యింది అప్పటివరకు బాధతో ఉన్న టీచర్ ధైర్యంగా మంటపంలోకి వచ్చింది. పెండ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అఖిల్ వాళ్ళ అమ్మతోను, వినోద్ వాళ్ళ అమ్మతోను కొంచెం పెద్దగానే “మా టీచర్ కు ఇదివరకే రవి అనే ఆయనతో  గుడిలో పెళ్లి జరిగిందమ్మా.  కానీ వాళ్ళ నాన్నకు ఆ పెళ్లి కొడుకు ఇష్టంలేక మళ్లీ ఇంకెవరితోనో చేస్తున్నాడు” అన్నారు.

“వెధవ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీ వల్ల పెండ్లి ఆగిపోతుంది” అన్నది అఖిల్ వాళ్ళ అమ్మ. అదేవిధంగా వినోద్ వాళ్ళ అమ్మ కూడ వినోద్ ను తిట్టింది.

ఆమె పక్కనే కూర్చున్న పెళ్లికి వచ్చినావిడ ఎవరో “ఏంటి అక్క మీ వాడు ఏదో అంటున్నాడు. వెనక కూర్చున్న వాళ్లంతా విని గుసగుసలు మాట్లాడుకుంటున్నారు” అన్నది.

పక్కన కూర్చున్న వినోద్ వాళ్ళ అమ్మ “ఏం లేదు ఈ వెధవ ఏదో అంటున్నాడు. పెండ్లి కూతురుకు ఇదివరకే వాళ్ల బావ తో గుడిలో పెళ్లి అయిందట. వాళ్ళ నాన్నకు ఆ అబ్బాయి ఇష్టం లేకపోవడం వల్ల వేరే సంబంధం చూసి పెళ్ళి చేస్తున్నాడట. ఏదో వాగుతున్నాడు. తెలిసి తెలియని వెధవ” అన్నది

వినోద్ వాళ్ళమ్మ మాటలు పెండ్లికొడుకు తరుపు వాళ్ళ చెవిలో కూడా పడ్డాయి. ఆ మాటలు అలా అలా ఒకరి తర్వాత ఒకరు అందరికీ తెలిసిపోయింది.

వాళ్ల తారపు అతను ఒకతను వచ్చి అఖిల్ ను ఒక గదిలోకి తీసుకెళ్ళి “నిజం చెప్పు నువ్వు చెప్పింది నిజమేనా” అన్నాడు.

“ఏమో నాకు తెలీదు ఎవరో అంటుంటే విన్నది మా అమ్మతో చెప్పాను” అన్నాడు.

అపుడే పెళ్లి కొడుకుకు ఒక కాల్ వచ్చింది. “మీరు చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది. వాళ్ళ బావతో గుడిలో, వాళ్ల కుటుంబాల గొడవలతో విడిపోయారు. నీకు చెప్పకుండా పెళ్లి అయిన అమ్మాయిని అంటగడుతున్నారు వాళ్ళ నాన్న . తర్వాత ఆ అబ్బాయి మీపైన కేసు పెట్టొచ్చు చూసుకోండి” అని చెప్పి కాల్ కట్ చేశారు.

అప్పటికే చుట్టాల ద్వారా విన్న మాటలను ఏవో పుకార్లు అనుకున్న వరుడు, ఫోన్ చేసిన వ్యక్తి కూడా అవే మాటలు చెప్పే సరికి, పెళ్లికూతురు తల్లితో “మీ అమ్మాయికి ఇదివరకే పెళ్లి అయిందట కదా. మమ్మల్ని మోసం చేసి మళ్ళీ మీ అమ్మాయిని మాకు అంటగట్టి, మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పాలను కుంటున్నారా” అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. ఆమె దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడింది.

“ఏదో మంచి మర్యాద గల సంబంధమని వచ్చాం. కానీ మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు. పెళ్లి అయిన అమ్మాయిని మావాడు చేసుకోవాల్సినంత కర్మ మాకేం పట్టలేదు. మీ పిల్లా వద్దు, మీ సంబంధం వద్దు” అని పెళ్లి వారంతా గబగబా అన్ని సర్దుకుని బయల్దేరారు.

పెళ్లి కూతురు నాన్న మోహన్రావు వాళ్ళ దగ్గరికెళ్లి “మీరు ఆ మాటలు నమ్మకండి. ఎవరో పుట్టించిన పుకార్లు అవి. అవి నమ్మి మా అమ్మాయికి అన్యాయం చేయకండి” అని బ్రతిమిలాడిన ఆగలేదు. ఆ కోపంలో ఇరువైపుల వాళ్ళు హద్దు మీరి మాటలనుకున్నారు.

అప్పుడు మోహన్రావు “మీరు చేసుకోనంత మాత్రాన నా కూతురికి పెళ్లి కాదు అనుకుంటున్నారా? దాన్ని కోరి చేసుకునే నా మేనల్లుడుకే ఇచ్చి ఘనంగా, ఈ ముహూర్తానికే పెళ్లి చేస్తాను. ఏదో చిన్న గొడవలు వచ్చి మీ సంబధానికి వచ్చాము. మీలాంటి చిన్న పిల్లలు చెప్పిన పుకార్లు నమ్మే మూర్ఖుల సంబంధం మాకేం వద్దు. ఇప్పుడు మీరు చేసుకుంటామన్న నేను ఇవ్వను.మీలాంటి వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి చేస్తే జీవితమంతా బాధపడేది. ఇంకా నయం ముందే తెలిసింది  మీరెలాంటి వాళ్ళో. ఇంత చిన్న విషయానికి అది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఏదో పిల్లలు చెప్పిన మాటలే మీరు నమ్మి నా కూతురును వద్దు అనుకుంటున్నారు. మీలాంటి సంబంధం తప్పి పోవడమే నా కూతురు అదృష్టం” అని వెంటనే మేనల్లుడికి ఫోన్ చేశాడు

“రవి, అమ్మను, నాన్నను, మన బంధువులందరిని తీసుకొని హాల్ దగ్గరకు తొందరగా వచ్చేయ్. నీకు నిత్యని ఇచ్చి ఇప్పుడే పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆలస్యం చేయకు. ముహూర్తం దాటిపోతుంది” అన్నారు.

“అదేంటి మామయ్యా, మొదట మీరే కదా ఇవ్వనన్నారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వస్తారో రారో” అన్నాడు రవి.
“ఒకసారి అమ్మకి ఫోను ఇయ్య. నేనే మాట్లాడతాను” అన్నాడు మోహన్ రావు.

“సరే మావయ్య. అమ్మ, నాన్న ఇక్కడే ఉన్నారు. మీరే చెప్పండి” అన్నాడు.

“హలో బావగారు, అక్కయ్య నన్ను క్షమించండి. పిల్లల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా చిన్న మనస్పర్ధలు వచ్చి మీ సంబంధం వద్దని వెడితే బాగానే బుద్ధి వచ్చింది. నన్ను క్షమించి వెంటనే అందరు వచ్చేయండి. రవికి నిత్యనిచ్చి పెళ్లి చేస్తాను” అన్నాడు.

“నీవు చెప్తే కాదంటానా బావా, మాకు కూడా నిత్య అంటే చాలా ఇష్టం. ఇదిగో ఇక్కడ గేటు దగ్గర ఉన్నాము. నీవు, మీ ఆవిడ వచ్చి మమ్మల్ని రవిని ఎదుర్కొని తీసుకెళ్ళు”అన్నాడు రవి వాళ్ళ నాన్న.

వాళ్ళందరినీ సంతోషంగా తీసుకుని హాల్లోకి వచ్చాడు మోహన్రావు ఈ తతంగమంతా నడిపించిన నిత్య శిష్యులు తము అనుకున్నట్టుగానే రవి అన్నయ్య తో తన టీచర్ పెండ్లి జరుగుతున్నం దుకు ఎంతో సంతోషించారు.

వెనక ఉండి తుంటరి ఆలోచనలతో వేరె సంబంధం చెడగొట్టి, తనే ఆమెను చేసుకుంటున్నందుకు రవి నిత్యను చూస్తూ “నేను సాధించాను చూడు” అన్నట్టు చూశాడు. ఆ చూపులకు నిత్య సంతోషంగా నవ్వింది.

తాను ఇప్పుడే ఫోన్ చేసి రెండు నిమిషాలు కూడ కాలేదు. ఇంత తొందరగా ఎట్లా వచ్చారు వీళ్ళు. ఏమన్నా దివ్యదృష్టి ఉందా. పెండ్లి ఆగిపోతుందని ఎలా తెలిసింది. అదే అడుగుదామనుకునే లోపలే

పురోహితుడు “పెళ్లి కొడుకుని తీసుకుని మోహన్ రావు గారు మంటపానికి తొందరగా రండి ముహూర్తం టైమ్ అవుతోంది” అనేసరికి గబగబా మంటపం వైపు వెళ్ళాడు. పెళ్లి అంత జరిగిన తర్వాత రవి, అఖిల్ వినోధులకు థాంక్స్ చెప్తుంటే వాళ్లు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు. రవి అన్నయ్య చెప్పిన తుంటరి ఆలోచనలకు కార్యరూపంతో, తాము ఆ మాటలు మంటపంలో చెప్పినంత మాత్రాన, ఇంత తొందరగా ఆ పెళ్లి ఆగిపోయి టీచర్ కోరుకున్నట్టుగా పెళ్లి జరుగుతుందని ఊహించని వినోద్, అఖిల్ తమ టీచర్ కు గురుదక్షిణ ఇచ్చినంత సంతోషించారు.

( పై కథ నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను )

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!