రేడియో జాకి (R.J)రాజేష్ గారితో ముఖా ముఖి

రేడియో జాకి (R.J) .రాజేష్ గారితో ముఖా ముఖి

 రచన:శివరంజని


సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అమ్మ నేర్పిన మంచి, నాన్న నేర్పిన సమాజ విలువలతో, తన ప్రయాణంలో ఎదురైన అడ్డంకులను ధైర్యం ఎదుర్కుంటూ, వివేకానందుడి స్పూర్తితో ఎదుగుతూ, తనకు చేతనైనంత ఇతరులకు సహాయ పడుతూ, థియేటర్ ఆర్టిస్ట్ గా, మూవీ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటూ, అనూహ్యంగా రేడియో జాకిగా మారి, ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన రేడియో జాకి (R.J) రాజేష్ గారితో ముఖాముఖి.. ఈ వారం మన తపస్వి మనోహరం ఆన్లైన్ పత్రికలో మీ కోసం… 

ప్రశ్న:: మీ ఊరు, తల్లిదండ్రులు, మీపై వారి  ప్రభావం గురించి చెప్తారా?

జవాబు:: అమ్మ పేరు కైలాస సావిత్రి, నాన్న  ఈశ్వర్ లింగం. మెదక్ డిస్ట్రిక్ట్ పాపన్నపేట సంస్థానం నా స్వస్థలం. తెలుగు యూనివర్సిటీలో  థియేటర్ ఆర్ట్స్ లో ఎం.ఏ చేసాను.  రిమోట్ తో టివిని మాత్రమే మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చని అనుకునేవాణ్ణి, కాని నిర్థిష్టమైన జీవన విధానంలో ఉండేవారు మనిషిని కూడా కంట్రోల్ లో పెట్టుకోగలరని అమ్మను చూస్తే అనిపిస్తుంది. ఎంత ఆధునిక జీవితంలోకి వెళుతున్నా, అమ్మ చిన్నప్పుడు చెప్పిన మంచి విషయాలను అతిక్రమించను. మంచి అనే లైన్ ఎప్పుడూ దాటను. ఇక నాన్న నుంచి నేర్చుకున్నది రెండు అంశాలు మొదటిది సమాజంలో మన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, రెండవది ఇతరులకు హాని చేయకూడదు.

ప్రశ్న:: మీరు రేడియో రంగంలోకి ఎలా వచ్చారు?

జవాబు:: లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎటు టర్న్ అవుతుందో చెప్పలేం,చిన్నప్పటి నుండి నా ఆలోచన ఎప్పుడు డిఫరెంట్ గా ఉండేది. స్కూల్ లో కూడా అందరు ఒకలా ఆలోచిస్తే నేను ఒకలా ఆలోచించేవాణ్ణి, నేను టీచర్స్ కి కూడ అర్థం అయ్యేవాడిని కాదు ఒక్క తెలుగు మాస్టార్ శర్మగారికి తప్ప. ఆయన మా సిస్టర్ తో అనేవారు వాడి ఆలోచనలు వేరమ్మ,  ఇప్పుడప్పుడే వాడు మనకు అర్థం కాడు అని, అన్నట్టే నాకు 23 సంవత్సరాలు వస్తే గాని మా అమ్మానాన్నలకు అర్థం కాలేదు. అర్థం అయ్యాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నాకు చిరంజీవి గారి పాటలు ఇష్టం. నేను ఇంట్లో అవే వినేవాడిని. మా అక్కకు రేడియో ఇష్టం, రేడియో వినేది అక్కడ గొడవ మొదలయ్యేది. అక్క పెద్దది కాబట్టి అక్క మాటే నెగ్గేది. పైగా లాజిక్ గా మాట్లాడేది, నీ పాటలు ఎప్పుడైనా వినొచ్చు అని., రేడియోలో పాటలు కాసేపటి తరువాత రావు అని బాగా కోపం వచ్చేది కానీ నా మాట నెగ్గడానికి అవకాశమే లేదు అక్కడ. ఇక నాన్న రేడియో మెకానిక్, అప్పటికి TV యుగం పుంజుకుంది. అక్క అప్డేట్ అవ్వచ్చు కద అనుకున్నాను.  కాని ఇప్పుడే అర్థమవుతుంది. రేడియో ఎప్పటికి ఎవర్ గ్రీన్ అని, కానీ ఇప్పుడు అక్క రేడియో మర్చిపోయింది. నేను  రేడియోకి ఎడిక్ట్ అయ్యాను. శ్రోతగానే కాదు, జాకిగా కూడా.  నా రేడియో ఎంట్రి చాలా విచిత్రంగా జరిగింది. నేను తెలుగు యునివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు, మా సూపర్ సీనియర్స్ యువవాణి తెలుగులో చేసేవారు. అప్పుడప్పుడు వారితో  కలిసి రేడియో స్టేషన్ కి వచ్చేవాడిని. అక్కడ అంతా చాలా బాగా అనిపించింది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండే నిర్లక్ష్యం అక్కడ కనిపించలేదు. అంతా పరుగులు పెడుతూ పనిచేస్తుంటే, అరె ఈ సంస్థ బలే ఉందనిపించింది, పైగా ఆఫీస్ నీట్ గా ఉంది. అక్కడే మొదలైంది ఆలోచన, ఇక్కడ కొంతకాలం పనిచేసి లాంగ్వేజ్ గ్రిప్ సంపాదించాలని తరువాత సినిమా రంగం వైపు వెళితే బాగా ఉపయోగపడుతుందని అనిపించి, మా సీనియర్ ఒకాయనని  అడిగా.. అన్నా ఆడిషన్ పడినప్పుడు చెప్పమని. ఆయన ఆన్సర్ “ఏంటయ్యా, రేడియో అంటే ఏమనుకుంటున్నావ్, మాకే సరిగా డ్యూటీస్ లేవు” అన్నాడు. కొంచెం బాధ అనిపించింది కాని మనసులో కసి మాత్రం పెరిగింది. కొంత కాలానికి మెయిన్ స్టేషన్ అనౌన్సర్ అంబడిపూడి మురళికృష్టగారు నేను వేసిన నాటకం చూసి పరిచయం అయ్యారు. రేడియోలో అప్లై చేయమని సలహా ఇచ్చి ప్రోత్సహించారు. చాలా విషయాలు నేర్పారు. అలా యువవాణి తెలుగులో ఫస్ట్ అటెంప్ట్ లోనే సెలక్టయ్యాను. తరువాత రెయిన్ బో Fmకి సెలక్టయ్యాను. అలా 14 సంవత్సరాలుగా fmలో RJగా కొనసాగుతున్నాను.

ప్రశ్న:: మీకు బాగా నచ్చిన షో?

జవాబు:: Rainbow 70mm లొ చాలా కాలం చేశాను. సహజంగా సినిమా అంటే చాలా ఇష్టం కాబట్టి సినిమా సమాచారాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా సేకరించేవాణ్ణి. ఈ క్రమంలోనే చాలా మంది పాత తరం నటులు, సినీసాంకేతిక నిపుణుల గురించి చదివినప్పుడు చాలా అంశాలు నన్ను ప్రభావితం చేశాయి. కొందరు గాయకులు చనిపోయే రోజు వరకు పనిచేసి చనిపోయారు. నిజంగా వారు నేటి, ముందు తరాలకు కూడా ఆదర్శం. ఈ షోతో నాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు, చాలా ఎనర్ఙితో పని చేసేవాణ్ణి.  

ప్రశ్న:: మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు?
జవాబు:: ప్రభావితం చేసినవారు చాలా మంది ఉన్నారు. ఒక్కో రంగంలో ఒక్కొక్కరు. ఇంటర్ పూర్తయిన వెంటనే సరైన సపోర్ట్ లేదు, గాడ్ ఫాదర్ లేడు. కాని పోరాడాలి అనే నిర్ణయానికి మాత్రం వచ్చాను. అప్పుడు మొదలైన పోరాటం ఇంకా కొనసాగుతుంది. దానికి స్పూర్తి స్వామి వివేకానందగారు. ఆ స్పూర్తే థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేయించగలిగింది.

ప్రశ్న:: థియేటర్ ఆర్ట్స్ లో చేరాక స్పూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు?
జవాబు:: మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్  డా. P.V రమణ గారు. వారు P.V రంగారావుగారికి బెస్ట్ ఫ్రెండ్. చాలా సార్లు P.V నరసింహారావు గారు కూడా గురువు గారికి ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారితో పరిచయం  వల్ల మంచి విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది.తల్లావర్జుల సుందరంగారి గురించి కూడ చెప్పాలి. మొదట్లో అర్థం కాలేదు, తరువాత తెలిసింది చాలా మంచివారని. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు అడగకపోయిన సహాయం చేసేవారు. చాలా గొప్పగా అనిపించింది. అప్పుడప్పుడు వారి ఈ ఫార్ములాను ఫాలో అవుతాను. ఇంక నాటకానికి సంబంధించి, వారి బ్లాకింగ్ చాలా బాగుంటుంది. నటన నేర్చుకోవడంలో మాత్రం డా. కోట్ల హనుమంతరావు గారు కీలకం అని చెప్పాలి. వారి నాటకాల్లో చాలా వర్క్ చేశాను.  ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు గారు కూడా సపోర్టివ్ గా ఉండేవారు. యాక్టింగ్ కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళము. మంచి సలహాలు ఇచ్చేవారు. వారితో వర్క్ చాలా సింపుల్ గా ఉంటుంది, లైటర్ వే లో వర్క్ పూర్తి చేస్తారు. అలాగే దాసరి శివాజి రావు గారు,  యునివర్సిటీలో అధ్యాపకులు. ఒకసారి డైరెక్టర్ కృష్ణవంశీ గారు వచ్చినపుడు ఆడిషన్స్ లో అందరు పాల్గొన్నారు. నాకు ధైర్యం చాలలేదు. ఇంతమంది ఎక్స్పర్ట్స్ లో నేను ఎలా సెలక్ట్ అవుతాను అనుకున్నాను. కాని వారు నన్ను నెట్టేసారు, వెళ్ళు చెయ్యి అని. అంత ప్రోత్సాహం ఎవరిస్తారు. అదే ఫార్ములాను అనుసరించి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 మంది రేడియోలో చేరటానికి నావంతు సహాయం నేను చేశాను.  ఇక రేడియో రంగంలో కూడ చాలా మంది స్పూర్తిగా ఉన్నారు. నేను రేడియోలో చేరటానికి కారకులైన అనౌన్సర్ అంబడిపూడి మురళికృష్ణ గారు. వారి సలహా ప్రోత్సాహం మరిచిపోలేనిది.యువవాణిలో చేరిన మొదట్లో రేడియోకి సంబంధించి చాలా విషయాలు నేర్పడంతో పాటు, రేడియోకి సంబందించి డిసిప్లేన్ నేర్పిన చావలి దేవదాస్ గారిని మరచిపోలేం. అలాగే రేయిన్బో లో చేరాక వర్క్ ఎక్కువైనా, తేలికైంది అనిపించింది. దానికి కారణం మిస్టర్ కూల్ అని మేమందం అనుకునే రాంబాబు గారు అని చెప్పచ్చు. తనకు కావల్సింది ఏమిటో  చెప్పి చేయించుకునే వారు, ఇదేంటి అదేంటి అని అనేవారు కాదు, కూల్ గా చెప్పేవారు. ఉదయం నాలుగు గంటలకు ఫోన్ చేసినా ఫీల్ అయ్యేవారు కాదు. ఏ విషయం చెప్పిన కూల్ గా చెప్పేవారు, అలా చెబితే అద్భుతం చేయచ్చు అని అప్పుడే తెలిసింది., కాని అది అంత సులువైన పని కాదు. తరువాత వచ్చిన పెక్స్ ల దగ్గర కూడా ఒక్కో విషయం నేర్చుకున్నాను,
AL కుమార్ గారు వీరు కూడా చాలా కూల్ గా వర్క్ తీసుకుంటారు. తరువాత శ్రీనివాస్ రెడ్డి గారు, వీరి నుండి కొన్ని అంశాలు నేర్చుకున్నాను. తరువాత రమేష్ సుంకసారి గారు, చాలా విషయాల మీద అవగాహన ఉన్నవారు., కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మొండిపట్టు అవసరం అనే విషయంలో వీరు స్పూర్తి. మంచి పని చేసేటప్పుడు నేను మొండిగానే వ్యవహరిస్తాను. భయస్తులు చెప్పే మాటలు సరిగా వినిపించుకోను. చెడ్డ పని చేసేటప్పుడు భయపడాలి కాని మంచి పనికి ఎందుకు భయపడాలి. పైగా మంచి పని చేస్తే కష్టమైనది అయినా, నేచర్ కూడ సహకరిస్తుంది అని నా నమ్మకం.తరువాత సంపత్ నాయుడు గారు సినిమా మీద మంచి నాలెడ్ఙ్ ఉన్నవారు. చెప్పింది చెప్పినట్టు చేస్తే అలా వదిలేసేవారు. వర్క్ కూల్ గా ఉండేది. ఇప్పుడు కామేశ్వరి గారు, వీరితో కలిసి చాలా ప్రయోగాలు చేశాం, బాగా ఫ్రీడం ఇచ్చారు. ఇలా చాలా మంది వ్యక్తులు స్పూర్తినిచ్చిన వారు ఉన్నారు.
అందరిని ప్రస్తావించడం కష్టం. ఉపాధ్యాయుడు కూడ నిత్యవిద్యార్ది అని మా కాలేజిలో సంస్కృతం మాస్టారు రాఙేశ్వర్ శర్మ గారు చెప్పిన మాట నాకు ఎప్పుడు గుర్తొస్తుంది.

ప్రశ్న:: రేడియో జాకీ కాకపోయి ఉంటే, ఏం చేసేవారు?
జవాబు:: మనం ఏదో అనుకుంటాం కాని, అనుకున్న దానికంటే ముందు ఇంకేదో అవుతాం.M.Sc.బోటనీ పూర్తి చేసి లెక్చరర్ గా చేస్తు, సినిమాల వైపు ప్రయత్నం చేయాలనుకున్నాను. కాని విధి మాత్రం తీసుకొచ్చి తెలుగు యునివర్సిటిలో పడేసింది. అలా నాటక రంగంలో పది సంవత్సరాలు పనిచేస్తునే, రేడియోరంగంలో కూడ అనుభవం సంపాదించాను.
చిన్నప్పటి నుండి నేను అనుకున్నది మాత్రం నటుడవ్వాలనే, నటుడిని అవ్వడంతో పాటు ఇవన్ని దేవుడు అడిషనల్ గా ఇచ్చారు. ఇది నేను గ్రహించడానికి చాలా టైమ్ పట్టింది. ఇక డబ్బింగ్ రంగం వైపు ట్రై చేయడానికి మాత్రం కారణం RCM రాజు గారే. ఇందులో అనుకున్నంత వర్క్ చేయలేదు, కాని వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు నాకు డబ్బింగ్ రంగం కూడ హెల్ప్ చేసింది.

ప్రశ్న:: డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అయ్యారు? ఇప్పటివరకు ఎన్ని చేసారు ?
జవాబు:: అవసరమే అన్ని నేర్పిస్తుంది అన్నట్టు, కొన్ని పనులు అవసరం కోసం చేయాల్సివస్తుంది. అవి నేర్చుకోవాల్సి వస్తుంది. RCM రాజు గారికి, నాకు ఉన్న పరిచయంతో వారి సలహాతో సినిమా డబ్బింగ్ ఆడిషన్ కి వెళ్ళాను, సెలక్ట్ అయ్యాను. కాని అనుకున్నన్ని వర్క్స్ చేయలేదు. కాని వేన్నీళ్లకు చన్నీళ్ళు తోడు అన్నట్టు హెల్ప్ అవుతుంది.
TV రంగంలో హరహర మహాదేవ సీరియల్ లో రుషికి కొన్ని ఎపిసోడ్స్ లో, రాక్షసునికి  అలాగే ETV 2లో వచ్చిన మాయాబజార్ లో కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. ఒక మూవిలో మెయిన్ విలన్ కు చెప్పాను. చిన్న చితకా కలిపి 100 మూవీస్ కి వర్క్ చేసి ఉంటాను. కాని అది నటనకి హెల్ప్ అవుతుందని మాత్రమే అందులో చేరాను.

ప్రశ్న:: మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్తారా?
జవాబు:: సేవా కార్యక్రమాల విషయానికి వస్తే, చాలా మంది సేవ చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్హత ఉండాలి అనుకుంటారు. అందుకే వారి గురించి వారు తప్ప మిగతా ఏం పట్టించుకోరు.నాకు పరిచయమున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెండ్యాల ప్రసాద్ గారు ఈ మధ్య అన్న మాట బాగా నవ్వు తెప్పించింది. తన గురించి తన ఫ్యామిలి గురించి మనిషే కాదు, కుక్క పిల్ల కూడ పట్టించుకుంటుంది. మనిషి విచక్షణ వున్నవాడు కాబట్టి గొప్పగా ఆలోచించాలి అనేది అతని ఆలోచన. మనం చేయగల్గినంత ఎంతో కొంత సేవ చేయాలి అనే ఆయన ఆలోచనతో నేను ఏకీభవిస్తాను. అందుకే ఇవన్ని చేస్తునే నా వంతు ప్రయత్నంగా, మా గ్రామంలో కొంత చైతన్యం తీసుకురాగలిగాను, నా శక్తి మేరకు నేను చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను.
మొదటి పనిగా, 17వ శతాబ్దంలో కట్టిన గ్రామద్వారంపై,15 సంవత్సరాల చెత్త పేరుకు పోయి, వర్షపు నీరు నిలిచి కూలాడానికి సిద్దంగా ఉంది. ఆ వీధిలోని వారికి అది కూలితే వచ్చే నష్టం, దాని ప్రాధాన్యత తెలిపి చైతన్య పరచడంతో తాత్కాలికంగ కాపాడగలిగాం. దాన్ని వాళ్ళే ప్రస్తుతం శుభ్రపరుస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు అక్కడ ఆగస్టు 15న పతాకావిష్కరణ, విజయ దశమి రోజు కాషాయ జెండా ఎగరవేస్తున్నారు. కొందరు నాయకులు కూడా వారికి సహకరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడంకోసం, విజయదశమి పురస్కారాలు తరువాత కూడా కొనసాగించాలని అనుకున్న అక్కడి ఉపాధ్యాయులు, కొందరు గ్రామ నాయకులు సహకరించకపోవడంతో పాటు అంతరాయం కలిగించడంతో తాత్కాలికంగా చేయడంలేదు, మళ్ళీ  ప్రయత్నించాల్సిందే.
    ఈ పరిణామాల మధ్య మరో బాధ్యత వచ్చి పడింది, గ్రామంలోని యువత  ప్రైం లొకేషన్ లో శివాజి విగ్రహం పెట్టాలనుకున్నారు, కాని ఎవరు సహకరించకపోవడంతో నన్ను సంప్రదించారు. ఆ స్థలం మా తమ్ముడిది. నేను అడగటంతో సరే అనడంతో పాటు,  ఉదార స్వభావంతో డబ్బులు తీసుకోకుండా వారికి డొనేట్ చేశాడు. ఆ పని పూర్తి కావడానికి మరికొంత శ్రమ పెట్టాల్సి ఉంది.
గ్రామ యువత వారి ప్రయత్నం వారు చేస్తున్నారు.  లాక్ డౌన్ సమయంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెని అధినేత నా మిత్రుడు ప్రవీణ్ మదిరె కొంత మంది పేదవారికి సరుకులు అందించాలని చెప్పడంతో, వారికి సజావుగా అందాలని దగ్గరుండి ఆ కార్యక్రమం పూర్తిచేయడానికి సహకారం అందించాను . ఆ కార్యక్రమం విజయవంతం చేశాను. సాగు నీటి కోసం ప్రభుత్వానికి లేఖ రాయడంతో, ప్రభుత్వం స్పందించడం వల్ల, మా గ్రామానికి  అదనంగా 5 నుండి 6 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రభుత్వం శ్రద్ద పెడితే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. వనరులు ఉన్నా పంటలు పండించకపోవడం కూడా దేశ ద్రోహమే. ఎందుకంటే  ఆహారం అందరి అవసరం.ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటివి.

ప్రశ్న:: రేడియో జాకీకి ఉండాల్సిన లక్షణాలు/నైపుణ్యాలు ఏమిటి?
జవాబు:: నటనలో మనం ఏ పని చేసినా 5విధాలుగా ఆలోచించాలి. ఇది యాక్టింగ్ కోర్సు నేర్పిన అంశం Who, What, why, when, where. కాని ప్రతి పనికి ఇది వర్తిస్తుంది అనిపిస్తుంది.
నేనెవరు, నాకేం కావాలి, ఎందుకు కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి… ఇదే ఆలోచన ప్రతి రంగంలో మనకు  సహకరిస్తుంది. RJ కి కూడ అంతే… ముఖ్యంగా ఆ పని మీద ఎంతో ఆసక్తి ఉండాలి. శ్రోతలతో  క్యాజువల్ టాక్ ఉన్నప్పుడే అది క్లిక్ అవుతుంది. ఒక షో చేస్తున్నప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తే షో బాగా వస్తుంది

ప్రశ్న:: మీరు పొందిన అవార్డులు?
జవాబు:: అవార్డు పొందటమంటే బాధ్యత పొందటం. అవార్డు పొందిన వ్యక్తి సమాజంలో బాధ్యతగా, తప్పులు చేయకుండా ఉండాలి అనేది నా ఫిలాసఫీ. తెలుగు యునివర్సిటిలో చేరాక నాటకాల్లో రాష్ట్రస్థాయి బహుమతులు కొన్ని వచ్చాయి. యువ కళా సమితి వారు కళారంగంలో సేవలకు గుర్తింపుగా ఒకసారి ఉగాది పురస్కారంతో సత్కరించారు. ఇంకా చిన్నా చితక బహుమతులు వచ్చాయి. కాలేజ్ డేస్ లో ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో చాలా బహుమతులు వచ్చాయి. సంగారెడ్డిలో జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ఒకసారి తృతియ బహుమతి వచ్చింది. అది నాలో రైటింగ్ స్కిల్స్ పెరగటానికి ఉత్సాహాన్నిచ్చింది. ఇంటర్ లో వచ్చిన బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ ఎప్పటికి మరచిపోలేను. అది రావడం వల్లే దాని విలువ కాపాడటానికి చిన్న తప్పు చేయాలంటే మనసు ఒప్పేది కాదు, జాగ్రత్తగా ఉండేవాణ్ణి. ఆ చిన్న కప్ నన్ను కాపాడిందని చెప్పొచ్చు.
 నేను చేసే ఏ పనైనా the best ఉండాలని ప్రయత్నం చేస్తాను. దానికి కొన్ని సార్లు ఫేట్ సహకరించినప్పుడు సక్సెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.  మహా న్యూస్,TV9 లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పని చేశాను. అక్కడ ఆడిషన్ కు వెళ్ళినప్పుడు చూశాను, చాలా మంది గుంటూర్, విజయవాడ వారిని కాదని, నాకు ఆ అవకాశం ఇవ్వడం ఒక పెద్ద అవార్డే అనచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ప్రాంతం భాషనే అందరు ప్రామాణికంగా తీసుకునేవారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి వారితో పోటిపడటం ఒక గొప్ప అనుభవం. పైగా కొందరు గిట్టనివారు మహాన్యూస్ లో ఎన్నో సార్లు నాపై  కంప్లైంట్ ఇచ్చినా, ఆ యాజమాన్యం నన్ను వివరణ కూడా అడగపోవడం మరచిపోలేని ఙ్ఞాపకం.  పైగా CEO అనీల్ గారు నన్ను సరదాగా  అమవాస్య చంద్రుడు అనేవారట. ఎందుకంటే ఎప్పుడు నైట్ షిప్ట్ చేసేవాడిని. నా పని నేను చూసుకొనే వాడిని. మొదట్లో కొందరు కావాలని పని కట్టుకొని పెద్దాయన IVR దగ్గరికి వెళ్ళి రాజేష్ కి రేడియో ఫ్లో వస్తుందని కంప్లైట్ చేసేవారట. రేడియోలో పని చేసే వారికి రేడియో ఫ్లో నే కదా వచ్చేది. కాని పెద్దాయన చాలా లైట్ గా తీసుకొని కొద్ది రోజులు చూద్దాం, ఆయనకే అలవాటవుతుంది అన్నారట. ఎందుకంటే ఆయనకు రేడియో స్టాండర్డ్ తెలుసు కాబట్టి  ఏ ప్రయత్నం చేయకుండానే యాజమాన్యమే నన్ను ప్రొటెక్ట్ చేయడం ఒక పెద్ద అవార్డే.

ప్రశ్న:: కరోనా అనుభవాలు చెప్తారా? 
జవాబు:: కరోనా కష్టాలు పెద్దగా లేవని చెప్పాలి. దేవుడి దయ వలన లాక్ డౌన్ సజావుగానే జరిగింది. వర్క్ విషయంలో బయటకి రాక తప్పలేదు. మరోవిషయం మామూలు టైంలో చేయలేని కొన్ని పనులు ఈ టైంలో చేయగలిగాను. రేడియోకి ఎందుకు వెళ్ళడం A.C వుంటుంది కదా, తొందరగా స్ప్రెడ్ అవుతుందని కొందరు భయం చెప్పినా, ఆ టైంలో పనిచేయడం నా దేశానికి, ప్రజలకు సేవ చేయడంలా అనిపించింది. అందుకే ఖచ్చితంగా వెళ్ళి డ్యూటి చేసి, ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరించినట్టు అనిపించింది. ఏదేమైనా కొంచెం కష్టమనిపించిన లాక్ డౌన్, కరోనా మంచి పాఠాలు నేర్పాయి.

ప్రశ్న:: మీరు పాటిస్తున్న కోవిడ్ జాగ్రత్తలు ఏమిటి?
జవాబు:: మూడు ముఖ్యమైన అంశాలు మాత్రం పాటిస్తున్నాను. మాస్క్ దరించడం, సోషల్ డిస్టెన్స్, శానిటైజషన్. ఏ కొంచెం ఇబ్బంది అనిపించినా వేడి నీళ్ళు తాగుతున్నాను, ఇబ్బంది పోతుంది. మొదట్లో మోడి గారు చెప్పిన కషాయాలు చాలాసార్లు తాగాను. ఇప్పుడు వీలు పడటం లేదు, కాని మళ్ళి తాగలని ఉంది. భారతీయ వైద్య విధానం ఎంత సురక్షితమైందో ఇప్పుడు అర్థమైంది. కొన్ని విషయాల్లో ప్రధాని గారిని బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చు అనిపించింది. వారు చెప్పిన కషాయంలో ఉపయోగించే వస్తువులు చాలా సహజ సిద్దమైనవి. అవి ఒకసారి తీసుకున్నా చాలా రోజుల వరకు పని చేస్తాయి.
సందర్భం కాకపోయినా…

భారతీయ వైద్య విధానం ఎంతగొప్పదో  మీతో రెండు అంశాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది.
1.చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు అడ్డు అదుపు లేకుండా రేగు పళ్లు తినేవాణ్ణి. అప్పటికే నాకు దగ్గు ఉండేది, అవి తినడంతో ఇంకా ఎక్కువైయ్యేది. ఎన్ని మందులు వేసుకున్న తగ్గేది కాదు. టెస్ట్లు చేయిస్తే నార్మల్ అని రిపోర్ట్స్ వచ్చేవి. నా బాధ చూసి మా అమ్మమ్మ గారి ఫ్రెండ్ భూమమ్మ గారు, ఆవిడ డాక్టర్ కాదు కాని చిన్న చిట్కా చెప్పింది… పొలాల్లో పెరిగే ముల్కపువ్వు ఉదయం ఏమి తినక ముందు తినమని. అంతే ఆశ్చర్యంగా మూడు రోజుల్లో దగ్గు మాయం.

2.అలాగే ఒకసారి నా కో R.J కి కంటి కింద కురుపు అయ్యి చాలా కాలం ట్రీట్ మెంట్ తీసుకున్నా తగ్గలేదు. చాలా బాధపడేది. ఒకరోజు నేను “చిన్న చిట్కా చెప్తా పాటిస్తారా కొంచెం మంట పుడుతుంది” అన్నాను. పర్వాలేదు అంది. “వెల్లుల్లి ముక్కను మట్టిలో రాసి, ఆ పేస్ట్ కురుపు పై పెట్టండి, నైట్ పడుకునేటప్పుడు” అన్నాను. అలా రెండు రోజుల్లో ఆ కంటి కురుపు పగిలి తను కొంచెం రిలాక్స్ అయింది. అదే భారతీయ ఆయుర్వేద సహజ వైద్యవిధానం గొప్పతనం. చాలా మంది కరోనా తగ్గడంలో నేచర్ సపోర్ట్ చేయడం లేదు అంటున్నారు. రోడ్లపై ఉన్న ఎందరో అనాథలకు రాని కోరోనా అన్ని జాగ్రత్తలు తీసుకునే వారికే ఎందుకు వస్తుంది. ఒక వేళ ఆ రోడ్లపై ఉండే వారికి వచ్చిన, వారికి తెలియకుండానే అదే తగ్గిపోతుంది. అది నేచర్ వారికి సపోర్ట్ చేయడం వల్లే అనిపిస్తుంది. నా మిత్రుడు సైంటిస్ట్ చెప్పినట్లు, ఒక సర్వే ప్రకారం… ముంబాయిలో ఒక ప్రాంతంలో కరోనా వ్యాపిస్తే జనం కుప్పలు కుప్పలుగా రాలిపోవాలి కాని అక్కడ వ్యాంపించినా జరిగిన నష్టం చాలా తక్కువ. వారిని కాపాడింది నేచరే. కడుపు నిండితే వేరే విషయం గురించి ఆలోచించని ఆ జనాన్ని నేచర్ సేవ్ చేసింది. కాని అవసరానికి మించి డబ్బులు వున్నా ఇంకా ఇంకా సంపాదిద్దాం అనే ఆలోచనతో ఇటు జనాన్ని, అటు నేచర్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని మాత్రం ,నేచర్ భయపెట్టిస్తు ఫుడ్ బాల్ ఆడుతుంది. నేచర్ని మనం పెడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. నేచర్ తనని తాను సరి చేసుకున్న వెంటనే ఇదంతా సర్దుకుంటుంది,అని నా అభిప్రాయం.

           that’s is why i request you all 
           please respect nature.

ప్రశ్న:: మీరు సాధించాలనుకునేవి ఏమిటి?
జవాబు:: వాస్తవానికి నేనొకటి అనుకున్నాను, కాని అనుకోనివి జరుగుతున్నాయి.  కాని అన్ని మంచి అనుభవాలే, రేడియో వైపు ,డబ్బింగ్ వైపు వస్తానని అనుకోలేదు. కాని ఈ రెండు రంగాలలో అనుకోకుండానే చేరాను. రెండు రంగాలలోను మంచి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. కాని రేడియో, నాటకం మాత్రం బాగా తృప్తినిచ్చాయి. నాటక రంగాన్ని మాత్రం మరచిపోలేను. దాదాపు 50 నుండి 60 నాటకాల్లో మంచి పాత్రల్లో నటించాను. సినిమా రంగంలో మంచి పాత్రల్లో నటించాలనేదే నా బలమైన కోరిక. తరువాత వివేకానందులవారు చెప్పినట్టు ప్రతి మనిషి ఒక అద్భుతం చేయడానికే వచ్చారు, అనేది నమ్ముతాను. అందుకే ఏదో ఒక అద్భుతం చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అక్కడ కొంచెం అయినా గుర్తింపు సంపాదించాను. సినిమా రంగం అంటే నాకు చాలా ఇష్టం. కానీ అక్కడ గారడి అర్థం కావడం కష్టంగా ఉంది. ఎప్పటికైనా ఆ గారడి చేధించాలి.
ఇంటర్ అయిపోగానే నాకు ఎదురైన రెండు ప్రశ్నలు

  1. ఏ కష్టం లేకుండా ఒకరు చెప్పింది వింటూ అందరిలో ఒకరిగా బతకటం.

       2.నాకు ఇష్టమైన రంగంలో కష్టమైనా సరే పోరాడి సాధించడం.

  రిస్క్ అయినప్పటికి నేను రెండవ మార్గాన్నే ఎన్నుకున్నాను. ఊహించిన దాని కన్న ఎక్కువే రిస్క్ లు ఫేస్ చేశాను. నేను అనుకున్నవన్ని సాధించిన రోజు ఇవన్ని బహుశా అంతగా గుర్తు రావేమో. వెండితెరపై నేను అనుకున్న ప్రయోగాలు చేసిన రోజు నా ఆనందానికి అవధులు ఉండవేమో.

ప్రశ్న:: మీ అభిరుచులు చెప్పండి?
జవాబు:: ప్రపంచం అంతా టీవి లో క్రికెట్ చూస్తున్న, నాకు మాత్రం సినిమానే చూడాలనిపిస్తుంది. సినిమా అంటే అంత ఇష్టం. తరువాత నాకిష్టమైన ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడటం, పాటలు వినడం ఇంకా మూడ్ బాగుంటే బుక్స్ చదవడం  చిన్నపిల్లలతో ఆడటం చాలా ఇష్టం.

ప్రశ్న:: యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జవాబు:: ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పూరి గారు చెప్పిందే… నిన్ను మించిన తోపు ఎవరు లేరు, నువ్వు రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్ లన్ని రీచ్ అవ్వు. ఏది వదలద్దు. సినిమా షూట్ లో మూవింగ్ లైట్ అందరి పైనా పడుతుంది. అది మన పై పడేవరకు వేచి చూడాల్సిందే. తొందరపడి పక్కకు జరిగితే ఒక అద్భుత అవకాశం మిస్సవుతాం. ఆ అద్భుతం మిస్ అవకూడదు.

You May Also Like

12 thoughts on “రేడియో జాకి (R.J)రాజేష్ గారితో ముఖా ముఖి

  1. చాలా inspiration కలిగించే ఇంటర్వ్యు ….చాలా చాలా నచ్చింది….

  2. ఆర్ జే రాజేశ్ ముఖాముఖి ప్రచురించినందుకు మనోహరం టీం కు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!