(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
లేలేత పూలు
రచయిత :: మంగు కృష్ణకుమారి
‘నాకు లెక్కలు రావు మొర్రో’ అన్న కొడుకు మాటలు తోసేసి ‘ఎమ్.పి.సి’ లోనే జాయిన్ చేసేడు ఓ తండ్రి
ఫలితం, ఇంటర్ పూర్తి చేయలేక ‘డింకీల రాజు’ అన్న హేళనలు
తట్టుకోలేక ఉరితాడుకి దేహాన్ని ఇచ్చేసాడు! మళ్ళా వస్తాడా?
“అమ్మా, నాకు సంగీతం ప్రాణం అన్న కూతురిని ఉరిమి చూసి ‘అమెరికా సంబంధం కావాలంటే
వస్తుందా?’ అంటూ మూడు ముళ్ళు
వేయించేసింది ఓ తల్లి! ఏడాదిలో అల్లుడి ఆరోపణలు! ‘మీ పిల్లకి
కరుకూ లేదూ చురుకూ లేదు! మీరే తీసుకుపోండి, ప్రాణం ఉన్న బొమ్మతో కాపురం నా వల్ల కాదు’
అమ్మాయి అమెరికానించీ బయల్దేరినా ఇంటికి మాత్రం రాలేదు! ‘నా బతుకు నేను బతకగలను’ అన్న మెసేజే
తల్లికి చివరికి మిగిలింది!
పిల్లల భవిష్యత్తుకి ఆకాశానికి నిచ్చెనలు వేసే అమ్మానాన్నలు మరోలా ఉంటే ఈ లేలేత పూలు ఎంత బాగా పూసేవో!