మకరంద మయం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పిల్లి.హజరత్తయ్య
కర్తవ్యం అనే విత్తనాలను
వివేకం అనే నీటితో
తడిపి చల్లినట్లయితే
శరత్కాల పంటలా
సత్ఫలితాలను
సంపాదించి పెడుతుంది..!
కష్టాల కడలిని
సులభంగా దాటిస్తూ
చాపల్యాన్ని అరికడుతూ
ఆశాభావాన్ని రేకెత్తించి
భుజం తట్టి మరీ
కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది..!
కష్టతర కార్యమైననూ
బుద్ధి కుశలతతో
ముందుకు సాగిపోతూ
ఆపదలను దాటుకుని
నిర్విఘ్నంగా నెరవేరేలా
చక్కటి దారి చూపిస్తుంది..!
సాధారణ మనిషిని
అసాధారణమైన వ్యక్తిగా
మార్చడంలో సహకరిస్తూ
మాయా మర్మాలను
తనకు తాను తెలుసుకోవడంలో
బాగా ఉపకరిస్తుంది..!
పరిశీలనాత్మకతను పెంచి
భవిష్యత్తు బంగారుమయములా
అతిని మితం గావించి
వివేచనకు అంకురములా
జీవితాన్ని నడిపించే
వివేకమే మకరందమయం..!