మానవత చచ్చిపోయింది

మానవత చచ్చిపోయింది

రచయిత: గుడిపూడి రాధికారాణి

అవును..
నాలోని మానవత చచ్చిపోయింది

కనీవినీ ఎరుగని కష్టంలో
కడుపు కాలుతున్న అభాగ్యులని
మురికివాడల్లో మూలిగేవారిని
కార్మికులనాదుకునే ధార్మికుడినంటూ
గర్వపు మొలకొకటి మట్టిబుర్రలో మొలిచినప్పుడే..
నాలోని మానవత చచ్చిపోయింది

బీదలకివ్వడానికి బోలెడు బోలెడు
బియ్యం,కూరలు,సబ్బులు,సరుకులు
కొన్నాను.. మంచిదేకానీ
బీదాబిక్కీ బారులు తీరి
మండుటెండలో ఆశగా నిలబడినప్పుడు
కళ్ళు తిరుగుతున్న ముసలవ్వ
వణుకుతున్న చేతులు చాపినప్పుడు
టీవీవాళ్ళూ,ప్రెస్ వాళ్ళూ రావాలి ఆగమంటూ
ఆమెని విసుక్కున్నప్పుడే..
నాలోని మానవత చచ్చిపోయింది

తెల్లని దుస్తుల్లో శాంతికపోతంలా ఉన్నావని
ఫొటోలో బాగా పడతావని
అంతరాత్మ పడేస్తుంటే
తెలుపుకు నలుపు షూ సూటయ్యిందని
ఫుల్ ఫొటో ఫేస్బుక్లో అప్లోడ్ చెయ్యాలని
సరిగ్గా ఫొటోలు తియ్యమని
అక్కడి కుర్రాడికి ఫోనిచ్చాను కానీ
అతని కడుపులో పేగుల మూల్గులు
కళ్ళలోంచి వినిపిస్తుంటే
కళ్ళుండీ చూడలేకపోయినప్పుడు…
నాలోని మానవత చచ్చిపోయింది

పసందుగా ఉంది తినమంటూ
పులిహోరపొట్లాలు పంచి
ఆత్రంగా వాట్సాప్ స్టేటస్
అప్డేట్ చేసుకుంటున్నప్పుడు
పేవుమెంటే ఇల్లైన యాచకుడు
ఎంతో ప్రశాంతంగా
పక్కనున్న కుక్కకొక ముద్ద
పంచాకే తను తిన్నప్పుడు
మానవత్వం పరిమళించిన
మహద్భాగ్యుడు కోటీశ్వరుడు
నువ్వా అతగాడానని
అంతరాత్మ ఆగలేక ఆవేశంతో
అడిగినప్పుడే…
నాలోని మానవత చచ్చిపోయింది

పేరుకోసం ఆర్భాటమో
గొప్పకోసం ఆరాటమో
ఏదైతేనేం జరిగేది మంచిపనేగా..
నువ్వు మంచివాడివేలే
అని అంతరాత్మ జోలపాడుతూ
నవ్వినప్పుడే..
నాలోని మానవత చచ్చిపోయింది

కానీ ఆ క్షణం..
మానవత్వ మహనీయత
నిజమైన నిర్వచనం నిరూపితమైంది.

You May Also Like

2 thoughts on “మానవత చచ్చిపోయింది

  1. పుట్టినరోజు పేదలకు బట్టలిచ్చి పలానా వారి ధర్మం అని పెద్ద అక్షరాలతో ముద్రించికొన్నప్పుడే నాలోని మానవత్వం చచ్చిపోయి, కీర్తి కండూతి మొలకలెత్తింది.

  2. చాలా బాగా చెప్పారు… అక్షర సత్యం మీ అక్షరాలు 👌🏻👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!