తండ్రి మాట

తండ్రి మాట

రచయిత :: అలేఖ్య రవికాంతి

రాములు, సావిత్రమ్మ ఆదర్శ దంపతులు. రాములు ఓ రైతు బిడ్డ. తను చిన్నపటి నుంచి పొలం పనిచేసేవాడు.సావిత్రమ్మ గృహిణి.వీరికి చాలా కాలం నుంచి సంతానం కలగలేదు. ఎన్నో పూజలు నోములు చేసాక వారికి ఒక మగ సంతానం కలిగింది.
ఇక వారి ఆనందానికి అవధులు లేవు. ఆ బిడ్డ వారి జీవితంలోకి వసంతం తీసుకొచ్చాడు కాబట్టి ఆ బిడ్డకి వసంత్ అని పేరు పెట్టుకున్నారు.ఉన్న ఒక బిడ్డని మంచిగా చదివించి ఉన్నత స్థానాల్లో చూడాలనుకుని వారు మళ్లీ సంతానానికి ప్రయత్నించలేదు.

వసంత్ వాళ్ళ ఊరిలోనే ఇంటర్ వరకు చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నాడు.రాములు బంధువులంతా కొడుకు చదువు అయిపోయింది కదా! ఇంతకంటే ఏం చదువుతాడు, మన ఊరిలో ఇంటర్ చదవడమే గొప్ప పై చదువులకు ఇక పట్టణానికి పంపకుండా పొలం పనులకి పంపించు అని అన్నారు. కాని రాములుకి మాత్రం తన కొడుకుని బాగా చదివించి వాడు మంచి ఉద్యోగం చేస్తుంటే చూసి ఆనందించాలని కలలు కనేేవాడు.

అనుకున్నట్టే వసంత్ కిి ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది.ఇంజనీరింగ్ సీటు మంచి కాలేజీలో వచ్చింది.రాములు తన కొడుకుని వెంటనే హైదరాబాద్ కి తీసుకెళ్లి కాలేజీలో చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రమ్మకు బాధ వేసినా కొడుకు భవిష్యత్తు బాగుంటుందని గుండె దిటవు చేసుకుని సంతోషంగా పంపించింది.
కాలేజీలో జాయిన్ అయిన వసంత్ కి మొదట కొన్ని రోజులు భయమనిపించింది. తరువాత రోజులు గడిచేకొద్దీ స్నేహితులయ్యారు పట్నం అలవాట్లన్ని వంట పట్టసాగాయి .
వసంత్ తన క్లాస్ లోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమె వెనకాలే వెళ్లే వాడు ఆమె ఏం చేస్తున్నదో ప్రతీది గమనించేవాడు.ఆ అమ్మాయి అందానికి ఆకర్షితుడయ్యి చదువుని పూర్తిగా మరిచాడు. ఆ పిల్ల పై ఎంతో ప్రేమని పెంచుకున్నాడు.

ఒక రోజు అమ్మాయికి వెళ్లి తన ప్రేమ విషయం చెప్పాడు కానీ అమ్మాయి మాత్రం ససేమిరా వద్దు అని చెప్పేసిందిి. ఆ బాధని తట్టుకోలేక ఆ అమ్మాయిని మర్చిపోవడానికి చెడు అలవాట్లను అలవర్చుకున్నాడు.
తాగడం, ధూమపానం, జూదం, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ అన్ని చెడు అలవాట్లకు బానిసైయ్యాడు. ఇంటి వాళ్ళకి ఫోన్ చేయడం ఎప్పుడో మరిచాడు. రాములు వసంత్ కి ఎప్పుడు ఫోన్ చేసినా గాని ఏదో ఒక వంక చెప్పేసి ఫోన్ పెట్టేసేవాడు. రాములుకి కొడుకు ప్రవర్తనపై అనుమానం వచ్చింది ఒకసారి వెళ్లి చూద్దాం అని భార్యకి చెప్పి హైదరాబాద్ కి వెళ్ళాడు .

కాలేజీకి వెళ్తే వసంత్ కాలేజీకి రావట్లేదని. చాలా రోజుల నుంచి చెడు అలవాట్లకు బానిసైనాడని తెలుసుకొని చాలా ఏడ్చేశాడు రాములు. ఇక నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే కొడుకుంటున్న హాస్టల్ కి వెళ్లి కొడుకు రూమ్ డోర్ కొట్టాడు. తలుపుకు గడియ పెట్టలేదు కాబోలు వెంటనే తెరుచుకుంది. తలుపు తీసి చూసేసరికి వసంత్ బాగా తాగేసి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు. వసంత్ ని అలా చూసేసరికి రాములు మనసు చివుక్కుమంది.

కొడుకు లేచే వరకు అక్కడే ఉండి అసలు ఎందుకిలా మారాడో తెలుసుకోవాలనుకున్నాడు. కాసేపటికి వసంత్ లేచాడు. తన పక్కన తండ్రిని అక్కడ చూసేసరికి కాస్త షాక్ కి గురయ్యాడు.

రాములు కొడుకు పరిస్థితిని చూసి కంటతడి పెడుతూ, “రేయ్ ఏమైందిరా నీకు ఎసుంటోడివి ఎట్టయ్యావురా అయ్యా”. అసలు ఏమైంది నీకు? అసలు ఈ మధ్య ఊరికి రావట్లేదు, ఫోన్ కూడా సేయట్లేదు.మీ యమ్మ నీ మీద బెంగెట్టుకుంది, రోజు ఏడుస్తుంది బిడ్డ. దానికి నేను వాడికి పరీక్షలట అందుకే ఫోన్ సేయట్లేదే. నీకు అన్నింటికి కంగారే నేనోపారి ఎళ్ళి సూసొస్త అని ఆ పిచ్చిదానికి చెపొచ్చా. ఊరికి రాగానే నీకు ఫోన్ చేసా నువ్వెంతకీ ఎత్తకపోయేసరికి మీ కాలేజీకి పోయా. ఆడ పెద్ద సారు నీ గురించి ఏవేవో సెప్పాడు అవ్వన్ని నిజమేనారా అయ్య? అని రాములు కొడుకుని అడిగాడు.

వసంత్, అవును నాన్న, నేను ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించా ఎంతగా అంటే తను కాదంటే చచ్చిపోయేంతగా. కానీ తను నా ప్రేమను కాదంది తన మనసులో వేరెవరో ఉన్నారని తెలిసి సూసైడ్ చేసుకుందామనుకున్నా కానీ మీరు గుర్తొచ్చి ఆ ప్రయత్నం విరిమించుకున్నా. ఎంత ప్రయత్నించినా తనని మరచి పోవడం నా వల్ల కావట్లేదు నాన్న అందుకే తనను మరచిపోడానికే ఈ చెడు అలవాట్లకు బానిసనైనా అని ఏడవసాగాడు.

రాములు కొడుకుని ఓదార్చుతు, చూడరా నిన్ను వద్దు అన్న వాళ్ళ కోసం నువ్వు నీ జీవితం నాశనం చేసుకోవడం ఎంత వరకు సమంజసం. ఇంకా ఆ పిల్ల వేరే వాడిని ఇష్టపడిందంటున్నావు. ఆ అమ్మాయి మనసులో వేరేవారున్నారని తెలిసాక కూడా ఇంకా ఆమెను తలుచుకొంటు నీ చదువు పాడు చేసుకోవడం ఎంత వరకు న్యాయం.?
అయ్యిందేదో అయ్యింది. ఇక ఆ పిల్లని మరచి చదువు పై ధ్యాస పెట్టు అన్నాడు కొడుకు భుజం తడుతు.

వసంత్ కి మాత్రం తండ్రి చెప్పిన మాటలు నచ్చలేదు. కోపంతో నాన్న నువ్వు నన్ను నా ప్రేమను మరిచిపోమంటున్నావు అసలు నీకు ప్రేమంటే ఏంటో ఆ బాధ ఏలా ఉంటుందో నీకు తెలియదు? తెలిస్తే ఇలా మాట్లాడవు అన్నాడు.

రాములు కొడుకన్న మాట విని బాధతో, అవును రా! నువ్వు చెప్పింది నిజమే. ప్రేమంటే ఎంటో మాకెలా తెలుసుద్ది?. మేమెన్నడూ నిన్ను ప్రేమగా చూడలేదు, గోరుముద్దలు తినిపించలేదు, అడిగిన తడువే ఏమి కొనివ్వలేదు. మన బంధువులంతా నీ కొడుకుకి పై సదువులు ఎందుకు పొలం పనుల్లో పెట్టు అన్నా వినలేదు. ఎందుకంటే నువ్వు చదివి మమ్మల్ని ఏదో ఉద్దరిస్తావని కాదు రా. నేను కష్టపడినట్లు నా బిడ్డ పడొద్దని. ఇదంతా ప్రేమంటే ఏంటో తెలియని ఈ పిచ్చి తండ్రి చేసిన తప్పు.

ఇక భరించలేని బాధంటావా, మీ అమ్మ నవ మాసాలు నిన్ను మోసి పురిటి నొప్పులు తాళలేక ప్రాణాలను పనంగా పెట్టి నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది. ఆ ప్రసవ వేదన ఏలా ఉంటుందో తెలుసా మన శరీరంలోని ఇరవై ఎముకలు ఒకే సారి విరిగితే ఎంత నొప్పి ఉంటుందో అంత. అంత నొప్పిని ఓ ఆడది కేవలం తన బిడ్డను ఈ లోకంలోకి తీసుకొద్దామని ఆనందంగా భరిస్తుంది. ఆ బాధ ముందు నీదెంతరా?.

ఒరేయ్ కన్నీళ్లనేవే చాలా విలువైనవి రా!. వాటిని అనవసరమైన వాటి కోసం వృథా చేయకూడదు. మనం ఏడుస్తున్నామంటే బలమైన కారణం ఉండాలి. కన్నీళ్లు కొన్ని సార్లు ఆనందంతో, కొన్ని సార్లు బాధతో మరి కొన్ని సార్లు అసలే కారణం లేకుండా వస్తాయి. మనం కార్చే ప్రతి కన్నీటి చుక్కలో అనంతమైన భాషకందని భావాలుంటాయిరా. వాటిని మనం చిన్న చిన్న కారణాలకి జారనీయకూడదు.
నిన్ను ఇష్టపడని వారి కోసం నీ చదువు పాడు చేసుకుంటావో లేక నీ మీద ప్రాణాలు పెట్టుకున్న వారి సంతోషం కోసం చదివి ఉన్నత స్థాయిలో ఉంటావో నీ ఇష్టం. చివరగా ఒక్క మాటరా, రేపు నువ్వు మంచి స్థితిలో ఉంటే నిన్ను ఇష్టపడి పెళ్ళాడడానికి వేల మంది నిన్ను వెతుక్కుంటూ వస్తారు.
ఇక నేను చెప్పేది చెప్పా, నీ జీవితం నీ ఇష్టం అని రాములు తిరిగి వెనక్కి వెళ్తుంటే వసంత్ తండ్రి కాళ్ళ పై పడి నన్ను క్షమించు నాన్న! మూసుకు పోయిన నా కళ్ళని తెరిపించావు ఇక మీదట మీరు కోరుకున్నట్టే బాగా చదివి ఉన్నత స్థానంలో ఉంటా అని వేడుకున్నాడు.
రాములు సంతోషంగా కొడుకుని హత్తుకుని దీవించి తిరిగి ఊరెళ్లిపోయాడు. వసంత్ నూతన ఉత్తేజంతో తిరిగి కాలేజీకి బయలుదేరాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!