నమ్మకం

 నమ్మకం

రచయిత :: సావిత్రి కోవూరు

ఇద్దరి కొడుకులకు టిఫిన్ బాక్సులు ఇచ్చి “శ్రీరామ్ తమ్ముని తీసుకుని బడికి వెళ్ళు వాడిని వదిలి పెట్టకు. అలాగే టీచర్ ని అడుగు శ్రీధర్ ఎలా చదువుతున్నాడని” అని పన్నెండేళ్ళ శ్రీరామ్ కు పదేళ్ళ శ్రీధర్ను అప్పగించి  చెప్పింది తల్లి శకుంతలమ్మ రోజటి లాగానే.

“లేదమ్మా వాడు సగం దూరం వెళ్లిం తర్వాత వాళ్ళ స్నేహితులు కనిపించగానే ‘నేను వస్తాను అన్నయ్య నీవు వెళ్ళు’ అని మధ్యలోనే వెళ్ళిపోతాడు. ఎంత పిలిచినా రాడు” అన్నాడు.

“వాడిని నేను, మీ నాన్న చిన్న వాడని గారాబం చేసినందుకు ఇలా అయ్యాడు రా. ఇప్పుడు మీ నాన్న కూడా లేరు. వాడికి భయం అనేది లేకుండా పోయింది” అన్నది శకుంతలమ్మ.

శకుంతలమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీరామ్, చిన్నవాడు శ్రీధర్. రెండేళ్ల క్రితం భర్త హార్ట్ ఎటాక్ తో చనిపోవడంతో పిల్లల పెంపకం, పొలాలు చూసుకోవడం అంతా ఆమెపై పడింది. అప్పటివరకు బయటి వ్యవహారాలు అన్ని భర్త చూసుకోవడం వల్ల నిశ్చింతగా గడిచిపోయింది. ఆ తరుణంలో భర్త పోవడం ఆమెకు తీరని కష్టాన్ని కలిగించింది.నమ్మిన భంటు లాంటి నౌకరు సత్తయ్య ఉండడంతో అతని సహాయం తో బయట ఆస్తుల వ్యవహారాలన్ని ఆకళింపు చేసుకొని, భర్త పోయాడన్న బాధను గుండెలోనే దాచుకొని,తన కొడుకుల భవిష్యత్తే తన జీవిత ధ్యేయంగా మలుచుకొని బ్రతుకసాగింది

పెద్ద కొడుకు శ్రీరామ్ తన తల్లి పడుతున్న కష్టాలు అర్థం చేసుకుని మంచిగా చదువుకుంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. శ్రీధర్ ను చిన్నప్పట్నుంచి గారాబం చేయడం వల్ల బాధ్యత లేకుండా తిరుగుతూ, చదువులో వెనకబడి, స్నేహితుల వల్ల దుర్వాసనాలన్ని అబ్బినాయి. తల్లి శ్రీధర్ ఎలా బాగుపడతాడోనని ఎప్పుడూ విచారిస్తూ ఉంటుంది.

కొన్నేళ్లకు పెద్దబ్బాయి డిగ్రీ అయిపోయింది. చిన్నబ్బాయి ఇంటర్ లోనే ఫెయిల్ అయ్యాడు. శ్రీరాం కి తొందరలోనే మంచి ఉద్యోగం దొరికింది. వాళ్ళ ఊరు సిటీకి దగ్గర కావడంతో ఊరి నుండే   రోజు వెళ్ళిరాగలుగుతున్నాడు.పెద్ద కొడుకు సంపాదన కూడ రావడంతో సంసారాన్ని ఒక కొలిక్కి తెచ్చి, పొదుపుగ జరుపుకుంటూ మిగిలిన ఆదాయాన్నంత దాచిపెట్ట సాగింది.

బుద్ధిమంతుడైన శ్రీ రామ్ కి సంబంధాలు కూడా వస్తుండటంతో తనకి అన్నివిధాలా నచ్చిన అమ్మాయిని చూసి  శ్రీరామ్ కు పెండ్లి చేసింది శకుంతలమ్మ. అమ్మాయి పేరు సుగుణ.పేరుకు తగ్గట్టే అమ్మాయి సుగుణాల రాశి. భర్త, అత్తను గౌరవంతో చూసుకునేది. మరిది వ్యవహారాలు చూసి కలత చెందేది.

శకుంతలమ్మ, శ్రీరామ్ కలిసి ఇన్ని రోజులు నుండి కష్టపడి సంపాదించి, పొదుపు చేసిన  డబ్బుతో ఎంతో బంగారు, వజ్రాలు కొని నగలు చేయించి సగం పెద్ద కోడలు సుగుణ కిచ్చి, సగం చిన్న కోడలు కై దాచి పెట్టింది.  చిన్న కొడుకు ఆ బంగారం ఇస్తే పేకాటలో పెట్టుబడిగా పెట్టి చాలా డబ్బు సంపాదిస్తానని తల్లిని పోరాడ సాగాడు.

కాని శకుంతలమ్మ “నీవు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యకి ఇస్తాను” అని గట్టిగా చెప్పింది. కాని శ్రీధర్ ఎలాగైన ఆ బంగారాన్నిచేజిక్కించుకొని జల్సాలు చేసుకోవాలని ఉపాయాలు వెతకసాగాడు.ఇంతలో
పెద్ద కోడలు గర్భం దాల్చడంతో ఆమెను పుట్టింట్లో వదిలిపెట్టి రావడానికి శ్రీరామ్ వెళ్ళాడు. అదే టైంలో శకుంతలమ్మ విషజ్వరం వచ్చి చాలా సీరియస్ గా ఉండి మంచం పట్టింది. వైద్యం ఎంత చేయించిన లాభం లేకపోయింది. చివరి గడియల్లో కళ్ళు మూతలు పడుతుండగా “శ్రీరామ్ శ్రీరామ్” అని పలవరించడం మొదలుపెట్టింది. అదే అదనుగా దగ్గరున్న శ్రీధర్ తల్లి దగ్గరికి వెళ్లి “అమ్మ  నేను  శ్రీరామ్ ని వచ్చాను” అన్నాడు.

“నాయన శ్రీ రామ్ నా నగలు, శ్రీధర్ భార్యకై చేయించిన నగలన్నీ మన వంటింట్లో దేవుడు ఫోటో వెనక తవ్వి దాంట్లో పెట్టి పైనుండి మట్టితో పూడ్చి  వేశాను. శ్రీధర్ కు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఆ నగలు అప్పగించు” అని చెప్పి ప్రాణాలు వదిలేసింది.

వెంటనే శ్రీధర్ గబగబ ఆ గూటిని తవ్వి నగలన్నీ మూటగట్టి సూట్ కేస్ లో పెట్టుకొని
“నేను ఇప్పుడే వస్తాను” అని తండ్రి కాలము నుండి తమకు చేదోడు వాదోడుగ ఉంటున్న నౌకరు సత్తయ్యను తల్లి దగ్గరుంచి, తనకు బాగా నమ్మకం ఉన్న బంధువు ఇంటికి వెళ్లి నగల సూట్కేసును  అతనికిచ్చి, జాగ్రత్తగా పెట్టమని తాను మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పి హడావిడిగా ఇంటికి వచ్చేసరికి, తల్లి పరిస్థితి తెలిసి వచ్చిన శ్రీరామ్
“ఎక్కడికి వెళ్ళావ్ రా, అమ్మ చనిపోయింది కూడా చూసుకోకుండా” అని ఏడవడం మొదలుపెట్టాడు.

“నేను వెళ్ళేటప్పుడు అమ్మ బాగానే ఉంది అన్నయ్య. అమ్మకు చెప్పే వెళ్లాను ఇంతలో ఇలా అవుతుందని అనుకోలేదు” అని ఏడపు నటించ సాగాడు.

అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత శ్రీధర్ బంధువుల ఇంటికి వెళ్లి తన సూట్ కేస్ తీసుకుని ఇంట్లోకొచ్చి తన రూమ్ లోకెళ్ళి తెరచి చూస్తే తానిచ్చిన నగల్లో పావు భాగం కూడా లేవు. ఇప్పుడు వెళ్ళి గొడవ చేస్తే అన్నకు తెలిసిపోతుందని తేలు కుట్టిన దొంగలా సూట్కేసు తీసుకొని “అన్నయ్య నేను కొన్ని రోజులు మా స్నేహితుడు మధు ఇంటికి వెళ్తున్నాను. అమ్మ లేని ఇంట్లో నాకు ఉండాలి అనిపించడంలేదు” అన్నాడు.

 శ్రీరామ్ కూడా నిజమేననుకొని ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి పంపాడు. శ్రీధర్ సిటీలో ఉన్న స్నేహితుడు మధు ఇంటికి వెళ్లి మధుతో “ఈ సూట్కేస్ జాగ్రత్తగా దాచిపెట్టు. కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటాను” అని సూట్కేసును అప్పచెప్పాడు శ్రీధర్.

ఆ స్నేహితుడు సరేనని ఆ సూట్కేసును తీసుకొని లోపలికి వెళ్ళేసరికి అతని భార్య “మీ స్నేహితుడు సూట్కేస్ తో వచ్చాడు. ఎన్ని రోజులు మకాం పెడతాడట. ముందే ఆయనకి అన్ని  వ్యసనాలు ఉన్నాయని చెప్పావు. అతన్ని మన ఇంట్లో పెట్టుకోవడం అవసరమా? అది కాకుండా నేను మీకు, మీ పిల్లలకు చాకిరీ చేసి చేసి అలసి పోతున్నాను. దానికితోడు ఇతను కూడానా” అని గొడవ పడ సాగింది.

మధు “పోనీలే వే కష్టకాలంలో నాకు ఎంతో డబ్బు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఖర్చులు అన్నీ తనే పెట్టుకుంటాడు. అతనికి కష్టం వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంచుకుంటే తప్పేం లేదు. వాడికి బోలెడంత ఆస్తి ఉంది. మన ఇంట్లో ఫ్రీ గా ఏమీ ఉండడు” అని సర్ది చెప్పాడు.

శ్రీధర్ తన దగ్గరున్న డబ్బులతో స్నేహితుని ఇంటి ఖర్చులన్నీ తనే పెట్టుకుంటూ, తను కూడా జల్సా గా ఖర్చు చేసుకుంటూ, హాయిగా ఉన్నాడు.డబ్బులు అయిపోతే అన్నకి ఉత్తరం రాసి డబ్బులు తెప్పించుకొని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆనందించసాగాడు. అతను తమకు ఖర్చు పెడుతున్న తీరు చూసి స్నేహితుని భార్య కూడా అతనికి రుచికరంగా వండి పెడుతూ మర్యాదలు చేయసాగింది.

ఒక రోజు రాత్రి శ్రీధర్ పడుకున్నాక అతని సూట్కేసును తెరిచి చూశాడు ఫ్రెండ్ మధు. దానిలో  డైమండ్స్ తో చేసిన నగలు ఎన్నో మిరుమిట్లు గొలుపుతూ కనిపించాయి.

అవి భార్యకు చూపి “ఈ నగలన్ని మన ఇంట్లో దాచిపెట్టు. సూట్కేస్ లో కొన్ని పేపర్స్ పెట్టేద్దాం. వాడు చెప్పింది కూడా అదే  అన్నాడు. మధు భార్య సంతోషంతో ఆ నగలన్నీ దాచి పెట్టేసి సూట్ కేసులో  కొన్ని పేపర్ల కట్టలు పెట్టి ఎప్పటిలా పెట్టేసింది. ఆ రోజు నుండి  శ్రీధర్ ఎప్పుడెళ్ళి పోతాడా అని ఎదురు చూడసాగారు.

శ్రీధర్ కి మర్యాదలు అన్నీ తగ్గించేసి  పాడైన కూరలు అన్నం పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వాళ్ళు సరిగ్గా మాట్లాడడం కూడా మానేశారు.  ‘పొమ్మనలేక పొగ పెట్టినట్టు’ వెళ్లి పోయేలాగా చేస్తున్నారని అర్థం చేసుకున్నాడు శ్రీధర్.

చివరికి ఒక రోజు శ్రీధర్ మధు తో “మధు నా సూట్ కేస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను చాలా రోజులైంది వచ్చి” అనేసరికి

“సరేలే వెళ్ళు మీ అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు” అని సూట్కేసు తెచ్చి ఇచ్చేశాడు.

ఇంటికెళ్లిన శ్రీధర్ ని చూసిన వాళ్ళ అన్న ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. వదిన వేడివేడిగా అన్నం పెట్టి “రెస్ట్ తీసుకో శ్రీధర్ అలసిపోయి ఉంటావు” అని చెప్పింది.

“సరే వదిన” అని తన గదిలోకి వచ్చిన శ్రీధర్ తలుపు మూసి మెల్లగా సూట్కేసును తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నో విలువైన నగలకు బదులుగా చిత్తుకాగితాలు కనబడే సరికి పిచ్చెక్కినంత పనయింది.మరుసటి రోజూ ఉదయమే లేచి మళ్ళీ స్నేహితుడు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

మధుని బయటకు పిలిచి “నేను సూట్ కేస్ లో ఎన్నోనగలు పెట్టి దాచి పెట్టమని ఇచ్చాను. నీవు ఎంతో నమ్మకస్తుడైన ఫ్స్నేహితుడివని నమ్మి,నీ దగ్గర దాయమని ఇస్తే నీవు మళ్ళీ నాకు ఇచ్చే టప్పుడు దాంట్లో పేపర్స్ పెట్టి ఇచ్చావు. నా నగలన్నీ ఏం చేసావ్? నీ వింత నమ్మకద్రోహం చేస్తావనుకోలేదు. నాకు ఇప్పుడు నా నగలు కావాలి ఇచ్చేసేయ్” అన్నాడు.

దానికి మధు “ఏమో నీవేం పెట్టి ఇచ్చావో నేనైతే చూడలేదు. నీవైతే నాకు ఇంపార్టెంట్ పేపర్స్ అని చెప్పావు.  క్లోజ్ ఫ్రెండ్ వి కదా అని, మీ అమ్మ మరణించి బాధపడుతున్నావని ఆశ్రయం ఇస్తే, నాకే దొంగతనం అంటగడుతున్నావా” అని గట్టిగా అరవసాగాడు. నీవు నాకు దాంట్లో ఏమున్నాయో చూపెట్టావా?  నాకు కాగితాలు అని చెప్పావు. నేను చూడలేదు నీవు ఎలా ఇచ్చావో అలాగే ఇచ్చేశాను” అన్నాడు.

ఇక చేసేదేమీలేక ఏం గొడవ చేసిన, పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన అన్నకు తెలుస్తుందని నోరు మూసుకొని ఇంటికి వచ్చాడు.

మరుసటిరోజు శ్రీరామ్ తమ్ముడి తో “నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. వాళ్లు మనకు తెలిసిన వాళ్ళు, చాలా మంచివాళ్ళు. నీకు ఇష్టమైతే మనం వెళ్లి చూసొద్దాం” అన్నాడు.

“అమ్మాయి ని చూడడానికి వదిన, నీవు ఎందుకు అన్నయ్య. నా ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళొస్తాను” అన్నాడు.ఇంత జరిగిన ఫ్రెండ్స్ పై నమ్మకం పోని శ్రీధర్.

శ్రీరామ్ “పెళ్లి చూపులకు ఆడవాళ్ళు ఉంటే బాగుంటుంది రా. నీ ఇష్టం నీకు ఎలా ఇష్టమనిపిస్తే అలా చెయ్” అన్నాడు.

ఒక రోజు నలుగురు ఫ్రెండ్స్ ని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్లి వచ్చాడు.

“అమ్మాయి ఎలా ఉంది రా నీకు నచ్చిందా” అన్నాడు శ్రీరామ్

“అమ్మాయి బాగానే ఉంది అన్నయ్య. కానీ జుట్టు మరీ పొట్టిగా ఉందని మా ఫ్రెండ్స్ అంటున్నారు” అన్నాడు.

అలాగే మూడు నాలుగు సంబంధాలు ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్లి చూసి, ఒక అమ్మాయిని కట్నం తక్కువని, ఒక అమ్మాయిని చాలా సన్నగా ఉన్నదని, ఒక అమ్మాయి చాలా లావుగా ఉందని, ఒక అమ్మాయి కలర్ తక్కువ ఉందని వంకలు పెట్టి అన్ని సంబంధాలు ఎగర కొట్టేసారు ఫ్రెండ్స్.
శ్రీధర్ పెండ్లి చేసుకొని సంసారంలో మునిగిపోతే తమకు ఇప్పుడు ఖర్చు పెడుతున్నట్టుగ ఖర్చు పెట్టడని శ్రీధర్ కి పెండ్లి కాకుండ వంకలు పెట్టసాగారు.

వాళ్ళు కోరుకున్నట్టగానే ఈ విషయాలన్నీ ఆడపిల్లల తల్లిదండ్రులకు తెలిసి సంబంధాలు రావడమే ఆగిపోయినాయి.అప్పుడు తెలిసింది.తన స్నేహితులు తన బాగుని కోరేవాళ్ళు కారని, తన డబ్బులు కోరే వాళ్లని తెలుసుకున్నాడు శ్రీధర్.

కొన్ని రోజులకు ఎదురు డబ్బులు ఇచ్చినా చేసుకోమనే పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళ అన్నయ్య వదిన ఎలాగో ఒక సంబంధం కుదిర్చి పెళ్లి చేశారు. భార్య కాత్యాయిని చాలా మంచి అమ్మాయి. శ్రీరామ్ భార్య సుగుణ తన నగలలో సగము కొత్తగా వచ్చిన తన తోటి కోడలు కి ఇచ్చేసింది.

శ్రీధర్ పశ్చాత్తాపంతో  “అన్నయ్య, వదిన ఇన్ని రోజులు మీ మంచితనం తెలుసుకోలేక బంగారము అంతా మంది పాలు చేశాను. నా దురదృష్టం కొద్దీ ఎవరు నా మేలు కోరే వారో తెలుసుకోలేక, స్వార్థపరులను నమ్మి ఎంతో కాలన్ని,అమ్మ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అమ్మను సంతోషపెట్టలేక పోయాను. స్నేహితుల వల్ల నేను చాలా నష్టపోయాను. వదినా నీ బంగారం ఇవ్వ వలసిన అవసరం లేదు. నీ దగ్గరే పెట్టుకో” అన్నాడు శ్రీధర్.

“అప్పుడు నీకు నీ ఫ్రెండ్సే లోకములా బ్రతికావు. ఇప్పుడు మారిపోయావు. అందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటికైనా నీ భార్య, నీవు సంతోషంగా ఉండండి.మాకంతే చాలు. నీవు అమ్మ దాచిపెట్టిన బంగారు నగలు తీసుకుపోయినట్టు, ఎవరెవరి దగ్గర ఎంతెంత పోగొట్టుకున్నావు అంతా మన నౌకరు సత్తయ్య నాకు చెప్పాడు. నీవు దేవుడి గూడు దగ్గర తవ్వి బంగారం తీసుకుని బంధువుల దగ్గరకు వెళ్లడం, తర్వాత మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లడం అన్నీ కనిపెట్టి సత్తయ్య నాకు చెప్పాడు. ఇప్పుడు నేనేమి చేయలేను. నా చేతిలో ఉన్నది మీ వదిన బంగారం పంచడమే కనుక తీసుకుని ఇప్పటికైనా నీకు తెలిసింది కదా! ఎవరు నీవాళ్ళో, ఎవరు ఎలాంటి వాళ్ళో అంతే చాలు. అన్నాడు శ్రీరామ్.

అప్పటినుండి శ్రీధర్ అన్నా, వదిన తో ఉంటూ అన్న చెప్పినట్టుగా నడుచుకుంటూ భార్యతో సుఖంగా ఉండసాగాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!