ఊచకోత

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ఊచకోత!

రచన: తొర్లపాటి రాజు(రాజ్)

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊయలలూగే

ప్రియా
నీ ఉహాల.. ఊట
నా మనసుకు లేకుండా చేసే..ఊరట!
నీ వెచ్చని ఊహలు
నా హృదయాన్ని ఊరగం(కర్పూరం) లా
కరింగించేసాయి!
ఊరగాయ లా…ఆరగించేసాయి!
నీ ఊహల… ఊడలు
నా మదిని ఊపి ఊపి…
నీవు తప్ప వేరే ఊసు లేకుండా చేశాయి!

ఓ ప్రియా!
ఏ ఉలి తో…
నా ఉదర ఊర్థ్వ భాగాన..
నీ ఊసు చెక్కబడిందో గానీ
నాటి నుండి
నీ ఊహల ఊసులు..
నా మదిని..
నీకు ఊడిగం చేయిస్తున్నాయి!
నీ కొరకై..
ఉపవాసం చేయిస్తున్నాయి!
నా గుండెను..
ఊచకోత కోస్తున్నాయి!

ఓ పోరీ!
నీ ఊహలు..
నన్ను ఊరక ఉండనీక..
ఉవ్వెత్తున ఉశిగొల్పి..
ఊరంతా.. ఊరేగిస్తున్నాయి!

ఓ..సఖీ!
యే క్షణాన నీ ఊసు
నా ఊపిరిని చేరిందో
నాటి నుండి
నా ఉనికి…నీ ఊహ!
నీ ఊహే..నా ఊపిరి!

నీ కొరకై..
నా ఊహలు..
ఉల్లి పొరల వలె..ఉబికి ఉబికి
ఉత్సాహ పడుతున్నవి!

ఓ.. నా హృదయేశ్వరీ!
ప్రతి ఉదయం..
నీ ఊసెత్తనిదే..నాకు ఊసుపోదు
నా ఊపిరికి.. ఊపు రాదు

ఓ..వాయు వాహినీ!
నీ ఊహాలనుండి ఊచిపోవు మార్గమ్ముకై ఉపనిషత్ లు …అవపోసన పట్టిన
ఉపాధ్యాయుల… పాదాలు పట్టిన గానీ!
ఉసిరికాయంతైన..ఉపాయమ్ము దొరకలేదు

ఓ..ఊర్వశి!
నా హృది నిండ
నీ ఊహను నింపుకున్న నాకు..
ఉలుపమ్ముగా‌ ఉంగరమే..ఇచ్చెదవో!
లేక..
ఉరితాడునే.. ఇచ్చెదవో!
నీ..ఊహకే.. వదిలేస్తున్నా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!