మరో మజిలీ

మరో మజిలీ

రచయిత:సత్య కామఋషి ‘ రుద్ర ‘


మండుటెండల ఎడారి దారుల్లో,
పచ్చదనం ఊసెరుగక ఎండిన మోడులే.,
అలసి ఆవిరై సాంత్వన కోరే తనువుకు
రవ్వంత నీడనిచ్చు మహావృక్షాలు..!

అల్లంత దూరాన కనిపించీ కనిపించక ,
కనుపాపలను మాయజేస్తూ కవ్వించే,
ఎండమావులే బ్రతుకు ఆశను ఉసిగొల్పి
ముందుకు నడిపించు వెలిగించని దీపాలు.!

దాహార్తికి తాళలేక తడియారి పిడసగట్టి
గుక్కెడు నీటికై వెదికి వేసారి వెంపర్లాడిన
జిహ్వకు..తల్లడిల్లి సొమ్మసిల్లిన మేనుకి..

కరుణగ మేఘమే కరిగి నేలకు  రాల్చిన
రెండు వర్షపు నీటిబొట్టులైనా…బాధను
తాళలేక మరిగిన తనువు జాలువార్చేటి
రెండు కన్నీటి చుక్కులైనా…గొంతు తడిపి
ప్రాణం నిలిపే అమృత బిందువులే కాదా.!

ఆగక సాగే అలుపెరుగని బ్రతుకు బాటలో
అనుకోని, ఆశించని ఎడారి మజిలీలో..
అపజయాల మోడులే అనుభవాల సాంత్వన
వాడిపోని ఆశలే ఊరించే ఎండమావి జాడలు

పట్టుదల పరిశ్రమల మేఘం వర్షంచి ఓరడించే
చిరు విజయాల జల్లులే…భావి భవిష్యత్
విజయ పరంపరలకు పేర్చినట్టి సోపానాలు.!
ఆనందాహ్లాదపు మజిలీలకు వేసుకున్న బాటలు.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!