మరో ఉగాది

మరో ఉగాది

వసంత ఆగమన ఋతురాగం

ఆమని మధుర సమ్మోహన గానం 

 

లేలేత పూతల ప్రకృతి పరివారం

తీపి రుచుల మామిళ్ల పచ్చని హారం 

 

జీవన గమన భావనల అనుసారం

ఉగాది పచ్చడి షడ్రుచుల సారం 

 

ఎర్రటి వన్నెల కొత్త పచ్చళ్ల కారపు

రుచులు పంచీ, పెంచేటి మమకారం.. 

 

మంచు తెరలు కరిగిపోగా నెమ్మదిగా 

పుడమిని వేడెక్కించే గ్రీష్మ ప్రతాపం… 

 

వేసవి సెలవుల కేరింతలతో అమ్మమ్మల

మేనమామల ఇళ్లను తాకే కోలాహలం… 

 

భగభగమంటూ భానుడి ప్రఛండ ప్రతాపం

పెరిగే తాపానికి..అడుగంటే నీటి ప్రవాహం

ఉస్సురోమంటూ ఉక్కిరిబిక్కిరి, జన సందోహం.. 

 

విషాద ఘంటికల విలయతాండవమాడిన శార్వరి

సెలవంటూ సాగేటి వైనం…మానని మది గాయాల

మెల్లగా మెత్తగా మాన్పగా, మైమరపుల జల్లుగా..

ఆనంద శుభాకాంక్షల చిరుజల్లుగా…

హరివిల్లుగా వస్తున్నాడుగా ప్లవుడు.. 

కలల రాకుమారుడుగా..

                                  రచన:సత్య కామఋషి’రుద్ర’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!