మార్పు

(అంశం : “మానవత్వం”)

మార్పు

రచన:సుశీల రమేష్

లక్ష్మీపతి జానకమ్మ ఇద్దరూ రిటైర్డ్ టీచర్ లు. లక్ష్మీపతి మహా పిసినారి
ఎంగిలి చేత్తో కాకిని తోలడు. అసలు తన ఇంటివైపు ఎవరిని రానిచ్చేవాడు కాదు.

వాళ్ల పెరట్లో జామ చెట్టు జామకాయలు విరగ కాసేది. అయినా ఏనాడు ఒక్క కాయ కూడా బయట పిల్లలకు ఇచ్చేవాడు కాదు. లక్ష్మీపతి. జానకమ్మ మాత్రం
భర్తకు తెలియకుండా బయట పిల్లలకు కాయలు కోసి ఇస్తూ ఉండేది.

పెళ్లి అయిన నాటి నుండి అంత పిసినారితనం వద్దండీ అని చెప్పి చెప్పి విసిగిపోయి ఇక ఈ మనిషి ఇంతే
కట్టె కాలేంతవరకు ఇంతేనేమో అని చెప్పడం మానేసింది.

వీరికి ఒక అమ్మాయి పేరు శాంతి. డాక్టరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేస్తుంది.

ఎవరైనా బిచ్చగాడు తన ఇంటి వైపు వచ్చి మాదా కాలం తల్లి అంటే చాలు, లక్ష్మీపతి మూడో కాలిమీద లేచి వచ్చి ఏరా బడుద్దాయి కాళ్లు చేతులు బాగానే ఉన్నాయి కదా ఏదన్నా పని చేసుకుని చావరాదు,
ఇలా ఇంటింటికి తిరిగి అడుక్కోకపోతే అని చిర్రు బుర్రు లాడేవాడు. ఎందుకండీ వాళ్ళని తిట్టడం. పెడితే పట్టెడన్నం పెట్టండి
లేకపోతే లేదని చెప్పండి. అంతే గానీ తిట్టడం దేనికి అంటున్న జానకమ్మ వైపు కోపంగా చూస్తూ నువ్వు ఒక్కదానివే ప్రతిదానికి తగుదునమ్మా అంటూ బయట వాళ్లకు వత్తాసు పలుకుతావు అని అంటాడు లక్ష్మీపతి.

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం.
శాంతి హాస్పిటల్ లోనే ఉండాల్సిన పరిస్థితి సంవత్సరం అయింది ఇంటికి వచ్చి. కానీ రోజు తల్లిదండ్రులతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉండేది. హాస్పిటల్ లో జరిగే విషయాలన్నీ చెప్పేది. శాంతి మాటలకు జానకమ్మ ఏంటో తల్లి ఈ మహమ్మారి ఎప్పుడు సమూలంగా నాశనం అవుతుందో తెలియదుగానీ దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి అంటుంది. లక్ష్మీపతి మాత్రం అమ్మాయి రోగులకు దూరంగా ఉండవే వాళ్ల కుల గోత్రాలు మతాలు ఏమిటో అని చెబుతూ ఉండేవాడు.

ఆ మాటకు శాంతి, ఇంకా కుల గోత్రాలు ఏంటి నాన్నా ఇంకెక్కడి మతం, కరోనా సోకితే జనాలు బాబాల దగ్గరికి వెళ్లకుండా హాస్పిటల్ కి ఎందుకు వస్తున్నారు. ఒక్కసారి ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంకెప్పుడూ మారతారు నాన్న. నీకు చెప్పేంత వయస్సు అనుభవం నాకు లేవు అంటుంది శాంతి.

నువ్వు కూడా మీ అమ్మలాగే వితండవాదం చేయకు చెప్పింది చెయ్యి అంటాడు లక్ష్మీపతి.

రెండు రోజుల తర్వాత బిపి మందుల కోసం బయటికి వెళ్తాడు లక్ష్మీపతి. తిరిగొచ్చిన మూడోరోజున జలుబు చేస్తుంది. నాలుగో రోజు విపరీతమైన ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తే భయపడిన జానకమ్మ కూతురు శాంతి కి ఫోన్ చేసి విషయం చెప్పింది. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకు ముట్టుకోకు కరోనా సోకింది ఏమో అని నాకు అనుమానం గా ఉంది. నేను అంబులెన్స్ పంపుతాను నాన్నవి నాలుగు జతల బట్టలు బ్యాగ్ లో సర్ది ఉంచు మా సిబ్బంది వస్తే
వాళ్ళకి ఇవ్వు నువ్వు మళ్ళీ ఇంట్లోకి ఫాగింగ్ చేసిన తర్వాతే వెళ్ళు అంటుంది శాంతి.

శాంతి చెప్పినట్టుగానే అంబులెన్స్ రావడం లక్ష్మీపతి ని తీసుకు వెళ్లడం
జరిగింది. శాంతి అనుమానమే నిజమైంది పరీక్షలో కరోనా అని తేలింది.

ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. లక్ష్మీపతి కి కరోనా తీవ్రత ఎక్కువ లేకపోయినప్పటికీ వళ్లు నొప్పులు తట్టుకోలేక పోయేవాడు. బాత్రూంకి వెళ్ళాలి అంటే మనిషి సాయం కావలసి వచ్చేది.

ఒకరోజు బాత్ రూమ్ కి మెల్లిగా నడవలేక నడుస్తుంటే లోపలికి వెళ్లే లోపు బట్టలు తడిసి పోయాయి. సిగ్గుతో బిక్క చచ్చిపోయాడు లక్ష్మీపతి. శాంతి పక్క రూములో ఉంది ఆ సమయంలో. సిబ్బందిలో లో కాంపౌండర్ రాము అసలు ఏమాత్రం విసుక్కోకుండా లక్ష్మీపతి వళ్ళు కడిగి బట్టలు మార్చి , జాగ్రత్తగా తీసుకెళ్ళి లక్ష్మీపతి ని బెడ్ పై కూర్చోబెట్టాడు.

లక్ష్మీపతి ఆశ్చర్యపోతూ ఏమయ్యా రాము నీవు నన్ను ఇసుమంతయినా విసుక్కోలేదు,
నామీద కోపం రాలేదా అని అడిగాడు.

ఆ మాటకి రాము, చూడండి బాబు గారు మీరు పెద్దవారు మీకు చెప్పేంత వాడిని కాదు, ఇక్కడ మేమున్నది విసుక్కోడానికి కాదు, ఇది మా బాధ్యత. ఏనాడైతే ఈ వృత్తిని ఎంచుకున్నా మో ఆనాడే
మేము మాలోనే కోపాన్ని సమాధి చేసి మానవసేవే మాధవసేవ అనే మాటను వంటబట్టించుకుంటాము.

అసలు మానవత్వం లేని వాడు మనిషే కాదు అంటాను అని రాము అనేసరికి లక్ష్మీపతి కి ఆ మాట చెంప పెట్టులా అనిపించింది.

అంతలో అక్కడికి వచ్చిన శాంతి రాముకి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటే, ఊరుకోండి మేడం నేనిప్పుడు ఏం చేశాను మనిషి గా సాయం చేశాను అంతే కదా, అది నా బాధ్యత ఒక మనిషిగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాము.

ఏం నాన్న రాము ది ఏ మతం ఏ కులం, ఇక్కడ రెండు నెలల నుండి చూస్తున్నావు కదా. ఎంతోమంది ఉన్నత కుటుంబం వాళ్ళు ఉన్నారు లేని కుటుంబం వారున్నారు.

మేమెప్పుడూ అందరినీ ఒకే దృష్టితో చూస్తాము. మేం మొత్తం రెండు వేల మంది సిబ్బంది , అందులో డాక్టర్లు నర్సులు కార్మికులు అనే తేడా లేకుండా ఇళ్లకు కూడా వెళ్లకుండా మా బాధ్యతను నిర్వహిస్తున్నాము.

* నాన్న ఈ సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదు. మతాలన్నీ మానవత్వాన్ని బోధిస్తాయి కనికరం లేని వారికి స్వర్గప్రాప్తి ఉండదు కులమతాలకతీతంగా మనుషులందరినీ ప్రేమించాలి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి.
అసలు ఇతర విలువల కన్నా మానవ విలువలే మిన్న, *

నేను ఇప్పుడు చెబుతున్నాను మాది అంతా ఒకటే మతం అదే మానవత్వం మాలో తారతమ్యాలు లేవు, అని శాంతి చెప్తుంటే,

లక్ష్మీపతి కంట నీరు పెట్టుకున్నాడు.
ఊరుకోండి నాన్న మిమ్మల్ని నా మాటలు బాధించి ఉంటే మన్నించండి.అంటుంది శాంతి.

రెండు నెలలకు పూర్తిగా కోలుకున్న లక్ష్మీపతి ని డిశ్చార్జి చేశారు.
ఇంటికి వెళ్ళిన లక్ష్మీపతి లో ఎంతో మార్పు వచ్చింది.

లాక్ డౌన్ వలన పనులు లేని బడులు పస్తులు ఉంటున్నారు అని తెలిసిన లక్ష్మీపతి తన ఇంట్లో మూడు పూటలు భోజనం వండించి
తనే స్వయంగా వడ్డించే వాడు. తిన్న తర్వాత వాళ్లంతా పాత్రలు పడుతుంటే వారితో పాటు లక్ష్మీపతి కూడా చిన్న చిన్న పనులు చేసేవాడు.

ఏమండీ మీలో ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు.అని జానకమ్మ అంటుంటే ,అవును జానకి కరోనా వైరస్ ని అందరూ తిట్టుకోవడం లో తప్పులేదు కానీ నాకు మాత్రం మేలు చేసింది. మానవత్వం అంటే ఏంటో రుచి చూపించింది. హాస్పటల్లో సిబ్బంది ఎక్కడి వారో ఎవరికి ఎవరో తెలియక పోయినా కేవలం వారి వృత్తి ధర్మంలోని బాధ్యతగా వారి కర్తవ్యాన్ని వారిలోని మానవత్వం నన్ను మార్చివేసింది.

చేతుల్లో పెరిగి నా దగ్గర పాఠాలు నేర్చుకున్నా నా కూతురు మానవత్వం అనే పాఠం నాకు చెప్తుంటే సాక్షాత్తు ఆ దేవి నాకు జ్ఞానోదయం చేస్తున్నట్లుగా అనిపించింది.

నిజమే మానవసేవే మాధవ సేవ.
ఈ రోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మనలో మానవత్వం మేలుకుంది. ఇప్పటినుంచి మనకున్నంతలో పరులకు సాయపడుతూ మానవత్వం యొక్క విలువను చాటి చెబుదాం
అంటాడు లక్ష్మీపతి.

సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!