ఐదుగురు అన్నలు

(అంశం : “మానవత్వం”)

ఐదుగురు అన్నలు

రచన:అపర్ణ

“హలో స్టూడెంట్స్ రేపు మన కాలేజీ తరపున మన క్లాస్ వాళ్ళం పిక్నిక్ కి వెళ్తున్నాం అందరూ ఇంట్లో చెప్పి పర్మిషన్ లెటర్ తీసుకుని వస్తేనే తీసుకుని వెళ్తాము అలా తేని పక్షాన మిగిలిన వాళ్ళు క్లాస్సేస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది” అని పిల్లలకి చెప్పి తన దారిన తాను క్లాస్ స్టార్ట్ చేశారు లెక్చరర్. అది విని క్లాస్ లో ఒక స్టూడెంట్ లేచి “మేడం రేపు పిక్నిక్ కి ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగేసరికి మన ఊరి చివర అడవి ఉంది కదా అక్కడికి, అక్కడికి వెళ్లి చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో కొన్ని మొక్కలని సేకరించి బోటనీ ప్రాక్టికల్ అప్పుడు ఆ మొక్కలని ఒక బుక్ లో అటాచ్ చేసి నాకు సబ్మిట్ చేయాలి, అందరూ అడవి అనేసరికి కంగారు పడకండి ఓన్లీ పర్మిషన్ ఉన్న ఏరియా లోకి మాత్రమే వెళ్ళబోతున్నాం అడవి లోపలికి వెళ్ళటానికి వీలు లేదు” అని అన్నారు. ఇదంతా వింటున్నఅబ్బాయిలు పిక్నిక్ అనేసరికి ఎగిరి గంతేశారు. అమ్మాయిలు మాత్రం డైలామా లో పడిపోయారు. అడవికి అంటే ఇంట్లో పంపిస్తారో లేదో అని వారిలో సిరి కూడా ఒకటి అదే విషయం తన స్నేహితురాలు సంధ్య తో అంటుంది “ఏమే మీ ఇంట్లో పంపీయకపోతే ఏమైంది రోజూ కాలేజీ కి ఎలా వస్తావో అలాగే రా కావాలంటే నీకు లెటర్ నేను రాసి పెడతాగా” అని భరోసా ఇచ్చింది. సంధ్య మాటలకు కొంత ఉపశమనం గా అనిపించింది సిరి కి. సరే అని ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోయారు.అలా తరువాత రోజు పిక్నిక్ కి అన్నీ సిద్ధం చేసుకుని పర్మిషన్ లెటర్ తో అందరూ స్టూడెంట్స్ తయారుగా ఉన్నారు సిరికి సంధ్య లెటర్ రాసి వాళ్ళ నాన్నగారి సంతకం చేసి ఇచ్చింది స్టూడెంట్స్ దగ్గర లెటర్ తీసుకుని అందరినీ బస్ ఎక్కించారు. బస్ లో పిల్లల పాటలతో కేరింతలతో ఎంతో ఉత్సాహంగా సాగింది వారి ప్రయాణం. ఇంతలో రావాల్సిన ప్రదేశం రానే వచ్చింది అందరూ దిగి లెక్చరర్స్ వెనకాల వెళ్తూ వాళ్ళు చూపించేవి చూస్తూ కావలసిన మొక్కలని సేకరిస్తూ ఎంతో ఉత్సాహంగా తమ పిక్నిక్ ని ఆస్వాదిస్తున్నారు. సిరి, సంధ్య కూడా జాలిగా అందరి స్నేహితులతో గడుపుతూ ఆ చల్లని వాతావరణాన్ని పచ్చని అడవిని చూస్తూ మైమరచి పోయారు. ఇంతలో సంధ్య కి ఒక ఆలోచన వచ్చింది అదే సిరి కి చెప్పింది. “ఏమే మనం కొంచెం లోపలికి వెళ్లి చూద్దామా అక్కడ ఇంకా బాగుంటుందేమో” అని అంటే అది విని సిరి “ఆమ్మో ఒద్దు లోపల అడవిలో పులులు ఉంటాయేమో అనవసరంగా రిస్క్ ఎందుకు లెక్చరర్స్ వొద్దు అన్నారుగా మనం ఇక్కడే ఉందాము “ అని సముదాయించి నట్లుగా చెప్పింది సంధ్య కి. “ఇంత పిరికి దానివి ఏంటే నువ్వు అయినా నువ్వు ఇక్కడికి రావటానికి నేనేగా మీ నాన్న పేరు తో లెటర్ రాసాను నువ్వు కనుక రాకపోతే బలవంతంగా రాయిచ్చావని నేను లెక్చరర్ కి చెప్పేస్తాను” అంటూ బెదిరించింది. “వామ్మో ఏంటే ఆ మాటలు అయినా ఒక ఫ్రెండ్ వి అయ్యుండి నన్నే నువ్వు ఇరికిస్తావా చెప్పు”. దానికి సంధ్య నవ్వుతూ “హహ్హహా నేను అంతే నా పని చేసుకోడానికి ఎవరిని అయినా అంతే చేస్తాను అంటూ నువ్వు ముందు పద అని తనని అందరి నుంచి వేరు చేసి లాక్కుని పక్కకి వెళ్ళింది. చేసేది ఏమిలేక సిరి సంధ్య తో పాటు వెళ్ళింది.వాళ్ళు కొంత దూరం లోనికి వెళ్ళాక సంధ్య అన్నట్లు అక్కడ ఇంకా బాగుంది చుట్టూ పక్షుల అరుపులు అందమైన పూల మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది ఆ ప్రాంతం అలా చూస్తూ చూస్తూ ముందుకి వెళ్ళారు. కొంతదూరం వెళ్ళాక ఒక ప్రదేశంలో అంతా బీర్ బాటిల్స్, గ్లాస్ లు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అది చూసి ఇద్దరూ కంగారు పడ్డారు. ఎందుకైనా మంచిది వెళ్ళిపోదాం అని అనుకుని వెనుతిరిగేసరికి ఎదురుగా ఐదుగురు అబ్బాయిలు తప్ప తాగి తూలుతూ పడతా లేస్తా వీరి దగ్గరికి వస్తున్నారు. విషయం అర్ధమైన సంధ్య సిరి ని వదిలేసి తోసుకుంటూ అక్కడి నుండి పరిగెత్తింది. సిరి కి ఏమి చేయాలో అర్థంకాలేదు మైండ్లో ఒక్కసారి గా వేల ఆలోచనలు వొళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ ఉంది, ఎలా తప్పించుకోవాలో, అమ్మా, నాన్న పరిస్థితి ఏంటీ ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ అక్కడే స్థానురాలై నుంచుని ఉంది. అడవిలోకి ముందుకు పరిగెడితే పులులు ఉంటాయేమో, వెనక్కి వస్తే పులుల కంటే ఘోరమైన ఈ మృగాళ్ల వలలో పడిపోతానేమో, ఏమీ చేయాలి ఏంటీ అని ఆలోచిస్తూ వాళ్ళు ముందుకి వస్తున్న కొద్దీ తాను వెనక్కి జరుగుతూ, వీళ్ళ చేతులో నా జీవితం నాశనం అవటం కంటే ఆ పులులకి ఆహారం అవ్వటం నయం అనుకుంది. అనుకున్నదే తడవుగా ముందుకు పరిగెత్తింది. తను పరిగెత్తగానే ఈ ఐదుగురు కూడా తన వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టారు. అది చూసి తను ఇంకా వేగం పెంచింది. వీళ్ళు వెనక నుంచి ఆగు, ఆగు అంటూ అరుస్తూ పరిగెడుతున్నారు, సిరి వెనక్కి తిరిగి చూస్తూ ముందుకి పరిగెడుతుంది. అలా వెనక్కి తిరిగి చూస్తూ పరిగెడుతుండటంతో కింద ఏముందో చూసుకోక కాలికి ఏదో అడ్డు తగిలి కింద పడింది ఆ పడటం పడటం ఊభి లో పడింది. అది చూసిన ఐదుగురు తన దగ్గరికి వెళ్లి “ఎమ్మా చెప్పేది వినకుండా ఎందుకు పరిగెడుతున్నావు? ముందుకు వెళ్తే ఊభి ఉంది పడిపోతావని చెప్పడానికి వస్తుంటే నువ్వు ఆగకుండా పరిగెడుతూనే ఉన్నావే, ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో అంటూ వాళ్ళు వాపోయారు. సిరి పరిస్థితి దారుణంగా ఉంది ఎంత బయటికి రావాలనుకుంటే అంత లోపలికి వెళ్లి పోతుంది. అప్పుడు సిరి “అన్నా!! రక్షించండి అన్నా నన్ను అంటూ ఏడుస్తూ బ్రతిమిలాడుతోంది వాళ్ళను. ఉండు చెల్లెమ్మ నువ్వు ఏమీ కంగారు పడకు అని వాళ్ళు అక్కడే ఒక చెట్టు బాదు పడి ఉంటే దాన్ని మోసుకుని వచ్చి సిరి ని దాన్ని పట్టుకోమని చెప్పి వాళ్ళు అంతా కలిసి బలవంతంగా తనని బయటికి తీశారు. బయటికి వచ్చిన సిరి వాళ్ళ ఐదుగురి ముందు మోకాళ్ళమీద కూర్చుని ఏడుస్తూ “అన్నా మీరే లేకుంటే ఈరోజు నేను చచ్చిపోయేదాన్ని మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను అన్నా నన్ను క్షమించండి” అంటూ భోరున విలపించింది. అది విని వారిలో ఒకరు “అమ్మా అందరూ ఒకలా ఉండరు ఎవరో కొంతమంది అలా చేసారని, చేస్తున్నారని అందరి మగాళ్లను మృగాళ్లుగా భావించటం చాలా తప్పు తల్లి, మాలోకూడా మానవత్వం ఇంకా మిగిలే ఉంది.తప్ప తాగారు అనగానే తప్పుడు మనుషులు అయిపోరుగా.విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది అది జంతువులకి ఉండదు. మనుషుల్లో కొంతమంది తాగగానే అది కోల్పోతారు అటువంటి సమయంలోనే కొన్ని దుర్గటనలు జరుగుతున్నాయి. మరీ విచక్షణ కోల్పోయేంత స్థాయికి అయితే ఎవరూ రాకూడదు. ఇదంతా నీకు చెప్పి అనవసరం తల్లి మమ్మల్ని చూడగానే నీకు అదే భావం కలిగిందని నాకు అర్థం అయింది. నిన్ను వదిలేసి మీ ఫ్రెండ్ పరిగెత్తినప్పుడు బాగా అర్థం అయింది. కానీ నువ్వు మా వైపు పరిగెత్తకుండా ముందుకి వెళ్లేసరికి ఎక్కడ ఉభిలో పడతావేమోనని నీ వెనక మేము ఆగమని పరిగెత్తాము, అంతే చెల్లెమ్మ అంతకుమించి ఇంకేమి లేదు, సరే పద నిన్ను మీ వాళ్ళ దగ్గర వదిలేస్తాము అని సిరి ని లేవదీసి జాగ్రత్తగా తనను అడవి బయట వదిలిపెట్టారు ఆ ఐదుగురు అన్నలు….
**శుభం ***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!