పాత సామాన్లు

(అంశం : “మానవత్వం”)

పాత సామాన్లు

రచన:చంద్రమౌళి భవానీ శంకర్

” పండుగ దగ్గరకు వచ్చేస్తోంది. ఈ రంగమ్మేమో పనికి రావడం మానేసింది.
రోజూ పనే చాలా కష్టంగా ఉందనుకుంటే ఇప్పుడు పండగ కోసం ఇంట్లో ఉన్న ఇత్తడి, రాగి, కంచు పాత్రలన్నీ తళతళా మెరవాలి అని అత్తమ్మ ఆదేశం. అసలు ఇంట్లో ఇన్ని పెద్ద పెద్ద గిన్నెలు ఎందుకో అసలు.
ఇదివరకు ఏదైనా పండగ వస్తే బంధువులు అందరూ కలిసి ఒకే చోట చేరి పండగ చేసుకునేవారు కాబట్టి వాళ్ళందరికీ వండి పెట్టడం కోసం ఇంత పెద్ద దబరా గిన్నెలు అవసరం ఉండేవి.
ఇప్పుడు ఇంట్లో ఉండే నలుగురికి వండడం కోసం ఇవన్నీ అవసరమా. హు, ఏదైనా చెప్తే కోడలు అత్త మాటకి ఎదురు చెప్పింది అంటారు. ” అని మూలుక్కుంటూ గిన్నెలు తోమే పనిలో పడింది లత.

” ఏంటి లతా… పండక్కి పిండివంటలు, స్వీట్లు ఏమైనా చేస్తున్నారా. టెంట్ సామాన్ల దగ్గర నుంచి ఇన్ని గిన్నెలు తెప్పించారు. వాళ్ళు కడిగే ఇస్తారు గా. మళ్ళీ నువ్వు తోముతున్నావు ఎందుకు. ” అంటూ ఆరాలు తీయడానికి తయారయింది కొత్తగా పక్కింట్లో అద్దెకు దిగిన రాణి.

” ఛా.. ఊరుకో, ఇవన్నీ మా వంశ పారంపర్య గిన్నెలు, ముంతలు. ప్రతి పండక్కి వీటిని అటక మీదనుంచి తీసి తళతళా మెరిపించక పోతే మా అత్తగారు నా తాట తీస్తుంది.
పిండి వంటలు, స్వీట్లు చేసే ఖాళీ ఇప్పుడు మాకెక్కడ ఉంది. ఏమ్ కావాలి అన్నా ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవడమే. ” అంటూ చెప్పి ఒక గిన్నె ఎంత తోమినా నల్లగా కనిపిస్తుండటంతో ” ఇవి వదలడమే లేదు. ” అని విసుక్కుంది లత

” గిన్నెలు తోమడానికి ఏమ్ వాడుతున్నావు లత. ”  అడిగింది రాణి.

రాణి ని ఒకసారి ఎగాదిగా చూసి ” ఏమ్ వాడతాం. ఎప్పుడూ వాడేవే. చింత పండు, కొబ్బరి పీచు. ఇవే వాడతాను. ఇంకేమైనా వాడితే గిన్నెలు పాడవుతాయని అత్తయ్య ఒప్పుకోరు. ” అని నిట్టూర్చింది లత.

” నేనొక ఐడియా ఇవ్వనా. ” గబగబా లత దగ్గరికి వచ్చి కళ్ళల్లో కన్నింగ్ నెస్ బోలెడు చూపిస్తూ అడిగింది రాణి.

ఒక్కసారిగా రాణి అలా రావడం చూసి దడుచుకుని మనసులోనే ” తూ, థూ ” అనుకుని ” నాకు పనికి వచ్చే పరిష్కారం చెప్తా అంటే ఎందుకు వద్దంటాను. ” అని ఒక చెవి రాణికి అప్పగించింది లత.

” మొన్న వర్షాలకు మేడ మెట్ల మీద నాచు పడితే అది కడగటానికి మా ఆయన ఆసిడ్ తెప్పించారు. ఆ ఆసిడ్ తో కడగగానే మెట్లన్ని తెల్లగా వచ్చేశాయి.  అది ఇంకా చాలా ఉంది. నీకు కావాలంటే తెచ్చి ఇస్తాను. యాసిడ్ వేసి కడిగినట్లు మీ అత్తకి ఎలాగూ చెప్పం కదా.  ” అని కోల్గెట్ పేస్ట్ యాడ్ లో లాగా పళ్ళు ఇకిలించింది రాణి.

అదే సమయంలో…

లత భర్త గోపాల్ , రాణి భర్త రాజా పని చేసే ఆఫీస్ కాంటీన్ లో వాళ్ళిద్దరూ చాలాసేపటి నుంచి ఒక విషయం కోసం చర్చించుకుంటున్నారు.

” ఈ రోజు ఏదో ఒకటి తేల్చేయ్యాలి రాజా. మా ఆవిడ లత ఏమో ఆ పాత సామాన్లు తీసెయ్యమని ఒకటే గోల. మా అమ్మేమో అవి ఎప్పుడో అప్పుడు ఉపయోగ పడతాయి. అవి నిన్నేమీ అన్నం, నీళ్ళు అడగలేదు కదా. అలా ఉంచు. ” అని ఇద్దరూ నన్ను ఆడుకుంటున్నారు అన్నాడు గోపాల్.

” మా ఇంట్లో కూడా ఇలాగే అత్తా కోడళ్ళ గొడవలు. వీళ్ళు అందరికీ వ్యతిరేకం. మా రాణి ఏమో ఇంట్లో పెద్ద తరహాగా ఉండి అన్ని సామాన్లు ఉండాలి అంటుంది. మా అమ్మేమో ఈ తరం వాళ్ళ లాగా అవసరం అయినవి ఉంచుకుని మిగిలినవి తీసెయ్యక ఇన్ని సామాగ్రి అవసరమా అంటుంది. ” అని వాపోయాడు రాజా.

” మీరిద్దరూ చెరో అయిదొందలూ నా మొహాన కొడితే మీ ఇద్దరికీ ఉపయోగ పడేలా మంచి ఉపాయం నేను చెప్తా. ఆ చెవి ఇటు పడెయ్యండి. ” అన్నాడు అప్పుడే వచ్చిన ప్యూన్ పుల్లారావు.

పుల్లారావు చెప్పిన ఉపాయం విని గోపాల్ , రాజా ఇద్దరి కళ్ళూ ఆనందం తో మెరిసాయి.

ఒక 3 గంటల తర్వాత …
గోపాల్ ఇంట్లో …

కాలు కాలిన పిల్లి లాగా తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడుతోంది లత.

” ఈ రాణి చెప్పిందని యాసిడ్ పెట్టి గిన్నెలు శుభ్రం చేద్దామని చూస్తే అన్నిటికీ పచ్చ రంగు వచ్చి ఇంకా ఎక్కువ పాడయ్యాయి. ఈ విషయం అత్తయ్య కి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడేం చేయాలి రా దేవుడా. ” అని అనుకుంటూ కంగారులో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది కాస్తా కాలు మెలిక పడి కింద పడింది.

అప్పుడే టక్కున తెరుచుకుంది ఆ గది తలుపు.

” అమ్మో, అత్తయ్య వచ్చేసింది.”  అనుకుంటూ కింద పడిన లత అలాగే దొర్లి మంచం కింద దాక్కుని ఏమ్ జరుగుతుందా అని చూడసాగింది.

గది లోకి వచ్చిన గోపాల్ లోపల లత కనిపించక పోవడంతో తనని పిలుస్తూ బయటకు వెళ్లాడు.

వచ్చింది గోపాల్ అని తెలిసాక కంగారు తగ్గి ఊపిరి పీల్చుకుని ” ఎందుకు పిలిచాడు. ” అనుకుంటూ వెనకే వెళ్ళింది లత.

బయటకి వచ్చిన గోపాల్ కి తన తల్లి ఏవో వెతుకుతూ అక్కడక్కడే కంగారుగా తిరుగుతూ ఉండటం చూసి దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు.

” మన ఇంట్లో ఇత్తడి , రాగి, కంచు గిన్నెలు, బిందెలు అన్ని ఇందాక లత తోమిపెట్టానని చెప్పింది రా. అవెక్కడ ఉన్నాయో కనిపించలేదు. అవే వెతుకుతున్నాను. ” అని చెప్పింది గోపాల్ తల్లి.

అవి అత్తగారి కంట పడితే తన పరిస్థితి ఏమిటో అనుకుంటూ గుటకలు వేస్తూ గోడ పక్కన నిల్చుంది లత.

” అవి లేవమ్మా. ” అన్నాడు గోపాల్.

ఆశ్చర్యంగా అర్థంకానట్లు చూసారు లత, గోపాల్ తల్లి.

” పాపం రాజా వాళ్ళ ఆవిడ రోజూ ఇంట్లో ఎక్కువ సామాగ్రి లేవని పోరు పెడుతోందట. అవన్నీ కొత్తవి కొనాలంటే ఇప్పుడు తన 3 నెలల జీతం ఖర్చు పెట్టాలి అని రాజా బాధ పడుతుంటే చూడలేక…” అని చెప్తూ ఆగిన గోపాల్ ని చూసి

” ఆ.. చూడలేక…” అని అడిగింది గోపాల్ తల్లి.

” మన ఇత్తడి, రాగి, కంచు దబరా గిన్నెలు, బిందెలు, పాత్రలు అన్ని వాడికి ఇచ్చేశాను. ” అని తల్లి వైపు చూసాడు గోపాల్.

ఆవిడ ముఖం లో ఏ భావం కనపడలేదు.

లత మాత్రం మనసులోనే గంతులు వేసేస్తోంది.

” పోనీలే నాన్నా, నువ్వు మానవత్వం తో అతని బాధ చూడలేక ఇచ్చావు. మనకి వాటి అవసరం ఎలాగూ లేదుగా. కాకపోతే ఈ సంవత్సరం ఇంట్లో ఉన్న అనవసరం అయిన సామాగ్రి అంతా అమ్మేస్తే కనీసం ఒక తులం బంగారం వస్తుంది కదా. లతకి ఏదైనా వస్తువు కొందాం అనుకున్నాను. వచ్చే ఏడాది చూద్దాం లే ఇక ఆ మాట. ” అంటూ లోపలికి వెళ్ళిపోయారు.

అత్త గారి మాటలకి లతకి ఏడుపొచ్చినంత పనైంది.

మరో వైపు రాణి ఇంట్లో…

భర్త తెచ్చిన వస్తువులు ఇంట్లో అందంగా కనపడేలా పెట్టాలి. అనుకుని వెళ్తున్న రాణి తో వాటిని శుభ్రం చెయ్యాలి. అని చెప్పాడు రాజా.

సరే అంటూ వాటి మీద కప్పి ఉంచిన కవర్ తీయగానే అక్కడ కనిపించిన పచ్చటి రంగు లోని చాలా సామాగ్రి మమ్మల్ని శుభ్రం చెయ్యి అన్నట్లు చూస్తుంటే షాక్ అయి ” ఇప్పుడు ఇవన్నీ తోమాలా. ” అంటూ తల పట్టుకుంది రాణి.

సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!