పండగ

పండగ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాళ్ళపల్లి నాగమణి

“పండక్కు, అరిసెలు చేసుకుంటే బాగుండు…” తనలో తనే అనుకున్నట్టు పైకి అనేసింది భారతమ్మ.
హాల్ లో కూర్చుని టి.వి చూస్తున్న ఆమె, ఏదో ఛానల్ లో పండగ ప్రొమో… చూసేసరికి, సంక్రాంతి సంబరాలన్నీ, మనసులో మెదిలి, వాటిలో ముఖ్య భాగమైన పండగ పిండివంట, దాని రుచి మనసులో మెదిలి, పైకి అనేసింది.
“అరిసెలు తినాలని ఉందామ్మా…”.  ప్రేమగా అడిగాడు కొడుకు రవి. అతను ఇంకా రాత్రి విన్న, చాగంటి వారి ప్రవచనం తాలూకు ప్రభావంలో ఉండటం వలన,  ఎంతో ఆప్యాయత ధ్వనిస్తుందా గొంతులో.
“అమెజాన్ లో ఆర్డర్ చేస్తా లేండి..” అక్కడే ఇంకో సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న కమల జవాబిచ్చింది, చాలా తేలికగా… ఆమె ఒక బ్యాంకు ఉద్యోగిని. భర్త పెద్ద ఆఫీసరు. ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. చేతినిండా డబ్బు.. చేతిలో అన్నీ క్షణాల్లో అమర్చ గలిగే సెల్ ఫోన్ లోని యాప్ లు.
“బజారు వస్తువులు కొన్ని మనం అనుకున్నంత నాణ్యత, రుచి ఉండవు కదమ్మా..” తన మాటకు విలువ ఉండదని తెలిసినా, గబుక్కున అనేసింది
భారతమ్మ.
“రాధా.. కొంచెం కాఫీ ఇవ్వు” అంటూ పిలిచింది అత్తగారి మాట పట్టించుకోనట్లు. భార్య అంతమాటన్నాక, ఇంకా తను మాట్లాడటానికి ఏం లేదని తెలుసు కాబట్టి, మౌనంగా ఫోన్ లోకి తలదూర్చేశాడు.
“అలాగే మేడం..” అంటూ బదులిచ్చింది వంటమనిషి రాధ. వంటచేస్తూ ఈ సంభాషణ అంతా వింటున్నది.
పండగ వస్తున్నది. తనింట్లో…తను, తనభర్త కలిసి సంపాదించుకుంటే కానీ నెలగడవదు. భర్తది ప్రైవేటు ఉద్యోగం. వాళ్ళకి అవసరమున్నన్నాళ్ళు చేయించుకుంటారు, తర్వాత అక్కర్లేదు పొమ్మంటారు. మళ్ళీ వేరేచోట వెతుక్కోవాలి. తనూ… ఇదిగో.. ఇలా ఉద్యోగాలకెళ్ళే ఆడవాళ్ళో, వృద్ధాప్యంలో చేసుకోలేని దంపతులకో తన అవసరం పడుతుంటుంది. రెండు, మూడు ఇళ్ళల్లో రోజు వంటలు చేసిపెట్టి, ఆవచ్చే డబ్బులతో ఇద్దరూ కాపురం నెట్టుకొస్తున్నారు. ఒక్కోసారి, ఒకరికి పనుంటే మరొకరు ఖాళీగా ఉంటారు. అందులో ఈ కరోనా వలన అసలు పనులు లేకుండా పోయాయి. అలాగే సర్దుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ అంటేనే, పెద్ద పండుగ అని పేరు. ప్రతి ఒక్కళ్ళు తమశక్తి కొద్ది కొత్త బట్టలు కొనుక్కుంటారు. కనీసం పిల్లలకైనా కొనాలని తన ఆశ. తను ఇంతకు ముందు వంటచేసిన ఇంట్లో, ఆ యజమానురాలు, అప్పుడప్పుడు పిండివంటలు చేయించుకుని, కొంతడబ్బిచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు.
‘పోనీ ఈ మేడంగారికి, చేసి పెడితే, చేయించు కుంటుందేమో!!! అటు పెద్దామె రంధీ తీరుతుంది, తనకూ పండక్కు, చేతిలో కొంచెం డబ్బులు పడతాయి..’ అనుకుంది.
“మేడం, మీకు కావాలంటే అరిసెలు, నేను చేసిపెడతాను” అంది కాఫీ ఇస్తూ..
“నువ్వు చేయడం చేస్తావు. మళ్ళీ వాటికి కావలసిన సరుకులు, తెప్పించటం, వండేటప్పుడు ఇంటినిండా గలీజు, వేడి…, నూనె వాసన…” చిరాగ్గా మొహం పెట్టింది కమల.
“పోనీ, మా ఇంటిదగ్గర చేసి తెస్తానమ్మా…” చివరి ప్రయత్నం చేసింది, చిరు ఆశతో.
కమల ఏం మాట్లాడక పోవడంతో వంటింట్లోకి వెళ్ళి పోయింది. తన పని పూర్తి చేసుకుని, వెళ్ళేముందు కమలకు చెప్పటానికి, బెడ్రూం దగ్గరకు వెళ్ళింది. లోపల భార్యాభర్తల మధ్య ఏం సంభాషణ జరిగిందో…
“ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని, సరుకులు కొనుక్కెళ్ళి, మీ ఇంట్లో వండుకురా..” అంటూ డబ్బులిచ్చింది.
ఇంటికెళ్ళే దారిలోతెలిసిన, కిరాణా కొట్టు దగ్గర సరుకులు తీసుకోవడానికి వెళ్ళింది. ఇదివరకు కొనుగోలు దార్లతో కిటకిటలాడే ఆ షాపు ఇప్పుడు బోసిగుంది.
“రా రాధమ్మ!! బాగున్నావా..” పలకరించాడు యజమాని గోవిందు.
“బాగున్నాను అన్నా.. మీరెలా ఉన్నారు!!” అంటూ తనక్కావలసిన సరుకులు చెప్పింది.
“ఏం రాధమ్మా… పండగ జోరుగా చేస్తున్నావా!!” చమత్కరించాడు.
“లేదన్నా… నాక్కాదు.. నా పరిస్తితి నీకు తెలియదా!!” అంటూ విషయమంతా వివరంగా చెప్పింది.
“ఏందన్నా… ఎప్పుడూ మనుషుల తో కిటకిటలాడే షాపు, ఇలాఉంది!! వ్యాపారం ఎట్లా జరుగుతుంది..” తనూ అతని యోగ క్షేమాలు ఆరాతీసింది
“ఏం చెప్పను రాధమ్మా.. ఇప్పుడందరూ… ఆన్లైన్ అని, పెద్ద పెద్ద షాపులెంటబడుతున్నారు.. ముడిసరుకులు కొని, చేసుకునేవాడేడి.. తయారైన ఫుడ్ ఆర్డర్, క్షణాల్లో డెలివరీట… అదిగో చూడు,” అంటూ, ఓ కంపెనీ కోటు వేసుకుని,  బైక్ పై వెళుతున్న డెలివరీ బొయ్ ని చూపించాడు.
“తెలిసిన వాళ్లు కొంతమంది, కరోనాకు బయటకు రాలేమంటే, ఫోన్ మీద లిస్ట్ రాసుకుని ఇంటికి పంపుతున్న.. వ్యాపారం పెద్దగా లేదమ్మా.. వేరే ఆలోచించాలి” అంటూ సరుకు లిచ్చాడు.
“వస్తానన్నా!!.” అన్న రాధతో,
“ఇదిగో.. నాకు రెండు అరిసెలు రుచి చూపించు..” నవ్వుతూ చెప్పాడు.
“అలాగే అన్నా!!” అంటూ వెళ్లిపోయింది రాధ.
భర్త సహాయంతో, కమ్మటి అరిసెలు తయారు చేసి, తళతళా మెరుస్తున్న, స్టీల్ డబ్బాలో పెట్టుకెళ్ళి కమలకు ఇచ్చింది. అలాగే, ఓ రెండు కవర్ లో పెట్టి గోవిందుకూ ఇచ్చింది.
ఆ తర్వాత రోజు..
“రాధా చాలా బాగా చేశావు. నేను మా బ్యాంకులో వాళ్ళకు రుచి చూపించా… చాలా బాగున్నాయి, మాకు చేయించి పెట్టమన్నారు.చేస్తావా!!” ప్రశంసా పూర్వకంగా అడిగింది.
డబ్బు పడేస్తే వచ్చే వస్తువు.. అది, అమేజాన్ అయితే ఏమీ,అప్పాయమ్మ చేస్తేనేమి!!! చేస్తానంటూ తల ఊపింది..
ఎంతమందికి చేయాలో, ఎన్ని చేయాలో, ఎంత ఖర్చవుతుందో, రాధ శ్రమకు ప్రతిఫలం కూడా కలిపి లెక్కేసి, డబ్బిచ్చింది. సరుకులు కొనటానికి, గోవిదు షాప్ కి, వెళ్ళినప్పుడు, “రా..రా..రాధమ్మ..”అంటూ
“రాధమ్మా!! ఇక్కడ బిజినెస్ తగ్గిన తర్వాత, ఊరి చివర బస్తీలో, మా వాడితో చిన్న షాపు తెరిపించానమ్మా… అక్కడ వాళ్ళకు, ఆన్లైన్ తెలవదు. ఏరోజు సరుకులు, ఆ రోజు కొనుక్కుంటారు. తినుబండారాలు ఇష్టపడతారు. ఈ పండగలో, అక్కడ వాళ్ళకి ఒకటి, రెండు చొప్పున అమ్మినా బోలెడు బేరం.. నాకు చేసి ఇస్తావా.. వచ్చేది చెరిసగం…” అడిగాడు.
సంతోషంగా ఒప్పుకుంది. పండగ ముందు రోజుదాకా చేతినిండా పని. గబగబా వంటపనులు ముగించుకొని వచ్చి, అర్థరాత్రి వరకూ వండుతూ ఉండేది. నాలుగు డబ్బులు చేతిలో పడ్డాయి. భర్త పిల్లలతో కలిసి, బజారుకెళ్లి, రోడ్డు పక్కన ఉన్న, దుకాణంలో, తెల్ల చుక్కలతో ఎర్రగా మెరుస్తున్న గౌను పాపకు, జీన్స్ పాంట్, టీ షర్ట్ బాబుకి కొంది.
కొత్త బట్టలు చూసి సంబరపడుతున్న పిల్లల్ని చూస్తుంటే, ఇన్ని రోజుల రాధ కష్టం ‘ఉఫ్’ మని ఎగిరి పోయింది. పండగ సంతోషం కలిగింది. భారతమ్మ గారు, జిహ్వను తృప్తి పరుచుకొని పండగ ఆనందం పొందారు.
గోవిందూ, ఇక్కడ తను పొందిన నష్టాన్ని, శివార్లలో బస్తీ జనానికి తీపి తినిపించి, కొంచెం లాభపడ్డాడు. అలా రాధ ఆలోచన పండగకు శోభ తెచ్చింది.

* * *

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!