అమ్మ మాట

అమ్మ మాట
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

“కల్పనా కల్పనా! ప్లీజ్ వెళ్ళొద్దు నా మాట విను!” అంటూ తల్లి ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది కల్పన.
కల్పన చేసిన పని కన్నా తను అన్న మాటలే ఎక్కువగా బాధిస్తున్నాయి వసుంధరని.
“అమ్మా నీలాగే నా బ్రతుకు కూడా బుగ్గిపాలు చేస్తావా అమ్మా? నాకు నచ్చిన వ్యక్తితో నా జీవితాన్ని నాకు నచ్చినట్టు బ్రతికే హక్కు కూడా నాకు లేదా? నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం సుధాకర్ ని తప్ప వేరే ఎవర్నీ చేసుకోను. మా పెళ్ళి ఎలాగూ నీకు ఇష్టం ఉండదు కాబట్టి, గుళ్ళో పెళ్ళి చేసుకుంటున్నాం. నువ్వు ఒప్పుకున్నప్పుడే నీ దగ్గరకి వస్తాను. సుధా చాలా మంచివాడు అమ్మా, నీకు నచ్చలేదని అతని గురించీ తక్కువ చేసి మాట్లాడకు. నాకు నచ్చదు!” అంటూ వసుంధరని మాటలతోనే చిత్రవధ చేసింది కల్పన.
దీనికి అంతటికీ కారణం సుధాకర్. సుధాకర్, కల్పన ఒకే ప్రాజెక్ట్ పని మీద కలిశారు, కొంత కాలం ఇద్దరూ కలిసి పని చేసారు, తర్వాత అతను ఒడిశా లో వేరే బ్రాంచ్ కి వెళ్ళిపోయినా వాళ్ళిద్దరి మధ్యా స్నేహం మాత్రం పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళకి అది ప్రేమగా మారింది.
ఆ విషయం వసుంధర కి చెప్తే, “వేరే రాష్ట్రంలో ఉంటూ నీతో మాట్లాడుతున్న అతను మంచివాడేనని ఎలా చెప్పగలవు? దగ్గర ఉండి చూస్తేనే కదా తెలిసేది. తొందరపడకు, తీరిగ్గా ఆలోచిద్దాం!” అంటూ సర్దిచెప్ప బోయింది తల్లి.
తల్లి మాటలు కాదని సుధాకర్ కోసం వెళ్ళిపోయింది కల్పన. కూతుర్ని తలచుకుంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడ్వసాగింది వసుంధర. ఒక్కసారి గతం తన కళ్ళ ముందు కనపడింది.

********

వసుంధర ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి గుండెపోటు కారణంగా మరణించాడు. తన తర్వాత నలుగురు పిల్లలు ఉన్నారు, ఇంటికి ఆమే పెద్ద కూతురు. చదువుల్లో ఫస్ట్ అయినా,  చేతి వ్రాత ఎంత బాగున్నా కానీ వసుంధరకి నుదుటి రాత మాత్రం అంతంత మాత్రంగానే రాసాడు ఆ భగవంతుడు. తల్లి నిర్మల పిల్లల బాగోగులు చూసుకోలేక సతమతమయ్యేది.
ఆ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని వచ్చాడు రామేశం, వసుంధరని తనకు ఇచ్చి పెళ్ళి చేస్తే మిగతా పిల్లలని తానే చదువిస్థానని, వసుంధర చెల్లెళ్లకు పెళ్లిళ్లు కూడా చేస్తానని చెప్పుకొచ్చాడు.
గత్యంతరం లేక నిర్మలమ్మ వసుంధర పెళ్ళి రామేశంతో చెయ్యటానికి ఒప్పుకుంది. రామేశం నిర్మలమ్మకి వరుసకి అన్నయ్య, వేలువిడిచిన పిన్ని కొడుకు. వయసు నలభై పైనే ఉంటుంది. ఇద్దరు భార్యలూ చనిపోయారు, మొదటి భార్యకు సంతానం లేదు, రెండవ భార్య ఇద్దరు కవల పిల్లల్ని కానీ పురిట్లోనే కన్ను మూసింది. పిల్లలని చూడటానికి అని మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు రామేశం..అక్క ఇబ్బందుల్లో ఉందని తెలిసి, కుందనపు బొమ్మలాంటి అక్క కూతురు వసుంధర కోసం వచ్చాడు.
మిగతా పిల్లలని చూసుకుంటాను అనేసరికి నిర్మలమ్మ ఏమీ మాట్లాడలేక పోయింది. తనకు పెళ్ళి ఇష్టం లేకపోయినా ఏడుస్తూ తాళి కట్టించుకుంది వసుంధర. రామేశానికి లేని అలవాట్లు లేవు, ఈ విషయం పెళ్ళి తర్వాతే తెలిసింది నిర్మలమ్మకి. కానీ ఏమీ అనలేక పోయింది, కూతురి జీవితం చేతులారా పాడు చేశానని బాధపడింది. పెద్దలు కూడబెట్టిన ఆస్తి ఉండటం వల్ల, ఆ డబ్బుతో అన్నట్టు గానే వసుంధర తమ్ముళ్ళు, చెల్లెళ్ళని చదివించాడు. అదే తృప్తితో బ్రతుకుతోంది వసుంధర. ఈలోగా తల్లి అయ్యింది, కల్పన పుట్టింది. కల్పన చిన్నతనంలోనే కాన్సర్ తో చనిపోయాడు రామేశం. తమ్ముళ్లు ఇద్దరూ చేతికి అంది రావటంతో, చెల్లెళ్లకు పెళ్ళి చేసి, కల్పనని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వచ్చింది వసుంధర. కూతురి ప్రేమ విషయం చెప్పగానే, సుధాకర్ గురించీ ఎంతో ఆలోచించి, అతను మంచివాడు అవునా కాదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. అది తట్టుకోలేక వెళ్ళిపోయింది కల్పన. సుధాకర్ కోసం భువనేశ్వర్ వెళ్ళాక కానీ తెలియలేదు కల్పనకు, అతని నిజ స్వరూపం ఏమిటో. తెలియగానే ఎంతో చాకచక్యంగా, అతనికి తెలియకుండా అక్కడినుంచీ తప్పించుకుంది కల్పన. రైల్వే స్టేషన్ చేరుకుని దొరికిన ట్రైన్ ఎక్కేసింది. సీట్లో కూర్చుని, ఆలోచించగా తల్లి వసుంధర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తల్లి బాధ పెట్టినందుకు క్షమాపణలు అడగాలి అనుకుని నిశ్చయించుకుని, నిశ్చింతగా పయనమైంది కన్నతల్లి దగ్గరకి.

*******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!