దేవుడు ఇచ్చిన కానుక.!!

దేవుడు ఇచ్చిన కానుక.!!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సరిత రవిప్రకాష్

పెద్దింటి సరోజమ్మ పక్కింటి పార్వతమ్మ మాట్లాడుకుంటున్నారు.
ఈ రోజు ఏమైనా విశేషం ఉందా సరోజమ్మ మీ ఇంట్లో అని అడిగింది. పార్వతమ్మ.
అందుకు సరోజమ్మ అలాంటిదేమి లేదు పార్వతమ్మ మా అబ్బాయి సందీప్ కోడలు చంద్రిక పెళ్ళి జరిగి 5 సంవత్సరాలు అయ్యింది కదా అందుకు బయటికీ హోటల్ కి వెళ్ళడానికి లేదు లాక్ డౌన్ కదా, అందుకు మాములుగా ఇంట్లోనే పెళ్ళి వార్షికోత్సవం ఆచరించాలి అని అనుకున్నాము.. అని చెప్పింది పార్వతమ్మ.
అయిదు సంవత్సరాలు అయ్యాయి కదా ఇంకా పిల్లలు కాలేదు మీ కోడలికి అని అడిగింది సరోజమ్మ.
అవును మేము మొక్కని దేవుడు లేడు ఎక్కని గుడి లేదు, అందరు డాక్టర్లకు చూపించాము అయిన మా కోడలికి పిల్లలు పుట్టలేదు. మాకేమో వయసైపోతోంది. చచ్చే కన్న ముందు మనమళ్లను చూడాలి వాళ్ళను ఆడిపించాలి అని ఆశగా ఉంది పార్వతమ్మ కానీ ఆ దేవుడు మాపై ఎందుకో ఇంకా కరుణించటంలేదు అని అన్నది…
వంట గదిలో వంట చేస్తూ వారి మాటలు విన్న సరోజమ్మ కోడలు చంద్రిక ,ఈ గ్యాస్ స్టవ్ పై ఉన్న మంటలో నేనే వేగిపోతున్నట్టు ఉంది అనిపించింది..
పెళ్ళి అయిన ఒక సంవత్సరం సంతోషంగా ఉన్నాం అంతే…! కానీ గడచిన ఈ 5 సంవత్సరాలలో 2-3 సార్లు అబార్షన్ అయ్యాయి, తరువాత ఇంటి పక్కల వాళ్ళు చుట్టాలు ఇదే విషయం ,ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినా పెళ్ళిళ్ళకు వెళ్లినా ఒకటే ప్రశ్న.. ఎందుకు చంద్రికా నీకు ఇంకా పిల్లలు కాలేదు. మీరిద్దరూ వద్దనుకుంటున్నారా.. ఏంటి ఇద్దరు ఇలా హ్యాపీగా గడపాలను కుంటున్నారా. వయసయ్యాక పిల్లలైతే అంత బాగోదు ఇలాంటి ఎన్నో ఉచిత సలహాలు విని విని చాలైపోయింది చంద్రికకు.ఈ విషయాలన్నీ చంద్రిక సమయం దొరికినప్పుడల్లా సందీప్ తో చెప్పేది. సందీప్ ఒకటే రెడీమేడ్ సమాధానం.
మన ఇద్దరికి అంత వయసేమయ్యిందని పిల్లలవుతారులే..! ఇంతకు నీకు ఇష్టమైనట్టే డాక్టర్ కు చూయించుకుంటున్నాం కదా… జనం మాట్లాడతారని నీవెందుకు బాధ పడతావు….డాక్టర్ చెప్పాడు అన్ని ట్రీట్మెంట్స్ తీసుకొంటున్నాం కదా..ఇంకా సమయం ఉంది చూద్దాం అని అంటాడు, వాళ్ళకేంటి మగవాళ్ళు ఏదో పని ఉంది అని బయటకు వెళ్ళిపోతారు, అయితే ఎప్పుడు ఇంట్లో ఉండే అడవాళ్ళకు కష్టం ఏంటి అని తెలుస్తుంది. ఇంటికి వచ్చే చుట్టాలతో పాటు పక్క పక్కన ఇళ్ళవాళ్ళ గుచ్చే చూపులు గుచ్చి గుచ్చి మాట్లాడే మాటలను ఎదిరించలేము అనేది చంద్రిక బాధ, ఆమె మనసుకు బాధ కలిగినప్పుడంత దేవుని గదికి వెళ్ళి దేవునికి దీపం పెట్టి దేవునికి చేతులు జోడించి ఒక్కతే కూర్చొని మనసుకు సమాధానం అయ్యేవరకు ఏడ్చేస్తోంది.
హడావిడిగా ఆరోజు ఇంటికి వచ్చిన సందీప్ చెప్పాడు,
మా ఆఫీసులో మాతో పాటే పని చేసే మా స్నేహితుడు రత్నాకర్ ఆయన భార్య సుధా ఇద్దరు పోయిన వారం నుంచి కరోనా వచ్చి మణిపాల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు, అని చెప్పాను కదా, ఇప్పుడేమో వారిద్దరి కండిషన్ సీరియస్ గా ఉందని ఇంకో స్నేహితుడు గోపాల్ చెప్పాడు, మాస్క్ వేసుకొని రెడీ అయి రా అక్కడికి వెళ్ళి చూసుకొని వద్దాం అని చంద్రికను తీసుకొని కార్ లో మణిపాల్ హాస్పిటల్ కు బయలుదేరారు, వాళ్ళు మణిపాల్ హాస్పిటల్ కు వెళ్ళే కంటే ముందే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అక్కడ ఉన్నారు.
సందీప్ చంద్రిక హాస్పిటల్ కు చేరుకోగానే ఎంతో బాధాకరమైన విషయం తెలిసింది, కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న రత్నాకర్ సుధా దంపతులు చికిత్స పొందుతూ హఠాత్తుగా ఇప్పుడే ఇద్దరూ చనిపోయారు అని స్నేహితులు చెప్పారు.
ఈవిషయం తెలిసిన స్నేహితులు అందరూ చాలా బాధపడ్డారు.. కానీ కార్యక్రమాలు చేయాలి కదా, అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి రత్నాకర్ దంపతుల బాడీలను ఇచ్చేవరకు మధ్యాహ్నం అయ్యింది, రత్నాకర్ సుధా దంపతులకు దగ్గరి చుట్టాలు ఎవరు లేనందుకు,స్నేహితులు అందరూ చేరి అంత్యక్రియలు చేశారు…
అంత్యక్రియల అనంతరం అందరూ స్నేహితులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాలని అనుకుంటున్నారు.
అక్కడే నిలబడి ఉన్న రత్నాకర్ ఇంటి పనిమనిషి దగ్గర వాళ్ళ 3 సంవత్సరాల పాప బోసినవ్వులతో చూస్తోంది. ఇవేవీ తెలియవు కదా అందుకే ముద్దుగా నవ్వుతోంది. అప్పుడు స్నేహితుడు గోపాల్ పాపను ఎత్తుకొని వచ్చి చంద్రిక చేతిలో పెడుతూ చెప్పాడు రత్నాకర్ కు దగ్గర చుట్టాలు ఎవరు లేరు, తనకు మేమే అన్నీ మీకు ఎలాగూ పిల్లలు లేరు కదా, ఈ పాపను మీరే ఎందుకు పెంచుకోకూడదు అన్నాడు..
తనతో పాటు ఉన్న అందరూ స్నేహితులు కూడా ఏక కంఠంతో అదే మాట అన్నారు రత్నాకర్ కు ఎవరు దగ్గరి చుట్టాలు లేరు మీరే ఎందుకు ఈ పాపకు తల్లిదండ్రులు కారాదు, అనాథల ఎందుకు పెరగాలి అన్నారు..!!
స్నేహితుని చేతిలో ఉన్న ఆ పాప చంద్రిక వైపు చూసి ఆశతో చూసినట్టు అనిపించింది చంద్రిక చేయి చాచేలోపే పాప నవ్వుతూ వచ్చింది, అది చూసి చంద్రిక ఎత్తుకొని ముద్దాడింది. ఈ పాప ఎంత ముద్దుగా ఉందండి, మనకు ఎలాగూ పిల్లలు లేరు, మనకు ఏ పిల్లలు వద్దు, ఈ పాపనే దత్తుకు తీసుకొని పెంచుకుందాం అన్నది. సరే అని సందీప్ తల ఆడించాడు,దగ్గరికి జరిగి పాపను ముద్దాడాడు..
ఒక వారం నుంచి మన ఐదవ పెళ్లిరోజుకు బహుమతి ఏమిస్తావు అని అడిగావు కదా చంద్రిక… ఇదే చూడు మనకు ఆ దేవుడు ఇచ్చిన బహుమతి అన్నాడు సందీప్.. ఆ క్షణంలో చంద్రిక కళ్ళలో ఆనందభాష్పలు నిండుకున్నాయి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!