మత్తు

మత్తు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

కుయ్ కుయ్ కుయ్ అంటూ పోలీస్ జీపు వచ్చింది. ఆ శబ్దం విని చుట్టు పక్కల వారందరు ఒక్కొక్కరు వస్తున్నారు. అప్పటి వరకు ఎవ్వరికి ఏమి జరిగిందో తెలియదు. ఎందుకంటే ఆ ఇంట్లో ముగ్గురు మాత్రమే నివసిస్తున్నారు. తల్లి ఇంటి దగ్గర వుంటే కొడుకు కోడలు కూలీ పనులకు పోతారు. ఒకే గది వున్న చిన్న ఇల్లు. సాయంత్రం ముందుగా వచ్చిన కోడలు శరీరంపై వస్త్రాలు లేకుండా పడివున్న అత్తను చూసి, భర్తకు ఫోన్ చేస్తే, పొలంలో కూలి పని చేస్తున్న చంద్రయ్య, పోలీసులకు ఫోన్ చేస్తే, వెంటనే జీపులో అక్కడికి వచ్చారు పోలీసులు.
అప్పటికే పరామర్శించి, అత్తమ్మకు చీర చుట్టి, నీళ్లు త్రాగించి, ఏమి జరిగిందని అడుగుతుంటే, 70 సంవత్సరాల చంద్రవ్వ సైగలతో ఇంటి వెనుక వైపు చూపిస్తున్నది. పోలీసులు ఎల్లమ్మను ప్రశ్నించి, ఆరా తీస్తున్నారు. నడుము వంగిపోయిన చంద్రవ్వ, ముడుతలు పడిన చర్మంతో, బోసి నోటితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా, చెప్పలేక చేతిని ఇంటి వెనుక వైపుకు చూపిస్తున్నది. అప్పుడే కొడుకు చంద్రయ్య వస్తే, పోలీసులు అతనితో వివరాలు సేకరిస్తున్నారు. తల్లి కళ్ళల్లో భయం, ఆందోళన, మాటిమాటికి ఇంటి వెనుకవైపు చూపిస్తూ, బిత్తర చూపులతో చూస్తుంటే, అనుమానం వచ్చి, అటు వైపు నుండి ఇంటి వెనిక్కి వెళ్ళాడు. అతని వెంట పోలీసులు వెళ్లారు. చుట్టు పక్కల వారిని దూరంగా తరిమి వెళ్లి చూస్తే, వెనుక ఇంటి అరుగుపైన మత్తులో ఒరిగి పోయిన ఆ ఇంట్లో వుండే మనిషి వాలకం చూసి పోలీసులు అతనిని ప్రశ్నించ సాగారు. బాగా త్రాగిన అతడు, పోలీసులు, ప్రజల అలికిడికి మత్తుగా కళ్ళు తెరిచాడు. వీడే!వీడే!వీడే!మా అమ్మను చెరిచాడు సార్! అంటూ చంద్రయ్య అరుస్తుంటే, వాడు అక్కడి నుంచి పారి పోవుటకు ప్రయత్నం చేశాడు. కానీ ఓ రాయి తగిలి కింద పడి పోయాడు. పోలీసులు అతన్ని పట్టుకొని జీపులో ఎక్కించారు. ముసలమ్మను ఇద్దరు పోలీసులు పట్టుకొని జీపులో హాస్పిటల్కు తీసుకొని పోయారు. చంద్రమ్మ వెంట ఎల్లమ్మ ఆసుపత్రికి పోతే, తాగుబోతు వెంట చంద్రయ్య పోలీస్ స్టేషన్కు పోయాడు. చంద్రమ్మకు ప్రాథమిక చికిత్స చేసి,కొన్ని సాంపిల్స్ తీసుకున్నారు డాక్టర్లు. స్టేషన్లో తాగుబోతుని ప్రశ్నించి, మళ్ళీ అందరూ కలిసి, హాస్పిటల్కు వచ్చారు. ఇతని నుండి కొన్ని సాంపిల్స్ తీసుకొని, అతన్ని పోలీసులకు అప్పగించారు.
అప్పటికే పొద్దుగుంకి చీకటి పడింది. తాగుబోతుని సెల్లో వుంచి, చంద్రయ్యతో కేసు నమోదు చేయించుకొని, వెల్లమంటే అతడు దవాఖానాకు వచ్చాడు. తల్లి అపస్మారక స్థితిలో వుంటే, గ్లూకోస్ ఎక్కించి, డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఎల్లమ్మ,చంద్రయ్య బైట ఏడుస్తూ కూర్చున్నారు.
రాత్రంతా వైద్యులు చికిత్స చేస్తున్నారు. తాగుబోతు మత్తు దిగిన తరువాత, పోలీసులు దండిస్తే తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. మధ్యాహ్నం ఫుల్లుగా సారాయి తాగి ఇంటికి వస్తే, పక్క ఇంట్లో వున్న చంద్రమ్మను చూసి, ఇంట్లోకొచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. లేవలేని స్థితిలో వున్న చంద్రమ్మను, అతడు పశువులా ప్రవర్తిస్తున్నాడు. అతనిని ప్రతిఘటించలేక పోయింది. ఇతడు ముసలమ్మ వస్త్రాలను పీకేసి, అమానుషంగా ప్రవర్తిస్తు, హింసించి, మానభంగం చేసానని, తరువాత వెళ్లిపోయానని పోలీసుల ముందు జరిగింది ఒప్పుకున్నాడు. తెలవారుతుండగా వైద్యులు రిపోర్ట్ పోలీసులకు అందజేశారు. అత్యాచారం జరిగిందని, ఆ తాగుబోతే నిందితుడని తెలియ జేశారు. పోలీసులు అతన్ని జైలు గదిలో వుంచి, కేస్ ఫైల్ చేశారు. తాగుడు వల్ల ఇంతటి ఘోరానికి పాలుబడ్డాడని FIR లో నందు చేసి, కోర్టుకు సమర్పించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!