ధర్మాగ్రహం

ధర్మాగ్రహం

-మంగు కృష్ణకుమారి

“భవానీ! ఆ రోజులు కావు. నువ్వు పనిమనిషితో కాస్త సద్దుకుపోవాలి. అప్పలనరసమ్మలా అందరినీ అనుకోకు” భర్త రంగనాధం చెప్పినా చెల్లెళ్ళు చెప్పినా వినదు భవానీ.

భవానీ తల్లి‌ గంగమ్మ జీవితం పల్లెటూర్లో గడిచింది. ఆమెకి అప్పల‌నరసమ్మ చెలికత్తలాగ ఉండేది. అన్ని పనులూ చేయడం, గంగమ్మ ఇంట్లోనే భోజనం కాఫీ టిఫిన్ అన్నీ గంగమ్మ పెట్టేది.
ఇంత పెట్టే గుణం ఉన్న గంగమ్మకి నోరూ ఎక్కువే..ఎంత అరిచినా అప్పలనరసమ్మ కిక్కురుమనేది కాదు.

ఆ పోలిక‌ భవానీకి కూడా కాస్త వచ్చింది. ఆమె అదృష్టానికి ఆమె దగ్గర పని చేసే సత్యవతికి చాలా సహనం.

భవానీ అరుపులూ కేకలూ పెట్టినా ఏమన్నా కిమ్మనదు. “ఈవిడ కేకలకి సత్యవతి కాబట్టి నోరు మూసుకొని ఊరుకుంది. ఇంకెవరూ చేయరు” ఇరుగు పొరుగు అంటారని కూడా భవానీకి తెలుసును.

సత్యవతి కూతుళ్ళు కాస్త పెద్దయేసరికి వాళ్ళ సాయంతో ఇంకో రెండిళ్ళు ఎక్కువ ఒప్పేసుకుంది. కూతురు సన్నమ్మని వేరే ఇళ్ళకి పంపి భవానీ ఇల్లు తనే చేస్తుంది. భవానీ దాటీకి కూతురు ఆగలేదేమో అని‌ లోలోపల భయం.

ఆ రోజు….. సత్యవతి తప్పనిసరి పనిమీద దగ్గరలో ఉన్న ఆడపడచు సూరప్ప ఇంటికి వెళ్ళింది. పక్కింట్లో తన పని పూర్తిచేసిన సన్నమ్మ,
‘తల్లి వచ్చిందా? లేదాని’ సన్నమ్మవచ్చింది. భవానీ చిందులు తొక్కుతోంది. “ఏమే! మీ అమ్మ చెప్పా పెట్టకుండా మానేసింది?” కేకపెట్టింది. సన్నమ్మ చెప్తూనే ఉంది.

వినకుండా “అలా మిడిగుట్లేసుకు చూపేమిటే? గిన్నెలు పెరట్లో వెయ్యు” అరిచింది. సన్నమ్మ గిన్నెలన్నీ పెరట్లో వేసి, భయం భయంగా తోమడం మొదలెట్టింది.

భవానీ పెరట్లోకి వచ్చి చూసి ఆగ్రహంతో కేక పెట్టింది. “సన్నమ్మా! ఆ జిడ్డు మూకుడు, పెనం వేరే పెట్టకుండా అన్నిట్లో కలిపేస్తావేమే? ఇవన్నీ జిడ్డు అవవా? చిన్న దానివా? చితకదానివా? గిన్నెలు తోమడం చేతకాకపొతే ఎలాగే? ” భవానీ అరుపులు పూర్తి కాకుండానే ఎప్పుడు వచ్చిందో సత్యవతి ఓ కేక వేసింది. “అమ్మగారూ! ఆగండి”

అప్పటికే సన్నమ్మ బిక్కచచ్చి కళ్ళనీళ్ళతో ఉంది. సత్యవతి దాని తల నిమిరి “సన్నీ లెగు” అంది.

కోపంగా భవానీవేపు తిరిగి “ఏటమ్మా? మీ అరుపులూ కేకలూ! అమ్మోరు పూనినట్టు అరస్తా ఉంటే సిన్నపిల్ల ఇది. ఏటి సెయ్యగలదు? నామీద అరిసినట్టు దీన్నేమి అనొద్దు. అయినా, తల్లెదురుగా పిల్లని తిట్టే తల్లి ఓర్సగలదా? ఇన్నాల్లలాగ
కాదు. దీన్నేటన్నా అంటే నేనూ పనిమానేస్తా అంతే! లెగే సన్నమ్మా” అంటూ సన్నమ్మ చెయ్యి పట్టుకొని సగం తోమిన గిన్నెలు వదిలేసి చరచరా వెళిపోయింది.

నోరు తెరుచుకొని భవానీ అలా ఉండిపోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!