(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
మూగబోయిన అంతరంగం
రచన: ప్రసాదరావు రామాయణం
కోడి కోయడం మానేసింది మా పల్లెలో
అంతర్జాలమొచ్చి
అంతరంగం మ్రోగడం మానేసింది మా గోళంలో
స్వార్ధాన్ని మెడకు చుట్టుకుని
వ్యర్ధ కోరికల ముళ్లలో పొర్లుతున్న మనిషికి
నోటు కొట్టి,ఓటు పట్టి
అందలమెక్కిన అందాజు
సామ్యవాదపు బుట్టక్రింద
కులాల కుంపట్లు రాజేస్తే
ప్రశ్నించిందా అంతరంగం?
విసిరేసిన శిశువును
కసికసిగా కాకులు కళ్ళు పొడుస్తుంటే
కుక్కలు ఎముకలు నములుతుంటే
అమ్మ అంతరంగం ఎటు జారుకుంది?
బ్రతుకుతెరువు మించి భత్యాలు మ్రింగుతూ
బల్లక్రింద బాహువులు చాచే అవినీతి తిమింగలానికి
ఎటుబోయే అంతరంగం?
ఇలా ఎందుకుంటుంది దేశం?
అంతరంగం అడగకనే నాశం!