నాన్నమాట

నాన్నమాట

రచన ::సిరి

“ఎందుకు ఆలస్యం అయింది?” అమ్మ అడుగుతుంది. నాకు ఇవేమీ వినిపించట్లేదు. నా చేతిలో ఉన్న ఫోన్ వైపే నా చూపంతా!!
“నిన్నే నాన్నా మాట్లాడవే? ఒంట్లో బాగోలేదా?” నా నుదిటిన చెయ్యి పెట్టి చూస్తుంది అమ్మ.
ఎదురుగా దండేసి దీపం పెట్టిన నాన్న ఫోటో. నన్ను చూసి చిరు నవ్వులు చిందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.
“బాగానే వుంది అమ్మా. చిన్న పని ఉండి ఆలస్యం అయింది.” కనీసం అమ్మ వైపు చూడలేదు నేను. నా చూపంతా నాన్న మీదనే!!
“కాళ్ళు చేతులు కడుక్కుని రా భోజనం పెడతాను” అమ్మ వెళ్ళిపోయింది.
నా ఆలోచనలు మూడు గంటల క్రితానికి వెళ్ళాయి.

***

ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న దారిలో జనం గుమిగూడి వున్నారు. ఏమైందో అని కంగారుగా అక్కడికి వెళ్ళాను.
ఎవరో పెద్దాయనకి రోడ్డు ప్రమాదం జరిగింది. చుట్టూ అందరూ గుమిగూడి ‘ఎలా జరిగింది? ఈ పెద్దాయనదే తప్పా? లేక ఆటో డ్రైవర్ తప్పా? ఈ పెద్దాయనే చూసుకోకుండా ఆటోకి ఎదురు వెళ్ళి ఉంటాడా? లేకపోతే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఉంటాడా?’ ఇవే వారిలో వారు చర్చించుకుంటున్నారు.  పెద్దాయన తలకి దెబ్బ తగిలి రక్తం ధారగా పోతుంది. అందరూ జాలి చూపుతున్నారు. అంతే కానీ! ఒక్కరూ ఆయన దగ్గరకి వెళ్ళే సాహసం చేయట్లేదు. అంబులెన్స్కి ఫోన్ చేశాను. వెంటనే ఆయన దగ్గరకి వెళ్ళాను. ఆయన బట్టలు రక్తంతో అభిషేకం చేసినట్టుగా ఉన్నాయి. చెవుల్లో నుండి రక్తం కారిపోతుంది. ఆయనకి బ్రతికే అవకాశాలు తక్కువే అనిపిస్తుంది నాకు. కాసేపట్లో అంబులెన్స్ వచ్చింది. అక్కడున్న అందరి వైపు చూశాను. ఒక అబ్బాయి నా దగ్గరకి వచ్చి సాయం పట్టాడు. పెద్దాయనని అంబులెన్స్ ఎక్కించాము, అంబులెన్స్ డ్రైవర్ సహాయం తీసుకుని. నాతో పాటు ఆ అబ్బాయి కూడా హాస్పిటల్కి వచ్చాడు. ఆ పెద్దాయనని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకువెళ్ళారు. ఆయన ఫోన్ నుండి వాళ్ళ ఇంట్లో వారికి ఫోన్ చేశాను.
“గంట పడుతుంది. వచ్చేస్తున్నాం అన్నా. మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఈ ఒక్క సహాయం చెయ్యి” అంటున్నాడు అతను. బహుశా! ఆ పెద్దాయన కొడుకు ఏమో! అనుకున్నాను.
“అలాగే ” ఫోన్ పెట్టేశాను.
నాతో వచ్చిన అబ్బాయి “అన్నా నేను ఇంటికి వెళ్లిపోనా? నాన్న తిడతారు లేట్ అయింది అని” అన్నాడు.
“హ్మ్మ్. థాంక్ యూ సో మచ్” వాడి భుజం చుట్టూ చెయ్యి వేశాను. నవ్వి వెళ్ళిపోయాడు.
ఈ లోపు డాక్టర్లు పెద్దాయనకి టెస్టులు చేస్తున్నారు. నా దగ్గర  ఉన్న కొంత డబ్బు ఇచ్చాను.
వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు పది మంది వచ్చారు. అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ కంట తడి పెట్టారు. నా డబ్బు నాకే తిరిగి ఇచ్చేశారు. నేను వద్దన్నా వినలేదు.

***

నా చేతిలో ఫోన్ మోగింది. ఆలోచనలు నుండి బయటకు వచ్చాను. ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాను.
అవతల వాళ్ళు చెప్పింది విని, ఊపిరి పీల్చుకున్నాను.
పెద్దాయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఏది ఏమైనా ప్రాణానికి ప్రమాదం లేదని! అది చాలు అనిపించింది నాకు!!
ఇలాగే ఆ రోజు. మా నాన్నకు జరిగిన రోజు. ఒక్కరైనా
సమయానికి ఆయన్ని ఆదుకుని ఉంటే మా ముందు నాన్న నవ్వుతూ తిరిగేవారు. మాతో సంతోషంగా ఉండేవారు. నాలాగే మరొకరు నాన్నని కోల్పోకూడదు అని నా శాయశక్తులా ప్రయత్నించాను. అతనికి వాళ్ళ నాన్న నా వల్ల దక్కాడు అనుకోగానే చెప్పలేని సంతోషమేసింది.
‘సహాయం చేసే అవకాశం ఉంటే దానిని సద్వినియోగించుకోవాలి’ అంటారు నాన్న.
ఫొటోలో ఉన్న నాన్న నన్ను మెచ్చుకోలుగా చూస్తున్నట్టు అనిపించింది నాకు!!
బయట సన్నగా వాన జల్లు. మా నాన్న ఆశీర్వదిస్తున్నట్టు ఉంది.

****

You May Also Like

2 thoughts on “నాన్నమాట

  1. Meaningful story nijamga andharu kakapouna kontha mandi ayinda ila cheste nijamgane enni families save avutayo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!