నాలోని నీకు

అంశం: ప్రేమలేఖ

నాలోని నీకు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నాగ మయూరి

ఓ నా ప్రియతమా
మాటలకందని సమధుర భావనను ఏమని తెలుపను!

కొన్ని వేల ఊసులు మీతో చెప్పాలని ఉంది కానీ
మిమ్మల్ని చూసిన క్షణాన మదిలోని భావాలు పెదవి గడప దాటి భయటకు రానంటున్నాయి
సముద్రమంత ప్రేమ గుండెలలోనే గుంబనంగా దాగిఉండి మౌనాన్ని ఆశ్రయిస్తోంది
మిమ్మల్నే ఆరాధించే నా కనులు రెప్పవేయటం కూడా మర్చిపోయి మీ రూపాన్ని కంటిపాపలో నింపుకుంటున్నాయి
అందుకే ఈరోజు మాటలతో చెప్పలేకపోతున్న భావాలను అక్షర రూపంలో మీ ముందుంచుతున్నా…
నామది నిరంతరం రెండు ప్రశ్శలకి సమాధానాల కోసం అన్వేషిస్తోంది.
అసలు ప్రేమంటే ఏమిటి? అనే ప్రశ్నకు ఒకప్పుడు నాకు సరైన సమాధానమే దొరికేది కాదు.
కానీ ఇప్పుడు మీరు పరిచయమయ్యాకా ప్రేమంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి…
ఇంక మరో ప్రశ్న మీ మీద నాకు ఎందుకు ఇంత ప్రేమ? దీని గురించి ఆలోచిస్తుంటే నాకు ఈ ప్రపంచంలోని బంధాలన్నీ మీలోనే కనిపిస్తున్నాయి…
ఆరోగ్యం బాగోలేదు అన్న వెంటనే మీరు చెప్పే జాగ్రత్తలు,
కొసరి కొసరి గోరుముద్దలు తినిపించే క్షణానా మీ ప్రేమ అమ్మను తలపిస్తుంది…
ఒంటరిగా పయనించే సమయాన, సమస్యల సుడిగుండంలో చిక్కుకుని సతమతమవుతున్న తరుణాన మీరిచ్చే సలహాలలో నాన్నలోని బాధ్యత కనిపిస్తుంది…
ఎలాంటి పరిస్థితులలోనైనా నీకు నేనున్నానంటూ ధైర్యం చెబుతుంటే మీలో నా తోడబుట్టిన తమ్ముడు కనిపిస్తాడు…
నా సంతోషాన్ని మీతో పంచుకుంటే అది మరింతగా రెట్టింపు అవుతుంది, బాధను పంచుకుంటే మీ మాటలతో అది దూదిపింజలా ఎగిరిపోతుంది.
అలా ప్రతిదీ మీతో పంచుకుంటుంటే మిమ్మల్ని మించిన స్నేహితుడు లేడనిపిస్తుంది….
చిలిపి మాటలతో, చేష్టలతో కవ్విస్తూ ఆట పట్టిస్తుంటే మీలో ఓ ప్రేమికుడు కనిపిస్తాడు…
నే చేసిన తప్పు ఒప్పులను ఎత్తిచూపుతూ నాపై అజమాయిషీ చేస్తుంటే ఆ దృశ్యం భార్య-భర్తల అనుబంధానికి అసలైన నిర్వచనంలా అనిపిస్తుంది…
ఒక్కోసారి ముద్దుముద్దుగా అల్లరి చేస్తూ మారాం చేస్తుంటే మీలో పసిబిడ్డలాంటి స్వచ్చమైన మనసు కనిపిస్తుంది…
ఇలా ఒకటేమిటి ఎన్నో బంధాలు మీలోనే కనిపిస్తున్నాయి. ఇలా ఇన్ని బంధాలు ఒక వ్యక్తిలో కనిపించటం.. బహుశా ప్రేమంటే ఇదేనేమో…
నామదిలోని ఈ భావాలు మీకు పిచ్చిలా అనిపించచ్చు కానీ ఇది నిజం బంగారం.
ఏంటి ఈ వింత ప్రేమలేఖ, నాకోసమేనా అంటూ ఆశ్చర్యపోకండి…
మనసులో ఉన్న ప్రేమని మనం ఉన్న పరిస్థితుల ప్రభావంతో మీకు అర్థమయ్యేట్టు నా ప్రవర్తనలో చూపించలేకపోవచ్చేమో కానీ మీరే నా సర్వస్వం…
నా మనసుకి సంబంధించినంత వరకు ఈ ప్రపంచం అంతా ఒకవైపు అయితే మీరొకరే నాకు ప్రత్యేకం…
ఊపిరి ఆగిపోయే క్షణం వరకు మీ ప్రేమని మాత్రమే ఆశించే

మీ
ప్రియ సఖి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!