నేటి సమాజం

నేటి సమాజం

రచయిత :: రామ్ ప్రకాష్

” కామాందుడి కోరికకు 8 ఏళ్ల చిన్నారి బలి…. ” ఒక పత్రిక కథనం

“అభం శుభం తెలియని బాలిక పై ఆకృత్యం చేసిన మృగం…” మరో పత్రిక అక్రోషం

‘పశువులా మారి పసిపాప మీద అత్యాచారం… ” ఇంకో పత్రిక కథనం.

అప్పుడే TV లో…
మదమెక్కిన పశువు….అనే ప్రోగ్రాం వస్తుంది.

“నిన్న మధ్యాహ్నం ప్రకాష్ అనే ఆటో డ్రైవర్ స్కూల్ కి వెళ్తున్న బాలికకు మాయ మాటలు చెప్పి ఊరి బయటకు తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సమాజంలో రోజు రోజుకు ఇలాంటి మృగాలు చాలా ఎక్కువ అయ్యారు. దీని మీద చర్చించడానికి మనతో కొంతమంది మహిళా సంఘాల నేతలు ఉన్నారు.

“వావి వరుస లేకుండా రెచ్చిపోతున్న ఇలాంటి పశువులను నడిరోడ్డులో నిలబెట్టి శిక్షించాలి”

“చిన్న, పెద్ద పని లేదండి. ఇలాంటి మృగాలకు ఆడది అయితే చాలు”
“ఒంటరిగా బయటకి వెళ్లాలన్నా, మా అమ్మాయిని బయటకి పంపాలన్నా భయం వేస్తుంది” ఒక మహిళా నేత భయం.
“అదంతా కాదండి ఆ కామాంధుడికి ఉరిశిక్ష వేయాలి….”
అందరూ నేతలు ముక్తకంఠంతో అరిచారు.
వీళ్ళ మాటలు పదే పదే అన్ని ఛానల్స్ లో ప్రసారం చేసారు.
మరో ఛానల్ లో
రేప్ కి గురికాబడిన చిన్నారి మరియు వాళ్ళ కుటుంబం తో ప్రత్యేక ప్రోగ్రాం. వాళ్ళ కుటుంబం ఫోటోలు, వీడియోలు పదే పదే ప్రసారం.
ఇంకో ఛానల్ లో…
రేప్ చేసిన ప్రకాష్ ఇంటి గోడ దూకి మరి తన భార్య పిల్లల   వీడియో రికార్డు చేసుకొని వచ్చాడు ఒక రిపోర్టర్. ఆ ఛానల్ లో అదే పెద్ద న్యూస్. అది చూసి చాలా ఛానల్స్ వాళ్ళ ఇంటి ముందుకు కెమెరా తీసుకోని లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టారు.
ప్రకాష్ భార్యకు ఒక రిపోర్టర్ ప్రశ్న…
“మేడం. మీ భర్త ఇలా చేయడం మొదటిసారా?” సమాధానం చెప్పలేక తెలుపేసుకుంది.
ప్రకాష్ 6 సంవత్సరాల కూతురు ఆడుకోవడం కోసం బయటకి వస్తే అదే అదునుగా మరో రిపోర్టర్
“మీ నాన్న నిన్ను ఎక్కడంటే అక్కడ తాకేవాడా…”
వాళ్ళేం అడుగుతున్నారో కూడా తెలియని పసిపిల్ల. ఎం చెప్పాలో తెలియక తల నిలువుగా ఒకసారి అడ్డంగా ఒకసారి ఊపి ఇంటి లోపలకు పరిగెత్తింది…
ఆ మాత్రం చాలు కదా… తల నిలువుగా ఊపిన దాకా వీడియో కట్ చేసారు.
“కన్న కూతురిని కూడా వదలని కామాందుడు…..” స్క్రోలింగ్ కూడా రెడీ అయ్యింది.
ఇంకేముంది ఛానల్ లో అరిగే దాక అదే వేశారు.
ఈ ఘోరాన్ని చూసి దేశం మొత్తం అట్టుడికింది. విద్యార్థులు కాలేజీలు మానేసి మరి రోడ్డు ఎక్కారు.. Facebook, వాట్సాప్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా వేదిక గా దీని గురించి షేర్ చేసారు. సెలబ్రిటీలు స్పందించారు..
అందరి నినాదం ఒక్కటే….ఆ మృగాన్ని ఉరి తీయాలి.
అలాంటి పశువు తరుపున వాదించడానికి న్యాయవాదులు ఎవరు ముందుకు రాలేదు. అందరూ ముకుమ్మడి గా బహిష్కరించారు.
రేప్ కి గురికాబడిన చిన్నారి స్కూల్ కి వెళ్తే పిల్లలు దూరంగా జరిగి కూర్చుంటున్నారు. వాళ్ళ బంధువులు అందరూ ఫోన్ కూడా ఎత్తడం లేదు. బయటకి వెళ్తే ఆ అమ్మాయే రేప్ అయ్యింది అని అంటున్నారు.
ఇక్కడ రేప్ చేసిన ప్రకాష్ ఉంటున్న ఇంటి ఓనర్ వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. కట్టు బట్టలతో బయటకి వచ్చారు. విధంతా రేప్ చేసిన వాడి భార్య, కూతురు అని గేలి చేసారు.
నమ్ముకున్న భర్త లేడు, నిలువ నీడ లేదు, సమాజంలో పరువు లేదు.
ఇన్ని లేనప్పుడు ప్రాణం మాత్రం ఉండి ఎం లాభం అనుకుంది ఆ భార్య కూతురుతో సహా రైలు పట్టాల మీద పడుకుంది.
మరునాడు మరో శీర్షిక…
“భర్త చేసిన పనికి అశువులు బాసిన నిండు ప్రాణం…”
అలాంటి వాడిని కట్టుకున్నందుకు మంచి పని జరిగిందని అన్నారు కొందరు.
నలుగురిలో పరువు పోయాక ఉండి ఎం లాభం అని మరికొందరు.
అసలు ఆరోజు నిజంగా అక్కడ ఎం జరిగిందో ఇద్దరికే తెలుసు…ఒకరు తను.. రెండు ఆ చిన్నారి..
ఆ చిన్నారినీ రోజు స్కూల్ కి తన ఆటోలో తీసుకోని తీసుకురావడమే తెలుసు. ఆ పిల్ల కూడా తన కూతురు వయసే కావడంతో కూతురు లానే అనుకునేవాడు. ఆరోజు ఆ అమ్మాయిని స్కూల్ దగ్గర దింపి వెళ్ళాడు.
మళ్ళీ సాయంత్రం వచ్చే సమయానికి ఆ పిల్ల స్కూల్ లోపలి నుంచి కాకుండా వేరే వీధి నుంచి రావడం చూసాడు.
స్కూల్ ఎగొట్టి ఆడుకుంది అని అర్థమైంది.
మీ నాన్నతో చెప్తా అన్నాడు. వద్దని ఏడ్చింది. ఆటో ఎక్కమన్నాడు.వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే ఆ పిల్ల భయంతో బయటకి దూకింది. చిన్న చిన్న గాయాలు అయ్యి రక్తం కారుతుంది. హాస్పిటల్ తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు.
ప్రకాష్ భార్యకు జ్వరం వచ్చిందని ఫోన్ రావడం తో ఆ పిల్లని వాళ్ళ ఇళ్ళు ఉన్న వీధి మొదట్లోనే వదిలి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆ అమ్మాయి ఈరోజు స్కూల్ కి రాలేదని వాళ్ళ  అమ్మ నాన్న లకు ఫోన్ చేసి చెప్పడంతో ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.. అలాంటి వాళ్లకు దెబ్బలతో కూతురు ఎదురోస్తుంటే ఏడుస్తూ దగ్గరకు తీసుకున్నారు. అసలేమైంది అని అడిగారు. స్కూల్ కి వెళ్లలేదనీ తెలిస్తే కొడతారేమో అని భయపడి రోజు న్యూస్ ఛానెల్ లో, సెల్లులో చూసే కిటుకు వాడుదామని ఆటో డ్రైవర్ రేప్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పింది.
దాని తరువాత ఎం జరిగిందో అందరికి తెలిసిందే….
ఇంతలో అందరూ కోరుకున్నట్టే ప్రకాష్ కి ఉరిశిక్ష పడింది.
ఉరితాడు ముందు నిలబడ్డాడు. ఒక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళని చూసాడు. అందరి కళ్ళలో తనంటే అసహ్యం, ద్వేషమే కనిపించింది. తన ఉరితాడు తనే బిగించుకున్నాడు. అందరూ చూస్తుండగానే చనిపోయాడు.
దేశం మొత్తం సంబరాలు జరుపుకుంది… న్యాయం గెలిచింది అంటూ అందరూ స్టేటస్లు పెట్టారు.
టీవీ ఛానల్ వాళ్ళు మరో రేప్ కేసు మీద ప్రోగ్రాం పెట్టారు.
ప్రకాష్ మాత్రం నింగిలో తన భార్య పిల్లలతో మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. కింద ఉండటం కంటే పైనే నయం అనుకున్నాడు.

చివరగా……
కొన్నిసార్లు కనిపించేదంతా నిజం కాకపోవచ్చు
అలాగే ప్రతి నిజానికి ఆధారం ఉండకపోవచ్చు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!