సరసమ్మ నిబ్బరం

సరసమ్మ నిబ్బరం

రచయిత : అనురాధ మురుగము బూజుల

సాధారణంగా ప్రతి వీధిలో ఒక మూడు నుండి నాలుగు దాక పచారీ కొట్లు వుంటాయి. ఎవరికి ఎక్కడెక్కడ పరిచయాలు వుంటే అక్కడికి వెళ్లి సరుకులు తెచ్చుకొనేవారు.

అలా మా వీధి మలుపులో ఒక ప్రభుత్వ పాఠశాల వుండేది, అది ఎప్పుడూ పిల్లలతో కిట కిటకిటలాడేది. ఆ స్కూల్ గేట్ ముందు కుడి వైపు మూలకు ఒక చెట్టు వుండేది. అక్కడ ఒకరోజు చిన్న బంకు (చెక్క తో చేసిన చిన్న కొట్టు) ఏర్పాటు చేయించారు ప్రిన్సిపాల్.

స్కూల్ కోసం అనుకున్నారు అందరు. మరుసటి రోజు వయసు మీద పడిన ఒక ఆమె అందులో కొన్ని తినుబండారాలు పెట్టుకొని కూర్చుంది. స్కూల్ కాబట్టి పిల్లలు అందరూ కొంటారు కదా అని మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. సెలువలు వచ్చిన ఆమె ఓపెన్ చేసుకొని కూర్చొనేది.

సెలవులు కదా ఎవరు కొంటారు అనుకొని, నేను వెళ్లి అడిగాను. “ఏమి అవ్వా, స్కూల్ కి సెలవులు కదా! నువ్వు కూడా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా,” అని అడిగాను.

ఎందుకులే పాప, ఈడ వుంటే మనుషులతో పొద్దుపోతుంది, ఇంటిలో వుంటే ఊసు పోదు, పని చేసి, చేసి అలవాటు అయిన జీవితం, ఇలాగే బాగుంటుంది, అని చెప్పింది.

రోజు తనను చూసి నవ్వేసి వెళ్లిపోయేదాన్ని కాలేజ్ కి, అలా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చూడటం, నవ్వటం, ఒక్కోసారి పలకరించి వెళ్లేదాన్ని.

ఒక రోజు రాత్రి భోజనం అయ్యాక, మేడ మీద పడుకోవాలి అని మంచం వేసేటప్పుడు చూస్తే ఆ అవ్వ సరుకులు నెత్తిన పెట్టుకుని వెళుతోంది, టైం చూస్తే తొమ్మిది అవుతోంది, స్కూల్ అయిదు కే అయిపోతుంది కదా అనుకుని మరుసటి రోజు సాయంత్రం వస్తూ అవ్వ కొట్టు దగ్గర సైకిల్ ఆపి…..

స్కూల్ అయిపోగానే వెళ్లొచ్చు కదా, రాత్రి దాక ఎందుకుంటున్నావు అని అడిగాను.

ఏమిలేదు తల్లీ ఎవరో ఒకరు ఏదో ఒకటి కొంటారు కదా, అందుకు అని సమాధానం ఇచ్చింది. తన గురించి కనుక్కుందామని, నేను కూడా రెండు బొరుగల ముద్దలు కొనుక్కొని తింటూ “నువ్వు ఒక్కదానివే వుంటావా?, నీ పిల్లలు….. ఇంకా అని అడిగాను”.

అవ్వ నవ్వుతూ అందరం తలా ఒక పని చేసుకుంటేనే కదా, బతుకు బండి నడిచేది అంది, ఆహా అనుకొని తన గురించి అంతా తెలుసుకున్నాను అనుకొని వెళ్ళిపోయాను.

అలా అప్పుడప్పుడు పరిచయం కాస్త గట్టి పడింది. తనకు ఇంకా బుక్స్, పెన్స్, పెన్సిల్స్….. పిల్లలకు అవసరం అయినవి తెప్పించి ఎలా అమ్ముకోవాలో కొన్ని మెళకువలు చెప్పి వెళ్లేదాన్ని, అంతే కాకుండా ఇంకోవైపు కూరగాయలు కూడా అమ్ముకోమని సలహా ఇచ్చాను.

చూస్తుండగానే అవ్వ కొట్టు మనుషులతో కనిపించేది. కానీ నా రాక కోసం ఎదురు చూసేది. కొద్దిరోజులకు అవ్వ మీద ప్రేమ ఎక్కువ అయ్యి మా ఇంటి నుండి స్పెషల్ ఫుడ్ కూడా ఇచ్చేదాన్ని, అప్పుడు అవ్వ ముఖం వెలిగిపోయేది. అలా కొంచెం సన్నిహితులం అయ్యాము, కానీ నేను ఎప్పుడూ డబ్బులు ఇచ్చే కొనుక్కొనేదాన్ని.

కాలేజీ కి వెళుతూ బంకు వైపు చూసాను. ఇంకా బంకు తెరువలేదు. ఈరోజు లేట్ అయ్యిందా? ఎప్పుడూ నాకంటే ముందే వస్తుంది కదా అనుకుంటూ వెళ్ళిపోయాను. సాయంత్రం కూడా బంకు మూసే వుంది. కొంచెం దిగులుగా అనిపించింది.

మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ఎవరిని అడగాలో తెలియదు. తమాయించుకొని కాలేజ్ కి వెళ్ళాను. “బాడీ ప్రెసెంట్ మైండ్ ఆప్సెంట్” అయ్యింది. అవ్వ మీద ఆలోచనలు ఎక్కువ అయ్యాయి.

ఇంకేమి ఆలోచించకుండా స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ప్రిన్సిపాల్ ని కలిసాను. ఆయన చెప్పినవి విని షాక్ అయ్యాను.

“అవ్వ పేరు సరసమ్మ అంట, ఈ మధ్యనే భర్తను పోగొట్టుకుందంట, భర్త పోయాక కొడుకులు, కోడళ్ళు చూడటం లేదంట, భర్త వున్నన్ని రోజులు వున్నంతలో బాగానే బతికింది, కొడుకులు పెట్టకపోతే చెయ్యి చాచటం ఇష్టం లేక, ప్రిన్సిపాల్ ఇంటిలో పనికోసం వస్తే, పెద్దావిడ ను కష్ట పెట్టటం ఇష్టం లేక, ఆయన ఇలా ఏర్పాటు చేయించారంట, అదంతా వినేసరికి నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది.

అడ్రస్ ఇచ్చారు చూడటానికి వెళుతుంటే, కళ్ళు మసకగా వున్నాయి, కాళ్ళు పెడల్ మీద వున్న అవి ముందుకు తొక్కటం లేదు.

మరుసటి రోజు వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడ ఒక చిన్న గుడి, దాని పక్కన చిన్న పూరి గుడిసె వుంది. అక్కడ ఇంకో ఇద్దరు వయసు అయిపోయిన వాళ్ళు వున్నారు. నన్ను చూడగానే……

“నువ్వేనా తల్లీ మాకు సరసమ్మ తో పాటి సాయం చేసింది అన్నారు.” అలా నిలబడి చూస్తుంటే, సరసమ్మ ఆటోలో నుండి ఎవరో తీసుకొస్తున్నారు, బాగా నీరసం గా వుంది.

ఏమైంది సరసమ్మ అని అడిగాను. జ్వరం తల్లీ అని జవాబు చెప్పింది. అక్కడే వున్న మంచం వంచి దిండు పెడితే అలా నడుము వాల్చింది.

నన్ను చూసి నవ్వుతూ, నా చెయ్యి పట్టుకుంది, సరే ఈ టిఫిన్ తిను, అని ఇచ్చాను. లేచి తిని సంతోషంతో నవ్వుతూ చూస్తోంది, టాబ్లెట్ ఇచ్చి వెళుతుంటే చెయ్యి పట్టుకుంది, సరే అని కాసేపు కూర్చున్నాను. తను ఏమి మాట్లాడలేదు.

ప్రిన్సిపాల్ కూడా వచ్చాడు. ఆయన కూడా వాళ్లకు సాయం చేస్తున్నాడు అనుకుంటా, ఆయన కోసం లేవబోతే అవ్వ చెయ్యి నా చేతిలో వుంది, వదలలేదు, తీయబోతే చెయ్యి కింద పడింది. నేను కళ్ళు తిరిగి పడిపోయాను.

కాసేపటికి……

నీళ్లు చల్లి లేపారు, చూస్తే సరసమ్మ కళ్ళు తెరిచే వున్నాయి, అందరూ ఏడుస్తున్నారు, సరసమ్మ నవ్వుతోంది. అదే నవ్వుతూ పోయింది.

ప్రిన్సిపాల్ వచ్చి నువ్వు వెళ్ళమ్మా, మిగతా విషయాలు చూసుకుంటాను అన్నారు.

కొద్ది రోజుల తరువాత……

బంకు తెరిచారు, ఆశగా అటు చూసాను, ఇంకో పెద్దాయన కూర్చున్నాడు. అవ్వ వదిలేసిన పనిని చేసుకుంటున్నాడు. అందరూ వదిలేసిన ఆమె ధైర్యంగా బతకటానికి చూసిందే కానీ, ఏరోజు యాచించలేదు, అలాగని అందరిలాగా కొడుకులు మోసం చేసారని ఏకరువు పెట్టి ఏడవలేదు, కష్టం ముఖంలో చూపించలేదు, బాధ ఎవరితోనూ పంచుకోలేదు, మనం దగ్గరయినా తన హద్దులోనే వుండేది, చివరి రోజుల్లో కూడా తన లాంటి వారిని ఇంకో ఇద్దరిని ఆదరిస్తూ స్వతంత్రంగా బ్రతకటానికి చూసింది, ఎంత సంస్కారవంతురాలు, ఎంత గుండె నిబ్బరంగా బ్రతికింది.

ఎన్నిసార్లు కలిసిన ఒక్కసారి కూడా నిండు కుండా తొనకదు అన్నట్టు వుండేది. నేనేది తనకు నేర్పించాను అనుకున్నాను, తనను చూసి నేనే కాదు చాలా మంది నేర్చుకోవచ్చు అనిపించింది.

ఇప్పటికీ ఆ బంకు అలాగే వుంది, కొనేవాళ్ళు పెరిగారు. కానీ “సరసమ్మ లేదు”, నాకు మాత్రమే అక్కడ తను వున్నట్టు, నవ్వుతున్నట్టు వుంటుంది.

“కంట్లో పడిన మెలిక లాగా, కాలిలో గుచ్చుకున్న ముళ్ళు లాగా, సూదిలో దారం ఎక్కించేటప్పుడు సూది చేసే గాయం లాగా ” సరసమ్మ నా మనసులో ఉండిపోయింది. ఆమె నిబ్బరం ఇక నేర్చుకోవాలి అనుకుంటా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!