యువతా మేలుకో

యువతా మేలుకో

రచయిత:: మంజీత కుమార్

“మళ్ళీ వచ్చారా? సిగరెట్లు తాగడానికి, గంటలు గంటలు కూర్చుని సొల్లు చెప్పడానికి” తిట్టుకుంటూనే మూడు టీలు తెచ్చిచ్చాడు సుందరం. ఇవేమి పట్టించుకోకుండా టీలు తీసుకుని, జేబులో నుంచి సిగరెట్లు తీసి ముట్టించారు.

సులోచనాపురంలో దినేష్, రంజిత్, రాకేష్ ముగ్గురు మంచి మిత్రులు. చదువులో అంతంత మాత్రమే. వారు చదివిన చదువుకు, వచ్చిన మార్కులకు ఎలాగూ ఉద్యోగాలు రావని వారే నిర్ణయించుకుని ఆ ప్రయత్నమే మానేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఇంటికెళ్లి పడుకోవడమే వారి దినచర్య.

రోజూలాగానే ఓరోజు సుందరం దగ్గరికి వచ్చారు. అక్కడ పలకపై ‘ఓ యువతా మేలుకో, గమ్యం చేరేవరకూ విశ్రమించకు’ అని రాసి వేలాడదీసి ఉంది. “అబ్బో” అనుకుంటూ టీ కప్పులు తీసుకుని, జేబులో నుంచి సిగరెట్లు తీసి వెలిగించబోయారు. “తమ్ముళ్లు ఇక్కడ సిగరెట్ తాగొద్దని ఎన్నిమార్లు చెప్పాలి” అని సుందరం మందలించడంతో చిరాకుగా ముఖంపెట్టి కాస్త దూరంగా నిలబడి టీలు, సిగరెట్లు తాగుతూ ముచ్చట్లలో పడ్డారు.

మరుసటిరోజు ‘పట్టుదలతో చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది’ అని రాసుంది. పట్టించుకోకుండా వారి పని ఏదో చూసుకుని వెళ్ళిపోయారు.

మూడోరోజు ‘నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందినా, ప్రయత్నం విరమించకు’ అని రాసిపెట్టి ఉంది.

అలా రోజూ స్వామి వివేకానంద సూక్తులు చదువుతున్న ముగ్గురు యువకులు ఆలోచనలో పడ్డారు. అసలు వివేకానంద ఏం చేసాడు, ఎందుకు చేసాడు అన్న ఆలోచనరాగా.. ముగ్గురు కలసి ఇంటర్నెట్లో ఆ సమాచారాన్ని తెల్సుకున్నారు. ఆ వివరాలతో ప్రభావితం చెంది ఇంతకాలం ఎంత సమయాన్ని వృధా చేసామోనని సిగ్గుపడ్డారు. తమ ప్రవర్తనతో కుటుంబ సభ్యులను కూడా బాధపెట్టినందుకు, వారిని క్షమాపణ కోరారు. చేతికొచ్చిన కొడుకులు ఇన్నాళ్లకు బుద్ధిమంతులుగా మారడంతో వారి తల్లిదండ్రులు తెగ సంతోషపడ్డారు.

తమకు బౌద్ది వృక్షంవలె జ్ఞానోదయం అయిన ‘వీధి చివర చిల్లరకొట్టు’ దగ్గరకు వచ్చిన ముగ్గురు స్నేహితులు… సుందరంకు నమస్కరించారు. ఇకపై చెడు వ్యసనాలను మానేసి ఏదైనా పనిచేసుకుంటూ బతుకుతామని చెప్పారు. వారిలో వస్తున్న మార్పును కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్న సుందరం తన ఆలోచన కార్యరూపం దాల్చినందుకు సంతోషపడ్డాడు.

You May Also Like

2 thoughts on “యువతా మేలుకో

  1. అస్సలు ఊహించలేదు పోకిరీల కథ కూడా ఇంత బాగా ముగుస్తుంది అని. చివరి twsit అమోఘం. రచనా శైలి అద్భుతం. చాలా మంచి కథ అందించారు. ధన్యవాదాలు.

  2. యువతకు మంచి సందేశాత్మాక కథ. స్వామి వివేకానంద పుట్టిన మనదేశపు యువత “awake, arise and stop not till the goal is reached” అన్నట్టుగా ఉండాలి, కానీ ఏమిటో కొందరు బద్ధకంగా, విల్ పవర్ లేకుండా ఉంటారు. అలాంటి వారికి మీ ఈ కథ కనువిప్పు. షాప్ లో వివేకానండుని సూక్తులు పెట్టడం ఆకట్టుకున్నది. 👍👌👏🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!