కాలంతో పాటు మనమూ

కాలంతో పాటు మనమూ

రచయిత ::గంటి ఉషాబాల

ఆటో దిగి నేను ను ఇంట్లోకి వెళ్ళగానే చేస్తున్న పని ఆపి అమ్మ పవిట చెంగుకి చేతులు తుడుచుకుంటూ “రారా చిట్టి బస్సు టైంకే వచ్చిందా మొహం కడుక్కో కాఫీ తెస్తాను” అంటూ వంటింట్లోకి వెళ్ళింది. పెరట్లో అరటి మొక్కలకి పాదులు తీస్తున్న నాన్న మట్టి చేతులు కడుక్కోకుండా పార పక్కన పడేసి “ప్రయాణం బాగా జరిగిందా” అంటూ అడిగారు. స్నానాదికాలు కానిచ్చి వచ్చాక అమ్మ పెట్టిన వేడివేడి నేతిపెసరట్టు తింటూ ఊరి విషయాలు ఆరా తీశాను.
“అవున్రా చెప్పడం మర్చిపోయాను నువ్వు వస్తున్నావ్ అని మాటవరసకి మన చిల్లర కొట్టు శీను గాడితో అన్నాను. ఎందుకో మరి నిన్ను కలవాలి అన్నాడు “అంది అమ్మ. “వాడు నన్ను కలవడం ఏమిటమ్మా టాటా బిర్లాలకైనా కాస్త టైం ఉంటుందేమో వీడికి అంత టైం ఎక్కడిది? తెల్లారి ఆరు గంటలకి కొట్టు తీస్తే రాత్రి పదింటి వరకూ సోడాలు కొడుతూ, కూల్డ్రింకులు,పాన్ మసాలాలు సిగరెట్లు,అమ్ముతూ తెగ బిజీ కదా. ఏదో మాతోపాటు హై స్కూల్ లో చదివాడు కదా అని పలకరిస్తే మొహమాటానికి ఓ నవ్వు నవ్వి తన పనిలో పడిపోతాడు.”కాదురా వాడి వ్యాపారం మునుపటిలా లేదుట బేరాలు తగ్గాయి అన్నాడు మరి ఏం మాట్లాడాలి నీతో అంటూ పిల్లి వంటింట్లో దూరడం తో దాన్ని తరమడానికి పరిగెత్తింది అమ్మ.
మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు స్నేహితుడిని కలవడానికి బయటకి వెళ్లి వచ్చేసరికి వీధి వరండాలో నా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు శీను.” ఏరా శీనూ బాగున్నావా అవును కొట్టే ఏమిటి మూసుంది రాత్రి పది తర్వాత గానీనీ కొట్టు కట్టవుగా ” అంటూ పలకరించాను.
‘అవును చిట్టీఅది ఒకప్పుడు ఇప్పుడు అలా లేదు వ్యాపారం అంత బాగాలేదు.నాకు చదువు అంతంతమాత్రం కదా అక్కడికీ మా నాన్న ఎప్పుడూ పోరుతూ ఉండేవాడు కొట్లో కూర్చున్నా ప్రైవేటుగా చదువుకోరా అని అప్పుడు చెవికెక్కలేదు.ఈ చిల్లర వ్యాపారం తప్ప నాకేదీ చాతకాదు. నెలవచ్చే సరికి బ్యాంకు వాళ్ళకి డబ్బులు కట్టాలి.మళ్ళీ సరుకుకి పెట్టుబడి పెట్టాలి.వ్యాపారం మీద వచ్చే డబ్బులు చాలడం లేదు. అందుకే నువ్వు హైదరాబాదులో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే అందరం తలో పని చేసుకుంటూ అక్కడే బతుకుతాం”అంటూ మొహమాటంగా తలవంచుకున్నాడు శీను.
శీను మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో శీను గాడి కొట్టు చుట్టూ ఎప్పుడూ బెల్లం చుట్టూ ఈగల్లా జనాలు మూగి ఉండేవారు.చిన్నపిల్లలు బళ్ళో కి వెళుతూ చాక్లెట్ల కోసం, ఆగే వారు. కాలేజీకెళ్లే అమ్మాయిలు షాంపూ ప్యాకెట్లు కోసమో బొట్టు బిళ్ళల కోసమో,మిఅమ్మమ్మ వయసు వాళ్ళు నిమ్మసోడా కోసమోశీనుగాడి కొట్టుకు వచ్చేవారు. వాడి సోడా రుచే వేరు.ఎంత ఖరీదైన కూల్ డ్రింక్ అయినా శీనుగాడు నిమ్మసోడా సాటిరాదు. ఇక బిస్కెట్లు,పప్పు ఉండలు, మగవాళ్ళ దువ్వెనలు, ఇంకా ఇలా ఎన్నో ఎన్నెన్నో. చూడ్డానికి చిన్న బండి కొట్టే గాని పిన్నిసు దగ్గర నుంచి అన్నీదొరికేవి.వాడు అప్పుడప్పుడు అడిగిన వాళ్ళకి అరువు కూడా ఇచ్చేవాడు. నేను స్నేహితులతో కలిసి దమ్ము లాగడానికి శీను గాడి కొట్టే మాకు అడ్డా. వాడి చేతులు చకా చకా వస్తువులు అమ్మడం లోనూ, డబ్బులు గల్లాపెట్టె లో వేయడం లోనూఎప్పుడూ బిజీగా ఉండేవి. ఆ వీధిలో చిన్న,పెద్ద ముసలి, ముతక అందరూ ఎందుకో ఆందుకు శీనుగాడి చిల్లర కొట్టు మీదేఆధార పడే వాళ్లు. అలాంటిది ఇప్పుడు విస్తరిస్తున్న సూపర్ మార్కెట్లు,హైపర్ బజార్ల పుణ్యమాఅని చిన్న చిన్న టౌన్లలో కూడా బడ్డీ కొట్లు,చిల్లర కొట్లు అంతరించిపోతున్నాయి. ఇప్పుడు పప్పుబెల్లాలు,కొనుక్కునే పిల్లలూలేరు, పైట పిన్నీసులు కొనుక్కునే అమ్మాయిలూ లేరు. అలాగే నాలా దమ్ము కోసం ఆగే కాలేజీ కుర్రాళ్లూలేరు. నిమ్మసోడా స్థానంలో కూల్డ్రింకులు, పప్పు బెల్లాల స్థానంలో ఆలూ చిప్స్ వచ్చిచేరాయి. చల్లగా ఏసీలో అందమైన సేల్స్ గర్ల్స్ అందించే వస్తువులను అందుకోవడానికి అలవాటు పడ్డ జనానికి వీధి చివర చిల్లరకొట్టు ఎలా నచ్చుతుంది?కాలంతో పాటు మనం మారాలి.ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా నిలబడి శీనుగాడి భుజం మీద చెయ్యి వేసి నా ఆలోచన చెప్పాను. వాడి ముఖం లో ఆనందం తో కూడిన ఓ కొత్త కాంతి.
కొద్ది రోజులకే మా వీధి చివర శీనుగాడి చిల్లర కొట్టుఉన్న చోటులో”వాసు జనరల్ స్టోర్ అండ్ సూపర్ మార్కెట్” అట్టహాసంగా ప్రారంభించబడింది. అందరూ చల్లగా సేదతీరుతూ కావలసినవి,అక్కర్లేనివి ఎడాపెడా వాళ్ళ బుట్టల్లో నింపుకుంటున్నారు. యధాప్రకారం శీను క్యాష్ కౌంటర్ లో కూర్చున్నాడు. తరువాత వాడి వ్యాపారం ఎలా వెళ్ళిందో మనం ఊహించవచ్చు. నేను వడ్డీ లేకుండా అప్పుగా ఇచ్చిన మొత్తంతో ప్రారంభించిన ఈ సూపర్ మార్కెట్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది.వాడెప్పుడూ ఈ విషయంలో నాకు పదే పదే కృతజ్ఞతలు చెబుతూ ఉంటాడు. అది ఎంత పెద్ద దుకాణం అయినా నాకు మాత్రం వీధి చివర శీనుగాడి చిల్లర కొట్టే.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!