మా సినిమా ప్రయాణం

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

మా సినిమా ప్రయాణం

రచన: సావిత్రి కోవూరు 

“అమ్మమ్మ ఒక కథ చెప్పవా అన్నారు నా మనవళ్ళు అనురాగ్, ప్రీతమ్, అభి మనవరాలు శ్రీయ. నన్ను  కథలు  చెప్పమంటారేంటి. మీరు పుస్తకాల్లో బోలెడు కథలు చదువుతారు. టీవీలో చూస్తూ ఉంటారు. ఇంక నేనేం చెప్పాలి” అన్నాను.

“అది కాదమ్మమ్మా మీ చిన్నప్పుడు జరిగిన సంఘటనలు చెప్తావు కదా. అవే చెప్పు” అన్నారు.

“సరే చెప్తాను కానీ మీకు బోర్ కొడుతుందేమో”  అన్నాను.

“ఏం పర్వాలేదు చెప్పు.” అన్నారు నలుగురు.

“సరే అయితె వినండి. నేను చిన్నగున్నప్పుడు అంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు మా అన్నయ్య ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి అనే ఊర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేసేవారు. భక్త రామదాసు పుట్టింది ఆ ఊర్లోనే. నేను కొన్ని రోజులు అక్కడ అన్నయ్య వదినల దగ్గర ఉన్నాను. మా అన్నయ్యకు అప్పుడు నలుగురు పిల్లలు అంతా చిన్న వాళ్ళు.

మా అన్నయ్యకు ఆఫీస్ జీప్ మరియు  డ్రైవర్ ను కూడ ఇచ్చారు. ఇంట్లో ఇద్దరు రాజనర్సు, నారాయణ అనే అటెండర్స్  ఉండేవాళ్ళు. దాంట్లో నారాయణ అనే అటెండర్ కు సినిమాల పిచ్చి ఎక్కువగా ఉండేది. ఆ ఊరిలో ఒక తడికల టాకీస్ ఉండేది. అతనికి సినిమా చూడాలి అనిపించినప్పుడల్ల మా అన్నయ్య గారి అబ్బాయితో  “బాబు నాన్నని అడుగు కొత్త సినిమా వచ్చింది వెళ్దాము.” అనేవాడు.

మా అన్నయ్య గారి ‘బుజ్జి’ మా అన్నయ దగ్గరికి వెళ్లి “నాన్న సినిమాకి వెళ్తాం.” అని చెప్పేవాడు.

మూడు గంటలు ఆ బెంచీల పైన కూర్చుని చూడడం చాలా కష్టం. నేను ఖమ్మం తీసుకెళ్తానలే అనే వారు. కానీ మా అన్నయ్యగారి అబ్బాయి మళ్లీమళ్లీ అడిగేసరికి మా అన్నయ్య సరే వెళ్ళండి అని, డబ్బులు ఇచ్చేవారు.

 కానీ ఆ ఊరిలో మా అన్నయ్య గారికి ఎక్కడలేని పలుకుబడి, గౌరవం ఉండేది. అందరూ ‘ఇంజనీర్ గారు, ఇంజనీర్ గారు’ అని చాలా గౌరవించేవారు.

ఆ టాకీస్ వాళ్ళకి నారాయణ మమల్ని చూపి ఇంజనీయర్ గారి అబ్బాయి, చెల్లెలు గారు అని చెప్పేసరికి, వాళ్ళు స్పెషల్గా స్టీల్ చైర్స్ తెప్పించి వేసేవాళ్ళు. అందరూ బెంచీల మీద కూర్చుని సినిమా చూస్తుంటే మేమిద్దరం మాత్రం కుర్చీలో కూర్చుని సినిమా చూసేవాళ్లం.

ఒక రోజు మళ్లీ నారాయణ అన్నయ్యగారి అబ్బాయి తో “బాబు కొత్త సినిమా వచ్చింది.వెళ్దాం నాన్న గారిని అడుగు” అన్నాడు.

మా అన్నయ్యను అడిగితే “ఇక్కడ వద్దులే నేను ఖమ్మం తీసుకెళ్తాను. అక్కడ చూడొచ్చు” అన్నారు.

ఖమ్మం వెళ్ళడం అంటే మేము మాత్రమే కాదు. ఎప్పుడు వెళ్ళినా మా అన్నయ్య, వదిన, నలుగురు పిల్లలు, నేను, ఇద్దరు అటెండర్స్, ఇద్దరి భార్యలు  మా అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్ కూతురు నాకు ఫ్రెండ్ అయింది ఆ అమ్మాయి, ఔట్ హౌస్ లో నా ఫ్రెండ్ సుజాత అనే అమ్మాయి ఇలాగ డ్రైవర్ తో కలిపి పదిహేను మందిమి కలిసి జీపు నిండా వెళ్లేవాళ్లం.
అలా వెళ్ళినప్పుడు తప్పనిసరి ఫస్ట్ షో, సెకండ్ షో రెండు సినిమాలు చూసి వచ్చేవాళ్ళం.

మా అన్నయ్య డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చునే వారు. మేమందరం వెనక కూర్చునేవాళ్ళం వచ్చేటప్పుడు  రాజనర్సు అనే అటెండర్ దయ్యాలవి, రాక్షసులవి కథలు చెప్పేవాడు. భయంకరమైన కథలు వింత వింత సౌండ్స్.తో చెప్పేవాడు. మేమంతా అతను చెప్తున్నంత సేపూ భయం భయంగా కథలో లీనమై శ్రద్ధగా వినేవాళ్ళం.

అసలే సెకండ్ షో చూసి తిరుగు ప్రయాణం, అర్ధరాత్రి పూట, చుట్టూ చీకట్లో అడవి గుండా తిరుగు ప్రయాణంలో ఇలాంటి కథలు చెప్తుంటే భయంతో వణికి పోయేవాళ్ళం.ఒక్కోసారి దూరంగా ఏవో మంటలు కనిపిస్తే, అదిగో వాటిని కొరివి దెయ్యాలు అంటారు, అవి మనల్ని పట్టుకుంటే వదిలిపెట్టవు అనే వాడు. దూరంగా ఎవరైనా పొలాలలో తెల్లని బట్టలతో  వెళుతుంటే, వాళ్ళని చూపి అదిగో అవి కామపిశాచాలు అంటారు. అవి పట్టుకుంటే అసలు వదిలి పెట్టవు అని చెప్పేవాడు.

అతను చెప్పే కథలు విని మేము ఇంటి కొచ్చినాక కూడా ఎన్నో రోజుల వరకు భయపడే వాళ్ళం.

 కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే వాళ్ళం. ఒకసారి సినిమా మొదలు పెట్టే కంటే కొంచెం ముందుగానే వెళ్ళిపోయాము. టికెట్స్ తీసుకున్నాక మా అన్నయ్య గారు ఇంజినీరింగ్ లో ఉన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ ఒకతని ఇల్లు అక్కడికి దగ్గర్లోనె ఉందని, ఒకసారి వెళ్లి చూసి వద్దామని  ఇక్కడ ఖాళీగా కూర్చునే బదులు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు మా అన్నయ్య.

మా అన్నయ్య  ఫ్రెండ్ “మీరు ఫస్ట్ షో చూసి మా ఇంటికి వచ్చి భోజనాలు చేసుకుని వెళ్ళండి” అన్నాడు.

“మేము సెకండ్ షో కూడా చూసి ఇంటికి వెళ్లి పోతాము. మేము చాలా మందిమి ఉన్నాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఇంకెప్పుడైన వస్తాము” అని మా అన్నయ్య చెప్పారు.

“ఎన్నో ఏళ్ళ తర్వాత కలిశాము. ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి, మీరు ఎంతమంది ఉన్నా పర్లేదు. మా ఇంట్లో ఏం ఇబ్బంది కాదు. సెకండ్ షో చూసే రండి. ఈ రోజు మా ఇంట్లో భోజనాలు చేసి ఇక్కడే పడుకుని ఉదయమే వెళ్ళి పోదురు” అని బలవంతం చేశాడు. మా అన్నయ్యకు ఒప్పుకోక తప్పలేదు.

అలాగా రెండు సినిమాలు చూసి దగ్గర్లోనే ఉన్న మా అన్నయ్య గారి ఫ్రెండ్ ఇంటికి పది మందిమి పెద్దవాళ్ళము, నలుగురు పిల్లలతో సహా వెళ్ళాము.

వాళ్ళింట్లో ఆయన, భార్య, తల్లి, కుమారి అనే ఒక చెల్లెలు, ఇద్దరు పని వాళ్ళు, వంటమనిషి ఉన్నారు.  మేము వెళ్ళే సరికి వేడివేడి భోజనము వడ్డించారు.

తర్వాత ఇంతమందికి కూడా తెల్లని మల్లె పువ్వు లాంటి బెడ్ షీట్స్ వేసి పడకలు ఏర్పాటు చేశారు. ఇల్లు కూడా చాలా పెద్దగానే ఉంది. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒక రూమ్ లో పడుకున్నాము. కొంచెం సేపు తర్వాత  మా దగ్గరకు మా అన్నయ్య గారి ఫ్రెండ్ చెల్లెలు కమారి వచ్చి తనను తనే పరిచయం చేసుకొని చనువుగా మా మధ్యన ఇరుక్కొని పడుకుంది. ఇంకా ఆ రోజు నైట్ అంతా పాటలు, కథలు, ముచ్చట్ల తోనే గడిచిపోయింది. కుమారి కూడా భయంకరమైన దయ్యాల కథలు చెప్పి హడలగొట్టింది. తను అప్పుడు ఇంటర్ చదువుతూ ఉండేది. ఎన్నో పాటలు కూడ పాడింది. చివరికి ‘నిను వీడని నీడను నేనె’ అని దయ్యాల పాటలు కూడ పాడింది. తన క్లాస్ మేట్స్ గురించి ఎన్నో వింత వింత జోక్స్ చెప్పి మమ్మల్ని ఎంత నవ్వించిందో  చెప్పలేను. ఆ విధంగా రాత్రి మొత్తము నవ్వుతూనే ఉన్నాము. ఆ అమ్మాయి నోరు తెరిచి నప్పటినుండి అసలు మూయలేదు.

అలాగ  తెల్లవారె వరకు మా కబుర్లు, కథలు, పాటలు సాగుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే ఆ అమ్మాయి మాకు ముగ్గురికి చాలా క్లోజ్ అయిపోయింది. తన పర్సనల్ విషయాలు సినిమాల విషయాలు, ఫ్రెండ్స్ విషయాలు, కథలు అన్ని చెప్పి మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది.

తెల్లవారిన తర్వాత మా అన్నయ్య కిన్నెరసాని ప్రాజెక్టు లో పని చేసేటప్పటి ఫ్రెండ్ కి మా అన్నయ్య అక్కడ ఉన్నారని తెలిసి, అతను కూడా వాళ్ళింట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమని ఆహ్వానించాడు. మళ్ళీ వచ్చినపుడు వస్తామని మా అన్నయ్య ఎంతచెప్పినా బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసు కెళ్ళాడు. వేడి.వేడి ఇడ్లీలు రుచికరమైన సాంబార్, పొడి తో బ్రేక్ ఫాస్ట్ పెట్టారు. అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాము.

ఇన్నేళ్ళయిన మా ప్రయాణాన్ని, ఖమ్మం లోని మా అన్నయ్య ఫ్రెండ్స్ ఆతిధ్యాన్ని నేను మరువలేదు అంటే ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు.

తర్వాత కొన్ని రోజులకు  ఒకసారి ఖమ్మం వెళ్ళినప్పుడు ఆ కుమారి అనే అమ్మాయిని చూడాలని అనిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్లేసరికి, వాళ్ల అమ్మగారు ఇంటి ముందర అరుగుపై కూర్చుని ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్లి “ఆంటీ కుమారి ఉందా?” అని అడిగేసరికి, ఆమె బోరుమని ఏడుస్తూ “ఇంకెక్కడి కుమారి అమ్మా. కుమారి పోయి నెల రోజులు అయింది.” అని చెప్పింది.

నేను ఊహించని ఆ జవాబు వినేసరికి షాక్ తిన్నాను. నా బుర్ర పనిచేయడం మానేసింది. అసలు ఏమయింది, ఎలా పోయింది అని అడిగి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా వెను తిరిగాను. కానీ ఎన్నో రోజులు ఆ అమ్మాయి పాడిన పాటలు, చెప్పిన జోక్స్, ఆ భయంకరమైన కథలు జ్ఞాపకం వచ్చి మనసంతా కలతచెందేది.

ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఆ అమ్మాయి జ్ఞాపకం వస్తే మనసంత బరువెక్కుతుంది. మా పరిచయం ఒక్క రాత్రి మాత్రమే. కానీ ఈ రోజు కూడా ఆ నవ్వు ముఖం కళ్ళ ముందు మెదులుతుంటుంది. ‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ’ అంటారు అదే ఆ అమ్మాయి విషయంలో నిజమయింది.

తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయికి అప్పటికే బ్లడ్ క్యాన్సర్ ఉందని తాను ఎక్కువ రోజులు బ్రతకదని తెలిసి కూడ అలా ఎలా నవ్వగలిగిందో, మమ్మల్ని ఎలా నవ్వించగలిగిందో నాకిప్పటికీ అర్థం కాదు.

చిన్న చిన్న బాధలకే కుంగిపోయి లోకమంతా చీకటి అయిపోయినట్టు కన్నవాళ్ళకు కట్టుకున్న వాళ్ళకి తీరని దుఃఖాన్ని కలిగించి, ప్రాణాలు తీసుకునే మనుషులున్న ఈ లోకంలో తన జబ్బు విషయం తెలిసి కూడా ఆ అమ్మాయి అంతా నిబ్బరంగా, హాయిగా ఎలా ఉండగలిగిందంటె చాల వింతగా ఉంటది. ఆ రాత్రంతా జోక్స్ చెప్తూ తన బాధను పొరపాటున కూడా వ్యక్త పరచ కుండా, తన జీవితం చివరి వరకు కూడా అందరికి నవ్వులు పంచుతూ వెళ్లిపోయిందట.

ఆ అమ్మాయిని తలుచుకుంటే ఇప్పటికీ కూడా నాకు అలా ఎలా ఉండగలిగింది అని అనిపిస్తుంది. మా మనవరాలు, మనవళ్ళు అప్పటివరకు నా కథలో లీనమైపోయి తేరుకోవడానికి చాలా టైం పట్టింది. తర్వాత మెల్లగా “అమ్మమ్మ ఇది వాస్తవంగా జరిగిందా? లేక నీవే కల్పించి చెప్తున్నావా” అన్నారు

“లేదర్రా ఇది వాస్తవంగా ఒక నలబై ఏళ్ళ క్రితం నా జీవితంలో జరిగింది. కల్పన కాదు” అన్నాను

“ఒక డౌట్ అమ్మమ్మ మీరు వచ్చేటప్పుడు దూరంగా కొరివి దెయ్యాలు ఉండేవని అటెండర్ చెప్పేవాడు కదా! అవేంటి” అన్నారు.

“దూరంగా వేసవి కాలంలో ఒక చెట్టుకి చెట్టు రాసుకుని ఆ రాపిడి వల్ల మంటలు రావడం సహజమే. ఇంకొకటి ఏంటంటే మృత కళేబరాల ఎముకల నుండి ఫాస్ఫరస్ అనే వాయువు వెలువడి వాతావరణంలోని ఆక్సీజన్ తో కలిసి మంటలు రావడం కూడ సహజమే. వాటిని చూపి అటెండర్ ‘కొరివి దెయ్యాలు’ అని మాకు చెప్పేవాడు.

దూరంగా పొలాలలో మంచెలపైనున్న  మనుషులని చూపి వాళ్ళు కామ పిశాచాలని పట్టుకుంటే వదలవని కథలు కల్పించి చెప్పి, మమ్మల్ని భయకంపితులను చేసేవాడు. అంతే కానీ దయ్యాలు, భూతాలు, పిశాచాలు అనేవి ఏవీ ఉండవు. అన్ని ఊహాజనితాలే” అన్నాను.

“అంతేనా నిజంగా దెయ్యాలు ఉంటాయేమొ అనుకున్నాము” అన్నారు పిల్లలు.

“అలాంటి వాటిని ఎప్పుడు నమ్మకూడదు. ఇంకొక విషయమేమిటంటే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ చిన్న చిన్న విషయాలకే కుంగిపోకూడదు” అన్నాను వాళ్ళతో.

“సరే అమ్మమ్మా, ఈరోజు కొత్త విషయాలు చెప్పినందుకు థాంక్స్. గుడ్ నైట్ అమ్మమ్మా” అని నిద్రకు ఉపక్రమించారు.

You May Also Like

One thought on “మా సినిమా ప్రయాణం

  1. చాలా బాగుంది.చివరన సందేశం ఇంకా బాగుంది.
    అభినందనలు సావిత్రి గారూ💐💐💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!