నా తప్పులేదు

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

నా తప్పులేదు

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

అనగనగనగా అంటూ ఆరంభించే అమ్మమ్మకధ కాదు ఇది. ఈ అమ్మమ్మ చెప్పిన కధ ఆ కోవకు చెందదు. ఈ కధ జీవితసత్యాన్ని తెలిపే కధ.
చిన్నప్పుడు అమ్మమ్మ నిద్రబుచ్చడానికి చెప్పె కధకాదు. నిద్రబోతున్న మనిషిని తట్టిలేపేలా చేస్తుంది ఈ కధ. ఇక కధలోకి వెళ్ధామా…..
“ఏమేవ్ ఇలా రా ఒకసారి. ఏం ఇంతలా గొంతుచించుకొని అరుస్తుంటే వినపడడంలేదా. ఏం నిలబడే నిద్రబోతున్నావా?”గొంతుచించుకొని అరుస్తోంది యశోదమ్మ కొత్తగా పెళ్ళైన కోడలు అనసూయమీద.
పట్టింట్లో ఎంతో అపురూపంగా పెరిగిన అనసూయకు ఇది నిజంగా కొత్త అనుభవమే. ఒకరకంగా భయంకరమే.
“ఏమైందత్తయ్యగారు.ఏం కావాలి?”అడిగింది అనసూయ.
“ఏం కావాలని అడుగుతున్నావా?ఈ పాటికి కాఫి కప్పుతో మా అత్తగారికివ్వడానికి ప్రత్యక్షమయ్యేవాళ్లం.అంతా పిదపకాలం. పిదపబుద్దులూనూ కాఫి ఇచ్చేదేమన్నా వుందా లేదా” అంటూ గదమాయించింది కోడలిని యశోదమ్మ.
“ఇదిగో ఇప్పుడే తెస్తున్నా”అంటు వంటగదిలోకి పరిగెత్తింది అనసూయ.
అనసూయ వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు. అత్తగారింట్లో ఎవరేమైనా అంటే
ఎదురుచెప్పకుండా వుండమని ప్రస్తుతం అనసూయ అదే చేస్తుంది. అలా అలా అణిగిమణిగి ఉండి ఆ సంసారాన్ని పాతికసంవత్సరాలు నెగ్గుకొని వచ్చింది.
అనసూయ అప్పట్లో చదివింది డిగ్రీ వరకు కూడా.
కాని ఏనాడు అత్తగారికిగాని ఆడపడచులకుగాని, కట్టుకున్న భర్తకుగాని ఎదిరించిందిలేదు. తన పిల్లిద్దరిని
కూడా నెమ్మదిగానే పెంచింది.
“సరేలే!అమ్మమ్మ ఇందులో ఏమి ట్విస్టులేదే. అంతా మామూలుగానే ఉంది. ఏమి ఇంటరెష్టింగుగాలేదు. ఇంకా వేరే కధ ఏదైనా చెప్పు” అంటూ మనవరాలు
మనోజ్ఞ దెప్పింది అనసూయని.
“మీకు అలానే వుంటేయే. ఇందులో ఎంత జీవితసత్యముందో నీకేం తెలుసు? మీ కాలపు వాళ్ళకి ఇవేవి అంతగా పట్టవు. మీరంతా తాడో పేడో తేల్చేసుకొని జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు.”
అనసూయ సమర్ధించుకుంది.
“నువ్వెన్నైనా చెప్పు అమ్మమ్మా నేనైతే అంత ఓర్పుగా ఎదురుచెప్పకుండా నోరుమూసుకొని వుండలేను. అటో ఇటో తేల్చేసుకుంటాను. అయినా నాకు తెలియటంలేదు నువ్వు అప్పట్లో డిగ్రీ చదివికూడా అలా ఎలా ఉండగలిగావమ్మమ్మా. హయిగా ఏ ఉద్యోగమో చేసుకొని వేరే కాపురం పెట్టేయాల్సింది” మనోజ్ఞ తేల్చేసింది.
“చెప్పేను కదే !మీదంతా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. నేనే అలా చేసివుంటే మీ నాన్నగాని ,మీ అత్తగాని ఇలా హాయిగా వుండగలిగేవారా. సహనం ఓర్పు ఉంటేనే ఎదైనా సాధించగలం. అవేశం ఎప్పుడూ అనర్ధదాయకమే. ఇది మీ తరం వాళ్ళకి
ఎంత చెప్పినా అర్ధం కాదు. అందుకే ముందల్లా ప్రేమ పెళ్ళి అని తొందరపడటం అయిన మూడ్నాళ్లకే బ్రేకప్పులవటం. ఇదేనా మన సంస్క్రతి. మన సాంప్రదాయమెంతో విదేశాలలో మెచ్చుకుంటుంటే వాళ్ళ పద్దతులలో మనం నడుచుకుంటున్నాం. ఇదెంతమాత్రం సమంజసమైనది
కాదు. ఒక్కసారి నువ్వు ప్రశాంతంగా ఆలోచించు నీకే అర్ధమవుతుంది” అంటూ అనసూయమ్మ తెలియజేసింది.
“సరేలే !అమ్మమ్మా నాకు నిద్ర వస్తోంది.పడుకుందాంరా!” అంటూ మనోజ్ఞ అమ్మమ్మను లేవదీసింది. అలా అందిగాని అది నిజం కాదు. మనోజ్ఞ మెదడులో అమ్మమ్మ మాటలు గింగురులు తిరుగుతున్నాయి. అవును కాదు
అని సందిగ్ధ పరిస్థితిలో పడివేస్తున్నాయి. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెంటనే మోబైల్ తీసుకొని భర్తకు మెసేజు పెట్టింది” నేను రేపు బయలుదేరి వస్తున్నాను. స్టేషనుకు వచ్చి పికప్ చేసుకోండి” అని.
మెసెజు పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది.
ఇదేనండి అమ్మమ్మ చెప్పిన కధ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!