అమ్మా అక్కని ఎగరనివ్వు

అమ్మా అక్కని ఎగరనివ్వు

రచన : అపర్ణ

“అక్కా, అక్కా! ఇటు చూడు నేను ఏమి చేసానో”అంటూ అంతులేని ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలోనిది అక్క చేతిలో పెట్టింది ఆరెళ్ల చిన్ని.

చిన్ని చేతిలోని కాగితంతో చేసిన పేపర్ ప్లేన్ తీసుకుని తన చెల్లిని చూసి మురిసిపోతూ “అబ్బో బలే చేసావే, చాలా బాగుంది ఇదిగో తీసుకుని ఆడుకో” అంటూ తన పని తాను చేసుకోటానికని లోపలికి వెళ్ళింది కంట కన్నీరు రెప్పల దాటి కిందకి రానీయకుండా.

“అక్కా, ఆగు అక్కా! ఇది చేసినది నీకోసం అయితే నువ్వు ఆడుకుంటావని నీకు ఇచ్చాను వెళ్ళిపోతావేంటి ఆగు అక్కా!” అంటూ తన చేతిని పట్టుకుని లాగుతుంటే “చిన్నీ వదలమన్నానా నాకు పని ఉంది నువ్వు వెళ్లి ఆడుకో నాకు ఆడుకోవడానికి సమయం లేదు”.

“ఎందుకు లేదు ఇదివరకు నాతో ఆడుకునేదానివిగా నీకు ప్లేన్ అంటే ఇష్టం కదక్కా పెద్దయ్యాక నన్ను నిజం ఏరోప్లేన్ లో ఎక్కించి తిప్పుతాను అన్నావుకదా అక్కా!…అందుకే చేశాను అది నీకే ఆడుకో” అంటూ అక్క దగ్గర మారం చేస్తుంటే,

చిన్నీ వాళ్ళ అక్క సుగుణ తన మనసులోని సంఘర్షణను అంత చిన్న పిల్లకి ఏమని చెప్పగలను, తను చిన్నీ వయసులో ఉన్నప్పుడు తన అమ్మ చనిపోతే తన తండ్రి రెండో అమ్మ ను తెచ్చాను అని తనకి చిన్నీ వాళ్ళ అమ్మను చూపిస్తే, తండ్రి అటు వెళ్ళగానే తనని దగ్గరకి తీసుకుని ప్రేమగా మాట్లాడుతుంది అనుకుంటే “చూడు నేను మీ అమ్మ ను కాదు పిన్ని ని మీ అమ్మ చనిపోయింది నువ్వు నన్ను పిన్ని అని మాత్రమే పిలవాలి అంటూ కన్నెర్ర చేసి చూస్తూ సుతిమెత్తగా మందలించింది.

అప్పటి నుండి మొదలయ్యాయి సుగుణ కష్టాలు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, పని చేస్తున్నప్పుడు నాన్న వస్తే నువ్వు ఎందుకు చేస్తున్నావ్ నేను ఉన్నాగా అంటూ ప్రేమగా పక్కకి నెట్టేది, నాన్న అలా వెళ్ళగానే మొట్టికాయలు వేసి మళ్ళీ పనిలో పడమని కసిరేది. ఇలా కొన్ని సంవత్సరాలు సాగుతుండగా అనుకోకుండా నాన్న కాలం చేయటంతో తన జీవితం తన పిన్ని చేతిలో చిక్కింది. పులి బోనులో కి తప్పిపోయి వచ్చిన జింక లాగా అయింది తన పరిస్థితి. వీటన్నిటి మధ్యలో తనకి ఊరట ఇచ్చేది తన చెల్లి అదే చిన్నీ.

పిన్ని ఎన్ని కష్టాలు పెట్టినా తనతో ప్రేమగా ఉంటూ వాళ్ల అమ్మ కంటే ఎక్కువ సుగుణ దగ్గరే పెరిగింది, తనకన్నా తొమ్మిదేళ్లు చిన్నది అయ్యేసరికి చిన్నీకి సుగుణ మరో అమ్మలా అనిపించేది, సుగుణ కూడా చిన్నీని అంతే ప్రేమతో సాకేది.సమయం దొరికినప్పుడు పిన్ని ఇంట్లో లేనప్పుడు సుగుణ, చిన్నీ ఇద్దరూ ఆడుకునేవాళ్ళు. ఉంటే దగ్గరికి రానీయదుగా మరి. అలా ఆడుకునేప్పుడు ఎప్పుడు పేపర్ ప్లేన్ చేసి ఇచ్చి పెద్దయ్యాక నిన్ను దానిలో తీసుకువెళ్తాను అని చెప్పేది సుగుణ.

అలా కాలం గడుస్తుండగా సుగుణ పెద్ద పిల్ల అయింది. ఇంక సుగుణకు పెళ్లి చేసి పంపియ్యాలనే ఉద్దేశ్యంతో తనకన్నా పదిహేను ఏళ్ళు పెద్దవాడిని తీసుకొచ్చింది. నేను చేసుకోను పిన్ని ఇంకా చిన్న పిల్లనేగా చదువుకుంటాను అంటే, నీకు తిండి పెట్టడమే ఎక్కువ ఇంకా చదువా అంటూ నవ్వి, చదువు మాన్పించింది. కట్నం కలిసి వస్తుంది అని సుగుణ జీవితాన్ని నిప్పుల్లోకి తోసేసింది ఆవిడ.

ఇదంతా ఆలోచించుకుంటూ చిన్నీ ని చూస్తూ ఇలా అనుకుంది “నీవు చిన్నపిల్లవు తల్లీ నీకు ఏమని చెప్పగలను కానీ నీ జీవితం నాలా కాకుండా ఉంటే చాలు, అవును మరి అప్పటికి నేను పెద్దదాన్ని అవుతానుగా నీ జీవితం ఎప్పటికీ నాలా కానివ్వను చిన్నీ నువ్వు నా బంగారానివి” అంటూ తన గడ్డం పట్టుకుని అంతే చూస్తూ ఉండగా,అప్పుడే లోపలికి వచ్చిన చిన్నీ వాళ్ల అమ్మ “ఏమేవ్ ఇంకా తెమల్లేదా నువ్వు ఎంతసేపు చేస్తావే పనికిమాలినదానా అవతల టైమ్ అవుతుంది పద పద, ఒసేయ్ చిన్నీ ఎన్నిసార్లు చెప్పానే దాన్ని అక్క అనవొద్దు అని అది ఏమన్నా నాకు పుట్టిందా, ఏంటా చేతిలో పేపర్ అని చిన్నీ చేతిలో పేపర్ తీసుకుని ముక్కలు చేసి చిన్నీ వాళ్ళ అక్క మొహం మీద విసిరేస్తూ తిండికే గతిలేదు ఆకాశంలో ఎగురుతుందట” అంటూ చిన్నీ వాళ్ళ అక్క మొహానికేసి గుడ్లు ఉరిమి చూసింది.

”ఇదిగో అయిపోయింది పిన్ని వస్తున్నాను అంటూ గబ గబా లోపలికి వెళ్లి తన సామాన్లు తెచ్చుకుని నుంచుంది.

వెంటనే చిన్నీ “అమ్మా!అక్క ఎక్కడికి వెళ్తుంది, అక్క ప్లేన్ లో ఎగరాలి అనుకుంది అందుకే ఆ పేపర్ ప్లేన్ అక్కకి ఇచ్చాను అమ్మా అక్కని ఎగరనివ్వు” అంటూ ఏడుపు మొహం తో తన అమ్మని ప్రాధేయపడుతున్నట్లుగా అనింది చిన్నీ “ఆ నీ అక్కకి పెళ్లి అయింది, దాని మొగుడు వచ్చాడు తీసుకెళ్ళడానికి అదిగో” అంటూ సుమారు ముప్పై ఏళ్ల పై బడిన మనిషిని చూపించింది.

పిన్ని చూపించిన వైపు భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ చిన్నీ వైపు ఒక్కసారి కళ్ళు ఎత్తి చూసి కంటి నుంచి జారిన నీటి చెమ్మను కొంగుతో తుడుచుకుంటూ వడివడిగా తన మొగునివైపు నడవసాగింది పదిహేను ఏళ్ల చిన్నీ వాళ్ళ అక్క.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!