ముగురాడవారు కూడిన

ముగురాడవారు కూడిన

రచన:  కృష్ణకుమారి

ఏమిటోయ్, సుచీ ఇక్కడ కూచున్నావ్?”

“రామ‌రామ కాసేపు పార్క్‌లో కూచోడం కూడా నేరమా? ఏదో నేను సంసారం వదిలేసి, పారిపోతున్నట్టు ఏమిటా గాభరా?”

“సంసారం వదిలేస్తే గాభరా ఆడవాళ్ళకి గానీ మొగుళ్ళకి ఉండదే పిచ్చిదానా?”

“సరి! ఎంత దివ్యమయిన కాపురమో? పోతుందో ఏమో అని బెంగపడ్డానికి”

“అంత వెటకారంగా చేతులు తిప్పుతున్నావ్ ఇంతకీ, నీ‌‌ కాపురానికి ఏం తక్కువో? కంటికి రెప్పలా చూసుకొనే అత్తగారు,
ఇంకా …”

“అవునవును, అత్తగారు, అక్కత్తయ్యా, అమ్మత్తా!  దేవుడా, ఏం‌‌ వరసలో? ఏం పిలుపులో?  అసలు మా నాన్నని అనాలి. ‌’ఇంటినిండా ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ‌మన‌ పిల్ల ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి రావచ్చు’ అంటూ నన్ను ఉచ్చులో పడేసాడు”

“మై గాడ్, ఉచ్చులోనా? ఇక్కడ ఉచ్చు ఉందా?”

“ఉచ్చు కాకపోతే ఊబి. అంత ఓవర్ ఏక్షన్ చూస్తేనే మండుతుంది”

“మా నాన్నకి చెల్లెలు వరస అవుతుంది అమ్మత్తయ్య. వాళ్ళ అమ్మాయి అక్కత్తా. పాపం ఎవరూ లేరని మా నాన్న వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. అమ్మత్తయ్య నాలుగు పేటల చంద్రహారాలు మా అమ్మ మెళ్ళోనే వేసింది తెలుసా? పిలుపులు
మా ఇంట్లో ఇలాగే ఉంటాయి”

“గొప్పగా చెప్పేరు. ఇవన్నీ మా మామ్మ అమ్మా చెప్తుంటే విన్నవే”

“నేను ఇంకా తేరుకోలేదు.  నీకొచ్చిన  కష్టం ఏమిటి?”

“అత్తగారి కాలు బెణకడం కాదుగానీ నాకు బుర్ర బెణికింది. ఒళ్ళు వణుకుతోంది”

“ఏమిటీ? నిజంగానా?”

“ఏమిటేమిటి? ఈ పెద్దలని తృప్తి పరచడం మాటలా? అమ్మో… మీ అమ్మత్తయ్య గారు అఖండులు. ఇంత వయసు అయినా ఆవిడ జిహ్వ చాపల్యం ఉందే సామాన్యం కాదు”

  ——

“మొన్నటికి మొన్న చపాతీలు కూరా చేసేనా? తీరా అత్తగారు పిలిచీ అంటుందీ…. “అమ్మాయ్ చపాతీలు
నువ్వు అందరికీ చేయలేదా?”

“అదేమిటి? చేసేనే అని నేను తెల్లబోయి చూద్దును కదా, అమ్మత్తయ్య గారొచ్చి ‘అబ్బే అవి మాకే చాల్లేదే!” అంటున్నారు.
“పదిహేను చపాతీలు ముగ్గురూ ఊదేసారు. ఓయమ్మో ఇంత గట్టి పొట్టలని ఎవరూహిస్తారు?”

“పాపం ఆకలయిందేమోలేవే!” జడుస్తూ అన్నాడు సుందరం

“ఆకలేమిటండీ, మా మామ్మ లేదూ, మా ఇంట్లో? సాయంకాలం ఓ జాంపండు తింటే అదే డిన్నర్! ఇంక ఏమీ
అక్కరలేదు.  అబ్బో మీ అక్కత్తయ్య ఉందే, అందర్నీ మించిపోతుంది”

———-

‘ఉక్కిరి చెయ్యవే’  అంది మొన్న. అంటే ఏమిటో తెలీలేదు.  ‘ఉక్కిరి చెయ్యే ఉక్కిరి చెయ్యే’ అంటూ ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అత్తగారిని అడిగి పుల్ల మజ్జిగలో వరిపిండి తడిపి ఇంత నూనెపోపు వేసి చేస్తూ ఉంటేవ అంటుందీ….’అయ్యో, ఉక్కిరికి ఇత్తడి మూకుడు వాడాలే’ అంటూ దీర్ఘాలు. ఇదెక్కడ తిండిపిచ్చో?”

——–

“ఎక్కడయినా మగవాళ్ళకి కాస్త తిండి పిచ్చి ఉంటుంది, అంటారు. ఇదెక్కడి ప్రారబ్ధమో ఇక్కడ మొగాడికి మొగుళ్ళు ఉన్నారు”

“పోనీవే.  బతికినన్నాళ్ళు బతుకుతారా చెప్పు? ఏదో కాస్త నాలికకి రుచిగా తినాలని యావ!”

“సరీ…మీ ఇంట్లో ఆయుష్షులే చెప్పాలా? సెంచరీలేకదా అందరూ!”

“ఒసే,అయితే ఏమిటంటావ్! అందరినీ కలిసికట్టుగా టపా కట్టీమంటావా?”

“నేనేం ఆ దేవుడి పోస్ట్ మేన్ నా ఏమిటి? టపాలు కట్టించిందికి?”

“మరి నీకు కాస్త అందరూ భారంగా ఉన్నట్టున్నారు”

“ఎవరెన్నాళ్ళుంటే నాకేం? ఆ మాటలే! మావిడి పళ్ళు, సపోటాలు, బొప్పాసి ఏవయినా శుభ్రంగా కడిగి తొక్కతీసి, ‘చిన్న చిన్న’ ముక్కలు తరిగి ఫ్రిజ్ లో ఉంచితే, ఓ నిద్ర తీసి లేచి తింటూ ఉంటే పక్కింటి సరసమ్మగారొచ్చి “వదిన మంచం పట్టినా, మీకు జరుగుబాటుకి ఏ లోటూ లేదు అక్కగారూ” అంటే మీ అక్కత్తయ్య అంటుందీ….’ ఆఁ దీనికేనా? పొయ్యి మీద పెట్టాలా? పోపు వేసి వేపాలా? పళ్ళు ఇవ్వడం అంత సులువు అదే’ అబ్బా, ఆ వజ్రాలబుర్ర, బంగారం నాలికా చూస్తే ముచ్చటపడి తీరాలి సుమీ!”

——

“ఎప్పుడు చూసినా,తిండి గోలే… అన్ని వంటకాలు తలలచుకోడం, తిని ఎన్నాళ్ళయిందో అని వగచడం! మా మేనత్త వాళ్ళత్తగారిని తిట్టేది ‘తింటారు, లేదంటారు’ మీ‌కొడుక్కి మీ పోలికే వచ్చింది’ అని. ఇక్కడ చూడాలి ఆవిడ”

“సుచీ, ఇంటికి వెళదామా! ఆకలి వేస్తోంది!”

“ఇంకా అనలేదా ఏమిటా….అని చూస్తున్నా,! పదండి.  వాళ్ళు ముగ్గురూ కలిపినంత మీరొక్కరు”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!