ఆవేదన

ఆవేదన

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సావిత్రి కోవూరు 

ప్రియమైన లతకు,
నీ స్నేహితురాలు అన్విత వ్రాయునదేమనగా దసరా పండుగకు మా అన్నయ్య వాళ్ళు ఊరికి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఆతీయటి కబుర్లు చెబుదమనుకున్నాను. కాని ఉత్తరంలో  ఇలా వ్రాయవలసి వస్తుందని అనుకోలేదు. దసరా అప్పుడు మన ఊరిలో రామాయణ, భారత కథలు డ్రామాలుగా ఆడే వాళ్ళు. దసరా పండుగకు రంగురంగుల పూలతో పోటీలు పడి పెద్ద బతుకమ్మలు పేర్చి స్త్రీలందరూ రంగు రంగుల చీరలు కట్టుకొని చక్కగా అలంకరించుకుని వలయాలుగా తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మలు ఆడి చీకటి పడే వేళకు బ్యాండ్ మేళంతో శివునిగుడి ముందర   ఆడిన తరువాత జలజల పారే వాగు దగ్గరకు తీసుకెళ్లి వాగులో వదిలి సాగనంపే వాళ్లము.
ఇప్పుడు మన ఊరి వాళ్ళెందరో ఇళ్ళు ఖాళీ చేసి పిల్లల చదువులకని, ఉద్యోగాలకని హైదరాబాదులోనే ఉండడం వల్ల బతుకమ్మ ఆడే స్త్రీలే తగ్గిపోయారు.

వాగులో నీళ్ళు కూడా ఎండిపోయి చిన్నచిన్న గుంటలగ మారిపోయింది. నాకు ఎంత బాధ కలిగిందో చెప్పలేను.

ఇక దసరా రోజు మగ వాళ్ళందరూ పిల్లలతో కలిసి భోజనం చేసిన తర్వాత ఊరి బయట కెళ్ళి పాలపిట్ట దర్శనం చేసుకుని వచ్చి, చెక్క భజనలు, కోలాటాలు, జడల కోలాటాలు ఆడుతూ సాయంకాలం అందరు కలిసి బాజాభజంత్రీలతో ఊరి బయట ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి, ప్రదక్షిణాలు చేసి, జమ్మి చెట్టును పూజించి, వచ్చి పెద్దలందరికీ నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకునేవారు.

అప్పుడు ఊరివాళ్లంతా ఊరి పెద్ద లేదా పట్వారి ఏమి చెప్పినా  వినే వాళ్ళు. ఇప్పుడు యువకులంతా ఎవరికి వాళ్లు మేమే గొప్ప అని పొద్దున లేచినప్పటి నుండే మద్యపానంలో మునిగితేలుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు.

భారత రామాయణాలకు బదులుగా సినిమాలలోని క్లబ్ పాటలతో గడుపుతున్నారు.

ఒకప్పుడు రాత్రిళ్లు మాత్రమే తాగి ఇల్లు కదలకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు సీసాలు పట్టుకొని బజార్లో తాగుతూ తిరుగుతున్నారు. ఇదంతా చూసి మన ఊరు ఇంత హీన స్థితికి దిగజారిపోయినందుకు చాలా బాధ అనిపించింది.

ఊరి విషయాలు చెప్పి నీకు బాధ కలిగిస్తే క్షమించు.

 ఇట్లు
నీ స్నేహితురాలు, అన్విత

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!